SOURCE :- BBC NEWS

కెనడా ఎన్నికలు

40 నిమిషాలు క్రితం

రెండుసార్లు సెంట్రల్ బ్యాంకులకు గవర్నర్‌గా పనిచేసిన మార్క్ కార్నీ ఈ ఏడాది మార్చి మధ్యలో కెనడా లిబరల్ పార్టీ నేతగా ఎన్నికైన తరువాత ఆ దేశ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు.

వెంటనే ఆయన సార్వత్రిక ఎన్నికలకు పిలుపునిచ్చారు.

జనవరిలో మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడో లిబరల్ పార్టీ నాయకత్వానికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి కెనడాలో అనేకమంది రాజకీయనాయకులు ఎన్నికలు జరపాలని డిమాండ్ చేస్తున్నారు.

అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ కెనడాపై టారిఫ్‌ల విధింపు వాణిజ్య యుద్ధాన్ని రాజేయడంతో, ఎన్నికలు జరపాలనే డిమాండ్లు పెరిగాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌

కెనడాలో ఎన్నికలు ఎప్పుడు?

ఏప్రిల్ 28, సోమవారంనాడు కెనడాలో ఎన్నికలు మొదలవుతాయి. చట్టప్రకారం కెనడాలో రెండు ఫెడరల్ ఎన్నికల మధ్య గరిష్ఠంగా 5 ఏళ్ల సమయం ఉండాలి. కానీ పరిస్థితుల కారణంగా ముందస్తు ఎన్నికలు జరుగుతున్నాయి.

సహజంగా కెనడాలో ముందస్తు ఎన్నికలనేవి రెండు పద్ధతులలో వస్తాయి.

1. ప్రధాని సలహా మేరకు గవర్నర్ జనరల్ పార్లమెంటును రద్దుచేస్తారు.

2. పార్లమెంటులో మెజార్టీని నిరూపించుకోలేక ప్రధాని రాజీనామా చేస్తే, గవర్నర్ జనరల్ ఆ రాజీనామాను ఆమోదించినప్పుడు ముందస్తు ఎన్నికలు వస్తాయి.

మార్క్ కార్నీకూడా ముందస్తు ఎన్నికల కోసం పార్లమెంటును రద్దు చేయాల్సిందిగా గవర్నర్ జనరల్‌ను కోరారు.

కెనడాలో ఓటింగ్ ఏప్రిల్ 28న జరుగుతుంది

ప్రధానిని ఎలా ఎన్నుకుంటారు?

కెనడా ఫెడరల్ ఎన్నికలలో ఓటర్లు ప్రధానిని నేరుగా బ్యాలెట్ ద్వారా ఎన్నుకోరు. వారు పార్లమెంటు సభ్యులను ఎన్నుకుంటారు. పార్లమెంటులో మెజార్టీ ఎంపీ స్థానాలు సాధించిన పార్టీ నేత ప్రధాని అవుతారు.

ఎన్ని పార్టీలు పోటీలో ఉన్నాయి?

కెనడాలో 4 ప్రధాన పార్టీలు ఎన్నికలలో పోటీచేస్తున్నాయి. వాటిలో లిబరల్స్, కన్జర్వేటివ్‌లు, న్యూ డెమోక్రాట్లు (ఎన్‌డీపీ), బ్లాక్ క్యూబెకోయిస్ ఉన్నాయి.

2015 నుంచి లిబరల్ పార్టీ అధికారంలో ఉంది. పార్లమెంటును రద్దు చేసే సమయానికి లిబరల్ పార్టీకి 152 స్థానాలు ఉన్నాయి.

కన్జర్వేటివ్స్ 120 సీట్లతో అధికారిక ప్రతిపక్షంగా ఉంది.

క్యూబెక్ ప్రావిన్స్‌లో మాత్రమే అభ్యర్థులను నిలబెట్టే బ్లాక్ క్యూబెకోయిస్‌కు 33 సీట్లు,

ఎన్‌డీపీకి 24 సీట్లు ఉన్నాయి.

కిందటి ఎన్నికలలో గ్రీన్ పార్టీ రెండు స్థానాలను గెలుచుకుంది.

కెనడా ఎన్నికలు

ఫొటో సోర్స్, Getty Images

సర్వేలు ఏం చెబుతున్నాయి?

కెనడా బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్ ఇచ్చిన జాతీయ పోలింగ్ సగటు డేటా ప్రకారం, 2023 , 2024 లో లిబరల్ పార్టీకి మద్దతు క్రమంగా క్షీణించింది. అదే సమయంలో కన్జర్వేటివ్‌లకు మద్దతు పెరిగింది.

ట్రంప్ 2025 జనవరి 20న మళ్లీ అమెరికా అధ్యక్షుడైనప్పుడు కన్జర్వేటివ్‌ల గ్రాఫ్ 44.8 శాతం ఉండగా, లిబరల్స్ గ్రాఫ్ కేవలం 21.9 శాతమే.

