SOURCE :- BBC NEWS

బొంత పురుగు

ఫొటో సోర్స్, Getty Images

కొన్ని రకాల బొంత పురుగు(గొంగళి పురుగు)లు శక్తిమంతమైన విషాన్ని విడుదల చేస్తాయని, ఆ విషంతో కొత్త ఔషధాలను తయారు చేసే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు.

సాధారణంగా విషపూరితమైన జీవులు అనగానే.. పాములు, తేళ్లు, తేనెటీగలు, కందిరీగలు, చీమలు లాంటివి గుర్తుకొస్తుంటాయి. బొంత పురుగుల గురించి మాత్రం ఎవరూ చెప్పరు.

కానీ, ఈ పురుగుల్లో కూడా కొన్ని అత్యంత విషపూరితమైనవి ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు. ఒకటి కాదు రెండు కాదు.. కొన్ని వేల రకాల విషపూరిత బొంత పురుగులు ఉన్నాయంటున్నారు.

కొన్ని రకాల బొంత పురుగుల విషం వల్ల మనుషులు చనిపోవడం, లేదా శాశ్వత వైకల్యం కలిగే ప్రమాదం ఉంటుంది. అలాంటి వాటిలో ‘లోనోమియా’ అనేవి ఒకటి.

ఔషధాల తయారీకి ఉపయోగపడే రసాయన సమ్మేళనాలు వీటి విషంలో ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఈ పురుగుల నుంచి సేకరించిన విషంతో ఔషధాలు తయారు చేసేందుకు వీలుంటుందని, కానీ అందుకోసం ఇంకా చాలా పరిశోధనలు జరగాల్సి ఉందని ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న బయాలజిస్ట్, బయోకెమిస్ట్ ఆండ్రూ వాకర్ చెప్పారు.

వాట్సాప్ చానల్
బొంతపురుగు

ఫొటో సోర్స్, Getty Images

ఒక్కో బొంత పురుగులో ఒక్కో రకమైన విషం ఉంటుంది. అంటే, ఆ విషంలో రసాయన సమ్మేళనాలు వేర్వేరుగా ఉంటాయి. కొన్నింటిలో వంద రకాలకు పైగా రసాయన సమ్మేళనాలు ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

‘విషం ఈ బొంత పురుగులకు రక్షణ వ్యవస్థ లాంటిది. ఒక్కో జాతి పురుగు విషం, ఒక్కో విధంగా ఉంటుంది. కాబట్టి సాధ్యమైనన్ని ఎక్కువ రకాల బొంత పురుగులపై పరిశోధన చేయాల్సి ఉంటుంది’ అని న్యూయార్క్‌లోని హంటర్ కాలేజీకి చెందిన శాస్త్రవేత్త మాండే హోల్ఫోర్డ్ అన్నారు.

అందుకే, కొన్నిసార్లు మనం పంట చేలు, గడ్డి, పొదల దగ్గరికి వెళ్లినప్పుడు కొన్ని రకాల బొంత పురుగులు మన శరీరంపై పాకితే అక్కడ తీవ్రంగా దురదపెట్టడం, దద్దుర్లు(బెందులు) రావడం లాంటివి చూస్తుంటాం. కొన్నిసార్లు శరీరమంతా దురద పెడుతుంది. కొన్నిసార్లు ఆస్పత్రులకు కూడా వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి.

ఔషధాల తయారీ కోసం కొత్తగా ఇతర రసాయనాలపై పరిశోధనలు చేయడం కంటే, లక్షల ఏళ్లుగా ప్రకృతిలో ప్రభావవంతంగా పనిచేస్తున్న ఈ పురుగుల విషంపై పరిశోధనలు చేయడం మేలని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ పురుగుల విష ప్రభావం అంతకంతకూ పెరుగుతోందని తెలిపారు.

‘‘లక్షల ఏళ్లుగా ఈ బొంత పురుగుల విషం సామర్థ్యం పెరుగుతూ వచ్చింది. ప్రకృతిలో సహజసిద్ధంగా ఆ విషంపై పరీక్షలు జరిగాయి. అంటే, ఆ పురుగుల విషాలు ప్రభావవంతంగా పనిచేస్తున్నాయనడంలో సందేహం లేదు’’ అని హోల్ఫోర్డ్ అన్నారు.

