SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, Reuters
సెయింట్ పీటర్స్ బసిలికా బాల్కనీ నుంచి కొత్త పోప్ పేరు ప్రకటించకముందే.. అక్కడ గుమికూడి ఉన్న జనసందోహం “వివా ఇల్ పాపా” – పోప్ వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేయడం మొదలుపెట్టారు.
69 ఏళ్ల రాబర్ట్ ఫ్రాన్సిస్ ప్రవోస్ట్.. సెయింట్ పీటర్ సింహాసనానికి 267వ అధిపతి అయ్యారు. ఆయనను లియో XIV (లియో ఫోర్టీన్)గా పిలుస్తారు.
పోప్‌గా నియమితులైన మొదటి అమెరికన్ ప్రవోస్ట్. అయితే, పెరూలో చాలా ఏళ్లు మిషనరీగా (మత బోధకుడు)గా ఉన్న కారణంగా ఆయనను లాటిన్ అమెరికా రోమన్ కేథలిక్ కార్డినల్లానే పరిగణిస్తారు.

1955లో షికాగోలో, స్పానిష్, ఫ్రాంకో-ఇటాలియన్ సంతతికి చెందిన తల్లిదండ్రులకు ప్రవోస్ట్ జన్మించారు. ఆయన బలిపీఠ బాలుడిగా పనిచేశారు. 1982లో సన్యాసం స్వీకరించారు.
మూడేళ్ల అనంతరం ఆయన పెరూకి వెళ్లినప్పటికీ, స్వస్థలంలో పాస్టర్‌గా, మఠాధిపతిగా సేవలందించేందుకు క్రమం తప్పకుండా అమెరికాకు వచ్చేవారు.
రాబర్ట్ ఫ్రాన్సిస్ ప్రవోస్ట్ పెరూవియన్ జాతీయత కలిగివున్నారు. అణగారిన వర్గాలను అక్కున చేర్చుకున్న వ్యక్తిగా, వంతెనల నిర్మాణానికి సాయం చేసిన వ్యక్తిగా ఆయన్ను కొందరు గుర్తుచేసుకుంటారు.
వాయువ్య పెరూలోని ట్రుజిల్లోలో స్థానిక పారిష్ పాస్టర్‌గా, సెమినరీ(మతబోధకుల పాఠశాల)లో టీచర్‌గా పదేళ్లు పనిచేశారు.
పోప్‌గా, లియో XIV మాట్లాడిన తొలి మాటలు పోప్ ఫ్రాన్సిస్ గురించే.
“మనల్ని ఆశీర్వదించిన పోప్ ఫ్రాన్సిస్ ధైర్యవంతమైన స్వరం ఇప్పటికీ మన చెవుల్లో మార్మోగుతూనే ఉంటుంది” అని ఆయన అన్నారు.
“దేవునితో చేయి చేయి కలిపి ఐక్యంగా, కలిసి ముందుకు సాగుదాం” అని ఆయన పిలుపునిచ్చారు.

