SOURCE :- BBC NEWS

టాలీవుడ్, హాలీవుడ్, బాలీవుడ్

ఫొటో సోర్స్, MytriMovies/BBC

ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలపై మరిన్ని సుంకాలు విధిస్తూ వాణిజ్య వివాదాలు పెరిగేందుకు కారణమైన అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్, తాజాగా మరో నిర్ణయం తీసుకున్నారు.

విదేశీ సినిమాలపై 100% సుంకాలను విధించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

అమెరికా సినిమా పరిశ్రమ “చాలావేగంగా అవసానదిశవైపు పయనిస్తున్నందున, అమెరికాలో విడుదలయ్యే విదేశీ సినిమాలపై పన్ను విధించే ప్రక్రియను ప్రారంభించడానికి అమెరికా వాణిజ్య ప్రతినిధికి అధికారం ఇస్తున్నట్లు ట్రంప్ తెలిపారు.

చిత్రనిర్మాతలు, స్టూడియోలను ఆకర్షించడానికి ప్రోత్సాహకాలను అందించే ఇతర దేశాల ప్రయత్నాన్ని ఆయన తప్పబట్టారు. దీనిని తమ ‘జాతీయ భద్రతా ముప్పు’గా అభివర్ణించారు ట్రంప్.

‘‘అమెరికాలో మళ్ళీ సినిమాలు తీసే రోజులు రావాలని కోరుకుంటున్నాం” అని ట్రంప్ తన ట్రూత్ సోషల్ ప్లాట్‌ఫామ్‌లో పేర్కొన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
హాలీవుడ్

ఫొటో సోర్స్, Getty Images

టాలీవుడ్, బాలీవుడ్ పై ఎఫెక్ట్

సినిమాలపై ట్రంప్ టారిఫ్ ప్రకటన వెలువడగానే వివిధ భారతీయ మీడియ సంస్థలు బాలీవుడ్, టాలీవుడ్ తదితర భారతీయ సినిమా ఇండస్ట్రీలపై పడే ప్రభావంపై అంచనాలు, విశ్లేషణలు చేశాయి.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదిత ట్యాక్స్ ప్రభావం భారతీయ చలనచిత్ర రంగంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఈ విశ్లేషణలు తేల్చాయి.

అమెరికాకు సినిమాలను ఎగుమతి చేసే భారతీయ సినీ పరిశ్రమలలో బాలీవుడ్, టాలీవుడ్ సినిమాలు అగ్రస్థానంలో ఉంటాయి.

విదేశాల్లో నిర్మాణమైన సినిమాలపై పన్ను వంద శాతం పెంచాలనేది ప్రతిపాదన అమలైతే ముఖ్యంగా బాలీవుడ్, టాలీవుడ్ సినిమాలకు ఇబ్బందులు కలిగే పరిస్థితులు కనిపిస్తున్నాయని ఎన్డీటీవీ కథనం పేర్కొంది.

ఇటీవల కాలంలో బాలీవుడ్, టాలీవుడ్ సినిమాలకు అమెరికాలో ప్రేక్షకుల నుంచి భారీగా ఆదరణ కనిపిస్తోంది.

పఠాన్, డంకీ, ఆర్‌ఆర్‌ఆర్, పుష్ప, జవాన్‌లాంటి భారతీయ చిత్రాలు వసూళ్లలో రికార్డులు బద్దలుకొట్టాయి. ముఖ్యంగా తెలుగు సినిమా రంగానికి అమెరికాకు మధ్య బలమైన పంపిణీ వ్యవస్థ ఏర్పడింది.

తెలుగు బ్లాక్ బస్టర్ సినిమాలు దాదాపుగా అమెరికాలోని సినిమా థియేటర్ల రెవెన్యూలో సింహభాగాన్ని దక్కించుకుంటున్నాయని కూడా ఎన్డీటీవీ పేర్కొంది. భారతదేశంలోకన్నా ఒకరోజు ముందే విడుదలై బజ్ సృష్టిస్తున్నాయి.

ట్రంప్ ప్రతిపాదించిన వంద శాతం టారిఫ్ అమలుచేస్తే భారతీయ సినిమాలను కొనుగోలు చేయడం అమెరికాలో పంపిణీదారులకు అదనపు భారమవుతుందని ఎన్డీటీవీ పేర్కొంది.

ఉదాహరణకు ఇప్పటివరకూ ఒక భారతీయ సినిమా పంపిణీ హక్కుల కోసం ఒక మిలియన్ డాలర్లు (సుమారు రూ.84 కోట్లు) పన్ను చెల్లించిన డిస్ట్రిబ్యూటర్ ఇకపై అదనంగా మరో రూ.84 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది.

ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా పంపిణీదారులు వెనక్కి తగ్గితే భారతీయ సినిమాలకు లాభం తగ్గిపోతుంది. ముఖ్యంగా అమెరికా మార్కెట్‌ను ప్రధానంగా దృష్టిలో పెట్టుకుని నిర్మించే తెలుగు సినిమా నిర్మాతలపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఎన్డీటీవీ పేర్కొంది.

