SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, Nasir Kachroo/NurPhoto via Getty Images
7 మే 2025, 08:58 IST
పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా సైనిక చర్యకు దిగినట్లు భారత్ ప్రకటించింది. బుధవారం (మే7వ తేదీ) తెల్లవారుజామున జరిగిన ఈ దాడిలో 8మంది చనిపోయినట్టు పాకిస్తాన్ తెలిపింది. అయితే, తాము జరిపిన దాడుల్లో పౌరులకు ఎలాంటి నష్టం జరగలేదని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి వెల్లడించారు.
మరోపక్క యుద్ధం వంటి అత్యవసర పరిస్థితుల్లో పౌరులు ఎలా స్పందించాలనే విషయంపై సన్నద్ధత కోసం దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు బుధవారం (మే 7న) మాక్ డ్రిల్స్‌ను చేపట్టాలని భారత కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది.
ఈ నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ బలం ఎంత? ఎవరెవరి వద్ద ఎన్నెన్ని ఆయుధాలు ఉన్నాయి, సైనిక సంపత్తి ఎంత, ఎవరెవరు ఎంతెంత సైనిక వ్యయం చేస్తున్నారో తెలుసుకుందాం.


ఫొటో సోర్స్, Globelfirepower.com
భారత త్రివిధ దళాల బలమెంత?
‘గ్లోబల్ ఫైర్ పవర్’ వెబ్సైట్ ప్రకారం 2025 మిలటరీ ర్యాంకింగ్‌లలో భారత్.. పాకిస్తాన్ కంటే ముందుంది.
2025లో అంతర్జాతీయ సైనిక శక్తికి సంబంధించి 145 దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో ఉంటే పాకిస్తాన్ ర్యాంకు 12.
భారత్ దగ్గర దాదాపు 22 లక్షల సైన్యం ఉంది.
4,201 యుద్ధ ట్యాంకులు, దాదాపు లక్షా 50 వేల ఆర్మర్డ్ వెహికల్స్, 100 సెల్ఫ్ ప్రొపెల్డ్ ఆర్టిలరీ, 3,975 టోవ్డ్ ఆర్టిలరీ ఉన్నాయి.
దీంతో పాటు మల్టీ బారెల్ రాకెట్ ఆర్టిలరీ 264 ఉన్నాయి.
భారత వాయుసేన దగ్గర 3 లక్షల10 వేల మంది బలగం ఉంది.
2,229 విమానాలున్నాయి. వాటిలో 513 ఫైటర్ విమానాలు కాగా, 270 రవాణా విమానాలు. 130 అటాక్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు, 351 శిక్షణ విమానాలు, ఆరు ట్యాంకర్ ఫ్లీట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లున్నాయి.
భారత సైన్యానికి చెందిన మూడు విభాగాల దగ్గర 899 హెలికాప్టర్లున్నాయి.
వాటిలో 80 అటాక్ హెలికాప్టర్లు.
భారత నౌకాదళం దగ్గర లక్షా 42 వేలమంది సెయిలర్లు ఉన్నారు.
రెండు విమాన వాహక నౌకలు సహా మొత్తం 293 నౌకలున్నాయి.
వాటిలో 13 డిస్ట్రాయర్లు, 14 ఫ్రిగేట్లు, 18 సబ్మెరైన్లు, 18 కర్వెట్టీలు ఉన్నాయి.
భారత ఆర్మీ పరిధిలో 311 ఎయిర్‌పోర్టులు, 56 పోర్టులు ఉన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
గ్లోబల్ ఫైర్ పవర్’ ప్రకారం పాకిస్తాన్ సైన్యంలో దాదాపు 13లక్షల11వేలమంది సైనికులు ఉన్నారు. లక్షా 24 వేలమంది నౌకాదళ సిబ్బంది, 78వేల వైమానిక సిబ్బంది ఉన్నారు.
పాకిస్తాన్ దగ్గర మొత్తం 1,399 ఎయిర్ క్రాఫ్ట్లున్నాయి. వాటిలో 328 ఫైటర్ జెట్లు, 90 ఎటాక్ టైప్స్, 64 ట్రాన్స్పోర్ట్ విమానాలు, 565 ట్రైనర్లు, నాలుగు ట్యాంకర్ ఫ్లీట్లు, 373 హెలికాప్టర్లు ఉన్నాయి. వాటిలో 57 ఎటాక్ హెలికాప్టర్లు.
2,627 ట్యాంకులు, 662 సెల్ఫ్ ప్రొపెల్లడ్ ఆర్టిలరీ, 2,629 టోడ్ ఆర్టిలరీ, 600 మల్టీబ్యారల్ ఆర్టిలరీ ఉన్నాయి.
