SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, Getty Images
పెళ్లి అనగానే కొత్త ఫర్నిచర్, కొత్త ఇల్లు, కొత్త వస్తువులు, దుస్తులు, నగలు వంటివన్నీ గుర్తొస్తాయి. అయితే వాటన్నిటికన్నా… ఫ్యూచర్ ప్లానింగ్ మరింత ముఖ్యం.
ఇద్దరూ కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించే ముందు, కలిసి చర్చించుకుని, తమ భవిష్యత్ ప్రణాళికలు వేసుకునే సమయం కూడా ఇదే. అనుకోని ఇబ్బంది ఎదురైతే ఎంతవరకు తట్టుకుని నిలబడగలిగే స్థాయిలో ఉన్నామనేది కూర్చుని మాట్లాడుకోవాలి.
మరీ ముఖ్యంగా తాము ఎంతవరకూ సెక్యూర్డ్, ఇన్సూర్డ్ అనేది కొత్త జంట చర్చించుకుని, దానిపై మొదటి నిర్ణయం తీసుకోవడం చాలా ముఖ్యం.
అనుకోకుండా ఎదురయ్యే మెడికల్ ఎమర్జెన్సీ, ప్రసవ సమయంలో ఏదైనా ఇబ్బంది… పెళ్లైన కొత్తల్లో ఇలాంటిదేదైనా జరిగితే ఆ కుటుంబం దానికి సిద్ధంగా ఉండకపోవచ్చు. పెళ్లికి భారీ ఖర్చు చేసి ఉన్న రెండు వైపుల కుటుంబాల్లో ఇది పెద్ద సమస్యగా మారొచ్చు.


ఫొటో సోర్స్, Getty Images
హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకంటే…
పెళ్లి తర్వాత కుటుంబ పోషణ, ఇల్లు, కారు, పిల్లల చదువులు, పెళ్లిళ్లు, రిటైర్మెంట్.. ఇలా ఎన్నో దశలుంటాయి. అన్నింటికీ డబ్బు కావాలి. ముఖ్యంగా హెల్త్, మెటర్నిటీ, లైఫ్ ఇన్సూరెన్స్ ప్రాధాన్యం ఇక్కడే మనకు అర్థమవుతుంది.
నీతి ఆయోగ్ హెల్త్ రికార్డ్స్ 2023 నివేదిక ప్రకారం భారత్‌లో సరాసరి ఆస్పత్రి ఖర్చులు ద్వితీయ శ్రేణి పట్టణాలు, జిల్లాల్లో ఏడాదికి రూ. 30 నుంచి రూ. 50వేల మధ్య ఉండొచ్చు. అదే మెట్రో నగరాల్లో అయితే రూ. 75వేల నుంచి లక్ష వరకూ కూడా ఉండొచ్చు.
సాధారణ ప్రసవమైతే ప్రైవేట్ ఆసుపత్రుల్లో రూ.60 వేల నుంచి ఒకటిన్నరలక్షల వరకు ఖర్చవుతుంది. సిజేరియన్ జరిగి, ఎలాంటి సమస్యలూ లేకపోతే ఒకటిన్నర లక్ష నుంచి 2 లక్షలపైనే ఉంటుంది. ఇక ఆ తర్వాత పిల్లల వ్యాక్సినేషన్స్ వంటి వాటి ఖర్చులు కూడా తక్కువేమీ కాదు.
నీతి ఆయోగ్ 2021-22 డేటా ప్రకారం… భారత్‌లో వైద్య ఖర్చులు సొంత జేబుల నుంచి పెట్టుకునే వాళ్ల సంఖ్య 70 శాతానికి పైగానే ఉంది.
పాలసీ బజార్ టర్మ్ ఇన్సూరెన్స్ 2023 అధ్యయనం ప్రకారం భారత్‌లో 25-35 ఏళ్ల మధ్య ఉండే యువ జంటల్లో 70 శాతానికి టర్మ్ ఇన్సూరెన్స్ లేనేలేదు.
ఇండియాలో ఇన్సూరెన్స్ పెనెట్రేషన్ 3 శాతం లోపే ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
కంపెనీ ఇన్సూరెన్స్ ఉందిగా!
మనలో చాలా మంది చెప్పే మొదటి కారణం ఇదే. ఏదైనా ఇన్సూరెన్స్ తీసుకున్నారా అని అడిగితే… మాకు కంపెనీ ఇచ్చే ఇన్సూరెన్స్ ఉండగా మరొకటి ఎందుకు అంటారు. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగం చేస్తుంటే ఇక వారు మరింత ధీమాగా ఉంటారు.
కానీ ఇక్కడ గమనించాల్సిన అంశం ఒకటుంది.
