SOURCE :- BBC NEWS
హైదరాబాద్‌లో పనిచేసే 22 ఏళ్ల మనోజ్ సంక్రాంతి పండుగకు సొంతూరుకు వెళ్లేందుకు ప్రైవేటు బస్సు టికెట్ బుక్ చేసుకున్నారు.
ప్రయాణానికి కొన్ని గంటల ముందు బస్సు ఆపరేటర్ నుంచి ఆయనకో మెస్సేజ్ వచ్చింది. అందులో బస్సు నంబర్, సీటు నంబర్ తదితర వివరాలు ఉన్నాయి. అయితే బస్సు నంబర్ దగ్గర మనోజ్ దృష్టి ఆగిపోయింది. బస్సు నంబర్ టీజీ అనో, ఏపీ అనో మొదలవ్వాల్సిన చోట ఎన్ఎల్ అని ఉండటం చూసి ఆశ్చర్యపోయారు.
అయితే, ఎల్బీనగర్ దగ్గర తను ఎక్కాల్సిన బస్సు కోసం వేచి ఉన్నప్పుడు ఆయన ఆశ్చర్యం రెట్టింపయింది. ఒక్క తాను ప్రయాణించే బస్సు ఒక్కదానిపైనే ఎన్ఎల్ ఉందేమో అనుకుంటే అటువైపు వచ్చే చాలా ప్రైవేటు బస్సుల నంబర్ ప్లేట్లపై మనోజ్‌కు ఎన్ఎల్ అని కనిపించింది .
ప్రైవేట్ బస్సులు, లారీలు, భారీ కంటైనర్ వాహనాలపై NL అని ఎక్కువగా కనిపిస్తుంటుంది. వాహనాల నంబర్ ప్లేట్‌పై ఉండే మొదటి రెండు ఇంగ్లీషు అక్షరాలు ఆ వాహనం ఏ రాష్ట్రంలో రిజిస్టర్ అయిందో చెబుతాయి. నాగాలాండ్‌లో రిజిస్టర్ అయిన వాహనాలపై ఎన్ఎల్ అనే కోడ్ ఉంటుంది.
మరి తెలుగు రాష్ట్రాలలో తిరిగే ప్రైవేటు బస్సులు, ఇతర భారీ వాహనాలను నాగాలాండ్ లాంటి ఈశాన్య రాష్ట్రాలలో ఎందుకు రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు? దీనివల్ల ఆపరేటర్లకు ఎటువంటి లాభం కలుగుతోంది? ఇది చట్టబద్ధమేనా? అధికారులు ఏమంటున్నారు?
ఆర్టీఏ ఆఫీసుకు వెళ్లకుండానే రిజిస్ట్రేషన్
ఒక ప్రైవేట్ బస్సు కానీ లారీ కానీ రిజిస్టర్ కావాలంటే ఆ వాహనాన్ని ఆర్టీఏ (ప్రాంతీయ రవాణా అధికారి కార్యాలయానికి) తీసుకెళ్లాలి. తయారీదారు నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం వాహనం ఉందా లేదా అని అధికారులు పరీక్షిస్తారు (దీనిని ఫిజికల్ అసెస్ మెంట్ అంటారు).
ఉదాహరణకు, వాహన తయారీ సంస్థ ఓ బస్సు తయారు చేసి కచ్చితమైన సీటింగ్ ప్రమాణాన్ని నిర్దేశిస్తుంది. బస్సు ఆపరేటర్లు ఈ సీటింగ్ కెపాసిటీ ప్రకారం టాక్స్ కట్టాల్సి ఉంటుంది. లారీ, కారియర్ లకు వాటి వెయిట్ కెపాసిటీ మేరకు టాక్స్ ఉంటుంది.
తరుచుగా బస్సు బాడీని నిర్మించేటప్పుడు ఆపరేటర్స్ సీటింగ్ కెపాసిటీని తారుమారు చేస్తారు. లగ్జరీ బస్సుల్లో 36 సీట్ల కెపాసిటీ ఉంటుంది. కానీ ఆపరేటర్లు 42 సీట్లు ఏర్పాటు చేస్తారు. సీటు-సీటుకీ మధ్య గ్యాప్, రెండు వరుసల మధ్య నడవా పరిమాణం వంటివి మారిపోతాయి. ఇవ్వన్నీ ప్రయాణికుని భద్రతకు సంబంధించినవి కాబట్టి వీటన్నింటినీ పరీక్షిస్తామని తెలంగాణ ట్రాన్స్ పోర్ట్ మాజీ అడిషనల్ కమిషనర్ సీఎల్ఎన్ గాంధీ చెప్పారు.
