SOURCE :- BBC NEWS

లోన్ యాప్, పాకిస్తాన్, చైనా, ఆత్మహత్య

ఫొటో సోర్స్, VIZAG POLICE

పాకిస్తాన్ నుంచి ఆపరేట్ అవుతున్న లోన్ యాప్‌ల ద్వారా అప్పులు ఇచ్చి…బాధితులను వేధించి ఆత్మహత్యలకు కారణమవుతున్న ముఠాను ఆరెస్ట్ చేసినట్టు విశాఖ పోలీసులు తెలిపారు.

విశాఖలో లోన్ యాప్ సిబ్బంది వేధింపులు తాళలేక ఒకరు ఆత్మహత్య చేసుకోగా పోలీసులు ఆ కేసు దర్యాప్తు చేశారు. దర్యాప్తులో ఇలాంటి కొన్ని యాప్‌లు పాకిస్తాన్ కేంద్రంగా ఆపరేట్ అవుతున్నట్లుగా గుర్తించారు.

పాకిస్తాన్ నుంచి బెదిరింపు కాల్స్ వచ్చినట్టు గుర్తించామని విశాఖ పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ ‘బీబీసీ’తో చెప్పారు.

”దర్యాప్తు అనంతరం ఇప్పటివరకు 18 మొబైల్ ఫోన్లు, 83 బ్యాంక్ అకౌంట్లు, 62 ఏటీఎమ్ కార్డులను సీజ్ చేశాం. అలాగే 54 సిమ్ కార్డులు, 15 స్టాంప్స్ ప్యాడ్స్, రెండు క్యూఆర్ కోడ్లు, 5 ఓటీజీ డ్రైవ్‌లు స్వాధీనం చేసుకున్నాం” అని తెలిపారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
లోన్ యాప్, పాకిస్తాన్, చైనా, ఆత్మహత్య

ఫొటో సోర్స్, VIZAG POLICE

ఆత్మహత్యకు కారణమైన రూ. 2 వేలు లోన్

”విశాఖపట్నంలోని మహారాణి పేటకు చెందిన ఒక వ్యక్తి నిరుడు ఒక గుర్తింపు లేని ఆన్‌లైన్ లోన్ యాప్‌లో రూ.2,000 రుణం తీసుకున్నారు. దానిని తిరిగి చెల్లించేసినా కూడా ఇంకా చెల్లించాలంటూ వేధింపులు మొదలయ్యాయి. అధిక మొత్తంలో డబ్బులు చెల్లించాలని ఒకసారి, మీరు చెల్లించిన డబ్బులు ఇంకా మాకు రాలేదని మరోసారి ఇలా సైబర్ నేరగాళ్లు వేధించేవారు.

అంతటితో ఆగకుండా ఆయన భార్య పోటోలను కూడా నగ్నంగా మార్ఫింగ్ చేసి వారి బంధువులు, స్నేహితులకు పంపించారు. ఇదంతా తట్టుకోలేక బాధితుడు ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన భార్య ఇచ్చిన ఫిర్యాదుతో మహారాణిపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇదంతా లోన్ యాప్ వల్లే జరిగిందని తెలియడంతో కేసును సైబర్ క్రైం పోలీసులకు అప్పగించాం” అని విశాఖ పోలీస్ కమిషనర్ చెప్పారు.

లోన్ యాప్, పాకిస్తాన్, చైనా, ఆత్మహత్య

ఫొటో సోర్స్, VIZAG POLICE

ఈ కేసులో దర్యాప్తు ఎలా సాగిందంటే…

”లోన్ యాప్ వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకుని అందులోని వివరాలను సేకరించాం. బాధితుడు వివిధ రకాల అనుమతి లేని లోన్ ఆప్స్ నుంచి రుణం తీసుకున్నట్టు గుర్తించాం.