మీ ఇన్సూరెన్స్‌కు, మీ ఉద్యోగానికీ లింక్ ఉంటుంది. మీరు ఉద్యోగం చేస్తున్నంత వరకే ఈ కవరేజ్ ఉంటుంది. మానేసిన రోజున ఆ కవర్ కూడా పోతుంది. నలభై ఏళ్లు దాటాకో, యాభై ఏళ్లు దాటాకో మీరు ఉద్యోగం మానేస్తే.. అప్పుడు కొత్తగా ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే ఎలా, అప్పటికే ఏవైనా హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటే పరిస్థితేంటి, ప్రీమియం ఎంత ఎక్కువగా చెల్లించాల్సి ఉంటుంది, వెయిటింగ్ పీరియడ్.. ఇలాంటి అంశాలు గురించి ఆలోచించాలి.
సాధారణంగా గ్రూప్ ఇన్సూరెన్సుల్లో ఔట్ పేషెంట్ డిపార్ట్‌మెంట్ ఖర్చులు, మెటర్నిటీ వంటివి కవర్ కావు. కొన్ని బీమా సంస్థలు కవర్ చేసినా, మీ వాస్తవ ఖర్చులతో సంబంధం లేకుండా గరిష్ఠంగా కొంత మొత్తం వరకూ ఒకేసారి చెల్లిస్తాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఏం చేయాలి?
అందుకే కొత్త జంట.. ఇద్దరికీ ఫుల్ కవరేజీ ఇచ్చే ఫ్యామిలీ ఫ్లోటర్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడం మంచిది. హైదరాబాద్‌లో నివసిస్తున్న 30 ఏళ్ల లోపు జంటకు రూ.10లక్షల ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ కావాలంటే ఏడాదికి రూ.12వేల నుంచి రూ.16వేల వరకూ ప్రీమియం ఉంటుంది. యాడ్ ఆన్ రైడర్స్ వంటి వాటికి ప్రీమియం మరికొంత పెరుగుతుంది.

ఫొటో సోర్స్, Getty Images
మెటర్నిటీ కవర్
కొత్తగా పెళ్లయ్యే వాళ్లకు రాబోయే రెండు, మూడేళ్లలో వచ్చే మొదటి అతిపెద్ద ఖర్చు సాధారణంగా ప్రెగ్నెన్సీ, డెలివరీకి సంబంధించిందే ఉంటుంది. అయితే చాలా ఇన్సూరెన్స్ కంపెనీలు పాలసీ తీసుకున్న మూడు, నాలుగేళ్ల తర్వాత మాత్రమే మెటర్నిటీ క్లెయిమ్‌కు అవకాశం కల్పిస్తాయి.
అందుకే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం కన్నా ముందే ఇన్సూరెన్స్ ప్లాన్ చేసుకోవాలి. అందులో మెటర్నిటీ కవర్ ఉందో లేదో క్రాస్ చెక్ చేసుకోవాలి. అంతేకాకుండా, మెటర్నటీ ఖర్చు మొత్తం కవర్ చేస్తున్నారా లేక.. దానిపై ఏదైనా పరిమితి ఉందా చెక్ చేయాలి.
మెటర్నిటీ కవర్ – ఇవి గుర్తుంచుకోండి
- మెటర్నిటీ వెయిటింగ్ పీరియడ్ 24-48 నెలలు
- మ్యాగ్జిమం క్లెయిమ్ లిమిట్ – రూ.50వేల నుంచి లక్ష వరకూ..
- 30 ఏళ్ల వయస్సు తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం సాధారణంగా పెరిగే అవకాశాలెక్కువ. నార్మల్ డెలివరీతో పాటు సిజేరియన్ కూడా కవర్ చేసే పాలసీలు చూడండి.
- డెలివరీకి ముందు, తర్వాత చెకప్స్, ఖర్చులు అందులో కవర్ అవుతున్నాయో లేదో చూడండి

ఫొటో సోర్స్, Getty Images
ఔట్‌పేషెంట్ కవర్ కూడా ఉండాలి
ఈ రోజుల్లో మెడికల్ టెక్నాలజీ అడ్వాన్స్‌మెంట్ బాగా పెరిగింది. ఏదైనా పెద్ద సమస్య వచ్చినా కూడా 24 గంటల్లోనే సమస్యను పరిష్కరించి ఇంటికి పంపించేస్తున్న రోజులివి. దీంతో 24 గంటల పాటు కనీసం ఇన్‌పేషెంట్‌గా ఉంటేనే ఇన్సూరెన్స్ వస్తుంది అనే నిబంధనలు క్రమంగా మారిపోతున్నాయి. అందుకే మన పాలసీ ఔట్‌పేషెంట్ విభాగానికి కూడా కవరేజ్ ఇస్తోందో లేదో చెక్ చేయండి. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లోని వర్కింగ్ కపుల్‌కు ఇది ముఖ్యం.
