SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, Getty Images
ప్రతి ఐఫోన్ కూడా కాలిఫోర్నియాలో డిజైన్ అయినట్లు తెలిపే లేబుల్‌తో మార్కెట్లో కనిపిస్తుంది. చాలామంది జీవితాల్లో భాగమైన ఈ ఐఫోన్ డిజైన్ వాస్తవానికి అమెరికాలో రూపొందించినప్పటికీ, తయారీ మాత్రం అక్కడికి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న చైనాలో జరుగుతుంది.
అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ సుంకాల వల్ల తీవ్రంగా దెబ్బతిన్న చైనా దిగుమతులు కొన్నింటిపై ఇప్పుడు సుంకం 245 శాతానికి పెరిగింది.
యాపిల్ ప్రతి ఏడాది 22 కోట్లకు పైగా ఐఫోన్లను అమ్ముతోంది.
వివిధ అంచనాల ప్రకారం, ప్రతి పది ఐఫోన్లలో తొమ్మిది చైనాలోనే తయారవుతాయి.
తళుక్కున మెరిసే స్క్రీన్ల నుంచి బ్యాటరీల వరకు, యాపిల్ ప్రోడక్ట్స్లోని అనేక భాగాలు చైనాలోనే తయారుచేస్తారు.
వీటిని ఐఫోన్లు, ఐప్యాడ్లు, మ్యాక్‌బుక్‌ల తయారీకి లేదా అసెంబుల్ చేసేందుకు వాడతారు. యాపిల్‌కి అతిపెద్ద మార్కెట్ అయిన అమెరికాకి వీటిలో చాలా వరకు రవాణా చేస్తారు.


ఫొటో సోర్స్, Getty Images
ట్రంప్ గత వారం స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్లు, కొన్ని ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను తన సుంకాల నుంచి మినహాయిస్తున్నట్లు ప్రకటించారు. కానీ ఈ మినహాయింపు స్వల్పకాలం మాత్రమే.
మరిన్ని సుంకాలు విధించనున్నామని డోనల్డ్ ట్రంప్ అన్నారు.
‘‘టారిఫ్‌ల బారి నుంచి ఎవరూ తప్పించుకోలేరు’’ అని ట్రంప్ సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్‌లో రాశారు.
సెమీకండక్టర్లు, మొత్తం ఎలక్ట్రానిక్స్ సప్లై చైన్‌పై తమ అడ్మినిస్ట్రేషన్ దర్యాప్తు చేసిందని చెప్పారు.
యాపిల్ తన బలంగా చెప్పుకుంటున్న గ్లోబల్ సప్లై చైన్‌పై పరిస్థితి ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.
ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, చైనాలు పరస్పరం ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉన్నాయి.
అయితే, ట్రంప్ విధించిన సుంకాల వల్ల ఆ సంబంధం రాత్రికి రాత్రే తారుమారు అయింది. ఈ నేపథ్యంలో ఈ రెండింటిలో ఏ దేశంపై మరో దేశం ఎక్కువగా ఆధారపడుతుందన్న ప్రశ్న తలెత్తుతోంది

ఫొటో సోర్స్, APPLE
లైఫ్‌లైన్ ముప్పుగా ఎలా మారింది?
ప్రపంచంలో అత్యంత విలువైన ఒక కంపెనీ ప్రొడక్ట్ తయారీకి వేదిక కావడంతో చైనా ఎంతో లాభపడింది.
యాపిల్ 1990ల్లో థర్డ్ పార్టీ సప్లయర్స్ ద్వారా కంప్యూటర్లను అమ్మడానికి చైనాలోకి ప్రవేశించింది.
1997 ప్రాంతంలో, ప్రత్యర్థులతో పోటీ పడటానికి ఇబ్బంది పడుతూ దివాలా అంచున ఉన్నప్పుడు, చైనా తనకొక లైఫ్‌లైన్ అని యాపిల్ గుర్తించింది.
ఉత్పాదకత పెంచడానికి, ఉద్యోగాలను సృష్టించడానికి విదేశీ కంపెనీలకు చైనా కూడా తన ఆర్థిక వ్యవస్థ తలుపులు తెరిచింది.

