SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, Getty Images
16 నిమిషాలు క్రితం
పహల్గాం దాడి తరువాత కేంద్ర ప్రభుత్వం దిల్లీలో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా దాడికి ప్రతీకారంగా తీసుకోబోయే చర్యలకు అన్ని పార్టీలు కేంద్రానికి మద్దతు ప్రకటించాయి. అయితే, ప్రతిపక్షాలు భద్రత లోపాన్ని కూడా లేవనెత్తాయి.
దాడి అనంతరం పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా కీలక నిర్ణయాలు తీసుకుంది భారత్. అందులో సింధు జల ఒప్పందాన్ని నిలిపివేయడం ఒకటి.
దీనికి ప్రతిస్పందనగా భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హయాంలో కుదుర్చుకున్న సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసుకుంది పాకిస్తాన్.
దీంతో, భారత్‌లో ఇప్పుడు ఇందిరాగాంధీ గురించి చర్చ జరుగుతోంది.


ఫొటో సోర్స్, ANI
ఇందిరా గాంధీ గురించి ఎవరేమన్నారు?
పహల్గాం దాడికి నిరసనగా హైదరాబాద్‌లో పలువురు రాజకీయ నాయకులు కొవ్వొత్తుల మార్చ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. “ప్రధాని నరేంద్రమోదీకి ఒక అభ్యర్థన. మన దేశ ప్రజలపై దాడి చేసిన ఉగ్రవాదులకు తగిన సమాధానం ఇవ్వడానికి 140 కోట్ల మంది పౌరులు సిద్ధంగా ఉన్నారు. భారతదేశంపై 1967లో చైనా దాడి చేస్తే ఇందిరాగాంధీ తగిన సమాధానం ఇచ్చారు. ఆ తర్వాత, 1971లో పాకిస్తాన్ దాడి చేస్తే, ఆ దేశాన్ని రెండు భాగాలుగా విభజించారు ఇందిరా గాంధీ. ఆ సమయంలో ఇందిరా గాంధీని అటల్ బిహారీ వాజ్‌పేయి ‘దుర్గ’ అని పిలిచారు” అని అన్నారు.
శివసేన (యూబీటీ) నాయకుడు, ఎంపీ సంజయ్ రౌత్ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్‌లో “ఈ రోజు దేశం ఇందిరాగాంధీని చాలా మిస్ అవుతోంది” అని రాశారు.
ఇదే సమయంలో, బీజేపీ అధికార ప్రతినిధి సుధాంశు త్రివేది ఒక న్యూస్ ఛానల్‌తో మాట్లాడుతూ “మీరు భద్రత లోపం గురించి మాట్లాడుతున్నారు. భద్రతా లోపం జరిగిందని అఖిలపక్ష సమావేశంలో కేంద్రం అంగీకరించింది. దేశంలో అతిపెద్ద భద్రత లోపం ఏంటో తెలుసా.. ప్రధానమంత్రిని(ఇందిరాగాంధీని) వారి సొంత ఇంట్లోనే హత్య చేయడం” అని అన్నారు.
1984 అక్టోబర్ 31న అప్పటి ప్రధాని ఇందిరా గాంధీని ఇద్దరు అంగరక్షకులు ఆమె ఇంటి వద్దనే కాల్చి చంపారు.
“ఇందిరా గాంధీ విషయాన్ని మేం ఎప్పుడైనా సమస్యగా మార్చామా, చెప్పండి?” అని త్రివేది ప్రశ్నించారు.
ఇందిరా గాంధీపై రేవంత్ రెడ్డి, సంజయ్ రౌత్ చేసిన ప్రకటనలకు సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు వస్తున్నాయి.
పహల్గాం దాడి అనంతరం రాజకీయ నాయకుల వ్యాఖ్యలపై ఆయుష్ మిశ్రా అనే నెటిజన్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ “దేశం మొత్తం కలిసి రావడం చూస్తే, గర్వంగా ఉంది” అని తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
సిమ్లా ఒప్పందం ఏమిటి?
