SOURCE :- BBC NEWS

సోనియా, రాహుల్, నేషనల్ హెరాల్డ్ కేసు, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్

ఫొటో సోర్స్, Getty Images

28 నిమిషాలు క్రితం

నేషనల్ హెరాల్డ్ న్యూస్‌పేపర్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ ఎంపీ సోనియా గాంధీ, లోక్‌ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ ) చార్జిషీట్ దాఖలు చేసింది.

ఈడీ చర్యను ”ప్రతీకారం రాజకీయం”గా కాంగ్రెస్ అభివర్ణించింది. ప్రధాన మంత్రి, హోం మంత్రి బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించింది.

వార్తా సంస్థ పీటీఐ ప్రకారం, కేసు దర్యాప్తు అనంతరం, ఈ ఇద్దరు సీనియర్ కాంగ్రెస్ నేతలపై ఈడీ చార్జిషీట్ దాఖలు చేసింది. ఏప్రిల్ 9న చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకున్న స్పెషల్ జడ్జి విశాల్ గొగ్నె, ఏప్రిల్ 25న కేసు విచారణ జరపనున్నట్లు నిర్ణయించారు.

కాంగ్రెస్ నాయకుడు శామ్ పిట్రోడా, రాజీవ్ గాంధీ ఫౌండేషన్ ట్రస్టీ సుమన్ దుబేలను కూడా చార్జిషీట్‌లో నిందితులుగా చేర్చారు.

ఈ నెల మొదట్లో, రూ.661 కోట్ల విలువైన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్) ఆస్తులను స్వాధీన ప్రక్రియను ఈడీ ప్రారంభించింది.

దిల్లీ, ముంబయి, లఖ్‌నవూలోని రిజిస్ట్రార్లకు అధికారికంగా నోటీసులు జారీ చేసిన ఈడీ, ఆస్తుల స్వాధీనం చేసుకోనున్నట్లు తెలిపింది.

నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికను యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్‌కి చెందిన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ ప్రచురిస్తుంది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి ఈ కంపెనీలో వాటాలున్నాయి.

పోస్ట్‌ X స్కిప్ చేయండి

X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

బీబీసీ న్యూస్ తెలుగు
సోనియా, రాహుల్, నేషనల్ హెరాల్డ్ కేసు, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్

ఫొటో సోర్స్, Congress

కాంగ్రెస్ ఏమంటోంది?

ఏజేఎల్‌లో జరిగిన ఆర్థిక అవకతవకల ఆరోపణలపై 2022లో ఈడీ కేసు నమోదు చేసింది. దర్యాప్తులో భాగంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీని ఈడీ ప్రశ్నించింది.

మనీలాండరింగ్ నిరోధక చట్టంలోని సెక్షన్ 8లోని రూల్ 5 (1) కింద నేషనల్ హెరాల్డ్ ఆస్తులను ఈడీ జప్తు చేసింది.

ఈ రూల్ కింద ఈడీ జప్తు చేసిన ఆస్తులను స్వాధీనం చేసుకునే ప్రక్రియను ప్రారంభించవచ్చు.

దీంతో ముంబయిలోని బాంద్రా (తూర్పు)లో ఉన్న హెరాల్డ్ హౌస్ భవనంలోని 7, 9 అంతస్తుల్లో ఉన్న జిందాల్ సౌత్ వెస్ట్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్‌కు కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది.

జిందాల్ సౌత్ వెస్ట్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ ఏజేఎల్‌కు చెల్లించే అద్దె లేదా ఇతర చెల్లింపులను తనకు చెల్లించాలని ఈడీ సూచించింది.

“నేషనల్ హెరాల్డ్ ఆస్తులను జప్తు చేయడం.. చట్టాల అమలు పేరుతో ప్రభుత్వం చేస్తున్న నేరం” అని కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేశ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

“కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ నాయకత్వం దీన్ని చూస్తూ మౌనంగా ఊరుకోదు. సత్యమేవ జయతే” అని ఆయన రాశారు.

సోనియా, రాహుల్, నేషనల్ హెరాల్డ్ కేసు, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్

ఫొటో సోర్స్, Getty Images

ఏమిటీ నేషనల్ హెరాల్డ్ కేసు?

నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికను 1938లో మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ప్రారంభించారు.

అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్) నేషనల్ హెరాల్డ్‌ను ప్రచురించేది. ఈ కంపెనీ ఉర్దూలో క్వామీ ఆవాజ్, హిందీలో నవజీవన్ అనే మరో రెండు వార్తాపత్రికలను కూడా ప్రచురించేది.

1937లో స్థాపితమైన ఈ సంస్థలో మరో 5,000 మంది స్వాతంత్య్రోద్యమకారులు భాగస్వాములుగా (షేర్‌ హోల్డర్లు) ఉండేవారు.

