SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, Getty Images
ఒక గంట క్రితం
పహల్గాం దాడి తరువాత పెరిగిన ఉద్రిక్తతల మధ్య, భారతదేశం సింధు జల ఒప్పందాన్ని తాత్కాలికంగా రద్దు చేసింది. ఒక్క చుక్క నీటిని కూడా ఆ దేశానికి పోనివ్వనని ప్రతిజ్ఞ చేసింది.
మరోవైపు, నీటిని ఆపడానికి లేదా మళ్లించడానికి ఏదైనా ప్రయత్నం జరిగితే, దానిని ‘యుద్ధ చర్య’గా పరిగణిస్తామని పాకిస్తాన్ స్పష్టం చేసింది. సిమ్లా ఒప్పందంతో సహా అన్ని ద్వైపాక్షిక ఒప్పందాల నుంచి వైదొలుగుతామని కూడా బెదిరించింది.
65 సంవత్సరాల కిందట భారత, పాకిస్తాన్‌ల మధ్య నదుల నీటి నిర్వహణకు సంబంధించి ఒక ఒప్పందం కుదిరింది. దీని తరువాత, 1965, 1971, 1999 సంవత్సరాలలో రెండు దేశాల మధ్య మూడు పెద్ద యుద్ధాలు జరిగాయి. కానీ ఈ ఒప్పందంపై ఎలాంటి ప్రభావం పడలేదు.
కానీ, జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన దాడిలో 26 మంది మృతి చెందిన తర్వాత భారతదేశం ప్రకటించిన తీవ్రమైన చర్యలలో దీనినే అతిపెద్ద చర్యగా పరిగణిస్తున్నారు.
“పాకిస్తాన్ శాశ్వతంగా సరిహద్దు తీవ్రవాదానికి మద్దతు ఇవ్వడం మానేసే వరకు” తన నిర్ణయం అమలులో ఉంటుందని భారతదేశం తెలిపింది.
భారతదేశం చేసిన ఆరోపణలను పాకిస్తాన్ తోసిపుచ్చింది. పహల్గాం దాడికి సంబంధించి ఆధారాలు చూపాలని డిమాండ్ చేసింది. ఈ దాడిలో తమ ప్రమేయం ఏమీ లేదని తెలిపింది.
సింధు, ఇతర నదుల జలాలను కోల్పోకుండా ఉండటానికి పాకిస్తాన్ వివిధ చర్యలపై దృష్టి పెడుతోంది.
ఈ పరిస్థితిలో పాకిస్తాన్ వద్ద ఉన్న ఆప్షన్స్ ఏమిటి?

ఆప్షన్ 1: ప్రపంచ బ్యాంకుకు ఫిర్యాదు
సింధు జల ఒప్పందాన్ని నిలిపివేయాలన్న భారతదేశ నిర్ణయానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ ప్రపంచ బ్యాంకును ఆశ్రయిస్తుందని… పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు .
“ఇది ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో, 1960లో సంతకం చేసిన ఒప్పందం. చాలా కాలంగా విజయవంతంగా కొనసాగుతోంది. భారతదేశం దాని నుంచి ఏకపక్షంగా వైదొలగలేదు. ఈ విషయంపై మేం సంప్రదింపులు జరుపుతాం” ఖ్వాజా ఆసిఫ్ అన్నారు.
గతవారం, పాకిస్తాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్ మాట్లాడుతూ, “అంతర్జాతీయ చట్టాల ప్రకారం, భారతదేశం సింధు జల ఒప్పందం ఆపకూడదు. అలా చేయడం ఒప్పందానికి సంబంధించిన చట్టాన్ని తీవ్రంగా ఉల్లంఘించడమే అవుతుంది” అని అన్నారు.
పాకిస్తాన్ ఇప్పటికే నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ ఒప్పందాన్ని నిలిపివేయడం వల్ల పాకిస్తాన్‌కు మరిన్ని సమస్యలు పెరుగుతాయి.
ఈ ఒప్పందం పాకిస్తాన్‌లోని వ్యవసాయం, జలవిద్యుత్ ప్రాజెక్ట్‌లకు చాలా ముఖ్యమైనది. పాకిస్తాన్‌లోని 80 శాతం సాగునీరు ఈ నది నుంచి సరఫరా అవుతుంది.

ఫొటో సోర్స్, AFP
ఆప్షన్ 2: అంతర్జాతీయ క్రిమినల్ కోర్టులో కేసు
పాకిస్తాన్ న్యాయ శాఖ సహాయ మంత్రి అకీల్ మాలిక్ సోమవారం వార్తా సంస్థ రాయిటర్స్‌తో మాట్లాడుతూ, భారతదేశం నిర్ణయాన్ని అంతర్జాతీయ స్థాయిలో సవాలు చేయడానికి పాకిస్తాన్ సిద్ధమవుతోందని అన్నారు.