కానీ తరువాత లిబరల్స్ కు మద్దతు పెరుగుతోందని సర్వేలు చెబుతున్నాయి.

లిబరల్ పార్టీకి 40 శాతానికి పైగా ఆధిక్యం ఉందని తాజా గణాంకాలు చెబుతున్నాయి.

మరోవైపు కన్జర్వేటివ్‌లకు 40 శాతం కంటే తక్కువ మద్దతు కనిపిస్తోంది.

మూడేళ్లలో లిబరల్స్ ఈ పోలింగ్ సర్వేలలో ఆధిక్యం సాధించడం ఇదే తొలిసారి.

వాణిజ్యంపై అధ్యక్షుడు ట్రంప్ బెదిరింపులు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, గృహ నిర్మాణం ఓటర్లకు ప్రధాన సమస్యలు.

ఎన్నికలు ఎలా జరుగుతాయి?

కెనడా వ్యాప్తంగా 343 నియోజకవర్గాలు ఉన్నాయి. వీటినే ఎలక్టోరల్ డిస్ట్రిక్ట్స్ అని కూడా పిలుస్తారు. ప్రతి నియోజకవర్గానికి హౌస్ ఆఫ్ కామన్స్‌లో ఒక్కో సీటు ఉంటుంది. ఐదేళ్లకోసారి దిగువసభకు అంటే హౌస్ ఆఫ్ కామన్స్‌కు ఎన్నికలు జరుగుతాయి.

ఇక ఎగువ సభ అయిన సెనేట్‌లో సభ్యులను నియమిస్తారు. వారు ఎన్నికలలో పోటీ చేయరు.

యూకే మాదిరిగానే కెనడాలో కూడా “ఫస్ట్-పాస్ట్-ది-పోస్ట్” ఎన్నికల వ్యవస్థ ఉంది. సింపుల్‌గా చెప్పుకోవాలంటే మెజార్టీ వచ్చినవారు చట్టసభకు ఎన్నికవుతారు. తక్కువ ఓట్లు వచ్చినవారికి ప్రాతినిథ్యం ఉండదు.

ప్రతి నియోజకవర్గంలోనూ ఎక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థి ఎంపీ అవుతారు.

ఇక ఎక్కువ సీట్లు గెలుచుకునే పార్టీ అధికారం స్వీకరిస్తే, తదుపరి స్థానంలో నిలిచే పార్టీ ప్రతిపక్షంగా మారుతుంది.

ఏ పార్టీకీ మెజారిటీ సీట్లు రాకపోతే దానిని హంగ్ పార్లమెంట్ లేదా మైనారిటీ ప్రభుత్వం అంటారు. ఇలాంటి ప్రభుత్వాలలో పార్లమెంటులో ఇతర పార్టీల అండ లేకుండా బిల్లులను ఆమోదింపచేసుకోలేవు.

ఎవరు ఓటు వేయవచ్చు?

కెనడా పౌరుడు అయి ఉండాలి.

కనీసం 18 సంవత్సరాల వయస్సు ఉండాలి,

గుర్తింపు చిరునామా ధ్రువపత్రాన్ని కలిగి ఉండాలి.

కెనడియన్లు కూడా ఈస్టర్ వీకెండ్‌లో ముందుగానే ఓటు వేసే అవకాశం లభించింది. అలా రికార్డు స్థాయిలో 73 లక్షలమంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

మార్క్ కార్నీ

ఫొటో సోర్స్, Reuters

మార్క్ కార్నీ

మార్క్ కార్నీ. వయసు 60 ఏళ్లు. ఈ ఏడాది మార్చిలో కెనడా ప్రధాని అయ్యారు. కానీ కొద్దికాలం మాత్రమే ఆ పదవిలో ఉన్నారు. లిబరల్ పార్టీ నాయకుడిగా 85 శాతం ఓట్లతో ఎన్నికయ్యారు.

ఆర్థిక విషయాల్లో నిపుణుడైన ఆయన బ్యాంక్ ఆఫ్ కెనడా, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్‌కు గవర్నర్‌గా పనిచేశారు.

కెనడాను అమెరికాలో 51వ రాష్ట్రంగా చేస్తామంటూ ట్రంప్ చేసిన ప్రకటనపై , ఆ పని ఎట్టి పరిస్థితులలోనూ జరగనివ్వమని కార్నీ చెప్పారు.

కార్నీ ప్రధాని పదవికి ముందు ఏనాడూ ఏ ప్రభుత్వ పదవి నిర్వహించలేదు. ఆయన ఫ్రెంచ్ భాష తన ప్రత్యర్థులకంటే మెరుగ్గా లేదు. క్యూబెక్ ప్రావిన్స్‌లో ఫ్రెంచ్ మాట్లాడటం సాధారణం.

