SOURCE :- BBC NEWS

పహల్గాంలో తీవ్రవాదుల దాడి, భారత్ పాకిస్తాన్ సంబంధాలు

ఫొటో సోర్స్, Getty Images

పహల్గాంలో ఇటీవల జరిగిన తీవ్రవాద దాడిలో 26 మంది మరణించడం, తదనంతర పరిణామాలు భారత భద్రతాదళాలకు, దౌత్యవేత్తలకు గతానుభవాలను మరోసారి గుర్తు చేస్తున్నాయి.

2019లో పుల్వామాలో బాంబు దాడుల్లో 40 మంది భారతీయ పారా మిలటరీ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. దీనికి ప్రతిగా భారత్ బాలాకోట్‌లో వైమానిక దాడులు చేసింది. 1971 తర్వాత భారత్ పాకిస్తాన్‌లో ఇలాంటి చర్య తీసుకోవడం మొదటిసారి . దీంతో పాకిస్తాన్ కూడా ప్రతీకార చర్యలకు దిగడంతో వైమానిక యుద్ధానికి దారి తీసింది.

అంతకు ముందు 2008లో ముంబయిలో 60 గంటల పాటు హోటళ్లు, రైల్వే స్టేషన్, యూదు కేంద్రం మీద జరిగిన భయానక దాడిలో 116 మంది ప్రాణాలు కోల్పోయారు.

దాడులు జరిగిన ప్రతిసారీ దాడులకు పాకిస్తాన్‌లోని మిలిటెంట్ సంస్థలదే బాధ్యతని భారత్ ఆరోపించేది. ఇస్లామాబాద్ వారికి మద్దతిస్తోందని చెప్పేది.

భారత్ ఇలా ఆరోపించిన ప్రతిసారీ పాకిస్తాన్ వాటిని తిరస్కరిస్తూ వస్తోంది.

2016 నుంచి, ప్రత్యేకించి 2019 వైమానిక దాడుల తర్వాత, భారత్ ‌వైఖరి కూడా నాటకీయంగా మారుతూ వస్తోంది. సరిహద్దులను దాటి భారత్ చేస్తున్న వైమానిక దాడులు, సర్జికల్ దాడులు కొత్త విధానంగా మారాయి. దీనిపై పాకిస్తాన్ నుంచి కూడా ఎదురు దాడి జరుగుతోంది. ఇది ఇప్పటికే ఉన్న అస్థిరతను మరింత తీవ్రతరం చేస్తోంది.

భారతదేశం మరోసారి ఉద్రిక్తతలు, సంయమనం, ప్రతిస్పందన, నియంత్రణ లాంటి సున్నిత అంశాల మధ్య సమతుల్యాన్ని సాధించే పనిలో ఉందని నిపుణులు చెబుతున్నారు.

పదే పదే పునరావృతమవుతున్న ఈ పరిస్థితుల మీద అజయ్ బిసారియాకు అవగాహన ఉంది. పుల్వామా దాడి సమయంలో ఆయన పాకిస్తాన్‌లో భారత్ హైకమిషనర్‌గా పని చేశారు.

ఆయన తన అనుభవాలు, జ్ఞాపకాలను “యాంగర్ మేనేజ్‌మెంట్: ది ట్రబుల్డ్ డిప్లొమాటిక్ రిలేషన్ షిప్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్” అనే పుస్తకంలో రాశారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
పహల్గాంలో తీవ్రవాదుల దాడి, భారత్ పాకిస్తాన్ సంబంధాలు

ఫొటో సోర్స్, Getty Images

పుల్వామా, పహల్గాం దాడులకు సారూప్యం

“పుల్వామాలో బాంబు దాడి, పహల్గాంలో తీవ్రవాదుల దాడి, ఆ తదుపరి పరిణామాలకు చాలా సారూప్యతలు ఉన్నాయి” అని పహల్గాం దాడి జరిగిన 10 రోజుల తర్వాత బిసారియా నాతో చెప్పారు.