“పాకిస్తాన్ మూడు వేర్వేరు చట్టపరమైన ఆప్షన్షను పరిశీలిస్తోంది. ఈ ఒప్పందంలో మధ్యవర్తిగా ఉన్న ప్రపంచ బ్యాంకుతో సమస్యను లేవనెత్తడం ఒకటైతే, పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్, ఇంకా ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ (ఐసీజే)లో లేవనెత్తే అంశాన్ని కూడా పరిశీలిస్తోందని ఆయన అన్నారు.
ఆయన చెప్పినదాని ప్రకారం, 1969 వియన్నా కన్వెన్షన్‌లోని లా ఆఫ్ ట్రీటీస్‌ను భారతదేశం ఉల్లంఘించిందని పాకిస్తాన్ ఫిర్యాదు చేయవచ్చు.
ఏ కేసును పాకిస్తాన్ ముందుకు తీసుకెళ్లాలనే దానిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని, ఈ అంశాన్ని ఒకటి కంటే ఎక్కువ వేదికలపై లేవనెత్తుతామని మాలిక్ అన్నారు.
“చట్టపరమైన వ్యూహానికి సంబంధించిన చర్చలు దాదాపు పూర్తయ్యాయి” అని ఆయన అన్నారు.
అయితే, దీనిపై భారతదేశం అధికారికంగా స్పందించలేదు.

ఫొటో సోర్స్, Getty Images
ఆప్షన్ 3: భద్రతా మండలికి వెళ్లే అవకాశం
పాకిస్తాన్‌కు అందుబాటులో ఉన్న నాలుగో ఆప్షన్ అంతర్జాతీయ వేదికలపై దౌత్యపరంగా ఈ సమస్యను లేవనెత్తడం అని అకీల్ మాలిక్ అన్నారు.
“పాకిస్తాన్ కూడా ఈ అంశాన్ని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో లేవనెత్తాలని పరిశీలిస్తోంది. మాకు అన్ని ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. మేం ఈ అంశాలను అన్ని సముచితమైన, సమర్థవంతమైన వేదికలలో లేవనెత్తడానికి ప్రయత్నిస్తున్నాం” అని ఆయన అన్నారు.
“ఒప్పందాన్ని ఏకపక్షంగా రద్దు చేయలేం, అలాంటి అవకాశం అందులో లేదు. అయినా భారతదేశం ఏకపక్షంగా సింధు జల ఒప్పందాన్ని నిలిపివేసింది’’ అని మాలిక్ ఆరోపించారు.
సింధు జల ఒప్పందాన్ని నిలిపివేయడంతో పాటు, ఇస్లామాబాద్‌లోని తన హైకమిషన్ నుంచి రక్షణ/సైనిక, నౌకా, వైమానిక దళ సలహాదారులను వెనక్కి పిలవాలని కూడా ఇండియా నిర్ణయించింది. రెండు హై కమిషన్లలో ఈ పదవులను రద్దు చేశారు.
రెండు హైకమిషన్ల నుంచి ఈ సైనిక సలహాదారులకు సహకరించే ఐదుగురు సిబ్బందిని ఉపసంహరించుకోవాలని కూడా నిర్ణయించారు.

ఫొటో సోర్స్, Reuters
అంతర్జాతీయ దౌత్యం
అంతర్జాతీయ సమాజం కూడా ఉద్రిక్తతను తగ్గించుకోవాలని రెండు దేశాలకు విజ్ఞప్తి చేసింది.
ఉద్రిక్తతలను తగ్గించడానికి భారతదేశం, పాకిస్తాన్‌లతో తన మెరుగైన దౌత్య సంబంధాలను ఉపయోగించుకుంటామని ఇరాన్ ముందుకొచ్చింది .
పుల్వామా దాడి తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడంలో కీలక పాత్ర పోషించిన సౌదీ అరేబియా… పహల్గాం దాడి తర్వాత కూడా భారత్, పాకిస్తాన్ అధికారులతో మాట్లాడింది.
ప్రాంతీయ ఉద్రిక్తతలకు సంబంధించి పాకిస్తాన్ విదేశాంగ శాఖ అనేక దేశాలతో చర్చల వేగాన్ని పెంచింది. గత రెండు రోజుల్లో, పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్.. గల్ఫ్, మిడిల్ ఈస్ట్‌తో సహా యుఏఈ, ఇరాన్, కువైట్, ఖతార్, బహ్రెయిన్, ఈజిప్ట్ వంటి అనేక దేశాల ప్రతినిధులతో ఫోన్‌లో మాట్లాడారు.
