SOURCE :- BBC NEWS

అఫ్గానిస్తాన్ మహిళలు

“నా కొడుకు దొరికే వరకు నేను ఎక్కడికీ వెళ్లను” అని అమీనా పాకిస్తాన్-అఫ్గానిస్తాన్ సరిహద్దులో బరువెక్కిన గుండెతో చెప్పారు.

అమీనా (పేరు మార్చాం) మూడు రోజుల కిందట తన కూతుళ్లు, వారి పిల్లలతో సరిహద్దుకు వచ్చారు. కానీ, ఆమె ముగ్గురు కొడుకులు రాలేకపోయారు.

పాకిస్తాన్‌లోని రావల్సిండిలో అమీనా కుటుంబం నివసించేది, ఒకరోజు ఇంటి వద్ద ఆమె ఇద్దరు కొడుకులను పోలీసులు అరెస్టు చేశారు.

పాకిస్తాన్ విడిచి వెళ్లాలని అధికారులు ఆదేశించడంతో అమీనా కుటుంబం సామగ్రి అంతా సర్దుకొని బయలుదేరింది.

కానీ, సరిహద్దు దాటకముందే ఆమె మూడో కొడుకును పాకిస్తాన్ సరిహద్దు భద్రతాదళ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు.

అప్పటి నుంచి అమీనా, ఆమె కుటుంబం పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ మధ్య ప్రధాన సరిహద్దు క్రాసింగ్ అయిన టోర్ఖామ్ సమీపంలో ఏర్పాటుచేసిన అఫ్గాన్ తాత్కాలిక ఆశ్రయంలో ఉంటున్నారు.

60 ఏళ్లు పైబడిన అమీనా రోజూ ఉదయం నిద్ర లేచిన వెంటనే తన కొడుకుల కోసం క్రాసింగ్ గేటు వద్దకు వెళ్లి ఎదురుచూస్తున్నారు.

మూడు రోజుల తరువాత అమీనా కొడుకుల జాడ కనుగొన్నారు.

సరైన పత్రాలు లేకుండా దేశంలో నివసిస్తున్న, తాత్కాలిక నివాస అనుమతులున్న విదేశీయులను పాకిస్తాన్ బహిష్కరిస్తోంది. అందులో అమీనా ఒకరు.

పాకిస్తాన్ నుంచి ప్రతిరోజూ 700 నుంచి 800 కుటుంబాలను అఫ్గానిస్తాన్‌కు పంపుతున్నారని, రాబోయే నెలల్లో సుమారు 20 లక్షల మంది వచ్చే అవకాశముందని అఫ్గానిస్తాన్‌లోని తాలిబాన్ అధికారులు చెబుతున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
వలస

సరిహద్దు వద్ద పరిస్థితి ఎలా ఉంది?

టోర్ఖామ్ క్రాసింగ్ వద్ద బాధాకర దృశ్యాలు కనిపిస్తున్నాయి. పాకిస్తాన్, అఫ్గాన్ భద్రతా దళాల పర్యవేక్షణలో పురుషులు, మహిళలు వేర్వేరు ద్వారాల నుంచి వెళ్తున్నారు.

పుట్టినప్పటి నుంచి తామెన్నడూ చూడని దేశానికి తిరిగి వెళ్లడానికి చాలామంది ప్రజలు నిరాకరిస్తున్నారు.

నేను మాట్లాడిన వారిలో చాలామంది విచారం, కోపం వ్యక్తం చేశారు.

అక్కడ మండుతున్న ఎండలో ఒక వ్యక్తి రోడ్డు పక్కన కూర్చున్నారు.

తన పిల్లలు పాకిస్తాన్‌లోనే జన్మించారని, దేశం విడిచి తీసుకెళ్లవద్దని వారు వేడుకుంటున్నారని ఆయన చెప్పారు.

ఆయన కుటుంబం పాకిస్తాన్‌లో ఉండటానికి అధికారులు తాత్కాలిక అనుమతి ఇచ్చారు. కానీ, ఆ గడువు మార్చిలో ముగిసింది.

పదేపదే పత్రాలు చూపించి పోలీసులు ప్రశ్నించడంతో విసిగిపోయిన ఆ వ్యక్తి “ఇక మేం ఎప్పటికీ పాకిస్తాన్ తిరిగి వెళ్లబోం. మాతో వ్యవహరించిన విధానం చూసి వెళ్లాలనిపించడం లేదు” అని చెప్పారు.

