SOURCE :- BBC NEWS

అలీనోద్యమం, బారత్ సమ్మిట్, హైదరాబాద్

ఫొటో సోర్స్, x.com/BharatSummit_25/

అలీనోద్యమ ప్రతిపాదనకు 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ‘భారత్ సమ్మిట్’ను నిర్వహిస్తోంది.

హైదరాబాద్ వేదికగా ఏప్రిల్ 25, 26 తేదీల్లో జరిగే ఈ సదస్సుకు లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ, ఎంపీ ప్రియాంక గాంధీ సహా దాదాపు 100 దేశాల నుంచి 450 మంది ప్రతినిధులు హాజరవుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

”శాంతి, సమానత్వం విషయంలో భారత్ ప్రతిష్ఠను ప్రపంచదేశాలలో సమున్నత స్థాయిలో నిలబెట్టాలనే లక్ష్యంతో సదస్సు నిర్వహిస్తున్నాం” అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.

జవహర్ లాల్ నెహ్రూ ఆలోచనల నుంచి పుట్టిన అలీనోద్యమ విధానం నుంచి భారత్ పక్కకు జరుగుతోందనే వాదన ఇటీవల బలంగా వినిపిస్తున్నవేళ కాంగ్రెస్ సారథ్యంలోని తెలంగాణ ప్రభుత్వం.. అలీనోద్యమ వార్షికోత్సవాన్ని నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది.

సహజంగానే బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమానికి దూరంగా ఉంది.

ఈ నేపథ్యంలో అసలు ఏమిటీ అలీనోద్యమం.. జహహర్ లాల్ నెహ్రూతో దీనికి ఉన్న సంబంధమేంటో చూద్దాం.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
అలీనోద్యమం, బారత్ సమ్మిట్, హైదరాబాద్

ఫొటో సోర్స్, Getty Images

అలీనోద్యమం అంటే?

అలీన విధానం అంటే తటస్థంగా ఉండటం అని చెప్పవచ్చు.

రెండో ప్రపంచ యుద్ధం, ఆర్థిక మాంద్యం పరిస్థితులలో సోవియట్ యూనియన్, అమెరికా కూటములు ఏర్పడ్డాయి. ‘కోల్డ్ వార్’ తీవ్ర స్థాయిలో ఉన్న దశలో అలీనోద్యమం తెరపైకి వచ్చింది.

ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో అమెరికా, సోవియట్ యూనియన్..కూటముల వైపు తలొగ్గకుండా మిగిలిన దేశాలన్నీ స్వతంత్రంగా ఉండేందుకు అలీనోద్యమం మొదలైందని దిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఆఫ్రికన్ స్టడీస్ ప్రొఫెసర్ అజయ్ కుమార్ దూబే బీబీసీకి చెప్పారు.

”సామ్రాజ్యవాద కూటములకు వ్యతిరేకంగా 1955లో భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ప్రతిపాదనతో అలీనోద్యమం తెరపైకి వచ్చింది. ఆసియా, ఆఫ్రికాలో అప్పుడే కొత్తగా స్వాతంత్య్రం పొందిన దేశాలతో ఇది ఏర్పాటైంది” అని చెప్పారు.

అలీనోద్యమ వ్యవస్థాపకుల్లో జవహర్ లాల్ నెహ్రూ ఒకరు.

తొలిసారిగా 1954లో నాన్ అలైన్మెంట్ అనే పదం కొలంబోలో జరిగిన కొలంబో కాన్ఫరెన్సులో వాడారు.

ఆ తర్వాత 1955లో ఇండోనేషియాలోని బాండుంగ్ నగరంలో జరిగిన సదస్సులో అలీనోద్యమానికి తొలి పునాది పడింది.