ఫొటో సోర్స్, Getty Images
యాపిల్ తొలుత షాంఘైకి చెందిన ఒక ట్రేడింగ్ కంపెనీ ద్వారా చైనాకు వచ్చి, ఉత్పత్తులను తయారు చేయడం మొదలుపెట్టింది.
ఐపాడ్లు, ఐమాక్లు, ఆ తరువాత ఐఫోన్లను తయారు చేయడానికి చైనాలో పనిచేస్తున్న తైవాన్ ఎలక్ట్రానిక్ తయారీదారు ఫాక్స్‌కాన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.
అప్పట్లో ఐఫోన్లను తయారు చేయడానికి చైనా సిద్ధంగా లేదు. కానీ, యాపిల్ తన సొంత సరఫరాదారులను ఎంచుకుని, వారు మాన్యుఫాక్చరింగ్ సూపర్స్టార్లుగా ఎదగడానికి సహాయపడిందని సప్లై చైన్ నిపుణులు లిన్ జుపింగ్ అన్నారు.
యాపిల్ తన తొలి స్టోర్‌ను 2008లో బీజింగ్‌లో ప్రారంభించింది. అదే ఏడాది బీజింగ్ ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇచ్చింది.
అదే సమయంలో, పశ్చిమ దేశాలతో చైనా సంబంధం అత్యున్నత స్థాయికి చేరుకుంది. కొద్దికాలంలోనే యాపిల్ దుకాణాల సంఖ్య 50కి చేరుకుంది. వినియోగదారులు క్యూలో నిలబడే స్థాయికి చేరింది.

