SOURCE :- BBC NEWS

చార్‌ధామ్ యాత్ర

ఫొటో సోర్స్, ANI

48 నిమిషాలు క్రితం

ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగలో ఉన్న కేదార్‌నాథ్ ఆలయ తలుపులు మే 2న తెరిచారు.

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

చార్‌ధామ్ యాత్ర సజావుగా, విజయవంతంగా నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని, ఇది’రాష్ట్ర పండుగ’ అని ఆయన అన్నారు.

అంతకు ముందు ఏప్రిల్ 30న యమునోత్రి, గంగోత్రి ఆలయాల తలుపులు తెరిచారు.

బద్రీనాథ్ ఆలయ తలుపులు మే 4న తెరుస్తారు.

ఈ దేవాలయాల తలుపులు తెరవడంతో చార్ ధామ్ యాత్ర ప్రారంభమైంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌

చార్‌ధామ్ యాత్ర అంటే ఏంటి?

ఉత్తరాఖండ్‌లో అనేక పురాతన దేవాలయాలు ఉన్నాయి. ఏడాది పొడవునా, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఈ ఆలయాలకు వస్తుంటారు.

వీటన్నింటిలో ముఖ్యమైనది చార్‌ధామ్ యాత్ర.

దీని కోసం యాత్రికులు దీర్ఘకాలిక ప్రణాళికతో సిద్ధమవుతుంటారు.

చార్‌ధామ్‌ యాత్రలో భాగంగా భక్తులు దర్శించే ఆలయాలన్నీ ఉత్తరాఖండ్‌లోని గర్హ్వాల్ ప్రాంతంలో ఎత్తైన ప్రదేశాలలో ఉన్నాయి.

ఈ దేవాలయాలను శీతాకాలం మొదలవగానే మూసేస్తారు. వేసవి ఆరంభంలో తిరిగి తెరుస్తారని ఉత్తరాఖండ్ పర్యటక శాఖ వెబ్‌సైట్ చెబుతోంది.

చార్‌ధామ్ యాత్రను సవ్యదిశలో పూర్తి చేసుకోవాలని భక్తులు నమ్ముతారు.

అందుకే యాత్రను యమునోత్రి నుంచి ప్రారంభిస్తారు. తరువాత గంగోత్రి, ఆ తరువాత కేదార్‌నాథ్‌ను సందర్శించాక, బద్రీనాథ్‌కు వెళ్లి అక్కడ పూజలు చేస్తారు.

దీంతో యాత్ర ముగుస్తుంది

యమునోత్రి

ఫొటో సోర్స్, ANI

యమునోత్రి

చార్‌ధామ్ యాత్ర యమునోత్రి నుంచే ప్రారంభం అవుతుంది.

యమునా నది జన్మస్థానానికి సమీపంలో ఉన్న ఈ ఆలయాన్ని కాలినడకన, గుర్రం లేదా పల్లకీ ద్వారా చేరుకోవచ్చు.

ఉత్తర కాశీలో ఉన్న ఈ ఆలయం సముద్ర మట్టానికి 3,233 మీటర్ల ఎత్తులో ఉంది.

రిషికేశ్ నుంచి యమునోత్రికి చేరుకోవడానికి దాదాపు 210 కిలోమీటర్లు ప్రయాణించాలి.

గంగోత్రి

ఫొటో సోర్స్, ANI

గంగోత్రి

ప్రయాణంలో రెండో పుణ్యక్షేత్రమైన గంగోత్రి ఆలయం కూడా ఉత్తరకాశీ జిల్లాలో ఉంది.

ఇది రిషికేశ్ నుంచి దాదాపు 250 కిలోమీటర్ల దూరంలో ఉంది.

భారతదేశంలోని ఎత్తైన మతపరమైన ప్రదేశాలలో గంగోత్రి ఒకటి.

సముద్ర మట్టానికి 3,415 మీటర్ల ఎత్తులో గంగోత్రి ఉంది.

ఇక్కడ గంగానది పుట్టిన ప్రాంతాన్ని ‘గోముఖ్’ అంటారు.

