SOURCE :- BBC NEWS

పవన్ కల్యాణ్, లోకేష్

ఫొటో సోర్స్, FB/JanaSena Party/TDP

ఆంధ్రప్రదేశ్‌ అధికార కూటమిలో.. ప్రధానంగా టీడీపీ, జనసేన మధ్య దూరం పెరగడానికి బీజం పడుతోందా.. అనే చర్చలు ఇప్పుడు మొదలయ్యాయి.

ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు, మంత్రి నారా లోకేష్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలనే టీడీపీ శ్రేణుల డిమాండ్‌ చివరికి ఎటు దారితీస్తుందోనే చర్చ నడుస్తోంది.

టీడీపీ అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్న మహాసేన రాజేష్‌ ఇటీవల తన యూట్యూబ్ మీడియా చానల్‌లో మాట్లాడుతూ.. మంత్రి లోకేష్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాల్సిన అవసరం ఉందంటూ మొదటగా గళం విప్పారు.

ఈ మధ్య కాలంలో జరిగిన వరుస ఘటనల్లో లోకేష్‌కు ప్రొటోకాల్‌ పరంగా అప్రాధాన్యత కనిపిస్తోందని, ఇది టీడీపీ శ్రేణులను,లోకేష్‌ అభిమానులను బాధిస్తోందని వ్యాఖ్యానించారు.

ప్రధానంగా ఇటీవల తిరుపతిలో డిప్యూటీ సీఎం, జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ పర్యటన సందర్భంగా అక్కడ కొందరు లోకేష్‌ని ఆపే ప్రయత్నం చేశారని రాజేష్‌ ఆరోపించారు.

ఇలాంటి పరిణామాలను చూసిన తర్వాత లోకేష్‌ను కచ్చితంగా ఉప ముఖ్యమంత్రిని చేయాల్సిన అవసరం ఏర్పడిందని, ఆ పదవికి ఆయన వందశాతం అర్హుడని అభిప్రాయపడ్డారు.

ఏపీ సీఎం చంద్రబాబు

ఫొటో సోర్స్, I&PR

బాబు సమక్షంలోనే

మహాసేన రాజేష్‌ వాదనపై టీడీపీ, జనసేన శ్రేణుల మధ్య సోషల్‌ మీడియాలో చర్చ నడిచింది.

అయితే టీడీపీ కడప జిల్లా అధ్యక్షుడు, పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు ఆర్‌.శ్రీనివాస్‌ రెడ్డి రెండురోజుల కిందట మైదుకూరులో జరిగిన సభలో స్వయంగా సీఎం చంద్రబాబు సమక్షంలోనే లోకేష్‌కి డిప్యూటీ సీఎంగా పదోన్నతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

బహిరంగ సభలో బాబును ఉద్దేశిస్తూ.. ” భవిష్యత్‌లో యువతకు భరోసా ఇవ్వాలన్నా.. పార్టీకి భరోసా ఇవ్వాలన్నా 43 ఏళ్ల టీడీపీ చరిత్రలో మూడోతరం నేతగా ఉన్న లోకేష్‌కు ఉపముఖ్యమంత్రిగా ప్రమోషన్‌ ఇవ్వాలి. దీని వల్ల పార్టీకి బ్రహ్మాండమైన భవిష్యత్‌ ఉంటుంది. ఇప్పటికే మంత్రిగా ఎంతో బాగా చేస్తున్న ఆయన్ను ఎలివేట్‌ చేసినట్టు ఉంటుంది” అని శ్రీనివాసరెడ్డి అన్నారు.

అయితే ఆ తర్వాత ప్రసంగించిన చంద్రబాబు ఈ విషయాన్ని ప్రస్తావించలేదు. కానీ శ్రీనివాస రెడ్డి మాటలను బలపరుస్తూ టీడీపీ సీనియర్‌ నేతలు సైతం రాష్ట్రవ్యాప్తంగా ఒక్కొక్కరుగా తమ వాదనను వినిపిస్తూ వస్తున్నారు

సోమిరెడ్డి, వర్మతో పాటు ఆర్‌ఆర్‌ఆర్‌ సైతం..

డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణ రాజు కూడా ఓ టీవీ చర్చా వేదికలో ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్

జనసేన కౌంటర్లు..

సోషల్‌ మీడియాలో మొదలై.. పార్టీ సీనియర్‌ నేతలు సైతం డిమాండ్‌ చేసే వరకూ వచ్చిన ”లోకేష్‌కు డిప్యూటీ” అంశంపై ఇప్పటి వరకు జనసేన నేతలు ఎవరూ స్పందించలేదు.

అయితే జనసేన శ్రేణులు, పవన్‌ అభిమానులు మాత్రం సోషల్‌ మీడియాలో టీడీపీని టార్గెట్‌ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. లోకేష్‌ను ఉప ముఖ్యమంత్రి చేయాలన్న డిమాండ్‌పై కౌంటర్లు ఇస్తున్నారు.

”ఔను నిజమే లోకేష్‌ను డిప్యూటీ సీఎంగా చేసి పవన్‌ కళ్యాణ్‌ను సీఎంగా చేయాలి. చంద్రబాబు జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలి” అని జనసేన నేతలు కౌంటర్లు ఇస్తున్నారు.

టీడీపీని కష్టకాలంలో ఆదుకున్న పవన్‌ను తగ్గించాలని చూస్తారా.. అని జనసేన అభిమానులు అంటుంటే.. ”అందుకే కదా గత ఎన్నికల్లో రెండు చోట్లా ఓడిపోయిన పవన్‌ను ఎమ్మెల్యేగా గెలిపించి డిప్యూటీ సీఎంగా చేశాం. ఇంకేం కావాలి” అని టీడీపీ కార్యకర్తలు సోషల్‌ మీడియాలో సమాధానాలిస్తున్నారు.

ఏపీ కేబినేట్ సమావేశం

ఫొటో సోర్స్, X/JanaSenaParty

భిన్నంగా పవన్ వైఖరి

రాష్ట్రంలో ఆరునెలల కిందట కూటమి అధికారంలోకి వచ్చిన దరిమిలా డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్న పవన్‌ కల్యాణ్‌ వైఖరి కొంచెం భిన్నంగానే ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మొదట్లో కేవలం తన శాఖలపై అవగాహన, పట్టు పెంచుకునేందుకే ప్రయత్నించినట్టు కనిపించిన పవన్‌ మూడు నెలల తర్వాత హోం మంత్రి అనితనుద్దేశించి చేసిన వ్యాఖ్యలు చర్చనీయమయ్యాయి.

రాష్ట్రం శాంతిభద్రతల విషయంతో పాటు గత వైఎస్సార్‌సీపీ పాలనలో విపక్ష నేతలు ఎదుర్కొన్న వేధింపులపై మాట్లాడుతూ.. తాను హోం మంత్రి పదవి తీసుకోవాల్సి వస్తుందేమోనంటూ పవన్ వ్యాఖ్యానించారు.

అయితే ఈ వ్యాఖ్యలను పాజిటివ్‌గా తీసుకుంటున్నామని, పవన్‌ అన్న దాంట్లో తప్పేమీ లేదని స్వయంగా సీఎం చంద్రబాబు, హోం మంత్రి అనిత బహిరంగంగా సమర్ధించడంతో ఆ విషయం వివాదంగా మారకుండా సమసిపోయింది.

ఆ తరువాత కాకినాడలో రేషన్‌ బియ్యం తరలింపునకు సంబంధించిన విషయంలో ‘సీజ్‌ ది షిప్‌’ అంటూ పవన్‌ ఇచ్చిన ఆదేశాల అమలుపై కూడా ప్రభుత్వ వర్గాలు నిబంధనల మేరకు ఇరకాటంలో పడ్డాయన్న చర్చ అప్పట్లో నడిచింది. దానిపై కూడా టీడీపీ నేతలు ఎక్కడా బహిరంగంగా స్పందించలేదు.

పవన్ కల్యాణ్

ఫొటో సోర్స్, i&pr

అప్పటి నుంచే గ్యాప్‌ మొదలైందా?