ఎన్నికల ప్రచారంలో అనేకసార్లు విరామం తీసుకున్నారనే విమర్శలను కార్నీ ఎదుర్కొన్నారు.

పియరీ పొయిలీవ్రే కెనడా ప్రతిపక్ష నేత

ఫొటో సోర్స్, Reuters

పియరీ పొయిలీవ్రే

పియరీ పొయిలీవ్రే. వయసు 45 సంవత్సరాలు. కన్జర్వేటివ్ పార్టీ నేత.

ఆల్బెర్టాలోని కాల్గరీకి చెందిన పియరీ రెండు దశాబ్దాలుగా కెనడా రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు.

25 ఏళ్ల వయసులో తొలిసారి ఎంపీగా ఎన్నికైన ఆయన కెనడాలోనే అత్యంత పిన్న వయస్కుడైన ఎంపీగా రికార్డు సృష్టించారు.

సామాన్యుడిపై పన్ను భారాన్ని తగ్గించాలని ఆయన మొదటి నుంచి వాదిస్తూ ఉన్నారు.

లిబరల్ పార్టీని లక్ష్యంగా చేసుకుని పోయిలివ్రే విమర్శలు గుప్పిస్తున్నారు.

ట్రూడో పాలన కెనడియన్ల జీవితాన్ని కష్టతరం చేసిందని ఆయన ఆరోపించారు.

పొయిలీవ్రే 2023 జూలై నుంచి 2025 మార్చి వరకు ఆధిక్యం సాధించినట్టు సర్వేలు వెల్లడించాయి.

కానీ ట్రూడో రాజీనామా తర్వాత పియరీ ముందున్న మార్గం మరింత క్లిష్టంగా మారుతోంది.

2019 నుంచి బ్లాంచెట్  బ్లాక్ క్యూబెకోయిస్ పార్టీ నేతగా ఉన్నారు

ఫొటో సోర్స్, Reuters

బ్లాక్ క్యూబెకోయిస్ నేత

ఫ్రెంచ్ మాట్లాడే ప్రాంతాల్లో మాత్రమే బ్లాక్ క్యూబెకోయిస్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తుంది.

బ్లాక్ క్యూబెకోయిస్ పార్టీ నేత ప్రధాని అయ్యే అవకాశాలు కనిపించడం లేదు.

అయితే ఈ పార్టీ ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తుంది.

ఏ పార్టీకి మెజారిటీ రాకపోతే బ్లాక్ క్యూబెకోయిస్ పాత్ర నిర్ణయాత్మకంగా మారుతుంది.

2019 నుంచి బ్లాంచెట్ పార్టీని నడిపిస్తున్నారు.

కెనడాను అమెరికాలో 51వ రాష్ట్రంగా చేయాలనుకుంటున్నట్లు ట్రంప్ చేసిన ప్రకటనను

ఆయన తప్పుబట్టారు.

వాణిజ్య భాగస్వాముల విస్తరణ ద్వారా కెనడా ఆర్థిక వ్యవస్థ గాడినపడుతుందని బ్లాంచెట్

నమ్ముతున్నారు.

కెనడాలో ఒక ప్రధాన పార్టీకి నాయకుడైన తొలి సిక్కు జగ్మీత్ సింగ్

ఫొటో సోర్స్, Reuters

జగ్మీత్ సింగ్

జగ్మీత్ సింగ్ న్యూ డెమోక్రటిక్ పార్టీ నేత. ఆయన వయసు 46 ఏళ్లు.

కార్మికుల సమస్యలపై ఆయన ఎక్కువ దృష్టి సారిస్తుంటారు.

కెనడాలో ఓ ప్రధాన పార్టీకి నేతృత్వం వహించిన తొలి మైనార్టీ, సిక్కు నేతగా ఆయన 2017లో చరిత్ర సృష్టించారు. 2019లో ఎంపీగా గెలిచారు. 2021 నుండి, ట్రూడో లిబరల్ పార్టీ ప్రభుత్వ మనుగడకు ఎన్‌డీపీ సహాయపడింది.

కానీ ప్రస్తుతానికి ఆయన పార్టీకి పెద్దగా మద్దతు లేదు.

ఏప్రిల్ మధ్యలో నిర్వహించిన పోల్స్ లో 8.5 శాతం మంది ప్రజలు ఎన్‌డీపీకి ఓటు వేస్తామని చెప్పారు.

మరి ఈసారి ఎన్‌డీపీ గతంలో సాధించిన సీట్లన్నింటినీ గెలుచుకుని, గుర్తింపు కలిగిన పార్టీ హోదాను నిలుపుకుంటుందా అనేది ప్రశ్న.

ఎన్‌డీపీ 2010 వరకు ప్రధాన ప్రతిపక్షంగా ప్రకటించడానికి తగినన్ని స్థానాలను గెలుచుకోగలిగింది.

కానీ ఇప్పుడా పార్టీ బలం 24 మంది ఎంపీలే.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)