SOURCE :- BBC NEWS

పహల్గాం

పహల్గాంలో తీవ్రవాద దాడి తర్వాత, జమ్మూ కశ్మీర్లోని అనేక ప్రాంతాల్లో పోలీసులు, భద్రతా దళాలు ఎంపిక చేసిన ఇళ్లను కూల్చివేస్తున్నాయి. ఇప్పటివరకు దాదాపు 10 ఇళ్లను ఇలా కూల్చివేశారు.

ఇళ్లు కోల్పోయిన రెండు కుటుంబాలతో బీబీసీ మాట్లాడింది. వీటిలో ఆదిల్ హుస్సేన్ థోకర్ కుటుంబం ఒకటి.

పహల్గాం దాడి తర్వాత అనంత్‌నాగ్ పోలీసులు విడుదల చేసిన ముగ్గురు తీవ్రవాదుల స్కెచ్‌లలో ఆదిల్ హుస్సేన్ థోకర్ పేరు కూడా ఉంది.

అయితే, ఇంటిని కూల్చివేసే చర్యపై పోలీసులు లేదా భద్రతా దళాలు అధికారికంగా ఎలాంటి ప్రకటనా ఇవ్వలేదు.

పోలీసులు కూడా ప్రశ్నించడం కోసం అనేక మందిని అదుపులోకి తీసుకున్నారు. కానీ దీని గురించి సమాచారం బహిరంగంగా ప్రకటించలేదు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
కూలిపోయిన ఇల్లు

ఆదిల్ థోకర్ కుటుంబం ఏమంటోంది?

ఏప్రిల్ 25 రాత్రి సైన్యం, పోలీసులు తమ ఇంటికి వచ్చారని ఆదిల్ థోకర్ కుటుంబం చెబుతోంది.

ఆదిల్ థోకర్ తల్లి శహజాదా బానో మాట్లాడుతూ, “ఆర్మీ, పోలీసు సిబ్బంది రాత్రి పన్నెండున్నర వరకు ఇక్కడే ఉన్నారు. నేను వారికి క్షమాపణలు చెప్పి, మాకు న్యాయం చేయాలని కోరా. మా తప్పు ఏంటని అడిగా. కానీ వారు నన్ను ఇక్కడి నుంచి వెళ్లిపొమ్మని చెప్పారు. వేరే ఇంటికి పంపించారు’’

“రాత్రి పన్నెండున్నరకు మా ఇంటిని పేల్చేశారు. అందరినీ 100 మీటర్ల దూరం వెళ్లమని చెప్పారు. చుట్టుపక్కల ప్రజలందరినీ ఖాళీ చేయించారు. కొంతమంది తమ పొలాల్లోకి వెళ్లారు. మరికొందరు ఇతరుల ఇళ్లలో ఆశ్రయం పొందారు” అని ఆమె తెలిపారు.

“ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. నా ఇద్దరు కొడుకులను, భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. మాకు సాయం చేసేవారే లేరు” అని శహజాదా బానో అన్నారు.

2018 నుంచి ఆదిల్ కనిపించడం లేదని శహజాదా తెలిపారు.

ఇంటి కూల్చివేత

జాకిర్ అహ్మద్ ఇల్లు కూడా …

కుల్గాం జిల్లాలోని మత్లహామా గ్రామంలోని జాకిర్ అహ్మద్ ఇంటిని కూడా కూల్చేశారు.

2023లో జాకిర్ ఇంటి నుంచి అదృశ్యమయ్యాడని, అప్పటి నుంచి ఆయన జాడ తెలియలేదని కుటుంబం చెబుతోంది.

తాను పోలీసులకు ఫిర్యాదు చేశానని, తన కొడుకు తీవ్రవాద సంస్థలో చేరాడని ఆ తర్వాత పోలీసులు, సైన్యం చెప్పాయని జాకిర్ తండ్రి గులాం మొహియుద్దీన్ తెలిపారు.

“మా ఇల్లు కూలిపోయినప్పుడు రాత్రి రెండున్నర అయ్యింది. పేలుడు జరిగినప్పుడు మమ్మల్ని మసీదులో ఉంచారు” అని గులాం మొహియుద్దీన్ అన్నారు.

“అహ్మద్ బతికే ఉన్నాడా, చనిపోయాడా అనేది మాకు తెలియదు. అతనికీ మాకు సంబంధంలేదు. ఇల్లు వదిలి వెళ్లాక తన ముఖం కూడా మాకు చూపించలేదని సైన్యానికి, గ్రామస్థులకు కూడా తెలుసు” అని ఆయన చెప్పారు.