బాధితుడిని వేధింపులకు గురిచేసిన లోన్ యాప్ పేరు క్యాష్ మాక్స్. ఆ యాప్ కోసం ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ సోషల్ మీడియాలలో సెర్చ్ చేసి వాటి ఐపీలను గుర్తించాం. బెదిరింపు మెసేజ్‌లు ఎక్కడి నుంచి వస్తున్నాయో టెక్నాలజీ సాయంతో తెలుసుకున్నాం. అవి పాకిస్తాన్ నుంచి అపరేట్ అవుతున్నట్లు తెలిసింది.

బాధితుడు రుణంగా తీసుకున్న డబ్బులు అస్సాం, గుజరాత్‌లలోని బ్యాంకులలో ఉన్న కొన్ని ఖాతాల నుంచి వచ్చినట్టు బ్యాంక్ స్టేట్‌మెంట్ ద్వారా గుర్తించాం. అస్సాంలోని బ్యాంక్ స్టేట్‌మెంట్లు తీసుకొని విశ్లేషిస్తే సుమారు తొమ్మిది వేలమందికి ఆ ఖాతా నుంచి డబ్బులు వెళ్లినట్టు తెలిసింది.

అకౌంట్లకు ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుందని పరిశీలించగా వివిధ రాష్ట్రాల్లోని మొత్తం 61 అకౌంట్ల నుంచి డబ్బులు డిపాజిట్ అవుతున్నట్టు తేలింది. దీంతో పోలీసు బృందాలను అయా రాష్ట్రాలకు పంపించి అక్కడ బ్యాంక్ ఖాతాల వివరాలు ఆధారంగా ఆరుగురిని అరెస్టు చేశాం” అని శంఖబ్రత బాగ్చీ వివరించారు.

”అరెస్టయిన ఆరుగురిని విచారించగా డబ్బుల కోసం ఆశపడి వివిధ బ్యాంకుల కరెంట్ అకౌంట్స్‌ను టెలిగ్రామ్, వాట్సాప్‌ల ద్వారా పంపినట్టు తెలిసింది. ఇందులో కర్నూలుకు చెందిన ఆర్. శ్రీనివాసరావు అనే వ్యక్తి ఒక్కరే 30 బ్యాంకు ఖాతాలు సైబర్ నేరగాళ్లకు అందించి రూ.12 లక్షలు తీసుకున్నట్లు అంగీకరించారు.

అలాగే ఏలూరు కు చెందిన అంజనాదేవి ‘సర్క్యూట్ డాక్టర్స్’ అనే పేరు మీద ఒక నకిలీ సంస్థ రిజిస్ట్రేషన్ చేసుకొని, దాని పేరు మీద వివిధ బ్యాంకుల్లో కరెంట్ అకౌంట్స్ ఓపెన్ చేసి సాంబ అనే వ్యక్తికి ఆ అకౌంట్స్ అమ్మారు” అని దర్యాప్తులో తేలిందన్నారు.

లోన్ యాప్, పాకిస్తాన్, చైనా, ఆత్మహత్య

ఫొటో సోర్స్, VIZAG POLICE

సైబర్ నేరగాళ్లు ఎంట్రీ

‘‘సాంబని విచారించగా ఆయనకు టెలిగ్రాం ద్వారా లోన్ యాప్ స్కామ్ చేస్తున్న సైబర్ నేరగాళ్లు హంట్ అండ్ ఆండీ (Hunt & Andy) అనే వ్యక్తులు పరిచయం అయ్యారని చెప్పారు. వారు చైనీయులని భావిస్తున్నారు. లోన్ యాప్ స్కామ్ చేయడానికి అవసరమైన ఇండియాకు చెందిన కరెంట్ బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయించి ఇస్తే ఎక్కువ మొత్తంలో కమీషన్ ఇస్తారని చెప్పడంతో సాంబ అందుకు అంగీకరించి తన స్నేహితులైన సందీప్, దిలీప్, జీవన్ సాయి, సాయి కృష్ణ, ఆదర్శ్, శ్రీనివాస్ ద్వారా ఇతరులకు డబ్బు ఆశ చూపి బ్యాంక్ అక్కౌంట్స్ ఓపెన్ చేయించారు. వాటికి నెట్ బ్యాంకింగ్ చేయించి సుమారు 132 బ్యాంక్ అకౌంట్ల వివరాలు నేరగాళ్లకు టెలిగ్రాం ద్వారా షేర్ చేశారు.