పాములు, తేళ్లు, సాలీడు వంటి వాటి విషంపై ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా పరిశోధనలు జరిగాయి. వాటికి సంబంధించిన చాలా విషయాలను శాస్త్రవేత్తలు తెలుసుకోగలిగారు. కానీ, బొంత పురుగులతో పాటు చాలా రకాల విషపూరిత కీటకాలు, జీవులపై పెద్దగా పరిశోధనలు జరగలేదు.

బొంత పురుగుల విషంపై ప్రత్యేకంగా పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందని ఆండ్రూ వాకర్ అన్నారు.

బొంతపురుగు

ఫొటో సోర్స్, Getty Images

నిజానికి బొంత పురుగుల్లో అనేక రకాలు ఉంటాయి. వాటిలో విషపూరితమైనవి 2 శాతం మాత్రమే ఉంటాయని ఆండ్రూ వాకర్ అంచనా.

కొన్ని దేశాల్లో అత్యంత విషపూరితమైన బొంత పురుగులు ఉంటాయి. ఉదాహరణకు, లాటిన్ అమెరికాలో ఎక్కువగా కనిపించే లోనోమియా అనే బొంత పురుగు అత్యంత విషపూరితమైనది. ఇది విడుదల చేసే విషం, కొన్ని రకాల పాముల విషం లాగే ఉంటుంది. మనుషులు ఈ విష ప్రభావానికి గురైతే రక్తం గడ్డ కట్టే ప్రమాదం ఉంటుంది.

కొన్ని పురుగుల విషం వల్ల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు, శాశ్వత వైకల్యం కలుగుతాయి. కొన్నింటి విషం గుర్రాలలో గర్భస్రావానికి కారణమవుతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

వీటిలోనే కొన్నింటి విషం ప్రజల ప్రాణాలను కాపాడే ఔషధాల తయారీకి ఉపయోగపడుతుందని ఆండ్రూ వాకర్ అంటున్నారు.

ముఖ్యంగా, లోనోమియా లాంటి జాతులకు చెందిన బొంత పురుగుల విషంతో విరుగుడు(యాంటీ వీనమ్) ఔషధాలు తయారు చేయొచ్చు అంటున్నారు. ఆ దిశగా కొన్ని పరిశోధనలు జరిగాయి.

ఇప్పటివరకు కొన్ని రకాల బొంత పురుగుల విషంపైనే పరిశోధనలు జరిగాయని, మిగతా రకాల పురుగులపై ఇంకా చాలా అధ్యయనాలు చేయాలని ఆండ్రూ చెప్పారు.

బొంత పురుగు విషం మనుషుల శరీరంలోకి వెళ్తే బాగా నొప్పి పుడుతుంది. ఈ పురుగులు తమ శత్రువులకు తీవ్రమైన నొప్పి కలిగించి బెదరగొట్టేందుకు ఈ విషం అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఈ విషయమే శాస్త్రవేత్తలు బొంత పురుగుల విషం మీద లోతుగా పరిశోధనలు చేసేలా చేసింది.

బొంత పురుగుల విషంతో ఇప్పటి వరకు ఇంకా ఎలాంటి ఔషధం తయారు చేయలేదు. కానీ, ఇతర జీవుల నుంచి సేకరించిన విషం కొన్ని రకాల థెరపీలకు ఉపయోగపడుతోంది. పాముల విషంతో తయారు చేసిన బీపీ, యాంటీక్లాటింగ్ ఔషధాలు ఉన్నాయి. అలాంటి అద్భుతమైన మందుల్లో సెమాగ్లుటైడ్ ఒకటి. గిలా మాన్‌స్టర్ అనే విషపూరితమైన బల్లి నుంచి తీసిన విషంతో కూడా కొన్ని ఔషధాలను తయారు చేశారు.

అందుబాటులోకి వస్తున్న అధునాతన శాస్త్రీయ పద్ధతుల సాయంతో బొంత పురుగులు సహా అనేక రకాల విషపూరిత జీవుల విషంపై శాస్త్రవేత్తలు సులువుగా పరిశోధనలు చేయగలుగుతున్నారు. అందుకే, భవిష్యత్తులో మరిన్ని అడుగులు పడొచ్చని నిపుణులు అంటున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)