పహల్గాం దాడిలో ఒక మార్పు ఉందని ఆయన గుర్తించారు. పుల్వామా, యూరీలో భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకున్నారు. పహల్గాంలో పౌరులు, దేశం నలుమూలల నుంచి వచ్చిన పర్యటకుల మీద దాడి చేశారు. ఇది 2008 ముంబయి దాడులను గుర్తు చేసింది.

“ఈ దాడిలో పుల్వామా తరహా పద్ధతి, ముంబయి తరహా అంశాలు ఎక్కువగా ఉన్నాయి” అని ఆయన చెప్పారు.

“మనం మరోసారి యుద్ధ వాతావరణంలో ఉన్నాం. ఇది కూడా గతంలో మాదిరిగానే ముగుస్తుంది” అని బిసారియా అన్నారు.

పహల్గాం దాడి జరిగిన వారం రోజుల తర్వాత, సరిహద్దులను మూసివేయడం, కీలకమైన నీటి పంపిణీ ఒప్పందాన్ని రద్దు చేయడం, దౌత్యవేత్తలను తిప్పి పంపడం, పాకిస్తాన్ జాతీయులకు ఇచ్చే వీసాల్ని ఆపేయడం, భారత్‌లో ఉన్న పాకిస్తానీలను పంపేయడం తదితర చర్యలతో దిల్లీ వేగంగా స్పందించింది.

సరిహద్దుల్లో రెండు వైపులా సైనికుల మధ్య అక్కడక్కడా కాల్పులు జరిపిన ఘటనలు నమోదవుతున్నాయి.

భారత్‌కు చెందిన ప్రజా, సైనిక విమానాలు పాక్ గగనతలంలోకి రాకుండా ఇస్లామాబాద్ ఆంక్షలు విధించిన తర్వాత దిల్లీ కూడా అదే రీతిలో స్పందించింది.

భారత్ నిర్ణయాలకు బదులుగా పాకిస్తాన్ కూడా వీసాలను రద్దు చేయడంతో పాటు 1972లో భారత్‌తో చేసుకున్న శాంతి ఒప్పందాన్ని రద్దు చేసుకుంది.

పహల్గాంలో తీవ్రవాదుల దాడి, భారత్ పాకిస్తాన్ సంబంధాలు

ఫొటో సోర్స్, Ajay Bisaria

పుల్వామా దాడి తరువాత..

2019 ఫిబ్రవరి 14న పుల్వామా దాడి తర్వాత భారత్‌ ప్రతిస్పందనను బిసారియా తను రాసిన పుస్తకంలో వివరించారు.

దాడి జరిగిన తర్వాతి రోజు ఉదయం ఆయన్ను దిల్లీకి పిలిపించారు.

పాకిస్తాన్‌తో వాణిజ్యాన్ని నిలిపివేస్తూ ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకుంది.

పాకిస్తాన్‌కు 1996లో ఇచ్చిన అత్యంత అనుకూల దేశ హోదాను రద్దు చేసింది.

తర్వాతి రోజుల్లో భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ పాకిస్తాన్ నుంచి దిగుమతి అయ్యే వస్తువుల మీద కస్టమ్స్ డ్యూటీని 200శాతానికి పెంచింది.

దీని వల్ల దిగుమతులు పూర్తిగా ఆగిపోయాయి.

వాఘా సరిహద్దు ద్వారా వాణిజ్యాన్ని నిలిపివేశారు.

పాకిస్తాన్‌తో సంబంధాలను తగ్గించడానికి విస్తృతమైన నిర్ణయాలు తీసుకున్నారు.

వాటిలో ఎక్కువ భాగం అమలు చేసినట్లు బిసారియా గుర్తించారు.

