SOURCE :- BBC NEWS

జమ్ముకశ్మీర్, పహల్గాం, టూరిస్టులు

ఫొటో సోర్స్, Getty Images

జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంకు ఐదు కిలోమీటర్ల దూరంలోని బైసరన్‌లో జరిగిన కాల్పుల ఘటనలో 26 మంది చనిపోయారు.

వారిలో పుణెకు చెందిన కౌస్తుభ్ గన్బోటే, సంతోష్ జగ్దాలే ఉన్నారు.

వారు తమ కుటుంబాలతో కలిసి పహల్గాం పర్యటనకు వెళ్లారు. కాల్పుల సమయంలో ఏం జరిగిందో కౌస్తుభ్ గన్బోటే భార్య సంగీత వివరించారు.

దాడి సమయంలో ఓ ముస్లిం తమను కాపాడడానికి ఎలా ప్రయత్నించారో, కాల్పుల్లో ఆయన ఎలా చనిపోయారో సంగీత తెలిపారు.

”అక్కడ కూర్చున్న మాలో ఒకరిని తీవ్రవాదులు.. అజాన్‌ చదువుతున్నావా అని అడిగారు. వెంటనే మేం అప్రమత్తమయ్యాం. మా దగ్గరున్న వస్తువులు, దుస్తులను పారేశాం. మమ్మల్ని చంపొద్దు అంటూ అల్లాహు అక్బర్ అని పలికాం. వారు అక్కడినుంచి వెళ్లిపోయారు. మాకు కొంచెం దగ్గరలో ఉన్న ముగ్గురిలో ఇద్దరిని చంపేశారు. మా వెనక కూర్చున్న వ్యక్తినీ చంపేశారు. అక్కడ భద్రత సిబ్బంది ఉండి ఉంటే, కనీసం ఒక్క సైనికుడైనా ఉంటే మాకు చాలా సాయం అందేది” అని సంగీత చెప్పారు.

కాల్పుల తర్వాత ఏం జరిగిందో కూడా సంగీత వివరించారు.

”మేం తిరిగి వెళ్లేటప్పుడు గుర్రాలపై వెళ్తున్నవారు మాకు చాలా సహకరించారు. వారు ముస్లింలు. మమ్మల్ని తిరిగి తీసుకెళ్లడానికి వచ్చారు. చివరివరకు మా వెంట ఉన్నారు. గుర్రపుస్వారీ చేస్తున్న ఓ వ్యక్తి ఏడుస్తూనే ఉన్నారు. వాళ్లు చాలా మంచివాళ్లు” అని సంగీత తెలిపారు.

”మమల్ని రక్షించడానికి ఓ ముస్లిం ముందుకొచ్చారు. తీవ్రవాదులు ఆయన్ను కూడా కాల్చేశారు” అని సంగీత చెప్పారు.

”నన్నెందుకు చంపుతున్నావు? వాళ్లేం తప్పుచేశారు” అని ఆ ముస్లిం వ్యక్తి అడిగారు. ఆయన దుస్తులు విప్పేసి కాల్చేశారు” అని సంగీత తెలిపారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
జమ్ముకశ్మీర్, పహల్గాం, టూరిస్టులు

ఫొటో సోర్స్, Getty Images

‘దాడిని అడ్డుకునేందుకు ధైర్యంగా ప్రయత్నించారు’

పహల్గాం కాల్పుల్లో మరణించిన వారిలో కశ్మీర్‌కు చెందిన సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా ఒకరు.

ఆదిల్ మరణంతో ఆయన గ్రామంలో విషాదం నెలకొంది. పహల్గాం తాలూకాలోని హాప్‌తనార్ గ్రామానికి చెందిన ఆదిల్ పర్యటకులను గుర్రాలపై వారు వెళ్లాల్సిన చోటికి చేర్చుతూ ఉపాధి పొందేవారు.

తమ కుటుంబంలో సంపాదించేది ఆదిల్ ఒక్కరే అని, అందరం ఆయనపైనే ఆధారపడి బతుకుతున్నామని కుటుంబ సభ్యులు చెప్పారు.

”ఆయన మామూలుగా చనిపోలేదని తెలిసింది. దాడిని అడ్డుకునేందుకు ఆయన ఎంతో ధైర్యంగా ప్రయత్నించారు. కాల్పులు జరిపే వారి దగ్గరినుంచి తుపాకీ లాక్కునేందుకు కూడా ఆయన ప్రయత్నించారనుకుంటా. అప్పుడే వారు ఆయన్ను లక్ష్యంగా చేసుకున్నారు” అని జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా చెప్పారు.

జమ్ముకశ్మీర్, పహల్గాం, టూరిస్టులు

ఫొటో సోర్స్, Getty Images

‘కుటుంబానికి ఆయనే ఆధారం’

కుటుంబంలో ఆదిల్ ఒక్కరే సంపాదిస్తున్నారు. ఆయనకు భార్య, తల్లి, తండ్రి, ఇద్దరు తమ్ముళ్లున్నారు.

ఆదిల్‌కు ఒక కుమారుడు ఉండేవారు. కొన్నిరోజుల క్రితం ఆ బాలుడు చనిపోయాడు. మనవడు చనిపోయిన తర్వాత ఆదిల్ తల్లి ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది.