సదస్సుకు ఇండోనేషియా అధ్యక్షుడు సుకర్నో, యుగోస్లేవియా అధ్యక్షుడు జోసిఫ్ బ్రోజ్ టిటో,ఘనా అధ్యక్షుడు ఫ్రాన్సిస్ క్వామ్వే న్రమా, ఈజిప్టు అధ్యక్షుడు గామల్ అబ్దెల్ నాజర్ హుస్సేన్ హాజరై అలీనోద్యమానికి రూపకల్పన చేశారు.

ఈ పది సూత్రాలకు కట్టుబడి అలీనోద్యమంలో భాగమై తమ దేశాల సార్వభౌమత్వం, స్వాతంత్య్రాన్ని కాపాడుకోవాలని 23 ఆసియా దేశాలు, 6 ఆఫ్రికా దేశాలు నిర్ణయించాయి.

ప్రస్తుతం అలీనోద్యమంలో దాదాపు 120 సభ్య దేశాలు ఉన్నాయి.

అలీనోద్యమం, బారత్ సమ్మిట్, హైదరాబాద్

ఫొటో సోర్స్, Getty Images

అలీనోద్యమం నుంచి భారత్ పక్కకు జరిగిందా?

అలీనోద్యమం నుంచి భారత్ దూరం జరుగుతోందనే వాదన కొన్నేళ్లుగా ఉంది.

ప్రతి మూడేళ్లకోసారి జరిగే అలీన దేశాల శిఖరాగ్ర సదస్సుకు గతంలో భారత ప్రధానులు హాజరయ్యేవారు. కానీ మోదీ ప్రధాని అయ్యాక ఆ సదస్సులకు ఒక్కసారీ హాజరు కాలేదు.

ప్రధానికి బదులుగా ఉపరాష్ట్రపతులుగా పనిచేసిన హమీద్ అన్సారీ, వెంకయ్యనాయుడు అలీన సదస్సులకు వెళ్లారు. 2023లో జరిగిన సదస్సుకు భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి హాజరయ్యారు.

జవహర్ లాల్ నెహ్రూ ప్రతిపాదించిన అలీనోద్యమానికి భారత్ ఇప్పుడు అంతగా ప్రాధాన్యం ఇవ్వడం లేదనే వాదన వినిపిస్తోంది.

”మోదీ వచ్చాకే కాదు, పీవీ నరసింహారావు సమయం నుంచే అలీన దేశాల సదస్సులకు భారత ప్రధానులు వెళ్లకపోవడం మనం గమనించవచ్చు” అని రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ బీబీసీతో అన్నారు.

ఇప్పటికీ అలీనోద్యమానికి కచ్చితంగా ప్రాధాన్యం ఉందని .. ప్రతి దేశానికి స్వతంత్ర విదేశాంగ విధానం ఉండటం మంచిదేనని ఆయనన్నారు.

ఈ విషయంపై ప్రొఫెసర్ అజయ్ కుమార్ దూబే భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేశారు .

అలీన విధానం అనేది 1960, 70ల నాటి అంశమని, ఇప్పటి పరిస్థితులకు అది సరితూగదని ఆయన అభిప్రాయపడ్డారు.

”ఈ అలీనోద్యమం అనేది అమెరికా, సోవియట్ యూనియన్ కూటముల్లో చేరకుండా స్వతంత్రంగా ఉండేందుకు ఏర్పడిన దేశాల కూటమి. భారత్ అభివృద్ధి చెందుతున్న దేశంగా మారింది. ప్రపంచంలో ఒక శక్తిమంతమైన దేశంగా ఆవిర్భవిస్తోంది. ఇలాంటి సమయంలో అలీన విధానం అవసరం లేదు” అని ఆయన అభిప్రాయపడ్డారు.

అలీనోద్యమం, బారత్ సమ్మిట్, హైదరాబాద్

ఫొటో సోర్స్, https://x.com/BharatSummit_25

అలీనోద్యమానికి ప్రాధాన్యం తగ్గిందా?