‘గోముఖ్’ గంగోత్రి నుంచి 19 కిలోమీటర్ల దూరంలో ఉంది.

గోముఖ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత, ఈ నదిని ‘భాగీరథి’ అని పిలుస్తారు.

బాగీరథి నది దేవప్రయాగ్ సమీపంలో అలకనంద నదిలో కలిసిన తర్వాత గంగగా మారుతుంది.

కేదారనాథ్

ఫొటో సోర్స్, Asif Ali

కేదారనాథ్

కేదార్‌నాథ్ ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ జిల్లాలో ఉంది.

హిమాలయాలలోని గర్హ్వాల్ ప్రాంతంలో సముద్ర మట్టానికి 3,584 మీటర్ల ఎత్తులో ఉంది.

ఆలయానికి చేరుకోవడానికి కొండల్లో 18 కిలోమీటర్లు నడవాలి.

నడవలేని వారి కోసం పల్లకీలు, గుర్రాలు ఉంటాయి.

హెలికాప్టర్ ద్వారా కూడా ఆలయం దగ్గరకు చేరుకోవచ్చు.

కేదార్‌నాథ్‌ను హిందువుల నాలుగు పవిత్ర ధామ్‌లలో ఒకటిగా భావిస్తారు.

హిందూ మత గ్రంథాలలో ప్రస్తావించిన పన్నెండు జ్యోతిర్లింగాలలో, కేదార్‌నాథ్ ఎత్తైన జ్యోతిర్లింగం.

మందాకిని నది కేదార్‌నాథ్ ఆలయం సమీపంలో ప్రవహిస్తుంది.

ఈ ఆలయం సుమారు వెయ్యేళ్ల పురాతనమైనది. దీన్ని చతుర్భుజాకార పునాదిపై భారీ రాతి పలకలను ఉపయోగించి నిర్మించారు.

కేదార్‌నాథ్ ఆలయం వెనుక కేదార్‌నాథ్ శిఖరం, హిమాలయాలలోని ఇతర శిఖరాలు ఉన్నాయి.

కేదార్‌నాథ్ ఆలయం తెరిచిన తరువాత తొలి రోజు 30,154 మంది భక్తులు దర్శించుకున్నారు.

బద్రీనాథ్

ఫొటో సోర్స్, ANI

బద్రీనాథ్

చార్‌ధామ్ యాత్రలో చివరిది బద్రీనాథ్ ఆలయం.

సముద్ర మట్టానికి 3,100 మీటర్ల ఎత్తులో ఉంది.

హిమాలయ పర్వత సానువుల్లో అలకనంద నది ఒడ్డున ఉంది.

దీనిని ఆది శంకరాచార్యులు 8వ శతాబ్దంలో స్థాపించారని నమ్ముతారు.

ఈ ఆలయంలో విష్ణుమూర్తి కొలువు దీరారు

భక్తులు

ఫొటో సోర్స్, Asif Ali

ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

చార్‌ధామ్ యాత్రకు ప్రతి ఏటా లక్షల మంది భక్తులు వస్తారు.

ఈ యాత్రకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి.

ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

ఆఫ్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేయించుకునే వారి కోసం హరిద్వార్, రిషికేశ్ ఇతర ప్రదేశాలలో కౌంటర్లను ఏర్పాటు చేశారు.

తీసుకోవల్సిన జాగ్రత్తలు

మీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ మీ వద్దే ఉంచుకోండి.

యాత్రకు వెళ్లే ముందు చెల్లుబాటయ్యే ఐడీ ప్రూఫ్ తీసుకెళ్లాలి.

మీరు ఏదైనా ఔషధాలు తీసుకుంటుంటే, వాటిని మీ దగ్గర ఉంచుకోండి.

వెచ్చని బట్టలు ఉంచుకుంటే మంచిది.

మే 7 నుంచి హెలికాప్టర్ టికెట్ బుకింగ్ ప్రారంభమవుతుంది.

ఈ ప్రయాణంలో అనేక కిలోమీటర్లు నడవాల్సి రావచ్చు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)