1942లో ఆ పత్రికను బ్రిటిష్ సర్కారు నిషేధించటంతో మూతపడింది. మళ్లీ మూడేళ్ల తర్వాత పత్రిక ప్రచురణ తిరిగి ప్రారంభమైంది.

1947లో భారతదేశం స్వాతంత్య్రం పొందినపుడు ప్రధాన మంత్రి పదవి చేపట్టిన నెహ్రూ.. నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రిక బోర్డు చైర్మన్ పదవికి రాజీనామా చేశారు.

కానీ, ఆ వార్తాపత్రిక సిద్ధాంతానికి రూపునివ్వటంలో కాంగ్రెస్ పార్టీ పాత్ర కొనసాగింది.

1963లో నేషనల్ హెరాల్డ్ రజతోత్సవాల సందర్భంగా నెహ్రూ ఇచ్చిన సందేశంలో.. ”స్వతంత్ర దృక్పథాన్ని కొనసాగిస్తూనే కాంగ్రెస్ విధానానికి అనుకూలంగా” ఉండే అంశం గురించి స్వయంగా మాట్లాడారు.

నేషనల్ హెరాల్డ్ పత్రికకు కాంగ్రెస్ పార్టీ నిధులు కొనసాగుతున్నా కూడా.. భారతదేశపు ఉత్తమ పాత్రికేయులు కొందరి సారథ్యంలో అగ్రస్థాయి ఆంగ్ల దినపత్రికల్లో ఒకటిగా అది నిలిచింది.

కానీ, ఆర్థిక కారణాల వల్ల ఈ పత్రిక 2008లో మరోసారి మూతపడింది. మళ్లీ 2016లో పత్రికను డిజిటల్ పబ్లికేషన్ రూపంలో పునఃప్రారంభించారు.

సోనియా, రాహుల్, నేషనల్ హెరాల్డ్ కేసు, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్

ఫొటో సోర్స్, Getty Images

బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి ఆరోపణలు..

కొంతకాలం కిందట మూతపడిన నేషనల్ హెరాల్డ్ అనే వార్తాపత్రికను ప్రచురించే సంస్థను కొనుగోలు చేయటానికి సోనియా, రాహుల్ గాంధీలు కాంగ్రెస్ పార్టీ నిధులను దుర్వినియోగం చేశారని బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి ఆరోపించారు.

దీనిపై 2012లో గాంధీల మీద ట్రయల్ కోర్టులో కేసు వేశారు.

అయితే, తాము ఎలాంటి ఆర్థిక అవకతవకలకు పాల్పడలేదని సోనియా, రాహుల్‌ వాదిస్తున్నారు.

ఏజేఎల్ సంస్థకు చెందిన 2,000 కోట్ల రూపాయలకు పైగా ఆస్తులను హస్తగతం చేసుకోవటం కోసం గాంధీలు ఆ సంస్థను తమ యాజమాన్యంలోకి తెచ్చుకోవటానికి కాంగ్రెస్ పార్టీ నిధులను ఉపయోగించుకున్నారని ఆయన ఆరోపించారు.

2008లో నేషనల్ హెరాల్డ్‌ను మూసివేసేటప్పుడు ఏజేఎల్ సంస్థ కాంగ్రెస్ పార్టీకి మొత్తం 90 కోట్ల రూపాయలు బకాయి ఉంది.

2010లో కాంగ్రెస్ పార్టీ ఈ బకాయిని యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు కేటాయించింది. లాభాపేక్ష లేని ఈ సంస్థను అప్పటికి కొన్ని నెలల ముందు స్థాపించారు. ఆ సంస్థ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఉన్నారు. కంపెనీలో వారిద్దరికీ చెరొక 38 శాతం వాటా ఉంది.

మిగతా 24 శాతం వాటా కాంగ్రెస్ నాయకులు మోతీలాల్ వోరా, ఆస్కార్ ఫెర్నాండెజ్, పాత్రికేయుడు సుమన్ దుబే, పారిశ్రామికవేత్త శాం పిట్రోడాల యాజమాన్యంలో ఉంది. సుబ్రమణ్య స్వామి వేసిన కేసులో వారిని కూడా నిందితులుగా చేర్చారు.

వేల కోట్ల విలువైన ఆస్తులను ‘అక్రమంగా సొంతం చేసుకోవటానికి’ గాంధీలు ఈ సాకును ఉపయోగించుకున్నారనేది సుబ్రమణ్య స్వామి ఆరోపణ.

ఏజేఎల్ సంస్థ మీద, దానికి సంబంధించి దిల్లీ, లఖ్‌నవూ, ముంబయి తదితర నగరాల్లో ఉన్న స్థిరాస్థుల మీద యంగ్ ఇండియా సంస్థ పూర్తి నియంత్రణ పొందిందని ఆయన ఆరోపించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)