ఫొటో సోర్స్, Getty Images
యాపిల్ లాభాల మార్జిన్లు పెరిగే కొద్దీ, చైనాలో తయారీ కూడా పెరిగింది.
ఝెంగ్ఝౌలో ప్రపంచంలోనే అతిపెద్ద ఐఫోన్ ఫ్యాక్టరీని నిర్వహిస్తోంది ఫాక్స్‌కాన్ సంస్థ. అప్పటి నుంచి దాన్ని ఐఫోన్ సిటీగా పిలుస్తున్నారు.
ఇవాళ యాపిల్ విలువైన ఐఫోన్లలో ఎక్కువ భాగం ఫాక్స్‌కాన్ సంస్థే తయారుచేస్తోంది.
వాటి పవర్ చిప్‌లను ప్రపంచంలోని అతిపెద్ద చిప్ తయారీదారు టీఎస్ఎమ్సీ (TSMC) తైవాన్‌లో తయారు చేస్తుంది.
ఆడియో అప్లికేషన్లు, కెమెరాలలో ఉపయోగించే రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ వీటి తయారీకి అవసరం.
నిక్కీ ఆసియా విశ్లేషణ ప్రకారం, 2024లో యాపిల్ టాప్ 187 సప్లయర్లలో దాదాపు 150 మందికి చైనాలో ఫ్యాక్టరీలు ఉన్నాయి.
ప్రపంచంలో చైనా కంటే మనకు కీలకమైన సప్లై చైన్ మరొకటి లేదని యాపిల్ సీఈఓ టిమ్ కుక్ గత సంవత్సరం ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
టారిఫ్ ముప్పు – ఊహాగానమా లేక నిశ్చయమా?
ట్రంప్ మొదటి పదవీ కాలంలో చైనా మీద విధించిన సుంకాలపై మినహాయింపులు పొందింది యాపిల్ సంస్థ.
కానీ ఇప్పుడు, ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కొన్ని ఎలక్ట్రానిక్స్‌పై సుంకాలను రద్దు చేయడానికి ముందు యాపిల్‌ను ఒక ఉదాహరణగా చూపించింది.
అధిక పన్నుల విధింపు అమెరికాలోనే ఉత్పత్తులను తయారు చేయడానికి ప్రోత్సహిస్తుందని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ నమ్ముతుంది.
‘‘ సెమీకండక్టర్లు, చిప్‌లు, స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు వంటి వాటిల్లో ఉపయోగించే క్రిటికల్ టెక్నాలజీల తయారీకి చైనాపై అమెరికా ఆధారపడాలనుకోవడం లేదని అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేశారు. అధ్యక్షుని ఆదేశాల మేరకు ఈ కంపెనీలు వీలైనంత త్వరగా అమెరికాలో తయారీని ప్రారంభించాలని చూస్తున్నాయి. కానీ, దీనిపై చాలామంది సందేహంగా ఉన్నారు’’ అని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలైన్ లీవిట్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
యాపిల్ తన అసెంబ్లీ ఆపరేషన్స్‌ను అమెరికాకు తరలిస్తుందని అనుకోవడం పూర్తిగా ఫాంటసీ అని ఆ సంస్థ అకడమిక్ అడ్వయిజరీ బోర్డుకు అంతకుముందు పనిచేసిన ఎలి ఫ్రైడ్‌మ్యాన్ అన్నారు.
బోర్డులో తాను చేరినప్పటి నుంచే అంటే 2013 నుంచే చైనా బయటకు తన సప్లై చైన్‌ను తరలించడంపై కంపెనీ చర్చిస్తోందని తెలిపారు. అమెరికా ఒక ఆప్షన్ కాదన్నారు.
ఈ వార్త రాసే సమయానికి ఈ వ్యవహారంపై యాపిల్ స్పందించలేదు. కానీ, తన సప్లై చైన్ వేల బిజినెస్ సెంటర్లతో 50కి పైగా దేశాల్లో విస్తరించిందని వెబ్సైట్లో పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
ముందున్న సవాళ్లు
కోవిడ్ మహమ్మారి తర్వాత వృద్ధిని వేగవంతం చేయడానికి ప్రయత్నిస్తున్న చైనాకు, యాపిల్ ప్రస్తుత సప్లై చైన్లలో ఏదైనా మార్పు జరిగితే పెద్ద దెబ్బే.
అయితే, ట్రంప్ బెదిరింపులకు చైనా ఎందుకు తలొగ్గదో నిపుణులు వివరిస్తున్నారు.
అమెరికా దిగుమతులపై 125 శాతం సుంకాలు విధించడం ద్వారా చైనా ప్రతీకారం తీర్చుకుంది.
చైనా తన వద్ద ఉన్న అరుదైన ఖనిజాలు, అయస్కాంతాలపై ఎగుమతి నియంత్రణలను కూడా విధించింది. ఇది అమెరికాకు పెద్ద ఎదురుదెబ్బ.
అయితే, ఇతర రంగాలపై అమెరికా విధిస్తున్న సుంకాలు చైనాను దెబ్బతీస్తాయనడంలో సందేహం లేదు.

ఫొటో సోర్స్, Getty Images
కేవలం బీజింగ్ మాత్రమే కాదు, అధిక సుంకాలు విధించడంలో చైనా సప్లై చైన్‌లో భాగమైన దేశాలను కూడా లక్ష్యంగా చేసుకుంటానని ట్రంప్ స్పష్టం చేశారు.
ఉదాహరణకు, యాపిల్ ఎయిర్‌పాడ్స్ ఉత్పత్తిని వియత్నాంకు తరలించడంతో… ట్రంప్ 90 రోజుల పాటు విరామం ఇచ్చే ముందు 46% సుంకాలు వియత్నాంపై విధించారు. ఆసియాలోని ఇతర ప్రాంతాలకు తయారీ సంస్థలను తరలించడం కూడా అంత తేలికైన విషయం కాదు.
‘‘లక్షలమంది కార్మికులున్న ఫాక్స్‌కాన్ ప్రొడక్షన్ సైట్లకు అనువైన ప్రదేశాలు ఆసియాలోనే ఉన్నాయి. ఈ దేశాలన్నీ అధిక సుంకాలను ఎదుర్కొంటున్నాయి’’ అని ఫ్రైడ్‌మ్యాన్ అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)