SOURCE :- BBC NEWS

అమరావతి, నిధులు, చంద్రబాబు, మోదీ

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులను రూ. 77,249.15 వేల కోట్లు అంచనాతో చేపట్టినట్లుగా ప్రభుత్వం చెబుతోంది.

ఒకవైపు లోటు బడ్జెట్.. మరోవైపు అప్పుల భారం ఉన్నప్పటికీ రాజధాని నిర్మాణ పనులు పూర్తి చేస్తామంటోంది.

మరి ఇన్ని వేల కోట్ల రూపాయల నిధులు ఏపీ ప్రభుత్వం ఎక్కడి నుంచి తెస్తుంది?

అమరావతి నిర్మాణ పనులకు నిధులు ఎక్కడి నుంచి వస్తాయి?

నిధులు ఎలా తెస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది?

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
అమరావతి, నిధులు, చంద్రబాబు, మోదీ

నిధులు ఎలా అంటే: మంత్రి నారాయణ

ఇప్పుడు చేపట్టనున్న అమరావతి పునర్నిర్మాణ పనులలో భాగంగా మొత్తం 100 పనులను రూ.77,249 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్నట్లుగా రాష్ట్ర మంత్రి నారాయణ బీబీసీతో చెప్పారు.

‘‘వరల్డ్ బ్యాంకు, ఏడీబీ చెరో రూ. 6,700 కోట్లు చొప్పున రూ.13,400 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించాయి. కేఎఫ్‌డబ్ల్యూ బ్యాంకు రూ. 5వేల కోట్లు ఇస్తోంది” అని వివరించారు.

వరల్డ్ బ్యాంకు, ఏడీబీ నుంచి వచ్చిన మొత్తంతో పాటు కేంద్ర ప్రభుత్వ మ్యాచింగ్ గ్రాంట్ కలుపుకొని ఈ ఏడాది ఏప్రిల్ 1న రూ.4,285 కోట్లు ఏపీకి అందాయని ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు బీబీసీతో చెప్పారు.

ఇవి కాకుండా హడ్కో నుంచి రూ.11వేల కోట్లు రుణంగా తీసుకోనుంది ఏపీ ప్రభుత్వం. ఇందుకు సంబంధించి సమ్మతి లేఖ (లెటర్ ఆఫ్ కన్సెంట్)ను తమ ప్రభుత్వం అందించిందని చెప్పారు నారాయణ.

”బ్యాంకులు, ఫండింగ్ ఏజెన్సీల నుంచి తీసుకోగా.. మిగిలిన నిధులను భూములు మార్ట్‌గేజ్ చేయడం, విక్రయాలు, లీజుకు ఇవ్వడం ద్వారా సేకరించబోతున్నాం” అని నారాయణ బీబీసీతో చెప్పారు.

అయితే, వరల్డ్ బ్యాంకు, ఏడీబీ నుంచి వస్తున్న రుణ భారం పరోక్షంగానో, ప్రత్యక్షంగానో ఏపీ ప్రజలపై పడే వీలుందని విజయవాడకు చెందిన ఆర్థిక శాస్ర్త నిపుణుడు ఒకరు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తన బ్యాలెన్స్ షీట్‌లోకి ఈ రుణాలను తీసుకుంటేనే ఏపీ భారం తగ్గుతుందని వివరించారు.

అమరావతి, నిధులు, చంద్రబాబు, మోదీ

ఫొటో సోర్స్, Getty Images

కేంద్రం నిధులు..

అలాగే, ‘మల్టీలేటరల్ లోన్ అసిస్టెన్స్’ పేరుతో అమరావతి నిర్మాణానికి అప్పులు ఇస్తున్నామని చెబుతోంది కేంద్ర ప్రభుత్వం. వివిధ సంస్థలు లేదా బ్యాంకుల నుంచి ఈ రుణాలు ఏపీకి అందనున్నాయి.

‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని అవసరాన్ని గుర్తించి, మల్టీ‌లేటరల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీల ద్వారా ప్రత్యేక ఆర్థిక సాయం అందేందుకు ఏర్పాట్లు చేస్తాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.15 వేల కోట్లు సమకూరుస్తాం. వచ్చే సంవత్సరాల్లోనూ అదనపు నిధులు సమకూరుస్తాం’ అని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు.

2025-26 కేంద్ర బడ్జెట్ ప్రసంగంలో ఆమె ఈ ప్రకటన చేశారు.