భారత్, పాకిస్తాన్ యుద్ధం తర్వాత చేసుకున్నదే ఈ సిమ్లా ఒప్పందం. 1971లో పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ (తూర్పు పాకిస్తాన్) విడిపోవడానికి భారత్ సహాయం చేసింది. ఆ సమయంలో దాదాపు 90 వేల మంది పాకిస్తాన్ సైనికులు లొంగిపోయారు.
యుద్ధం తర్వాత, అప్పటి భారత ప్రధాని ఇందిరా గాంధీ, పాకిస్తాన్ అధ్యక్షుడు జుల్ఫికర్ అలీ భుట్టో మధ్య ఒక ఒప్పందం కుదిరింది. దీనినే సిమ్లా ఒప్పందం అని పిలుస్తారు.
యుద్ధం తరువాత సిమ్లా ఒప్పందంపై రెండు దేశాలూ సంతకం చేశాయి. ఇది ఒక అధికారిక ఒప్పందం, రెండు దేశాల మధ్య శత్రుత్వ అంతానికి సిమ్లా ఒప్పందం ముఖ్యమైనదిగా పరిగణించారు. ఈ ఒప్పందం ప్రకారం రెండు దేశాలు అన్ని అంశాలను ద్వైపాక్షిక చర్చలతో శాంతియుతంగా పరిష్కరించుకోవాలి.
సిమ్లా ఒప్పందం ప్రకారం రెండు దేశాల మధ్య నియంత్రణ రేఖను (ఎల్వోసీ) ఏర్పాటు చేశారు. ఈ రేఖను ఒక ప్రమాణంగా భావించి, రెండు పక్షాలూ ఒకరి భూభాగం నుంచి మరొకరు సైన్యాన్ని ఉపసంహరించుకోవడానికి అంగీకరించాయి.

ఫొటో సోర్స్, Getty Images
పహల్గాం దాడి తర్వాత ఏం జరిగింది?
పహల్గాం దాడి తర్వాత భారత్, పాకిస్తాన్ దేశాలు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. 1960 నాటి సింధు జలాల ఒప్పందాన్ని తక్షణం తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు భారత్ ప్రకటించింది. సీమాంతర ఉగ్రవాదానికి పాకిస్తాన్ మద్దతు నిలిపివేసేంతవరకు ఇది అమలవుతుందని తెలిపింది.
పాకిస్తాన్ పౌరులను భారత్‌లోకి అనుమతించేది లేదని స్పష్టం చేసింది. గతంలో పాకిస్తానీయులకు జారీచేసిన ప్రత్యేక వీసాల(ఎస్‌వీఈఎస్)ను రద్దు చేసింది. ఈ వీసా కింద భారత్‌లో ఉన్న పాకిస్తానీయులు 48 గంటల్లో దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది.
దిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్‌లో ఉన్న రక్షణ, సైనిక, నేవీ, వైమానిక సలహాదారులు వారం రోజుల్లో దేశం విడిచి వెళ్లాలని సూచించింది. అలాగే పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో ఉన్న భారత హైకమిషన్ కార్యాలయంలోని ఇదే హోదా గల భారత ఉద్యోగులను వెనక్కు పిలిచింది.
పాకిస్తాన్ సరిహద్దులో ఉన్న అటారీ చెక్‌పోస్ట్‌ను మూసివేసింది. భారత్ వైపు నుంచి సరైన పత్రాలతో వెళ్లినవారు కూడా ఈ ఏడాది మే 1 లోపు తిరిగి రావాలి.
భారత్ తీసుకున్న చర్యలకు ప్రతిస్పందనగా పాకిస్తాన్ కూడా కీలక నిర్ణయాలు తీసుకుంది. భారతదేశంతో ద్వైపాక్షిక ఒప్పందాలను నిలిపివేసింది. ఇందులో సిమ్లా ఒప్పందం కూడా ఉంది.
భారత విమానాలకు గగనతలం మూసివేసింది. అలాగే భారత్‌తో వాణిజ్యాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. పాకిస్తాన్‌లోని భారత రక్షణ సలహాదారులు, వారి సహాయకులను దేశం విడిచి వెళ్లాలని కోరింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)