SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, Mohar Singh Meena
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కొడుకు బాగోగులు చూస్తున్న తండ్రికి, అవసరం లేకపోయినా ఆపరేషన్ చేసినట్టు రాజస్థాన్‌లోని కోటా మెడికల్ కాలేజీపై ఆరోపణలొస్తున్నాయి.
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ కొడుకు దగ్గర ఉన్న తండ్రిని ఆపరేషన్ థియేటర్‌కు పిలిపించిన వైద్యులు, రోగి ఆయనో, కాదో నిర్ధరించుకోకుండా ఆపరేషన్ చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఏప్రిల్ 12న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన సమాచారం బయటకు రాకుండా ఆస్పత్రి అధికార యంత్రాంగం ఐదు రోజుల పాటు దాచిపెట్టిందని బాధితుడి కుటుంబం ఆరోపిస్తోంది. బాధితునికి ఎలాంటి సమస్యలు లేవని, ఆయన్ను ఆస్పత్రిలో చేర్పించలేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
కోటా జిల్లాలోని మహావీర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో దీనిపై కేసు నమోదయింది.ఈ ఘటనపై దర్యాప్తు చేయడానికి ఏర్పాటు చేసిన ముగ్గురు సభ్యుల కమిటీ నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సంగీత సక్సేనా చెప్పారు.


ఫొటో సోర్స్, Mohar Singh Meena
ఆపరేషన్ ఎప్పుడు జరిగింది?
బరన్ జిల్లాలోని అట్రుకు చెందిన 33 ఏళ్ల మనీశ్ పంచల్ మూడు నెలల కిందట రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. అప్పటి నుంచి ఆయన కోటా మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్నారు.
శస్త్ర చికిత్స కోసం మనీశ్ ఇటీవల ఆసుపత్రిలో చేరారు. ఆయన బాగోగులు చూసుకోవడానికి తండ్రి జగదీశ్ పంచల్ కూడా ఆసుపత్రిలో ఉన్నారు.
ఏప్రిల్ 12 ఉదయం మనీశ్‌ను ఆపరేషన్ థియేటర్‌కు తీసుకెళ్లారు. ఆపరేషన్ థియేటర్ బయట తండ్రి జగదీశ్ కొడుకు కోసం ఎదురుచూస్తూ కూర్చున్నారు.
“ఆపరేషన్ తర్వాత నేను బయటకు వచ్చి చూస్తే నాన్న కనిపించలేదు. కాసేపటి తర్వాత ఆయన చేతికి బ్యాండేజ్‌తో తిరిగివచ్చారు” అని మనీశ్ పంచల్ బీబీసీతో అన్నారు.
“ఆపరేషన్ థియేటర్ వైద్య సిబ్బంది ‘జగదీశ్’ అని పిలిచారని, తననే పిలిచారనుకుని ఆయన అక్కడికి వెళ్లానని, అక్కడ తనను అడగకుండానే మత్తుమందు ఇంజెక్షన్ ఇవ్వడంతో, తాను అపస్మారక స్థితిలోకి వెళ్లానని నాన్న చెప్పారు” అని మనీశ్ వివరించారు.
“నాన్న ఎడమచేతిపై పొడుగ్గా కోసి ఆపరేషన్ చేశారు. దాదాపు ఆరు కుట్లు వేశారు.” అని మనీశ్ ఆవేదన వ్యక్తంచేశారు.

ఫొటో సోర్స్, Mohar Singh Meena
బాధిత కుటుంబం ఏం కోరుతోంది?
ఏప్రిల్ 17న స్థానిక వార్తాపత్రికలో ప్రచురితమైన వార్తను చదివినప్పుడు ఆ కుటుంబానికి ఈ ఘటన గురించి తెలిసింది.
ఆ తర్వాత మనీశ్ అన్న శ్రావణ్ పంచల్ నేరుగా కోటా ఆసుపత్రికి వచ్చారు.
“ఆస్పత్రి అధికారులు ఈ విషయాన్ని ఐదురోజుల పాటు బయటకు రానీకుండా చేశారు. నా తమ్ముడిని, మా నాన్నను వాళ్లు బెదిరించారు. అందుకే ఆస్పత్రి ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్న విషయం బయటకు రాలేదు. ” అని శ్రావణ్ ఆరోపించారు.
“మా నాన్నను ఆస్పత్రిలో చేర్చలేదు. ఆయన పేరును రోగిగా నమోదు చేయలేదు. మా నాన్నకు ఎలాంటి గాయాలు లేవు. పూర్తి ఆరోగ్యంగా ఉన్న వ్యక్తికి శస్త్రచికిత్స చేశారు. ఇది మా నాన్నకు జరిగిన అన్యాయం. మాకు న్యాయం కావాలి” అని శ్రవణ్ అన్నారు.
“ఆపరేషన్ చేసిన డాక్టర్ రాజేంద్ర మహావీర్, ఇతర వైద్య సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలి. తాము చేసిన తప్పును గ్రహించిన వైద్యులు ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని మా నాన్నతో అన్నారు.” అని శ్రవణ్ అంటున్నారు.
“నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్య సిబ్బందిపై చర్యలు తీసుకోవాలి. ఆ వైద్యుడిని ఉద్యోగం నుంచి తొలగించాలి. మా కుటుంబానికి పరిహారం చెల్లించాలి” అని ఆయన డిమాండ్ చేశారు.
ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా అధ్యక్షులు, న్యాయవాది కుంజ్ బిహారీ సింఘాల్ ఆస్పత్రిలో ఆకస్మికంగా పర్యటించిన సమయంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
వైద్యులు, ఆస్పత్రి అధికారయంత్రాంగంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్‌కు ఆయన ఒక మెమోరాండం సమర్పించారు. ఈ కేసు బయటకు రాకుండా ఆస్పత్రి అధికారులు బాధితులను బెదిరిస్తున్నారని ఆయన ఆరోపించారు.

ఫొటో సోర్స్, Mohar Singh Meena
ఆస్పత్రి అధికార యంత్రాంగం ఏం చెప్పింది?
మీడియాలో వార్తలు, నిరసనల తర్వాత కోటా మెడికల్ కాలేజీ అధికార యంత్రాగం చర్యలు ప్రారంభించింది. దీనిపై దర్యాప్తు జరిపేందుకు ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది.
“కమిటీ నివేదిక వచ్చిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటాం” అని మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సంగీత సక్సేనా బీబీసీతో అన్నారు.
” కుంజ్ బిహారీ మెమోరాండం ఇచ్చిన తర్వాతే ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు ఈ విషయం తెలిసింది. ఈ విషయంపై ఒక కమిటీని ఏర్పాటు చేసి వాస్తవ నివేదికను సమర్పించాలని ఆయనను కోరాను” అని సంగీత సక్సేనా చెప్పారు.
“రోగిని ఆస్పత్రిలో చేర్చుకుని, వాళ్ల ఫైల్ సిద్ధంగా ఉన్న తర్వాత మాత్రమే ఆపరేషన్ చేస్తారు. ఈ కేసులో ఏం జరిగిందనేది కమిటీ నివేదిక తర్వాతే తెలుస్తుంది” అని సక్సేనా అన్నారు.
“బాధిత కుటుంబం నుంచి ఫిర్యాదు అందింది. మేం దర్యాప్తు ప్రారంభించాం. నిర్లక్ష్యం ఉన్నట్లు రుజువైతే, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటాం” అని మహావీర్ నగర్ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ రమేశ్ కవియ బీబీసీతో చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)