అందులో రెండు దేశాల మధ్య నడిచే సంఝౌతా ఎక్స్‌ప్రెస్, దిల్లీ లాహోర్ మధ్య బస్సు సేవలను ఆపేయడం, ఇరువైపులా సరిహద్దుల గురించి చర్చలను వాయిదా వేయడం, కర్తార్‌పూర్ కారిడార్‌పై చర్చలను నిలిపివేయడం, వీసాల జారీ ఆపేయడం, సరిహద్దుల మూసివేత, భారతీయులు పాకిస్తాన్‌ వెళ్లడంపై నిషేధం, రెండు దేశాల మధ్య విమానాల రాకపోకలను రద్దు చేయడం లాంటివి ఉన్నాయి.

“నమ్మకాన్ని నిర్మించడం ఎంత కష్టమో, దాన్ని విచ్ఛిన్నం చేయడం అంత తేలిక” అని బిసారియా రాశారు.

“రెండు దేశాల మధ్య సంక్లిష్టమైన సంబంధాల్లో ఏళ్ల తరబడి ప్రణాళికాబద్దంగా నిర్వహించిన చర్చలు, విశ్వాసాన్ని నెలకొల్పేందుకు తీసుకున్నచర్యలన్నీ నిమిషాల్లో చెరిగిపోయాయి.

ఒక ప్రత్యేక దౌత్య సంఘటన తర్వాత ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషనర్ కార్యాలయంలో సిబ్బందిని 110 నుంచి 55కి తగ్గించారు. (పహల్గాం దాడి తర్వాత ఈ సంఖ్య ఇప్పుడు 30కి చేరుకుంది) భారతదేశం కూడా దౌత్యపరమైన దాడి మొదలు పెట్టింది.

దాడి జరిగిన తర్వాత, విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్ గోఖలే, అమెరికా, బ్రిటన్, చైనా, రష్యా, ఫ్రాన్స్ సహా 25 దేశాల రాయబారులకు జైషే మహమ్మద్ పాత్ర గురించి వివరించారు. బాంబు దాడి వెనుక పాకిస్తాన్ కేంద్రంగా నడుస్తున్న మిలిటెంట్ గ్రూప్ ఉందని,టెర్రరిజాన్ని ప్రభుత్వ విధానంగా పాకిస్తాన్ అమలు చేస్తోందని ఆరోపించారు.

ఐక్యరాజ్యసమితి, అమెరికా, బ్రిటన్, ఇండియా ఉగ్రవాద సంస్థగా గుర్తించిన జైషే మహమ్మద్‌ పుల్వామా బాంబు దాడికి బాధ్యత తమదేనని ప్రకటించింది.

పహల్గాంలో తీవ్రవాదుల దాడి, భారత్ పాకిస్తాన్ సంబంధాలు

ఫొటో సోర్స్, AFP

సరిహద్దులు దాటి భారత్ దాడి

దాడి జరిగిన పది రోజుల తర్వాత ఫిబ్రవరి 25న కూడా భారత్ దౌత్య దాడి కొనసాగింది. జైషే మహమ్మద్ అధినేత మసూద్ అజర్‌ను ఐక్యరాజ్యసమితి ఆంక్షల కమిటీ టెర్రరిస్టుగా ప్రకటించి ఈయూ ఉగ్రవాదుల జాబితాలో చేర్చాలని కోరింది.

రెండు దేశాల మధ్య కీలకమైన సింధు జలాల పంపిణీ ఒప్పందాన్ని రద్దు చేయాలని ఒత్తిడి ఉన్నప్పటికీ, ఒప్పందాన్ని రద్దు చేయకుండా పాక్‌తో సమాచార మార్పిడిని ఆపేయాలని భారత్ నిర్ణయించిందని బిసారియా తన పుస్తకంలో రాశారు.

రద్దు చేసేందుకు అవకాశం ఉన్న48 ద్వైపాక్షిక ఒప్పందాలను భారత్ సమీక్షించింది. దిల్లీలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో ప్రభుత్వ నిర్ణయాలకు ఏకగ్రీవ మద్దతు లభించింది.

అదే సమయంలో రెండు దేశాల డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ మధ్య కమ్యూనికేషన్ మార్గాలు తెరిచి ఉంచారు. ఇది రెండు దేశాల సైన్యాలు, హైకమిషన్‌ల మధ్య కీలకమైన సమాచార మార్గం. పహల్గాం విషయంలో చెప్పినట్లే 2019లోనూ దాడులతో తమకు ఏమాత్రం సంబంధం లేదని పాకిస్తాన్ చెప్పింది.