పాకిస్తాన్ నౌకాదళం దగ్గర మొత్తం 121 యుద్ధ నౌకలున్నాయి. వాటిలో 9 ఫ్రిగేట్లు, 9 కార్వెట్టులు, 8 సబ్మెరైన్లు, 69 పెట్రోల్ నౌకలున్నాయి.
పాకిస్తాన్ ఆర్మీ పరిధిలో మూడు పోర్టులు మాత్రమే ఉన్నాయి. దీంతో పాటు 116 ఎయిర్‌పోర్టులు, 60 మర్చంట్ మెరైన్ ఫ్లీట్లు ఉన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
స్వీడిష్ థింక్ ట్యాంక్ స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(ఎస్ఐపీఆర్ఐ) ప్రకారం భారత్ దగ్గర 172 న్యూక్లియర్ వార్హెడ్లు ఉండగా, పాకిస్తాన్ దగ్గర 170 ఉన్నాయి.
రెండు దేశాలు ఎన్ని అణువార్హెడ్లను మోహరించాయనేదానిపై స్పష్టత లేదు.
భారత్‌తో పోటీపడడానికి పాకిస్తాన్ అణ్వాయుధాలు తయారుచేసుకుంటుంటే, దీర్ఘశ్రేణి లక్ష్యాలను ఛేదించగల ఆయుధాల మోహరింపుపై భారత్ దృష్టి పెట్టిందని ఆ సంస్థ తెలిపింది. ఈ ఆయుధాలు చైనాను కూడా టార్గెట్ చేయగలవు.
భారత్, పాకిస్తాన్లకు పొరుగు దేశమైన చైనా ప్రపంచంలో మూడో అతిపెద్ద అణ్వాయుధ సంపత్తి ఉన్న దేశం. చైనా దగ్గర అణు వార్హెడ్లు 410 నుంచి 500కు చేరాయి.
రెండు దేశాల దగ్గర ఎన్ని డ్రోన్లు ఉన్నాయి?
భారత్, పాకిస్తాన్ డ్రోన్ల సంఖ్యను బాగా పెంచుకుంటున్నాయని గత ఏడాది నవంబరులో బీబీసీ ఉర్దూ ప్రతినిధి షకీల్ అఖ్తర్ రాసిన ఆర్టికల్‌లో పేర్కొన్నారు.
వచ్చే రెండు నుంచి నాలుగేళ్లలో డ్రోన్ల సంఖ్యను భారత్ దాదాపు ఐదువేలకు పెంచుకుంటుందని రక్షణరంగ నిపుణులు రాహుల్ బేదీ చెప్పారు.
భారత్‌తో పోలిస్తే పాకిస్తాన్ దగ్గర తక్కువ డ్రోన్లు ఉన్నప్పటికీ, పాకిస్తాన్ దగ్గర అనేక రకాల సామర్థ్యమున్న 10 నుంచి 11 రకాల డ్రోన్లు ఉన్నాయి.
3.5 బిలియన్ డాలర్ల విలువైన ప్రిడేటర్ డ్రోన్లు కొనుగోలు చేయడానికి గత ఏడాది అక్టోబరులో అమెరికాతో ఒప్పందం కుదుర్చుకుంది భారత్.
ప్రిడేటర్ డ్రోన్లను ప్రపంచంలో అత్యంత ప్రమాదకర డ్రోన్లుగా భావిస్తారు.

ఫొటో సోర్స్, Getty Images
వాటితో పాటు 500 మిలియన్ డాలర్ల విలువైన బాంబులు, లేజర్ గైడెడ్ మిసైల్ కూడా భారత్ కొనుగోలు చేయనుంది. ఆ డ్రోన్లతో నిర్దేశిత లక్ష్యాలను ఛేదించవచ్చు.
తుర్కియే, చైనా నుంచి పాకిస్తాన్ డ్రోన్లు దిగుమతి చేసుకుంటోందని రాహుల్ బేదీ తెలిపారు. జర్మనీ, ఇటలీ నుంచి కూడా పాకస్తాన్ డ్రోన్లు కొనుగోలు చేసింది.
బరాఖ్, శహపర్ వంటి డ్రోన్లను కూడా పాకిస్తాన్ తయారుచేస్తోంది.
తుర్కియేకు చెందిన అధునాతన బైరాక్తర్ డ్రోన్లు టీబీ2, ఎకెంజీ పాకిస్తాన్ దగ్గర ఉన్నాయి. ‘వాంగ్ లాంగ్ 2’ సీహెచ్ 4వంటి డ్రోన్లను కూడా చైనా నుంచి పాకిస్తాన్ కొనుగోలు చేసింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
SOURCE : BBC NEWS