ఉన్నట్టుంది ఏ అర్థరాత్రో కడుపు నొప్పి రావడమో, ఫుడ్ పాయిజనింగ్ జరగడమో… చిన్నగానే అనిపించవచ్చు. వీటికి గంటల్లోనే పరిష్కారం కూడా లభిస్తుంది. అలా అని ఇంట్లోనే సొంత వైద్యాలు చేసుకోలేం. హాస్పిటల్‌కు వెళ్లినా.. రోజంతా అక్కడ ఉండలేం. అందుకని ఔట్‌పేషెంట్ కవర్, డే కేర్ ప్రొసీజర్స్ కూడా కవర్ కావాలి.
వీటితోపాటు డెంటల్, డెర్మటాలజీ, గైనిక్ వంటి వాటికి హాస్పిటలైజేషన్ అవసరం ఉండదు. ఇవన్నీ పాలసీలో కవర్ చేస్తున్నారో లేదో చూడాలి.
ఇవి కవర్ అవుతున్నాయో లేదా చూడాలి.
- ఓపీడీలో డాక్టర్ కన్సల్టేషన్స్
- ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్స్
- ఫిజియోథెరపీ
- ఐ చెకప్స్
- డెంటల్ చెకప్స్
- డయాగ్నస్టిక్ సేవలు
సాధారణంగా ఓపీడీ రైడర్స్ ఏడాదికి గరిష్టంగా రూ.2500-3500 మధ్య ఉంటాయి. ఐసీఐసీఐ లంబార్డ్, హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో, నివా బూపా వంటివి ఇలాంటి రైడర్స్ ఆఫర్ చేస్తున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఫర్టిలిటీ, ఐవీఎఫ్ కవరేజ్ ఉండాలా?
ఆలస్యపు పెళ్లిళ్లు, జీవన సంబంధిత సమస్యలు, ఒత్తిడి వంటివి సంతానలేమి సమస్యలకు కారణమవుతున్నాయి. అందుకే ఐవీఎఫ్ వంటివి ఎక్కువగా చూస్తున్నాం. భారత్‌లో కనీసం ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సంబంధిత సమస్య ఉంటోందని డబ్ల్యూహెచ్ఓ నిర్వహించిన ఇన్ఫెర్టిలిటీ ప్రివాలెన్స్ ఎస్టిమేట్స్, 1990-2021 అధ్యయనంలో తేలింది.
స్టార్ హెల్త్, నివా బూపా వంటి కంపెనీలు కొన్ని పాలసీలకు ఐవీఎఫ్ కవరేజ్ కూడా ఇస్తున్నాయి. అయితే పాలసీ నిబంధనల గురించి స్పష్టంగా తెలుసుకోవాలి. వీటి ప్రీమియమ్ కూడా సహజంగానే అధికంగా ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
టర్మ్ ఇన్సూరెన్స్ తప్పనిసరి
మనం ఉన్నా లేకపోయినా మన జీవిత భాగస్వామికి ఆర్థిక భరోసా కల్పించాల్సిన బాధ్యత మనదే. అందుకే మొదట హెల్త్ ఇన్సూరెన్స్, తర్వాత టర్మ్ ఇన్సూరెన్స్.. ఈ రెండూ కచ్చితంగా తీసుకున్న తర్వాతే ఏ ఇన్వెస్ట్‌మెంట్ నిర్ణయమైనా తీసుకోవాలి.
ఆస్తులతో పాటు మన అప్పులు కూడా టర్మ్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఎంచుకోవడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. ముప్ఫై ఏళ్ల లోపున్న వాళ్లకు కోటి రూపాయల సాధారణ టర్మ్ ఇన్సూరెన్స్‌కు గరిష్టంగా ఏడాదికి రూ.10-12వేల వరకూ ప్రీమియం ఉంటుంది.
హౌసింగ్ లోన్ ఉన్నవాళ్లు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడంలో అసలు నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే సుమారు 20 ఏళ్ల పాటు కొనసాగే లోన్ పీరియడ్‌లో దురదృష్టవశాత్తు జీవిత భాగస్వామి చనిపోతే, ఆ భారం బతికున్న వాళ్లను మరింత ఆర్థికంగా కుంగదీయకూడదు. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, ఐసీఐసీఐ ప్రూ, ఎల్‌ఐసీ, మ్యాక్స్‌లైఫ్ వంటి సంస్థలు టర్మ్ ఇన్సూరెన్స్‌తో పాటు యాక్సిడెంటల్ డెత్, తీవ్ర అనారోగ్యం, డిజేబిలిటీ రైడర్స్‌ను కూడా ఆఫర్ చేస్తున్నాయి.
బీమా.. మనతో పాటు మన ఫ్యామిలీకి మనం నిర్మించే ఆర్థిక రక్షణ కవచం. దీన్ని మించిన గిఫ్ట్ ఏమైనా ఉంటుందా?
(గమనిక: ఇవన్నీ కేవలం అవగాహన కోసం అందించిన వివరాలు మాత్రమే. ఆర్థిక అంశాలపై మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనుకున్నా నిపుణులను సంప్రదించగలరు)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)