పహల్గాం దాడి తర్వాత జరుగుతున్నట్లుగానే, పుల్వామా దాడి సమయంలోనూ పాకిస్తాన్ ఆధారిత మిలిటెంట్ గ్రూపులకు, తీవ్రవాదులకు సాయం అందించడంతోపాటు ఆశ్రయం, సమాచారం అందిస్తున్నారని ఆరోపిస్తూ 80 మంది కశ్మీరీలను పోలీసులు అరెస్ట్ చేశారు.

అప్పట్లో హోంమంత్రిగా ఉన్న రాజ్‌నాధ్ సింగ్ జమ్మూ కశ్మీర్‌ను సందర్శించారు. దాడికి పాల్పడినవారు, అనుమానితులు, నేరస్తుల గురించి పత్రాలను సిద్ధం చేశారు.

విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్‌తో జరిగిన ఓ సమావేశంలో పాల్గొన్నప్పుడు బసారియా ఆమెతో “ఈ రకమైన ఉగ్రవాద దాడులను దౌత్యపరంగా ఎదుర్కోవడంలో భారత్‌ ఎంపికలు పరిమితంగా ఉన్నాయని” చెప్పారు.

“కొన్ని కఠిన చర్యలు ఉండబోతున్నాయని ఆమె నాకు సంకేతం ఇచ్చారు. తర్వాత, దౌత్యం పాత్ర పెరుగుతుందని నేను భావించేలా చేశారు” అని బసారియా రాశారు.

ఫిబ్రవరి 26న భారత వైమానిక దళం 1971తరవాత తొలిసారి అంతర్జాతీయ సరిహద్దులను దాటి బాలాకోట్‌లోని జైషే క్యాంపుల మీద వైమానిక దాడులు చేసింది. ఆరు గంటల తర్వాత దాడుల్లో “భారీ మొత్తంలో” మిలిటెంట్లు, కమాండర్లు చనిపోయారని భారత విదేశాంగ కార్యదర్శి ప్రకటించారు.

అయితే పాకిస్తాన్ దీన్నీ వెంటనే తిరస్కరించింది. తర్వాత దిల్లీలో అనేక ఉన్నత స్థాయి సమావేశాలు జరిగాయి.

పహల్గాంలో తీవ్రవాదుల దాడి, భారత్ పాకిస్తాన్ సంబంధాలు

ఫొటో సోర్స్, AFP

బందీగా భారత్ వింగ్ కమాండర్

తర్వాతి రోజు ఉదయానికి, అంటే ఫిబ్రవరి 27న పాకిస్తాన్ ప్రతీకార వైమానిక దాడులకు దిగడంతో ఈ సంక్షోభం తీవ్రమైంది.

పరస్పర వైమానిక దాడుల్లో భారత్‌కు చెందిన ఫైటర్‌జెట్‌ను కూల్చేశారు. ఆ విమానం నడుపుతున్న పైలట్, వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్‌ను పాకిస్తాన్ బలగాలు బంధించాయి. శత్రు భూభాగంలో అభినందన్ నిర్బంధం జాతీయ స్థాయిలో ఆందోళనలను రేకెత్తించింది. రెండు అణ్వాయుధ దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచింది.

ఆ సమయంలో భారత్, ఇస్లామాబాద్‌లోని అమెరికా, బ్రిటన్ రాయబారులను సంప్రదించడంతో పాటు దౌత్యపరంగా అనేక మార్గాలను ఉపయోగించిందని బిసారియా రాశారు.

“పాకిస్తాన్ మరెలాంటి చర్య తీసుకున్నా, పైలట్‌కు ఏదైనా గాయమైనా తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీస్తుంది” అనే సందేశాన్ని భారత్ పంపింది.