పాకిస్తాన్ సరిహద్దు సిబ్బంది తమ వస్తువులన్నీ తీసుకెళ్లకుండా అడ్డుకుంటున్నారని చాలామంది చెప్పారు, అనేక మానవ హక్కుల సంస్థలు కూడా ఈ ఫిర్యాదు చేశాయి.

దీని గురించి పాకిస్తాన్ మంత్రి తలాల్ చౌధరిని ప్రశ్నించినపుడు “అఫ్గాన్ శరణార్థులు వారి వస్తువులను తీసుకెళ్లకుండా నిరోధించడానికి మాకు ఎలాంటి విధానం లేదు” అని ఆయన బదులిచ్చారు.

“ఎగుమతికి పరిమితులు ఉన్నాయి కానీ, మిగతా వస్తువులను తీసుకెళ్లడానికి ప్రజలకు అనుమతించాలి’’ అని వాణిజ్య మంత్రిత్వ శాఖను కోరినట్లు ఆయన చెప్పారు.

అఫ్గానిస్తాన్ బార్డర్

‘ఇక్కడే పుట్టి పెరిగాను’

సరిహద్దు క్రాసింగ్ నుంచి ఒక కిలోమీటరు దూరంలో శిబిరం ఏర్పాటు చేశారు, ఇది పాకిస్తాన్ నుంచి వచ్చేవారికి మొదటి స్టాప్. ప్రజలను ఆర్మీ ట్రక్కులలో తీసుకువస్తున్నారు. ఇక్కడ తాలిబాన్ ప్రభుత్వం, సహాయ సంస్థలు ప్రజలకు ప్రాథమిక సహాయం అందిస్తున్నాయి. ప్రజలు వారి స్వస్థలాలకు వెళ్లే వాహనాలు శిబిరం వద్దకు వచ్చే వరకు అక్కడే ఉంటున్నారు.

ఈ కుటుంబాలు 30 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలో కాన్వాస్ టెంట్లలో నివసిస్తున్నాయి. వేసవిలో ఇక్కడ ఉష్ణోగ్రత 50 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు చేరుకుంటుంది.

ఈ ప్రాంతంలో దుమ్ము కమ్మేస్తుండటంతో ప్రజలు ఇబ్బందిపడుతున్నారు.

“మాకు వారం రోజులుగా నిద్రలేదు. పాకిస్తాన్ నుంచి బయలుదేరే ముందు నిద్రలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మూడునాలుగు రోజులు నిద్రపోలేకపోయాం” అని సయ్యద్ రెహమాన్ తన ఆరుగురు పిల్లలతో ఒక టెంట్‌లో కూర్చుని చెబుతున్నారు.

రెండో తరం శరణార్థి అయిన సయ్యద్ పాకిస్తాన్‌లోనే పుట్టి పెరిగారు. తాను ఎప్పుడూ అఫ్గానిస్తాన్‌ చూడలేదని ఆయన చెప్పారు.

“నేను నా జీవితాంతం పాకిస్తాన్‌లోనే ఉన్నాను. అక్కడే వివాహం చేసుకున్నాను. ఇప్పుడు నేనేం చేయాలి?” అని సయ్యద్ ప్రశ్నిస్తున్నారు.

శిబిరంలో తాలిబన్ నియమించిన ఆర్థిక కమిటీ సభ్యుడు హిదాయతుల్లా యాద్ షిన్వారీ చెప్తున్న ప్రకారం.. తిరిగి వచ్చే వారికి సహాయం చేయడానికి 4 వేల నుంచి 10 వేల అఫ్గానీలను (భారత కరెన్సీలో సుమారు రూ. 3,500 నుంచి రూ. 12,000 వరకు) ఇస్తున్నారు. అక్కడి తాత్కాలిక క్లినిక్ ప్రతిరోజూ 1,500 మంది రోగులకు చికిత్స అందిస్తుంది.

అఫ్గానిస్తాన్

ఎంతమందిని బహిష్కరించొచ్చు?

ఈ సామూహిక బహిష్కరణ అఫ్గానిస్తాన్‌పై ఒత్తిడిని పెంచింది, ఎందుకంటే ఆ దేశంలో ఇప్పటికే మౌలిక సదుపాయాల కొరత ఉంది.

సుమారు 4.5 కోట్ల జనాభా ఉన్న అఫ్గానిస్తాన్ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉంది.

దానికి తోడు ఇపుడు లక్షలాది మందిని తీసుకోవాలని అడుగుతున్నారు.

వీరిలో చాలామందికి డబ్బు లేదు, ఇల్లు లేదు, నిర్దిష్ట భవిష్యత్తు లేదు.