ఫొటో సోర్స్, EPA
అగస్టీనియన్ ఆర్డర్లో ఆయన పాత్ర గురించి కూడా పోప్ మాట్లాడారు.
2014లో, ఫ్రాన్సిస్ ఆయనను పెరూలోని చిక్లాయో బిషప్‌గా నియమించారు.
లాటిన్ అమెరికాలోని బిషప్‌ల బాధ్యతలు చూసే డికాస్టరీకి ప్రిఫెక్ట్(కేథలిక్ చర్చి గవర్నింగ్ బాడీ అధిపతి)గా ఆయన కార్డినల్స్కు సుపరిచితులు. బిషప్‌లను ఎంపిక చేయడం, పర్యవేక్షించడం వంటి కీలక బాధ్యతలు చూసేవారు.
ఆయన 2023 జనవరిలో ఆర్చ్‌బిషప్(క్రైస్తవుల ప్రధాన గురువు) అయ్యారు. ఆ తర్వాత కొద్ది నెలల్లోనే ఫ్రాన్సిస్ ఆయన్ను కార్డినల్‌ను చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
పోప్ లియో ఆలోచనలేంటి?
రోమన్ కేథలిక్ చర్చిలో తన పూర్వీకుల సంస్కరణలను లియో XIV కొనసాగిస్తారో, లేదో తెలుసుకోవడానికి ఆయన ప్రకటనలపై అందరి దృష్టి ఉంటుంది.
పేదలు, వలసదారులు, పర్యావరణంపై ఫ్రాన్సిస్ అభిప్రాయాలను ప్రవోస్ట్ కొనసాగిస్తారని విశ్వసిస్తున్నారు.
ప్రవోస్ట్ రూమ్మేట్ రెవరెండ్ జాన్ లిడాన్ బీబీసీతో మాట్లాడుతూ, “స్నేహపూర్వకమైన వ్యక్తి, ఎంత ఎదిగినా ఒదిగి ఉండే వ్యక్తి, పేదల పక్షపాతి” అని అభివర్ణించారు.
పోప్ ఎన్నికకు ముందు ఇటాలియన్ నెట్వర్క్ రాయ్‌తో తన వ్యక్తిగత నేపథ్యం గురించి చెబుతూ, తాను వలసదారుల కుటుంబంలో పెరిగానని రాబర్ట్ ప్రవోస్ట్ అన్నారు.
“నేను అమెరికాలో పుట్టాను. కానీ, మా పూర్వీకులు వలసొచ్చారు. ఫ్రెంచ్, స్పానిష్ వారు. నేను కేథలిక్ కుటుంబంలో పెరిగాను, నా తల్లిదండ్రులు నిత్యం ప్రార్థనల్లో నిమగ్నమై ఉండేవారు” అని ప్రవోస్ట్ చెప్పారు.
ప్రవోస్ట్ అమెరికాలో జన్మించినప్పటికీ, వాటికన్ ఆయన్ను అమెరికా నుంచి వచ్చిన రెండవ పోప్‌గా అభివర్ణించింది (ఫ్రాన్సిస్ అర్జెంటీనా నుంచి వచ్చారు).
పెరూలో ఉన్న సమయంలో చుట్టుముట్టిన లైంగిక వేధింపుల ఆరోపణల నుంచి ఆయన తప్పించుకోలేకపోయారు. అయితే ఆయన అనుచరులు మాత్రం ఈ ఆరోపణలను ఖండించారు.
లియో అనే పేరును ఎంచుకోవడం, సామాజిక సమస్యల పట్ల ప్రవోస్ నిబద్ధతను సూచిస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఫొటో సోర్స్, Reuters/Vatican Media
కొత్త పోప్‌ను ఎన్నుకునే రహస్య ప్రక్రియ ఏంటి?
పోప్ మరణించినప్పుడు (లేదా 2013లో పోప్ బెనెడిక్ట్ -16లా రాజీనామా చేయడం వంటి అరుదైన సందర్భంలో) కార్డినల్స్‌ను వాటికన్లో సమావేశానికి పిలుస్తారు.
ఆ తర్వాత కాంక్లేవ్ జరుగుతుంది.
పోప్ మరణం, ఆయన వారసుడి ఎన్నిక మధ్య కాలంలో కాథలిక్ చర్చి నిర్వహణను కార్డినల్స్ చూసుకుంటారు.
సిస్టీన్ చాపెల్ లోపల ఈ ఎన్నిక చాలా రహస్యంగా జరుగుతుంది. మైఖేలాంజెలో చిత్రంలో ఈ సిస్టీన్ చాపెల్ కనిపిస్తుంది.
విజేతను నిర్ణయించేంతవరకు కార్డినల్స్ తమకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేస్తారు.
ఈ ప్రక్రియకు చాలా రోజులు పట్టవచ్చు.
గత శతాబ్దాలలో ఓటింగ్ వారాలు లేదా నెలల తరబడి కొనసాగేది.
కొంతమంది కార్డినల్స్ కాంక్లేవ్ల సమయంలో మరణించారు కూడా.
కార్డినల్స్ బ్యాలెట్ పేపర్లను కాల్చడం వల్ల రోజుకు రెండుసార్లు వెలువడే పొగ ఎన్నికలు ఎలా జరుగుతున్నాయనే దాని గురించి ఒకే ఒక సూచన.
నలుపు రంగు పొగ వస్తే పోప్ ఎన్నిక ఇంకా పూర్తికాలేదని అర్ధం. తెల్లటి పొగ బయటకు వస్తే కొత్త పోప్ ఎన్నికైనట్టు అర్ధం.

ఫొటో సోర్స్, Reuters
కొత్త పోప్ ఎవరనే నిర్ణయాన్ని ఎలా తెలియజేస్తారు?
తెల్లటి పొగ బయటకు వచ్చిన తర్వాత సాధారణంగా గంటలోపు కొత్త పోప్ సెయింట్ పీటర్స్ స్క్వేర్ బాల్కనీలో కనిపిస్తారు.
కాంక్లేవ్‌లో పాల్గొన్న వారిలో సీనియర్ అయిన కార్డినల్ ”హబేమస్ పాపమ్” అనే లాటిన్ మాటతో కొత్త పోప్‌ను ఎన్నుకున్న నిర్ణయం చెప్తారు. దీని అర్థం ‘మనకు పోప్ ఉన్నారు’ అని.
తరువాత ఆయన కొత్త పోప్‌ను తాను ఎంచుకున్న పాపల్ పేరుతో పరిచయం చేస్తారు. అది ఆయన అసలు పేరు కావచ్చు..కాకపోవచ్చు.
ఉదాహరణకు, పోప్ ఫ్రాన్సిస్ అసలు పేరు జార్జ్ మారియో బెర్గోగ్లియో. కానీ సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అస్సిసి గౌరవార్థం తన పాపసీకి వేరే పేరును ఎంచుకున్నారు.
కార్డినల్స్, కాథలిక్ చర్చ్ సీనియర్ అఫీషి వాటికన్లో సమావేశానికి పిలుస్తారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)