ఇటీవల తిరుమలలో జరిగిన తొక్కిసలాట దుర్ఘటనపై క్షమాపణ చెప్పిన పవన్‌ కల్యాణ్‌ .. టీటీడీ ఈవో, చైర్మన్‌లు కూడా భక్తులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. దానిపై మంత్రి లోకేష్‌ కొంచెం భిన్నంగా స్పందించారు.

ఈ విషయమై మీడియా అడిగిన ప్రశ్నకు లోకేష్‌ సమాధానమిస్తూ.. ‘టీటీడీ చైర్మన్‌ను క్షమాపణ కోరడం పవన్‌ వ్యక్తిగత అభిప్రాయం.. అది టీడీపీ స్టాండ్‌ కాదు’ అని స్పష్టం చేశారు. దాంతో లోకేష్‌ వ్యాఖ్యలు చర్చకు తెరలేపాయి. యాదృచ్ఛికమే కావొచ్చు గానీ ఆ తర్వాతే లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాలనే డిమాండ్‌ తెరపైకి వచ్చిందన్న వాదనలూ ఉన్నాయి.

మరో పదేళ్లు బాబే సీఎంగా ఉండాలన్న పవన్‌..

తాజా వివాదం నేపథ్యంలో అసలు పవన్‌ కల్యాణ్, లోకేష్‌ల మధ్య బంధం ఎలా ఉంటుంది.. అనే విషయం కూడా చర్చకు తెరలేచింది.

నాలుగోసారి సీఎంగా చంద్రబాబు పదవీ బాధ్యతలు తీసుకున్న సందర్భంలో అదే వేదికపై పవన్‌ కాళ్లకు లోకేష్‌ దండం పెట్టిన వీడియో అప్పట్లో వైరల్‌గా మారింది.

టీడీపీ సోషల్‌ మీడియాలో ఈ వీడియో ఎక్కడా కానరానప్పటికీ జనసేన శ్రేణుల ఖాతాల్లో ఆ వీడియో హల్‌చల్‌ చేసింది. పవన్‌పై లోకేష్‌కున్న అభిమానానికి అది నిదర్శనమని అప్పట్లో జనసేన నేతలు సంబరపడ్డారు.

ఇక పవన్‌ను సీఎంగా ఎప్పుడు చూస్తామోనని జనసేన శ్రేణులు ఎదురుచూస్తుంటే.. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే ఇంకో పదేళ్లు చంద్రబాబే సీఎంగా ఉండాలని పవన్‌ స్వయంగా అసెంబ్లీ వేదికగా చేసిన వ్యాఖ్యలు ఆయన మనోగతాన్ని స్పష్టం చేశాయి.

మరి ఇంతగా వారి మధ్య అనుబంధం ఉన్న నేపథ్యంలో తాజా వివాదం ఎందుకు మొదలైంది? దీనికి ఫుల్‌ స్టాప్‌ ఎలా పడనుందనే దానిపై జనసేన, టీడీపీ నేతలతో పాటు రాజకీయ పరిశీలకులు ఏమంటున్నారో చూద్దాం.

జనసేన పొలిట్‌ బ్యూరో సభ్యుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ

ఫొటో సోర్స్, x/bolisetti_satya

అది కోవర్టుల కుట్ర: జనసేన

”నారా లోకేష్‌‌ను డిప్యూటీ సీఎం చేయాలనే నినాదాన్ని తెరపైకి తీసుకువచ్చి కూటమి పార్టీల మధ్య చిచ్చు రేపేందుకు వైఎస్సార్‌సీపీ కోవర్టులు చేసిన కుట్ర ఇది. బాధగా ఉన్నా ఒప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే టీడీపీతో పాటు జనసేన, బీజేపీల్లో కూడా వైఎస్సార్‌సీపీ కోవర్టులు ఉన్నారు. ఇది వాళ్లు ఆడే గేమ్‌” అని జనసేన పొలిట్‌ బ్యూరో సభ్యుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ బీబీసీతో అన్నారు.

”టీడీపీ కార్యకర్తలు లోకేష్‌ను డిప్యూటీ సీఎంగా చేయాలని కోరుకోవచ్చు అందులో తప్పులేదు.. అలాగే జనసేన క్యాడర్‌ కూడా పవన్‌ను సీఎంగా కావాలనే కోరుకుంటుంది. ఇది సహజం కానీ, కొంతమంది కుట్రపూరితంగా ఈ వివాదాన్ని తెరపై తెచ్చారు.