“మా వస్తువులన్నీ ఇంటి కింద సమాధయ్యాయి. ఏమీ తీసుకెళ్లలేకపోయాం. చిన్న పాప ఉంది, ఆమెను ఫెరాన్‌(ఒక రకమైన వస్త్రం)లో చుట్టి తెచ్చాం. ప్రాణాలు మాత్రమే కాపాడుకోగలిగాం. ఇప్పుడు కట్టుబట్టలతో మిగిలాం’’ అని మొహియుద్దీన్ అన్నారు.

జాకిర్ అహ్మద్ సోదరి రుకయా

‘నా సోదరుడిని కొన్ని సంవత్సరాలుగా చూడలేదు’

జాకీర్ సోదరి రుకయా కూడా చాలా సంవత్సరాలుగా తన సోదరుడిని చూడలేదని చెబుతున్నారు.

“మా దృష్టిలో అతను ఇంటి నుంచి బయటకు వెళ్ళిన క్షణంలోనే చనిపోయాడు. ప్రస్తుతం బతికున్నాడో, లేదో కూడా మాకు తెలియదు” అని ఆమె బీబీసీతో అన్నారు.

“మేం మా కళ్ళతో ఏమీ చూడలేదు. కానీ ఈరోజు కుటుంబం కష్టాల్లో కూరుకుపోయింది. నా ఇద్దరు సోదరులు పోలీస్ కస్టడీలో ఉన్నారు. మా మామయ్య కొడుకు కూడా జైలులో ఉన్నాడు” అని రుకయా అంటున్నారు.

‘‘జాకిర్‌కు మా కుటుంబం నుంచి మద్దతు లేదు. అతను ఎక్కడ ఉన్నా, వెతికి పట్టుకుని చంపాలని నేను చెబుతున్నాను. న్యాయం చేయమని మేం చేతులు జోడించి కోరుతున్నాం. అది తప్ప మాకేమీ వద్దు’’ అని ఆమె అన్నారు.

ఈ చర్యలపై సైన్యం, పోలీసులు లేదా జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం ఎటువంటి అధికారిక ప్రకటనా చేయలేదు.

సైన్యం

ఫొటో సోర్స్, Getty Images

ఈ కూల్చివేతలపై ప్రశ్నలేంటి?

అయితే, కొంతమంది ఈ చర్యలను ప్రశ్నిస్తున్నారు.

జమ్మూకశ్మీర్‌కు చెందిన న్యాయవాది హబిల్ ఇక్బాల్ దీనిపై మాట్లాడారు. ఇది సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించడమేనని ఆయన అన్నారు.

“ఇళ్ల కూల్చివేత కేసుల గురించి సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. నోటీసు ఇచ్చినా ఇవ్వకపోయినా, పట్టపగలే ఇళ్లను కూల్చివేశారు. ఇలాంటి చర్యలను కలెక్టివ్ పనిష్మెంట్ అని గతంలో సుప్రీంకోర్టు అన్నది. ఇలాంటి చర్య ఏ చట్టం ప్రకారమైనా ఆమోదయోగ్యం కాదని కోర్టు చెబుతోంది” అని ఆయన అన్నారు.

మెహబూబా ముఫ్తీ

ఫొటో సోర్స్, Getty Images

దీనిపై మెహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లా ఏమన్నారు?

జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ ఆ కూల్చివేతలను ప్రశ్నిస్తూ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు.

“పహల్గాం దాడి తర్వాత భారత ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలి. తీవ్రవాదులు, అమాయక పౌరుల మధ్య తేడాను గుర్తించాలి. తీవ్రవాదాన్ని వ్యతిరేకిస్తున్న వారిని ప్రభుత్వం వేరు (ఒంటరి వారిని) చేయకూడదు” అని ఆ పోస్ట్‌లో రాశారు.

సామాన్య ప్రజలు ఒంటరివాళ్లయిపోతే, అది తీవ్రవాదుల ఉద్దేశాలను బలపరుస్తుందని ముఫ్తీ అభిప్రాయపడ్డారు.

‘‘దోషులకు కఠినమైన శిక్ష విధించాలి. వారిపై కనికరం చూపకూడదు. కానీ అమాయకులు దీనిబారిన పడకుండా జాగ్రత్త వహించాలి” అని జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఎక్స్ పోస్ట్‌లో రాశారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)