అయితే ఇటువంటి పరీక్షలు ఏమీ లేకుండానే దేశంలో ఏ మూల నుంచైనా నాగాలాండ్ లాంటి ఈశాన్య రాష్ట్రాలలో వాహన రిజిస్ట్రేషన్ జరిగిపోతుందని, ఇందుకోసం ఆయా రాష్ట్రాలలో విస్తృత ఏజెంట్ వ్యవస్థ ఉందని గాంధీ చెప్పారు.
“సీట్లు మార్చుతున్నారు అనేది కరెక్ట్ కాదు. బస్సు కేటగిరీని బట్టీ సీట్లు ఎక్కువ తక్కువ అవుతాయి. ఒక వేళ ఎక్కువ సీట్లు ఉంటే బస్సుకు పర్మిషన్ ఇవ్వరు కదా ” అని తెలంగాణ రాష్ట్ర క్యాబ్, బస్ ఆపరేటర్స్ అసోసియేషన (టీఎస్బీఓఏ ) ప్రెసిడెంట్ సయ్యద్ నిజాముద్దీన్ చెప్పారు.
ఇటీవల కాలంలో కచ్చితమైన బాడీ బిల్డింగ్ కోడ్స్ కూడా వచ్చాయని గాంధీ అన్నారు.
ఓ దశాబ్ధం కిందట నాగాలాండ్ రవాణా అధికారులే స్వయంగా ముంబయికి వచ్చి ఇటువంటి రిజిస్ట్రేషన్లు చేసేవారని, ప్రస్తుత ఆన్లైన్ కాలంలో ఆఫీసర్లకు, ఏజెంట్లు సంబంధిత వాహనాల డాక్యుమెంట్స్ పంపితే, మొత్తం వ్యవహారమంతా ఆన్లైన్లో పూర్తయిపోతోందని గాంధీ అన్నారు.
“కేవలం వాహన పత్రాలు మాత్రం అక్కడి ఆఫీసులకు పంపుతారు. అంతే వాహన రిజిస్ట్రేషన్ జరిగిపోతుంది” అని చెప్పారు.
అందుకే ఎన్ఎల్ పేరుతో మనకు కనిపించే వాహనాలు నాగాలాండ్ నుంచి వచ్చినవీ కావు, అక్కడకు ఎప్పుడు వెళ్లినవీ కావు.
టాక్స్నుంచి తప్పించుకోవడానికి
వాహనాల రిజిస్ట్రేషన్ చార్జీలు దేశం అంతటా ఒకేలా ఉంటాయి. కానీ రోడ్డు టాక్స్ రాష్ట్రాల వారీగా మారుతుంది. గతంలో అయితే వాహనాలు ఎన్ని రాష్ట్రాలు దాటితే అన్ని రాష్ట్రాలలోనూ పన్నులు చెల్లించాల్సి వచ్చేది. కానీ కేంద్రం ఈ విధానాన్ని రద్దు చేసి ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్ తీసుకువచ్చింది. ఒకసారి ఈ పర్మిట్ తీసుకుంటే ఇక ఎన్ని రాష్ట్రాలలో తిరిగినా ఆ రాష్ట్రాలకు పన్ను కట్టాల్సిన పనిలేదు. అంటే తెలంగాణాలో ఒక బస్సు ఆపరేటరు పది బస్సులు నడుపుతున్నాడునుకుంటే, ఇక్కడ హోంస్టేట్ టాక్స్ కింద దాదాపు ఏడాదికి కోటి 20లక్షలరూపాయలవరకు పన్ను కట్టాల్సి వస్తుంది. కానీ నాగాలాండ్‌లో రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఈ హోంటాక్స్ 40 లక్షల రూపాయలతో అయిపోతుంది. ఇదే విషయాన్ని గాంధీ వివరించారు.
“తెలంగాణాలో రిజిస్టర్ అయిన బస్సులు ఏడాదికి దాదాపు 12 లక్షల వరకు రాష్ట్రానికి పన్ను చెల్లించాలి. కానీ నాగాలాండ్ లో రిజిస్టర్ అయితే 4 లక్షల రూపాయల టాక్స్ ఉంటుంది. బస్సు ఆపరేటర్లు పదుల సంఖ్యలో సర్వీసులు నడుపుతారు కాబట్టి కొన్ని లక్షల రూపాయల పన్ను చెల్లించకుండా తప్పించుకుంటారు. అందుకే చాలా ప్రైవేట్ బస్సుల నంబర్ ప్లేట్లపై NL అని ఎక్కువగా చూస్తాం’’ అని గాంధీ తెలిపారు.
దీని వల్ల రాష్ట్ర ఆదాయానికి పెద్ద నష్టమే.