చైనా విదేశాంగ మంత్రితో కూడా దార్ మాట్లాడారు. చైనా జాతీయ మీడియా గ్లోబల్ టైమ్స్ ప్రకారం , పహల్గాం దాడిపై నిష్పాక్షిక దర్యాప్తులో సహాయం చేయడానికి చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ముందుకొచ్చారు. ఇరు దేశాలు చర్చల ద్వారా పరిష్కారం కనుగొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
తమ విదేశాంగ మంత్రి మార్కో రూబియో త్వరలో భారతదేశం, పాకిస్తాన్ దేశాలకు చెందిన తన సహచరులతో మాట్లాడి ఉద్రిక్తతను తగ్గించాలని విజ్ఞప్తి చేస్తారని అమెరికా విదేశాంగ శాఖ తెలిపినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ పేర్కొంది.
అణ్వాయుధాలు కలిగిన ఈ రెండు దేశాలతో చర్చలు జరుపుతున్నట్టు ఆదివారం నాడు అమెరికా తెలిపింది. బాధ్యతాయుతమైన పరిష్కారాన్ని కనుగొనాలని రెండు దేశాలను కోరినట్లు పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
సింధు జల ఒప్పందంలోని నిబంధనలు ఏమిటి?
రెండు దేశాల మధ్య నీటి పంపిణీపై తొమ్మిది సంవత్సరాలు చర్చలు కొనసాగాయి.
పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు అయూబ్ ఖాన్, భారతదేశ మొదటి ప్రధాన మంత్రి జవహర్‌లాల్ నెహ్రూలు 1960 సెప్టెంబర్‌లో సింధు జల ఒప్పందంపై సంతకం చేశారు.
ఈ ఒప్పందం ప్రకారం, సింధు పరీవాహక ప్రాంతంలోని మూడు తూర్పు నదులైన రావి, బియాస్, సట్లెజ్‌ల నీటిని భారతదేశానికి కేటాయించారు. అదే సమయంలో, మూడు పశ్చిమ నదులైన సింధు, జీలం, చీనాబ్‌ల నీటిలో 80 శాతం పాకిస్తాన్‌కు కేటాయించారు.
సింధు జల ఒప్పందం ప్రకారం, కొన్ని మినహాయింపులతో, భారతదేశం తూర్పు నదుల నీటిని ఎటువంటి ఆటంకం లేకుండా ఉపయోగించుకోవచ్చు.
అదే సమయంలో, పశ్చిమ నదుల నీటిని ఉపయోగించుకోవడానికి భారతదేశానికి విద్యుత్ ఉత్పత్తి, వ్యవసాయానికి పరిమిత నీరువంటి వాటిలో పరిమిత హక్కులు కూడా ఇచ్చారు.
అలాగే సింధు జల ఒప్పందంలో రెండు దేశాల మధ్య ఒప్పందం, సైట్ తనిఖీ మొదలైన వాటికి సంబంధించిన చర్చలు కూడా ఉన్నాయి.
అలాగే సింధు కమిషన్ కూడా ఏర్పాటు చేశారు. ఈ కమిషన్ కింద, రెండు దేశాల కమిషనర్లు సమావేశం కావాలనే ప్రతిపాదన ఉంది.
ఈ ఒప్పందం ఏదైనా వివాదాస్పద అంశంపై ఇద్దరు కమిషనర్ల మధ్య చర్చలు జరపడానికి వీలు కల్పిస్తుంది.
ఒక దేశం ఒక ప్రాజెక్టుపై పనిచేస్తుండగా, మరొక దేశం దానిపై అభ్యంతరం వ్యక్తం చేస్తే, మొదటి దేశం దానికి ప్రతిస్పందిస్తుందని కూడా ఒప్పందంలో పేర్కొన్నారు. దీనికోసం రెండు దేశాలు సమావేశాలు ఏర్పాటుచేస్తాయి.
సమావేశాల్లో పరిష్కారం దొరకకపోతే, రెండు దేశాల ప్రభుత్వాలు కలిసి దాన్ని పరిష్కరించుకోవాలి.
దీంతోపాటు అవసరమైతే అటువంటి వివాదాస్పద అంశంపై తటస్థ నిపుణుడి సహాయం తీసుకోవాలి, లేదా ఆర్బిట్రేషన్ కోర్టును సంప్రదించాలి అన్న నిబంధనలు కూడా ఉన్నాయి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)