డోనల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సుంకాల మోత

జనవరిలో వైట్ హౌస్‌లో తిరిగి అడుగుపెట్టినప్పటినుంచి.. ట్రంప్ ప్రపంచ దేశాలపై సుంకాలను విధించడం మొదలుపెట్టారు.

సుంకాలు అమెరికా తయారీదారులను ప్రోత్సాహకరంగా ఉంటాయని, ఉద్యోగాలను కాపాడతాయన్నది ఆయన వాదన. అయితే, ఆయన నిర్ణయాలతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ గందరగోళంలో పడింది.

ప్రపంచవ్యాప్తంగా వస్తువుల ధరలు పెరుగుతాయని భావిస్తున్నారు.

తన ప్రమాణ స్వీకారానికి ముందు, ట్రంప్ ముగ్గురు సినీ నటులు.. జాన్ వోయిట్, మెల్ గిబ్సన్, సిల్వెస్టర్ స్టాలోన్‌లను హాలీవుడ్‌లో వ్యాపార అవకాశాలను ప్రోత్సహించే ప్రత్యేక రాయబారులుగా నియమించారు.

‘‘గత నాలుగు సంవత్సరాలుగా విదేశాలకు మళ్లిన వ్యాపారాన్ని…గతంలో కంటే భారీగా, మెరుగ్గా, బలంగా హాలీవుడ్‌కు తిరిగి తీసుకురావడానికి వారు నాకు ప్రత్యేక రాయబారులుగా వ్యవహరిస్తారు’’ అని డోనల్డ్ ట్రంప్ పేర్కొన్నారు.

తాజా ప్రకటనపై అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ స్పందిస్తూ, “మేం ఇప్పటికే విదేశీ సినిమాలపై సుంకాలు విధించే దిశగా పనులు మొదలుపెట్టాం” అని అన్నారు.

సవాళ్లు ఉన్నప్పటికీ అమెరికా ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రధాన చలనచిత్ర నిర్మాణ కేంద్రంగా ఉందని చలనచిత్ర పరిశ్రమ పరిశోధన సంస్థ ప్రోడ్‌ప్రో పేర్కొంది.

గత సంవత్సరం అమెరికా $14.54 బిలియన్ డాలర్ల మేరకు ఉత్పత్తి వ్యయం చేసినట్లు తాజా వార్షిక నివేదిక ద్వారా తెలిసింది. అయితే, 2022 నుంచి అది 26% తగ్గింది.

ఇదే కాలంలో ఖర్చులు పెరిగిన దేశాలలో ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, కెనడా, అమెరికా ఉన్నాయని నివేదిక పేర్కొంది.

బాలీవుడు, టాలీవుడ్, హాలీవుడ్

ఫొటో సోర్స్, facebook/Maddock Films

విదేశీ సినిమాలపై సుంకాలు అన్న ప్రకటనకు ముందే, ట్రంప్ వాణిజ్య విధానాల ప్రభావం అమెరికా సినిమా పరిశ్రమపై పడింది.

తన దేశంలోకి అనుమతించిన అమెరికన్ సినిమాల కోటాను తగ్గిస్తున్నట్లు ఏప్రిల్‌లో.. చైనా తెలిపింది.

“చైనాపై సుంకాలను దుర్వినియోగం చేయడానికి అమెరికా తీసుకున్న చర్య, అమెరికన్ చిత్రాల పట్ల దేశీయ ప్రేక్షకుల అనుకూలతను మరింత తగ్గిస్తుంది” అని చైనా ఫిల్మ్ అడ్మినిస్ట్రేషన్ పేర్కొంది.

“మేం మార్కెట్ నియమాలను పాటిస్తాం, ప్రేక్షకుల ఎంపికను గౌరవిస్తాం. దిగుమతి చేసుకున్న అమెరికన్ చిత్రాల సంఖ్యను మధ్యస్థంగా తగ్గిస్తాం.” అని తెలిపింది.

ట్రంప్ తన సుంకాల దాడితో చైనాను తీవ్రంగా దెబ్బతీశారు, అక్కడి నుంచి వచ్చే వస్తువులపై 145% వరకు దిగుమతి సుంకాలను విధించారు.

కొత్త సుంకాలను ఇప్పటికే ఉన్న వాటికి జోడించినప్పుడు, కొన్ని చైనా వస్తువులపై సుంకాలు 245%కి చేరుకోవచ్చని ఆయన ప్రభుత్వం గత నెలలో తెలిపింది.

దీనికి ప్రతిగా అమెరికా నుంచి వచ్చే వస్తువులపై 125% దిగుమతి సుంకాన్ని విధించింది బీజింగ్.

జూలైలో అధిక సుంకాలపై విరామం ముగిసే వరకు ఇతర దేశాలు ప్రస్తుతం 10% సుంకాలను అమెరికాకు చెల్లిస్తున్నాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)