ఈ రూ.15 వేల కోట్లు గ్రాంటా, లేక రుణమా అనేది ఆ ప్రకటనలో స్పష్టత ఇవ్వలేదు. కానీ, ఆ రూ.15 వేల కోట్లతో పాటు చాలా వరకూ రుణాలు, రాష్ట్ర ప్రభుత్వానికి అందేలా కేంద్రం ఫెసిలిటేట్ చేస్తుందని, వాటితో పాటుగా కొంత గ్రాంటు కూడా ఉంటుందని తర్వాతి పరిణామాల్లో పలు ప్రకటనల ద్వారా స్థూలంగా తేలింది.

అమరావతి, నిధులు, చంద్రబాబు, మోదీ

విభజన చట్టం ఏం చెబుతోంది?

ఏపీ పునర్విభజన చట్టం సెక్షన్ 94(3) ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి అవసరమైన సాయాన్ని కేంద్ర ప్రభుత్వం అందించాలనే నిబంధన ఉంది.

దీని ప్రకారం, ఇప్పటివరకు ”స్పెషల్ అసిస్టెన్స్ (గ్రాంట్లు)” రూపంలో ఏపీ రాజధాని ప్రాంతంలో అవసరమైన మౌలిక వసతుల అభివృద్ధికి రూ.2,500 కోట్లు ఇచ్చినట్లు కేంద్రం చెబుతోంది. ఈ ఏడాది మార్చిలో లోక్ సభలో తిరుపతి ఎంపీ గురుమూర్తి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి దీనిపై లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

అమరావతి కోసం చేసే అప్పులు ఏపీ తీసుకునే రెగ్యులర్ రుణ పరిమితి (సీలింగ్) కిందకు రావని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అలాగే, వరల్డ్ బ్యాంకు రుణానికి ఈ ఏడాది జనవరి 22 నుంచి, ఏడీబీ ఇచ్చే అప్పులకు ఫిబ్రవరి 10 నుంచి లోన్ టర్మ్ మొదలైందని కేంద్రం చెప్పింది.

తాజాగా ప్రాజెక్టు ఖర్చులో పది శాతం మించకుండా (గరిష్ఠంగా రూ.1500 కోట్లు) ‘స్పెషల్ అసిస్టెన్స్’ కింద ఇవ్వనున్నట్లు కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. కేంద్ర ప్రభుత్వం గ్రాంటు కింద రూ.1,560 కోట్లు ఇస్తోందని ఏపీ మంత్రి నారాయణ చెప్పారు.

వరల్డ్ బ్యాంకు, ఏడీబీ, హడ్కో.. ఇలా వివిధ సంస్థల నుంచి తీసుకువస్తున్న అప్పులతో అంతిమంగా ప్రజలపైనే భారం పడుతుందని ఆంధ్ర ఇంటలెక్చువల్ ఫోరం అధ్యక్షులు చలసాని శ్రీనివాసరావు బీబీసీతో చెప్పారు.

”స్పెషల్ అసిస్టెన్స్ పేరుతో డబ్బులు ఇస్తున్నామని అంటున్నారు. వాటిని సీఆర్డీఏనే చెల్లించాలి. అది కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం కట్టాలి. రాష్ట్రం కట్టకపోతే కేంద్రంపై భారం పడుతుంది. కానీ, కేంద్ర ప్రభుత్వం మళ్లీ ఆంధ్రప్రదేశ్ నుంచే రికవరీ చేస్తుంది” అని ఆయన వివరించారు.

అమరావతి, మంత్రి నారాయణ, చంద్రబాబు, నరేంద్ర మోదీ

అయితే, దీనిపై మంత్రి నారాయణ మాట్లాడుతూ, ప్రజలపై ఒక్క రూపాయి భారం పడకుండా అమరావతి నిర్మిస్తున్నామన్నారు.

”గతంలో ల్యాండ్ పూలింగ్‌లో సేకరించిన భూమిలో రైతులకు రిటర్నబుల్ ప్లాట్లు కూడా ఇచ్చేశాం. అవి పోగా, సీఆర్డీయేకి 4 వేల ఎకరాల భూమి మిగులుతుంది. ఆ 4 వేల ఎకరాలను భవిష్యత్తులో వేలం వేసి, రాజధాని నిర్మాణానికి వరల్డ్ బ్యాంక్, ఏడీబీ, హడ్కో వంటి సంస్థల నుంచి తీసుకున్న రుణాలు చెల్లించేలా ప్రణాళికలు వేశాం” అని బీబీసీ ఇంటర్వ్యూలో మంత్రి నారాయణ చెప్పారు.

అమరావతి, నిధులు, చంద్రబాబు, మోదీ

బడ్జెట్‌లో నిధుల కేటాయింపులు..