‘గ్లోబల్ సౌత్’ విధానాన్ని 2023లో మోదీ తెరపైకి తీసుకువచ్చారు. ‘గ్లోబల్ సౌత్’అనే పదాన్ని ఎక్కువగా లాటిన్ అమెరికా, ఆసియా, ఆఫ్రికా, ఓషియానియా ప్రాంతాలకు వాడుతుంటారు. థర్డ్ వరల్డ్‌నే మనం ‘గ్లోబల్‌ సౌత్‌’గా చూడొచ్చు.

యూరప్, ఉత్తర అమెరికా మినహాయించి, మిగిలిన ప్రాంతాలన్నింటినీ గ్లోబల్ సౌత్‌లో కలపవచ్చు. గ్లోబల్ సౌత్‌లో ఉన్న చాలా దేశాలు తక్కువ ఆదాయం కలిగి, రాజకీయంగా, సాంస్కృతికంగా అట్టడుగున ఉన్న దేశాలు.

అలీనోద్యమంలో భాగమైన దేశాలు దాదాపుగా గ్లోబల్ సౌత్‌లో భాగమై ఉన్నాయి.

ప్రస్తుతం అలీనోద్యమ దేశాలు 1960, 70ల నాటి ఆలోచనల నుంచి బయటకు రావాలని ప్రొఫెసర్ అజయ్ కుమార్ దూబే చెబుతున్నారు.

1970లోనే సౌత్-సౌత్ కోఆపరేషన్ విధానాన్ని ఇందిరాగాందీ ప్రతిపాదించారని చెప్పారు.

”అలీనోద్యమ దేశాల లక్ష్యాలు కాలక్రమంలో మారుతూ వచ్చాయి. ఇప్పుడు మనం 2025లో ఉన్నాం. గ్లోబల్ గవర్నెన్స్, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సభ్యత్వం, గ్లోబల్ మానిటరీ పాలసీ, వరల్డ్ బ్యాంకు లక్ష్యాలు, డాలర్ వ్యవస్థలపై అలీనోద్యమ దేశాలు చర్చించాలి” అని అన్నారాయన.

అలీనోద్యమ తొలినాళ్లలో ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవనేది ఆయన చెబుతున్నమాట.

”ఇప్పుడు ప్రపంచం అనేది ఒకటి లేదా రెండు దేశాలపైన కాకుండా ఎక్కువ దేశాలపై ఆధారపడి నడుస్తోంది” అని బీబీసీతో చెప్పారు ప్రొఫెసర్ అజయ్ కుమార్ దూబే.

ఈ నేపథ్యంలోనే అలీన విధానంలో మార్పులు రావాలని చెబుతున్నారు.

అలీనోద్యమం, బారత్ సమ్మిట్, హైదరాబాద్

ఫొటో సోర్స్, x.com/BharatSummit_25

కాంగ్రెస్ కార్యక్రమంగా చూడాలా?

అలీనోద్యమ ప్రతిపాదనకు 70 ఏళ్లైన సందర్భంగా సదస్సు నిర్వహణకు కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించింది.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో సదస్సుకు హైదరాబాద్‌ను వేదిక చేసుకుంది. దీన్ని ప్రభుత్వం వైపు నుంచి నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.

భారత్ సమ్మిట్ చరిత్రలో నిలిచిపోతుందని తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు.

భారత్ సమ్మిట్ ద్వారా తెలంగాణకు పెట్టుబడులు కూడా వచ్చే అవకాశం ఉందన్నారు.

ఇది విదేశాంగ విధానానికి సంబంధించిన అంశం కాబట్టి, దీన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అయితే ఈ సదస్సును తెలంగాణ ప్రభుత్వం నిర్వహించడంలో తప్పేమీ లేదని ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ చెప్పారు.

”అలీనోద్యమం అంటే కేవలం విదేశాంగ విధాన పరమైనది. కేంద్రమే ఈ తరహా ఈవెంట్లు నిర్వహించాలని లేదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్వహించవచ్చు” అని ఆయన అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)