SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, PTI
జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో మిలిటెంట్ల కాల్పుల్లో 20మందికి పైగా టూరిస్ట్‌లు చనిపోయారు.
పహల్గాంకు ఐదు కిలోమీటర్ల దూరంలోని బైసరన్‌లో ఈ దాడి జరిగింది.
దాడి సమాచారం అందిన వెంటనే భద్రతాబలగాలు ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నాయి.
ఇటీవలి కాలంలో కశ్మీర్లో సాధారణ పౌరులను లక్ష్యంగా చేసుకుని జరిగిన అతిపెద్ద దాడి ఇదేనని జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అన్నారు.
దాడిలో అనేకమంది గాయపడ్డారు.
గాయపడ్డవారిలో కొందరు అనంతనాగ్‌లోని ప్రభుత్వ మెడికల్ కాలేజ్‌లో చికిత్స పొందుతున్నారు.

‘అకస్మాత్తుగా కాల్పులు’
గుజరాత్‌కు చెందిన టూరిస్ట్‌తో బీబీసీ ప్రతినిధి మాజిద్ జహంగీర్ మాట్లాడారు.
ఆ టూరిస్ట్ కలిసి వెళ్తున్న బృందంపై కాల్పులు జరిగాయి.
అకస్మాత్తుగా కాల్పులు జరిగాయని, దీంతో అక్కడ గందరగోళం ఏర్పడిందని, అరుస్తూ, ఏడుస్తూ అందరూ అటూఇటూ పరుగులు తీయడం ప్రారంభించారని ఆ టూరిస్ట్ చెప్పారు.

‘దాడికి పాల్పడిన వారిని వదిలిపెట్టబోం’ – ప్రధాని మోదీ
ఈ ఘటనను ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు.
‘‘ఈ దారుణ ఘటనకు బాధ్యులైనవారిని కఠినంగా శిక్షిస్తాం. వాళ్లను వదిలిపెట్టబోం’’ అని ప్రధాని ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.
కశ్మీర్ లోయలో టూరిస్టులు బాగా వచ్చే ఈ సీజన్లో దాడి జరిగింది.
పహల్గాం కీలక పర్యటక ప్రాంతం. పచ్చిక బయళ్లు, అందమైన సరస్సులతో ఆహ్లాదకరంగా ఉండే ప్రాంతం కావడంతో ఇక్కడికి పెద్ద సంఖ్యలో దేశ, విదేశీ పర్యాటకులు వస్తుంటారు.
అధికారిక లెక్కల ప్రకారం 2024లో 35 లక్షలమంది కశ్మీర్లో పర్యటించారు.
పహల్గాంను ‘స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా’గా పిలుస్తారు.
ఘటనపై జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా విచారం వ్యక్తంచేశారు.
”నేను పూర్తిగా షాక్‌కు గురయ్యా. ఇటీవలికాలంలో పౌరులపై జరిగిన అతిపెద్ద దాడి ఇదే” అని ఆయన ఎక్స్‌లో పోస్టు చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
అమిత్ షా ఏమన్నారు?
‘పహల్గాంలో టూరిస్టులపై దాడి జరగడం బాధాకరం. కాల్పుల్లో మరణించిన వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నా” అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ‘ఎక్స్’లో పోస్టు చేశారు.
ఈ ఘటనకు బాధ్యులైన వారెవరినీ విడిచిపెట్టబోమని, సరైన సమాధానం చెబుతామని అమిత్ షా అన్నారు.
”ఘటన గురించి ప్రధాని మోదీకి తెలియజేశాం. సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో సమావేశమై చర్చించాం” అని అమిత్ షా చెప్పారు
దాడి చేసిన వారిన వదిలిపెట్టబోమని జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అన్నారు.
”పిరికిపంద ఉగ్రదాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. డీజీపీ, భద్రతా అధికారులతో మాట్లాడాను. ఆ ప్రాంతాన్ని ఆర్మీ, పోలీసు బలగాలు ఆధీనంలోకి తీసుకున్నాయి” అని ఆయన ఎక్స్‌లో పోస్టు చేశారు.

ఫొటో సోర్స్, EPA
”పహల్గాంలో పిరికిపంద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి హింసను అంగీకరించబోం. చారిత్రకంగా కశ్మీర్ పర్యాటకులను ఆహ్వానిస్తోంది. ఇలాంటి ఘటన జరగడం ఆందోళనకరంగా ఉంది”అని పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ అన్నారు.
ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ ఘటనను ఖండించారు. ”పహల్గాంలో ఉగ్రవాదుల పిరికిపంద దాడిలో పర్యాటకులు చనిపోవడం, అనేక మంది గాయపడడం చాలా బాధ కలిగించింది. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నా” అని రాహుల్ గాంధీ ఎక్స్‌లో పోస్టు చేశారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)