”కుటుంబంలో ఆదిల్ పెద్ద కొడుకు. ఆయనే కుటుంబాన్ని పోషిస్తున్నారు” అని ఆదిల్ తల్లి న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐతో ఏడుస్తూ చెప్పారు.

”గుర్రాన్ని తీసుకుని ఆదిల్ పహల్గాం వెళ్లారు. అక్కడేదో జరిగిందని మధ్యాహ్నం 3 గంటల సమయంలో మాకు తెలిసింది. మేం ఆదిల్‌కు ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ వచ్చింది. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఆయన ఫోన్ పనిచేసింది. మేం ఫోన్ చేస్తూనే ఉన్నాం కానీ అటునుంచి ఎవరూ మాట్లాడలేదు. తర్వాత కాల్పుల సంగతి తెలిసింది. అప్పుడు మా అబ్బాయిలు అక్కడికి వెళ్లారు. ఆదిల్ ఆస్పత్రిలో ఉన్నారు” అని ఆదిల్ షా తండ్రి సయ్యద్ హైదర్ షా చెప్పారు.

కాల్పులకు పాల్పడ్డవారిని కఠినంగా శిక్షించాలని హైదర్ షా డిమాండ్ చేశారు.

జమ్ముకశ్మీర్, పహల్గాం, టూరిస్టులు

ఫొటో సోర్స్, ANI

అంత్యక్రియలకు హాజరైన ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా

సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా అంత్యక్రియలు బుధవారం(ఏప్రిల్ 23) జరిగాయి. గ్రామస్తులందరితో కలిసి సీఎం ఒమర్ అబ్దుల్లా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆదిల్ కుటుంబ సభ్యులను పరామర్శించారు.

”ఈ ఘటన గురించి ఏం మాట్లాడగలం? దీన్ని ఖండిస్తున్నాం. దాడిలో మరణించినవారి కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నాం. సెలవుల్లో సరదాగా గడిపేందుకు మన అతిథులు బయటినుంచి వచ్చారు. కానీ వారిని శవపేటికల్లో ఇళ్లకు పంపాల్సివచ్చింది” అని ఒమర్ అబ్దుల్లా ఆవేదన వ్యక్తంచేశారు.

”వాళ్ల కుటుంబంలో సంపాదించేవారెవరూ లేరు. వాళ్లది చాలా పేద కుటుంబం. ఆయన అమాయకుడు. ఈ పరిస్థితుల్లో ఆ కుటుంబాన్ని రక్షించాలి” అని ఆదిల్ మామయ్య ఏఎన్ఐతో చెప్పారు.

”ఆయన కుటుంబాన్ని మేం ఆదుకుంటాం. వాళ్లకు తప్పనిసరిగా సాయం చేయాలి. ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని చెప్పడానికే నేనిక్కడికి వచ్చాను. చేయగలిగిందంతా మేం చేస్తాం” అని సీఎం ఒమర్ అబ్దుల్లా చెప్పారు.

జమ్ముకశ్మీర్, పహల్గాం, టూరిస్టులు

ఫొటో సోర్స్, Getty Images

ఆదిల్ షా కుటుంబానికి రూ.10 లక్షల నష్టపరిహారం

పహల్గాం దాడిపై ఆదిల్ షా కుటుంబం, బంధువులు, గ్రామస్తులు ఆగ్రహంతో ఉన్నారు. దాడి వారిని చాలా బాధిస్తోంది.

”ఇది కశ్మీర్ మీద పడ్డ మరక. ఈ మరకను తొలగించడం చాలా కష్టం. ఈ కుట్రను మనం ఖండించాలి” అని ఆదిల్ షా బంధువుల్లో ఒకరైన మొయిద్దీన్ షా చెప్పారు.

”ఈ ఘటన వెనక ఉన్న కుట్రను బయటపెట్టాలి. అప్పుడు భవిష్యత్తులో ఇలాంటి ఘటన జరగకుండా ఉంటుంది. ఆదిల్ షా పేదకుటుంబానికి చెందిన వ్యక్తి. కుటుంబమంతా ఆయన సంపాదనపైనే ఆధారపడి ఉంది. ఇప్పుడు వాళ్లేం చేయాలి? వారికి ఎలాంటి అండా లేదు” అని షా ఆవేదన వ్యక్తంచేశారు.

పహల్గాం దాడిలో చనిపోయిన వారి కుటుంబాలకు జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా రూ.10 లక్షల నష్టపరిహారం ప్రకటించారు. కాల్పుల్లో మృతిచెందిన వారి ప్రతి కుటుంబానికి ఈ నష్టపరిహారం అందిస్తారు.

”పహల్గాంలో జరిగిన దాడి నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. జరిగిన నష్టాన్ని డబ్బులతో పూడ్చలేం. బాధిత కుటుంబాలకు జమ్ముకశ్మీర్ ప్రభుత్వం రూ.10 లక్షల నష్టపరిహారం అందిస్తుంది. అమాయకపౌరులపై అనాగకరికంగా, క్రూరంగా కాల్పులు జరిగాయి. ఇలాంటి వాటికి మన సమాజంలో చోటు లేదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం’ అని ఒమర్ అబ్దుల్లా చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)