సాంబ ఇచ్చిన అకౌంట్ల ద్వారా ట్రాన్సక్షన్ చేస్తున్నపుడు ఆయా బ్యాంకు అకౌంట్‌కు లింక్ అయిన మొబైల్ నంబర్లకు వచ్చిన ఓటీపీ వివరాలు చైనీస్ సైబర్ నేరగాళ్లకు ఫార్వార్డ్ అవ్వడానికి సాంబ వద్ద ఉన్న మొబైల్స్‌లో ఒక ఏపీకే ఫైల్ ఇన్స్టాల్ చేసినట్టు తెలిపారు.

సాంబ ఓపెన్ చేయించిన 132 బ్యాంక్ అక్కౌంట్లను నేషనల్ సైబర్ క్రైం పోర్టల్‌లో చెక్ చేయగా సుమారు 1500 కు పైగా పిర్యాదులు ఉన్నాయి. ఈ బ్యాంక్ అక్కౌంట్లలో సుమారు రూ. 200 కోట్ల వరకు లావాదేవీలు జరిగాయి. అలాగే రూ. 60 లక్షలు ఫ్రీజైన డబ్బు ఉంది.

ఈ బ్యాంకు అకౌంట్లు సప్లై చేసినందుకు చైనీస్ స్కామర్లు క్రిప్టో కరెన్సీ రూపంలో సాంబకు కమీషన్ ఇస్తున్నట్టు తేలింది. సాంబ, దిలీప్, సందీప్‌ల దగ్గర భారత కరెన్సీలో రూ.59 లక్షల విలువైన క్రిప్టో కరెన్సీ ఉంది” అని విశాఖ పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ చెప్పారు.

లోన్ యాప్, పాకిస్తాన్, చైనా, ఆత్మహత్య

ఫొటో సోర్స్, Getty Images

‘చట్టపరమైన చర్యలు తప్పవు’

“సైబర్ నేరగాళ్లు ఇచ్చే కమీషన్లకు ఆశపడి ఎవరైనా బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసి ఇచ్చినా, సరిగా తనిఖీ చేయకుండా బ్యాంక్ అధికారులు కరెంట్ అకౌంట్లు తెరిచినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని విశాఖ సైబర్ క్రైం సీఐ భవానీ ప్రసాద్ హెచ్చరించారు.

“ఆన్‌లైన్‌లో ఎలాంటి హామీ లేకుండా రెండు వేలు, మూడు వేలు రూపాయలు లోన్లు ఇస్తామంటూ సోషల్ మీడియాలో ప్రకటనలు ఇస్తుంటారు. వాటిపై క్లిక్ చేసిన వెంటనే ఏపీకే ఫైల్ మన ఫోన్‌లో ఇన్స్టాల్ అవుతుంది. ఆ సమయంలో మన మొబైల్‌కి సంబంధించిన అన్నీ పర్మిషన్స్ ఇవ్వడం వల్ల మన కాంటాక్ట్స్, గ్యాలరీ, లొకేషన్ వంటివి సైబర్ నేరగాళ్ల చేతికి చేరుతాయి.

దాంతో మన ఫోటోలను మార్ఫింగ్ చేసి కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్న మిత్రులకు, బంధువులకు పంపిస్తామని బెదిరిస్తారు. దీనికి భయపడి వారికి పదేపదే డబ్బులు కడుతూ ఉంటాం.

అలాంటి సమయాల్లో సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ www.cybercrime.gov.in లో ఫిర్యాదు చేయాలి” అని సైబర్ క్రైం పోలీసులు తెలిపారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)