2021లో తాలిబన్లు అధికారాన్ని చేజిక్కించుకున్నప్పటి నుంచి ప్రతిదీ నియంత్రణలో ఉందని చూపించడానికి ప్రయత్నించింది ప్రభుత్వం.

కానీ అధికారులు ఇప్పుడు పరిస్థితి కష్టమని అంగీకరిస్తున్నారు.

తాలిబన్ ప్రభుత్వానికి చెందిన శరణార్థుల వ్యవహారాల హెడ్ బఖ్త్ జమాల్ గౌహర్.. టోర్ఖమ్ క్రాసింగ్ వద్ద మాట్లాడుతూ “మేం చాలా విషయాలను పరిష్కరించాం, కానీ ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు రావడం సమస్యను పెంచుతోంది. ఈ ప్రజలు దశాబ్దాల క్రితం తమ ఆస్తిని విడిచిపెట్టారు. ఈ 20 సంవత్సరాల యుద్ధంలో చాలామంది ప్రజల ఇళ్లు కూడా ధ్వంసమయ్యాయి” అని తెలిపారు.

కాగా, ఈ బహిష్కరణను ఆపాలని ఐక్యరాజ్యసమితి ప్రత్యేక రాయబారి రోజా ఒతున్‌బయేవా పాకిస్తాన్‌ను కోరారు.

అంతర్జాతీయ రక్షణ అవసరమైన వ్యక్తులకు జారీ చేసే యూఎన్ రెఫ్యూజీ ఏజెన్సీ (యూఎన్‌హెచ్‌సీఆర్) పత్రాలు కూడా ఇందులో కొంతమందికి ఉన్నాయి.

కానీ, 1951 రెఫ్యూజీ కన్వెన్షన్‌పై పాకిస్తాన్ సంతకం చేయలేదు. దీంతో అక్కడ నివసిస్తున్న అఫ్గాన్లను పాకిస్తాన్ శరణార్థులుగా గుర్తించడం లేదు.

పాకిస్తాన్ దశాబ్దాలుగా అఫ్గాన్ శరణార్థులకు ఆశ్రయమిస్తోంది. అయితే, ఇపుడు జాతీయ భద్రత, ప్రజా సౌకర్యాలపై ఒత్తిడి సమస్యలను చూపుతూ దేశంలో ఎక్కువమందిని ఉండనివ్వబోమని చెబుతోంది. సరైన పత్రాలు లేని అన్ని దేశాల పౌరులకు ఈ విధానం వర్తిస్తుందని పాకిస్తాన్ ప్రభుత్వం స్పష్టంచేసింది.

యూఎన్‌హెచ్‌సీఆర్ ప్రకారం, దాదాపు 35 లక్షల మంది అఫ్గాన్ పౌరులు పాకిస్తాన్‌లో నివసిస్తున్నారు.

2021లో తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత వలస వచ్చిన వారు ఇందులో 7 లక్షల మంది ఉన్నారు.

వీరిలో సగం మందికి ఎటువంటి పత్రాలు లేవని, మిగిలిన వారి పత్రాలు ఇకపై చెల్లవని ఐక్యరాజ్యసమితి భావిస్తోంది.

అఫ్గాన్ శిభిరం

మహిళలు, బాలికల భవిష్యత్తుపై ఆందోళన

అఫ్గానిస్తాన్‌లో ఆహారం, ఆశ్రయం కోసం పోరాటమే కాకుండా, మహిళలు, బాలికల భవిష్యత్తు గురించి చాలామంది భయపడుతున్నారు.

తాలిబాన్ పాలనలో మహిళలు బహిరంగంగా మాట్లాడటానికి అసౌకర్యంగా భావిస్తారు.

ముగ్గురు కూతుళ్ల తండ్రి అయిన సలేహ్, తాలిబాన్ పాలనలో తన కూతుళ్ల జీవితం ఎలా ఉంటుందో అని ఆందోళన చెందుతున్నారు.

వారి కూతుళ్లు పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో పాఠశాలకు వెళ్లేవారు. కానీ, అఫ్గానిస్తాన్‌లో 12 సంవత్సరాలకు పైగా ఉన్న బాలికలకు విద్యపై నిషేధం ఉంది.

“నా పిల్లలు చదువుకోవాలని కోరుకుంటున్నాను” అని సలేహ్ అన్నారు.

“అఫ్గాన్‌లో ఇస్లామిక్ ప్రభుత్వం ఉంది. అబ్బాయిలు, అమ్మాయిలు ఇద్దరికీ విద్యను అనుమతించాలి. పాఠశాలలు తెరవాలి. ప్రతి వ్యక్తికి విద్య పొందే హక్కు ఉంది” అని ఆయన అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)