ఇలాంటి వివాదాలను పవన్‌ కళ్యాణ్‌ అస్సలు పట్టించుకోరు. ఎవరెన్ని కుట్రలు చేసినా టీడీపీ, జనసేన పొత్తు మరో 15 ఏళ్ల వరకు ఉంటుంది. ఇది ఖాయం” అని ఆయన స్పష్టంచేశారు.

స్వయంగా టీడీపీ సీనియర్‌ నేతలే లోకేష్‌ డిప్యూటీ సీఎం వాదనను బలంగా వినిపిస్తున్నారని బీబీసీ ప్రస్తావించగా బొలిశెట్టి స్పందిస్తూ.. ”ఇది వారంతా లోకేష్‌ గుడ్‌ లుక్స్‌‌లో పడేందుకు పడుతున్న ఆరాటం మాత్రమే. తాము ఇప్పుడు మాట్లాడకపోతే యువ నాయకుడు లోకేష్‌ దృష్టిలో వెనకపడతామేమోనని అలాంటి డిమాండ్లు చేస్తున్నారు ” అని అన్నారు.

మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి

ఫొటో సోర్స్, facebook/Somireddy Chandra Mohan Reddy

పవన్‌ను తగ్గించడానికి కాదు: టీడీపీ నేత సోమిరెడ్డి

”లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాలనేది మా పార్టీ కేడర్ కోరిక. ఇందులో తప్పేమీ లేదు. దీంట్లో పవన్‌ కళ్యాణ్‌ని తగ్గించేదేమీ లేదు. రాష్ట్రంలో ఆయన స్థాయి ఆయనకుంది. పవన్‌ శైలి ప్రత్యేకం” అని టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి బీబీసీతో అన్నారు.

”టీడీపీ కష్టకాలంలో ఉన్నప్పుడు, ముఖ్యంగా చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు ఆయన స్పందించిన తీరు ఎవరూ మర్చిపోలేనిది. అలాంటి పవన్‌ను తగ్గించాలని కాదు. లోకేష్‌ను కార్యకర్తలు కోరుకున్నట్టుగా మరింత శక్తిమంతమైన నేతగా చూసేందుకు మాత్రమే మేం అడుగుతున్నాం. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లోకేష్‌ పడిన కష్టానికి గుర్తింపుగా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకే మేం అడుగుతున్నాం. దీనిపై నిర్ణయం తీసుకోవాల్సింది పార్టీ అధినేత చంద్రబాబు. ఇది రాజకీయ వివాదంగా చూడాల్సిన అవసరమే లేదు” అని సోమిరెడ్డి అన్నారు.

‘ఎవరూ మాట్లాడకండి’ : టీడీపీ

నారా లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాలని టీడీపీలోని కొందరు నేతలు చేస్తున్న డిమాండ్‌పై ఆ పార్టీ అధిష్టానం సీరియస్‌ అయినట్టు తెలుస్తోంది. ఒక్కొక్కరుగా సీనియర్ నేతలు, మంత్రులు సైతం ఈ విషయమై మాట్లాడుతున్న నేపథ్యంలో సున్నితమైన ఆ అంశం వివాదాస్పదం కాకుండా టీడీపీ అధిష్టానం స్పందించింది.

నారా లోకేష్‌కు డిప్యూటీ సీఎం ఇవ్వాలని ఎవరూ డిమాండ్‌ చేయద్దని, ఆ విషయంపై ఎవరూ మాట్లాడొద్దని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి పార్టీ అధికార ప్రతినిధులకు, ఇప్పటికే మాట్లాడిన టీడీపీ నేతలకు ఫోన్లు వెళ్లాయని టీడీపీ స్టేట్ మీడియా కో ఆర్డినేటర్ దారపునేని నరేంద్ర బీబీసీకి చెప్పారు.