ఓ టూర్ ఆపరేటర్ రెండు రాష్ట్రాల మధ్య సర్వీసు నడిపితే రెండు రాష్ట్రాలకు అంతర్ రవాణా పన్ను కట్టాలి. కాని కేంద్ర ప్రభుత్వం 2023లో తీసుకొచ్చిన ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్ (AITP) వల్ల ప్రైవేట్ బస్సు వ్యాపారాలకు ఈ టాక్స్ నుంచి మినహాయింపు లభించింది. ఈ పర్మిట్ ఫీజు మూడు నెలలకు ఒకసారి లేదా, ఏడాదికోసారి కట్టాలి. నెలకు ఒక సారి కేంద్రం రాష్ట్రాలకు టాక్స్ ఆదాయాన్ని కేటాయిస్తుంది
ఎందుకిలా?
వ్యాపారం ఒక రాష్ట్రంలో, రిజిస్ట్రేషన్ మరో రాష్ట్రంలో జరపడమనేది చట్టబద్ధమేనా అని ప్రశ్నిస్తే… దీనికి సరైన సమాధానం చెప్పడం కష్టమేనని ఓ ఆర్టీఏ అధికారి చెప్పారు.
రవాణా అనేది కేంద్ర, రాష్ట్రాల ఉమ్మడి జాబితాలోని అంశం. రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి నిర్ణయం తీసుకోవచ్చు. ఉదాహరణకు, తమిళ నాడులో అక్కడి రూల్స్ ప్రకారం ఇటువంటి బస్సులను సీజ్ చేస్తున్నారు. ఆల్ ఇండియా టూర్ పర్మిట్ తీసుకుని కేవలం తమిళనాడులో మాత్రమే వాహనాలు నడుపుతున్నవారిని అడ్డుకుంటోంది.
పాత రూల్స్ ప్రకారం రిజిస్ట్రేషన్ చేసిన రాష్ట్రానికి ప్రతి మూడు నెలలకు ఒక సారి వెళ్లాల్సి వచ్చేది. కాని AITP ఉన్న వాహనాలకు ఈ రూల్స్ వర్తించటం లేదు అని ఆంధ్ర ప్రదేశ్ లో ఓ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ (ఎంవీఐ) బీబీసీతో అన్నారు.
“ఏడాదికి నాలుగు సార్లు నాగాలాండ్ కు ఈ బస్సులు వెళ్లవు. ట్రాఫిక్ పోలీసులు ఈ రూల్ ను ఉల్లంఘిస్తున్నందుకు చలాన్ రాసేవారు. ఇప్పుడలా కాదు. చాలా వరకు రూల్స్ సడలించారు,” అని ఆ ఎంవీఐ చెప్పారు.
ఇలాంటి బస్సులు తెలుగు రాష్ట్రాలలో ఎన్ని ఉన్నాయని ప్రశ్నిస్తే…
“కచ్చితమైన లెక్క ఉండకపోవచ్చు. కాని పండుగ సమయాల్లో రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు తనిఖీ చేస్తే దాదాపు 90 శాతం ఈశాన్య రాష్ట్రాల రిజిస్ట్రేషన్ బస్సులే కనిపిస్తున్నాయి” అని అన్నారు ఆ అధికారి.
“రాష్ట్ర ప్రభుత్వాలు మొండిగా ప్రవర్తిస్తే బస్సు ఆపరేటర్లు టాక్స్ తక్కువ ఉన్న చోటుకే వెళతారు. రూల్స్ కు వ్యతిరేకంగా ఏమి చేయడంలేదు. టాక్స్ లు కడతున్నారు కదా. ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలాగా టాక్స్ ఉండటం అసలైన సమస్య. ఎవరి ఆసక్తి ప్రకారం వాళ్లు టాక్స్ లు నిర్ణయించారు. ఒక వేళ తెలంగాణ , ఆంధ్ర రాష్ట్రాలు టాక్స్ లు త్గగ్గిస్తే ఇప్పుడు ఉన్న దాని కంటే ఎక్కువ బస్సులు రిజిస్ట్రేషన్ జరుగుతాయి. రెవెన్యూ పెరుగుతంది” అని నిజాముద్దీన్ అన్నారు.
ట్రాన్స్ పోర్ట్ రూల్స్ లోని లోపాలు కారణంగా ఇది ఎప్పటి నుండో ఉన్నా, AITP తర్వాత బస్సు ఆపరేటర్ లు తమకి తోచిన చోట రిజిస్ట్రేషన్ లు చేసుకునే వెసులుబాటు ఏర్పడింది. ప్రైవేట్ బస్సుల యజమానుల లాబీయింగ్, రాజకీయ నాయకులతో ఉన్న సంబంధాల వల్ల దీనిని ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకోవడం లేదని ఎంవీఐ అధికారి అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
SOURCE : BBC NEWS