SOURCE :- BBC NEWS

పోప్ ఫ్రాన్సిస్, వాటికన్ సిటీ, ఇటలీ

ఫొటో సోర్స్, Reuters

పోప్ ఫ్రాన్సిస్‌ మరణంతో వాటికన్ సిటీలో కొత్త పోప్ ఎన్నిక జరగనుంది.

కొత్త పోప్‌ను కాథలిక్ చర్చిలోని అత్యంత సీనియర్ అధికారులు ఎన్నుకుంటారు. వారందరినీ కలిపి కాలేజ్ ఆఫ్ కార్డినల్స్ అని పిలుస్తారు.

ఈ కార్డినల్స్ అందరూ పురుషులే. ఒక్కరు కూడా మహిళ లేరు. వీరంతా నేరుగా పోప్ ద్వారా నియమితులైనవారు.

ప్రస్తుతం 252 మంది కాథలిక్ కార్డినల్స్ ఉన్నారు, వీరిలో 138 మంది కొత్త పోప్‌‌ను ఎన్నుకునేందుకు ఓటింగ్‌లో పాల్గొనడానికి అర్హులు.

మిగతా 114 మంది 80 ఏళ్లు దాటినవారు కావడంతో వారు ఓటింగ్‌లో పాల్గొనరు. కానీ, పోప్‌గా ఎవరిని ఎన్నుకోవాలన్న చర్చలో వారు పాల్గొనవచ్చు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌

పోప్‌ ఎన్నికలో కాంక్లేవ్ అంటే ఏంటి?

పోప్ మరణించినప్పుడు (లేదా 2013లో పోప్ బెనెడిక్ట్ -16లా రాజీనామా చేయడం వంటి అరుదైన సందర్భంలో) కార్డినల్స్‌ను వాటికన్‌లో సమావేశానికి పిలుస్తారు.

ఆ తర్వాత కాంక్లేవ్ జరుగుతుంది.

పోప్ మరణం, ఆయన వారసుడి ఎన్నిక మధ్య కాలంలో కాథలిక్ చర్చి నిర్వహణను కార్డినల్స్ చూసుకుంటారు.

సిస్టీన్ చాపెల్ లోపల ఈ ఎన్నిక చాలా రహస్యంగా జరుగుతుంది. మైఖేలాంజెలో చిత్రంలో ఈ సిస్టీన్ చాపెల్‌ కనిపిస్తుంది.

విజేతను నిర్ణయించేంతవరకు కార్డినల్స్ తమకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేస్తారు.

ఈ ప్రక్రియకు చాలా రోజులు పట్టవచ్చు.

గత శతాబ్దాలలో ఓటింగ్ వారాలు లేదా నెలల తరబడి కొనసాగేది.

కొంతమంది కార్డినల్స్ కాంక్లేవ్‌ల సమయంలో మరణించారు కూడా.

కార్డినల్స్ బ్యాలెట్ పేపర్లను కాల్చడం వల్ల రోజుకు రెండుసార్లు వెలువడే పొగ ఎన్నికలు ఎలా జరుగుతున్నాయనే దాని గురించి ఒకే ఒక సూచన.

నలుపు రంగు పొగ వస్తే పోప్ ఎన్నిక ఇంకా పూర్తికాలేదని అర్ధం. తెల్లటి పొగ బయటకు వస్తే కొత్త పోప్ ఎన్నికైనట్టు అర్ధం.

పోప్ ఫ్రాన్సిస్, వాటికన్ సిటీ, ఇటలీ

ఫొటో సోర్స్, Getty Images

కొత్త పోప్ ఎవరనే నిర్ణయాన్ని ఎలా తెలియజేస్తారు?

తెల్లటి పొగ బయటకు వచ్చిన తర్వాత సాధారణంగా గంటలోపు కొత్త పోప్ సెయింట్ పీటర్స్ స్క్వేర్‌ బాల్కనీలో కనిపిస్తారు.

కాంక్లేవ్‌లో పాల్గొన్న వారిలో సీనియర్ అయిన కార్డినల్ ‘‘హబేమస్ పాపమ్’’ అనే లాటిన్ మాటతో కొత్త పోప్‌ను ఎన్నుకున్న నిర్ణయం చెప్తారు. దీని అర్థం ‘మనకు పోప్ ఉన్నారు’ అని.

తరువాత ఆయన కొత్త పోప్‌ను తాను ఎంచుకున్న పాపల్ పేరుతో పరిచయం చేస్తారు. అది ఆయన అసలు పేరు కావచ్చు..కాకపోవచ్చు.

ఉదాహరణకు, పోప్ ఫ్రాన్సిస్ అసలు పేరు జార్జ్ మారియో బెర్గోగ్లియో. కానీ సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అస్సిసి గౌరవార్థం తన పాపసీకి వేరే పేరును ఎంచుకున్నారు.

పోప్ ఫ్రాన్సిస్, వాటికన్ సిటీ, ఇటలీ

ఫొటో సోర్స్, AP

పోప్ కావడానికి అర్హత ఏంటి?

సాధారణంగా బాప్తిజం తీసుకున్న రోమన్ కాథలిక్ ఎవరయినా పోప్ అయ్యేందుకు ఎన్నికల్లో పోటీ చేయొచ్చు.

అయితే సంప్రదాయకంగా కార్డినల్స్ తమలో ఒకరిని పోప్‌గా ఎంచుకునేందుకు ప్రాధాన్యమిస్తున్నారు.

అర్జెంటీనాలో జన్మించిన పోప్ ఫ్రాన్సిస్ 2013లో జరిగిన కాంక్లేవ్‌లో ఎంపికయ్యారు.

దక్షిణ అమెరికాకు చెందినవారు పోప్ కావడం అదే తొలిసారి.

ప్రపంచంలోని మొత్తం కాథలిక్కుల్లో దాదాపు 28శాతం దక్షిణ అమెరికాలో ఉన్నారు.

అయితే చరిత్ర గమనిస్తే యూరప్ దేశాలకు చెందిన వారు ముఖ్యంగా ఇటలీకి చెందిన వారిని పోప్‌గా ఎంచుకునే అవకాశం ఎక్కువగా ఉంది.

ఇప్పటిదాకా మొత్తం 266 మంది పోప్‌లుంటే వారిలో 217 మంది ఇటలీకి చెందినవారే.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)