ఈ విషయమై అత్యుత్సాహం వద్దని నేతలను టీడీపీ అధిష్టానం వారించిందని, కూటమి నేతలు మాట్లాడుకున్నాకే ఏదైనా నిర్ణయాలుంటాయనే విషయాన్ని వారికి తెలియజేసినట్టు నరేంద్ర చెప్పారు.

తమకు ఫోన్లు వచ్చిన మాట వాస్తవమేనని, డిప్యూటీసీఎం అంశంపై ఎవరూ మాట్లాడవద్దని స్పష్టమైన ఆదేశాలు అథిష్ఠానం నుంచి అందాయని టీడీపీ అధికార ప్రతినిధి శొంఠి శివరామ్ ప్రసాద్ బీబీసీకి తెలిపారు.

ఏపీ రాజకీయాలు

ఫొటో సోర్స్, TDP

ఇది ఎప్పటికైనా ఇబ్బందే: గాలి నాగరాజు

”రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి పార్టీల మధ్య సైద్ధాంతిక ప్రాతిపదికన పొత్తులు లేనందునే ఇలాంటి డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి. మేం ముందు నుంచీ చెబుతున్నాం. అధికారమే లక్ష్యంగా, వేరే పార్టీని దించాలనే ధ్యేయంగా పొత్తులు ఉండకూడదు. రాష్ట్ర ప్రయోజనాలు లక్ష్యంగానే పార్టీలు కలవాలి. క్యూరింగ్‌ లేకుండా బిల్డింగ్‌ కట్టినట్టు కూటమి పార్టీల మధ్య సఖ్యత కనిపిస్తోంది. ఇది ఎప్పటికైనా ఇబ్బందే” అని సీనియర్‌ పాత్రికేయుడు గాలి నాగరాజు బీబీసీతో చెప్పారు.

”పవన్‌ అయితే తన అసంతృప్తిని బాహాటంగానే ప్రదర్శిస్తూ వస్తున్నారు. తన మాటల్లో కొంత వాస్తవికత కనిపిస్తోంది. గత ప్రభుత్వం మాదిరిగానే అవినీతి, అక్రమాలు జరిగితే ఈ ప్రభుత్వం వచ్చి ప్రయోజనమేముందని పవన్‌ అంటున్నారు. అధికారుల పనితీరుపై ఆయన అసంతృప్తిగా ఉంటున్నారు. ఆ అధికారుల బదిలీల వ్యవహారాలన్నీ లోకేష్‌ చూస్తున్నారన్న వాదనలున్నాయి. ఈ సమయంలో ఇప్పుడు ఇలాంటి వివాదాలు, డిమాండ్లు తెరపైకి రావడంతో కూటమి సయోధ్య మూణ్ణాళ్ల ముచ్చటగా మిగిలిపోతుందా? లేదంటే ఐదేళ్లూ ఇలానే కొనసాగిస్తారా అనేది చూడాలి” అని నాగరాజు అన్నారు.

జనసేన

ఫొటో సోర్స్, Getty Images

జరిగేది అదే..

”బాబు సీఎంగా ఉన్నారు. ఇప్పటికే లోకేష్‌ మంత్రిగా పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. అందుకని లోకేష్‌కి డిప్యూటీగా ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే లోకేష్‌కి ఇస్తే సామాజిక వర్గ లెక్కలు తెరపైకి వస్తాయి.” అని రాజకీయ పరిశీలకులు చెవుల కృష్ణాంజనేయులు బీబీసీతో అన్నారు.

”సీఎం, రెండు డిప్యూటీ సీఎం పోస్టులూ అగ్రవర్ణాలకే ఇస్తే మిగిలిన బీసీ, ఎస్సీ. ఎస్టీ సామాజిక వర్గాల నుంచి డిమాండ్లు తెరపైకి వస్తాయి. మళ్లీ గత వైఎస్సార్‌సీపీ హయాంలో మాదిరిగా ఆ పదవి కేవలం అలంకార ప్రాయంగా తయారవుతుంది. అందువల్ల బాబు త్వరలోనే దీనిని ఎండ్‌ చేస్తారని అనుకుంటున్నాను. పవన్‌ ఒక్కరే డిప్యూటీ సీఎం అని ప్రకటించవచ్చు” అని కృష్ణాంజనేయులు అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)