పైలట్‌ను విడుదల చేస్తున్నట్లు పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఫిబ్రవరి 28న ప్రకటించారు. యుద్ధ ఖైదీల అప్పగింత ప్రోటోకాల్ కింద అభినందన్‌ను మార్చి 1న భారత్‌కు అప్పగించారు. ఈ చర్యను పాకిస్తాన్ “సద్భావన సంకేతంగా” ఉద్రిక్తతలను తగ్గించే అంశంగా చూపించే ప్రయత్నం చేసింది.

పుల్వామా, బాలాకోట్ దాడులు, పైలట్ తిరిగి రావడంతో మార్చ్ 5 నాటికి భారత్‌లో రాజకీయ వాతావరణం చల్లబడింది.

దౌత్యంలో భాగంగా భారత హైకమిషనర్‌ను తిరిగి పాకిస్తాన్ పంపాలని భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ నిర్ణయించింది.

“పుల్వామా ఘటన తర్వాత పాకిస్తాన్ నుంచి వచ్చిన నేను 22 రోజుల తర్వాత మార్చి 22న తిరిగి ఇస్లామాబాద్ చేరుకున్నాను. కార్గిల్ తర్వాత రెండు దేశాల మధ్య జరిగిన సైనిక దాడి ప్రభావం నెల రోజుల్లోపే ముగిసింది” అని బసారియా రాశారు.

“పాకిస్తాన్‌కు దౌత్యపరంగా గతంలో మాదిరిగానే మరో అవకాశం ఇచ్చేందుకు భారత్ సిద్ధమైంది. దీంతో భారత్ వ్యూహాత్మకంగా, సైనికపరంగా ఒక లక్ష్యాన్ని సాధించింది. ఇది తమ విజయం అని పాకిస్తాన్ స్వదేశంలో ప్రచారం చేసుకుంది” అని బసారియా తన పుస్తకంలో తెలిపారు.

పహల్గాంలో తీవ్రవాదుల దాడి, భారత్ పాకిస్తాన్ సంబంధాలు

ఫొటో సోర్స్, AFP

సింధు జలాల ఒప్పందం రద్దుతో..

దౌత్యవేత్తగా అది తనకు “పరీక్షతో పాటు ఇష్టమైన సమయం” అని బిసారియా అభివర్ణించారు.

అయితే ఈసారి ముఖ్యమైన తేడా ఏంటంటే, ” కశ్మీర్‌లో పరిస్థితులు మెరుగుపడినప్పుడు పౌరుల్ని లక్ష్యంగా చేసుకుని దాడిచేయడం’’ అని ఆయన పేర్కొన్నారు.

ఉద్రిక్తతలు అనివార్యమైమనప్పటికీ, వాటికవి తగ్గే మార్గాలు కూడా ఉన్నాయని బసారియా చెప్పారు.

ఇలాంటి సమయాల్లో భద్రతా వ్యవహరాల కేబినెట్ కమిటీ సమావేశమైనప్పుడు, వారి నిర్ణయాలు ఉద్రిక్తతల వల్ల ఏర్పడే ఆర్థిక ప్రభావాన్ని అంచనా వేస్తాయని భారతదేశానికి నష్టం లేకుండా పాక్‌కు హాని కలిగించే చర్యలు తీసుకుంటాయని ఆయన చెప్పారు.

“ఈసారి కూడా అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి” అని ఆయన అన్నారు. అయితే ఈసారి తీసుకున్న నిర్ణయాల్లో గొప్ప మార్పు ఏంటంటే సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు భారత్ ప్రకటించడం.

“భారత్ ఈ నిర్ణయం తీసుకుంటే, పాకిస్తాన్ మీద దీని ప్రభావం దీర్ఘకాలికంగా తీవ్రంగా ఉంటుంది”

“గుర్తుంచుకోండి. మనం ఇప్పటికీ సంక్షోభం మధ్యలో ఉన్నాం. సైనిక పరంగా మనం ఇంకా ఎలాంటి చర్యలు చూడలేదు” అని బసారియా చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)