”అమరావతి అనేది సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్. ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా నగరాన్ని నిర్మిస్తున్నాం” అని ప్రకటిస్తూ వస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.

ఈ ఆర్థిక సంవత్సరం (2025-26) బడ్జెట్లో అమరావతి రాజధాని నిర్మాణానికి రూ.6 వేల కోట్లు ప్రతిపాదించింది ఏపీ ప్రభుత్వం. ఇది ప్రతిపాదనే తప్ప కేటాయింపు కాదు.

ఏపీ బడ్జెట్‌లో గత పదేళ్లగా అమరావతికి జరిగిన నిధుల కేటాయింపులు పరిశీలిస్తే..

2015-16 బడ్జెట్ – రూ.3,168 కోట్లు

2016-17 – రూ.1,500 కోట్లు

2017-18 – రూ.1,061 కోట్లు

2018-19- రూ.1,000 కోట్లు

2019లో జగన్ ప్రభుత్వ హయాంలో జులైలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రూ.500 కోట్లు మాత్రమే కేటాయించారు.

అనంతరం, మూడు రాజధానుల విధానాన్ని తెరపైకి తీసుకొచ్చి వైసీపీ ప్రభుత్వం అమరావతిని పక్కనబెట్టింది. ఆ తర్వాత నిధుల కేటాయింపు జరగలేదు.

మరోవైపు, 2025-26 బడ్జెట్‌లో రెవెన్యూ లోటు రూ.33,185 కోట్లుగా ఉంటుందని సభకు చెప్పారు ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్.

ఆంధ్రప్రదేశ్‌కు ఈ ఏడాది మార్చి 31నాటికి రూ.5,62,557 కోట్లు అప్పు ఉందని మార్చి 25న లోక్‌సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంజక్ చౌదరి చెప్పారు.

అమరావతి, నిధులు, చంద్రబాబు, మోదీ

ఇప్పటివరకు ఎన్ని పనులు జరిగాయి?

టీడీపీ ప్రభుత్వం 2019లో దిగేపోయే సమయానికి రూ.39,875 కోట్ల విలువైన పనులు నిర్మాణదశలో ఉన్నాయని అప్పట్లో సీఆర్డీఏ అధికారి ఒకరు చెప్పారని హిందుస్థాన్ టైమ్స్ 2019లో రాసిన ఓ కథనంలో పేర్కొంది.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిరుడు జులైలో అమరావతి నిర్మాణ పనుల పురోగతిపై శ్వేతపత్రం విడుదల చేసింది.

దాని ప్రకారం, 2019కి ముందు ప్రభుత్వ కాంప్లెక్స్ భవనాలు, రోడ్లు, ఇతరత్రా మౌలిక వసతుల కోసం రూ.51,687 కోట్లు అవసరమని అంచనా వేసింది.

ఇటీవల విలేఖరులతో మాట్లాడుతూ, 2014-19 మధ్య దాదాపు రూ.5 వేల కోట్లు ఖర్చు చేసినట్లు మంత్రి పి.నారాయణ చెప్పారు.

అయితే, 2019కి ముందు రూ.51 వేల కోట్లతో అంచనాలు వేసిన ప్రభుత్వం, కేవలం 5 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసిందన్న విమర్శలు కూడా వచ్చాయి.

అమరావతి, నిధులు, చంద్రబాబు, మోదీ

పెరిగిన అంచనాలు

2019తో పోల్చితే నిర్మాణాల్లో అంచనా వ్యయాలు భారీగా పెరిగాయి.

”అప్పటి ఖర్చులతో పోల్చితే భవనాలు, ఇతరత్రా వసతులకు సంబంధించి నిర్మాణ వ్యయం రూ.12,392 కోట్లకు పెరిగింది” అని సీఆర్డీఏ తెలిపింది.

ఇందులో ఐకానిక్ టవర్ల నిర్మాణం 2018లో అంచనా వ్యయం రూ.2271.14 కోట్లుగా ఉండేది. ప్రస్తుతం అంచనా వ్యయం రూ.4,688 కోట్లకు పెంచింది.

మరోవైపు, తాజాగా అసెంబ్లీ భవన నిర్మాణం రూ.590 కోట్లు అంచనా కాగా… 4.48 శాతం ఎక్సెస్ తో ఎల్ అండ్ టీ సంస్థకు రూ.617 కోట్లకు పనులు అప్పగించింది.

హైకోర్టు భవన నిర్మాణానికి రూ.750 కోట్లు అంచనా వ్యయం కాగా, 4.52 శాతం ఎక్కువకు రూ.786 కోట్లకు ఎన్సీసీ సంస్థకు పనులు అప్పగించింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)