SOURCE :- BBC NEWS
హమాస్ నుంచి, 471 రోజుల తర్వాత విడుదలైన ముగ్గురు ఇజ్రాయెలీ మహిళల్లో 24 ఏళ్ల రోమీ గోనెన్ కూడా ఒకరు. తనకు ”డ్యాన్స్ చేస్తున్నప్పుడు సంతోషంగా అనిపిస్తుంది” అని చెప్పేవారు.
2023 అక్టోబర్ 7న నోవా ఫెస్టివల్‌పై దాడి జరిగిన సమయంలో, అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తూ హమాస్‌కు బందీగా చిక్కారు రోమీ.
వెటర్నరీ నర్సు డొరొన్ స్టీన్‌బ్రెచర్ (31), బ్రిటిష్ – ఇజ్రాయెల్ ద్వంద్వ పౌరసత్వం కలిగిన 28 ఏళ్ల ఎమిలీ డమారీతో పాటు ఆమె కూడా విడుదల అయ్యారు.
ఇజ్రాయెల్ – హమాస్ మధ్య కుదిరిన ఒప్పందం, మొదటి దశలో భాగంగా వీరిని విడుదల చేశారు.
హమాస్ ఈ ముగ్గురి పేర్లను ఇజ్రాయెల్‌కు తెలియజేయడంలో ఆలస్యం జరిగింది. దాని కారణంగా కాల్పుల విరమణ అమలు మూడు గంటలపాటు ఆలస్యమైంది. క్షేత్రస్థాయి సాంకేతిక కారణాల వల్ల ఇలా జరిగిందని హమాస్ పేర్కొంది. తర్వాత ఈ ముగ్గురిని విడుదల చేసింది.
రోమీ గోనెన్
ఇజ్రాయెల్ ఉత్తర ప్రాంతంలోని క్ఫార్ వెరాడిమ్ నుంచి నోవా ఉత్సవానికి వచ్చారు రోమీ.
”తను ఎంతో ప్రేమించే, డ్యాన్స్ చేయడం కోసం ఆమె వెళ్లారు” అని ఆమె కుటుంబం తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న ది హాస్టేజెస్ అండ్ మిస్సింగ్ ఫ్యామిలీస్ ఫోరం తెలిపింది. చదువుకునే రోజుల్లో సోలో ప్రదర్శనలు ఇచ్చేవారని, తర్వాత అద్భుతమైన కొరియాగ్రాఫర్ అయ్యారని పేర్కొంది.
హమాస్ దాడి జరిగి సైరన్లు మోగగానే ఆమె తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేశారు. తన కుమార్తెతో చివరిసారి మాట్లాడినప్పుడు కాల్పుల శబ్దాలతో పాటు అరబిక్‌లో అరుపులు వినపడినట్లు ఆమె తల్లి గుర్తు చేసుకున్నారు.
రోమీ ఫెస్టివల్ నుంచి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో హమాస్ మిలిటెంట్లు ఆమెపై మెరుపుదాడి చేశారు.
గత నవంబర్‌లో ఫోరం విడుదల చేసిన వీడియోలో ”ఎప్పుడూ చిరునవ్వుతో కనిపించే అమ్మాయి, వెలిగిపోతూ ఉండేది, మంచి ఫ్రెండ్” అని వర్ణించారు.
డొరొన్ స్టీన్‌బ్రెచర్
హమాస్ దాడి జరిగినప్పుడు, కిబ్బుట్జ్ క్ఫార్ అజాలోని తన అపార్ట్మెంట్ నుంచి వెటర్నరీ నర్సు డొరొన్ అపహరణకు గురయ్యారు.
నిరుడు మేలో ఆమె సోదరి యామిత్ అష్కెనాజీ రాసిన భావోద్వేగ లేఖను ‘ది హాస్టేజెస్ అండ్ మిస్సింగ్ ఫ్యామిలీస్ ఫోరం’ ప్రచురించింది. అందులో ఆమెను ”మై సన్‌షైన్” అంటూ సంబోధించారు.
”మా శక్తి కూడా నీకు తోడవ్వాలని కోరుకుంటున్నా. నీ విడుదల కోసం మేం ఇక్కడ పోరాడుతున్న విషయం, నీకు కొంచెమైనా తెలిస్తే బాగుండు. నిన్ను ప్రేమిస్తున్నా, నీ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నా, హృదయం బద్దలైంది, అయినా నీ కోసం పోరాడుతున్నా, ఇవన్నీ నీకు తెలియాలని కోరుకుంటున్నా” అని అందులో రాశారు.
అంతకుముందు చేసిన పోస్ట్‌లో.. ”స్నేహితులందరినీ కలిపి ఉంచే, సున్నితమైన వ్యక్తి, నవ్వించే వ్యక్తి, నవ్వుతూ.. సాయం చేసేందుకు ఎప్పుడూ ముందుండే వ్యక్తి” అని వర్ణించారు.
ఆమె స్కూల్లో థియేటర్, సినిమా కోర్సులు చేశారు, కానీ జంతువులపై ఆమె పెంచుకున్న ప్రేమ వెటర్నరీ నర్సుగా మార్చింది.
2023 నవంబర్‌లో యామిత్ బీబీసీతో మాట్లాడుతూ ఒక కొత్త టాటూ గురించి చెప్పారు. అందులో, ”సూర్యుడిలా మనం మళ్లీ ఉదయిస్తాం, అయితే ప్రస్తుతం కొన్ని కిరణాలు కనుమరుగయ్యాయి”
”నువ్వు ఇంటికి తిరిగి రావడంతో అవి మళ్లీ ప్రకాశిస్తాయి” అని ఆమె అన్నారు.
ఎమిలీ డమారీ
అక్టోబర్ 7న జరిగిన దాడి సమయంలో, కిబ్బుట్జ్ క్ఫార్ అజా ప్రాంతంలో 28 ఏళ్ల ఎమిలీ హమాస్‌కు బందీగా దొరికారు.
ఆమె విడుదల అవుతున్నారన్న వార్తలు వచ్చిన తర్వాత(ఇప్పుడు విడుదలయ్యారు) ఆమె కుటుంబానికి సన్నిహితులు మాట్లాడుతూ, ”471 రోజుల నరకం, కానీ ఈ 24 గంటలు మరో నరకం” అన్నారు.
”ఎమిలీ తల్లి మాండీ తన కూతురు కనిపించగానే గట్టిగా హత్తుకోవాలని అనుకుంటున్నారంతే. కానీ, అది తన కళ్లతో చూసే వరకూ ఆమెకు నమ్మకం లేదు” అని వారు తెలిపారు.
ఎమిలీకి యూకేతో బలమైన అనుబంధముంది. ఆమె టోటెన్హామ్ హాట్స్పర్ అభిమాని. బంధువులతో గడపడం, కాన్సర్ట్స్కి వెళ్లడం, అక్కడి పబ్బులకి వెళ్లడమంటే ఆమెకిష్టం.
ఆమె తల్లి మాండీ డమారీ గతంలో బీబీసీతో మాట్లాడుతూ, ”మా కుటుంబంలో ఎమిలీ చాలా ప్రత్యేకం, కానీ ఇప్పుడామె లేదు” అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)