SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, Getty Images
వైమానిక దళం సహాయం ఉంటే యుద్ధంలో గెలవొచ్చు, గెలవలేకపోవచ్చు. కానీ, వైమానిక దళం లేకపోతే యుద్ధంలో ఓటమి తథ్యం అని చెబుతుంటారు.
1971 నాటి యుద్ధంలో జైసల్మేర్ సెక్టార్‌లోకి యుద్ధ ట్యాంకులతో సహా దాదాపు 2000 మంది సైనికులను పంపించింది పాకిస్తాన్.
అకస్మాత్తుగా దాడి చేసి రామ్‌గఢ్, జైసల్మేర్లను స్వాధీనం చేసుకోవాలనేది పాకిస్తాన్ లక్ష్యం.
డిసెంబర్ 4న జైసల్మేర్‌లో బ్రేక్‌ఫాస్ట్ చేస్తామంటూ పాకిస్తాన్ వాళ్లు చెప్పుకుంటున్నారని గబ్బర్ సమీప గ్రామాల్లో డిసెంబర్ మొదట్లో వదంతులు వచ్చాయి.
డిసెంబర్ 3న భారత్‌లోని అనేక వైమానిక స్థావరాలపై దాడి చేసి ‘ఆపరేషన్ చెంఘిజ్ ఖాన్’ను మొదలుపెట్టింది పాకిస్తాన్.
1971 డిసెంబర్ 5ను భారత సైనిక చరిత్రలో ఒక ముఖ్యమైన తేదీగా చెప్పుకుంటారు.

డిసెంబర్ 4-5 మధ్య రాత్రి ఒక వెన్నెల రాత్రి. లోంగేవాలాలో పిల్లగాలులు వీస్తున్నాయి. లోంగేవాలా పోస్ట్ వద్ద 23 పంజాబ్‌కు చెందిన ఆల్ఫా కంపెనీ గస్తీ కాస్తోంది.
ఈ ప్రదేశం, జైసల్మేర్ నుంచి 120, రామ్‌గఢ్ నుంచి 55, అంతర్జాతీయ సరిహద్దు నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
లోంగేవాలా-రామ్‌గఢ్ రహదారిపై ఒక చోట హెలిప్యాడ్‌ను నిర్మించారు. దీన్నుంచి లోంగేవాలా పోస్ట్‌కు 700 మీటర్ల దూరం ఉంటుంది.
భారత సైన్యం వద్ద రెండు మీడియం మిషన్ గన్స్, 81 ఎంఎం మోర్టార్లు రెండు, యుద్ధ ట్యాంకుల దాడి నుంచి తప్పించుకునేందుకు భుజాల మీద నుంచి ప్రయోగించే రాకెట్ లాంచర్లు నాలుగు, ఒక రికాయిలెస్ గన్ ఉంది.
వారి వద్ద కొన్ని ల్యాండ్మైన్లు కూడా ఉన్నాయి. కానీ, వాటిని అప్పటికి ఇంకా పాతలేదు.

ఫొటో సోర్స్, IMR media publication
యుద్ధ ట్యాంకుల శబ్దాలు విన్న గస్తీ దళం
లోంగేవాలా పోస్ట్ ఇన్చార్జి మేజర్ కుల్దీప్ సింగ్ చాంద్‌పురి పెట్రోలింగ్ కోసం కెప్టెన్ ధరమ్వీర్ భాన్ నేతృత్వంలో మరికొంత మంది సైనికులను పంపించారు.
ఎయిర్ మార్షల్ భరత్ కుమార్‌కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ధరమ్వీర్ ఆ రాత్రి ఎలా ఉందో వివరించారు.
”ఆ రోజు రాత్రి పూట ఉన్న ప్రశాంత వాతావరణం అకస్మాత్తుగా ట్యాంకు ఇంజిన్ల నుంచి పుట్టిన శబ్దాలు, అవి ముందుకు వస్తున్న కొద్దీ గర్జన లాంటి శబ్దాలుగా మారిపోయింది. మొదట్లో ఈ సౌండ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో మాకు అర్థం కాలేదు.
మా ప్లాటూన్ మొత్తం ఆ వాటిపైనే పూర్తిగా దృష్టి కేంద్రీకరించింది. రాన్రాను అవి పెరిగేసరికి నేను వైర్లెస్ వ్యవస్థ ద్వారా కంపెనీ కమాండర్ మేజర్ కుల్దీప్ చాంద్పురిని సంప్రదించాను. ఏదైనా వాహనం బురదలో చిక్కుకుందేమో అని ఆయన నాకు చెప్పారు. భయపడాల్సిందేమీ లేదు, వెళ్లి పడుకోండి అని అన్నారు” అని ధరమ్వీర్ గుర్తు చేసుకున్నారు.

ఫొటో సోర్స్, IMR media publication
నెమ్మదిగా సమీపించిన పాకిస్తాన్ యుద్ధ ట్యాంకులు
పాకిస్తాన్ యుద్ధ ట్యాంకులు రాత్రి 12 గంటలు దాటిన తర్వాత ధరమ్‌వీర్‌కు కనిపించాయి. అవి చాలా నెమ్మదిగా ముందుకు కదులుతున్నాయి. వాటి లైట్లు ఆర్పేసి ఉన్నాయి. అవి రోడ్డుపై కాకుండా పక్కకు ఉన్న ఇసుకలో నడుస్తున్నందున నెమ్మదిగా కదులుతున్నాయి.
అప్పుడు ధరమ్వీర్, కంపెనీ కమాండర్‌ను అప్రమత్తం చేయాలని ప్రయత్నించారు. కానీ, ఆయనను సంప్రదించలేకపోయారు.
తెల్లవారుజామున 4 గంటలకు ఆయన బెటాలియన్ హెడ్‌క్వార్టర్స్‌తో కాంటాక్ట్‌లోకి వచ్చారు. పాకిస్తాన్ యుద్ధ ట్యాంకులు, భారత్‌లోకి ప్రవేశించి లోంగేవాలా వైపు కదులుతున్నాయని సమాచారం ఇచ్చారు.
మేజర్ చాంద్‌పురి, బెటాలియన్ హెడ్‌క్వార్టర్స్‌కు ఫోన్ చేసి మరింత బలగాలు, ఆయుధాలు కావాలని కోరారు.
12:30 గంటల ప్రాంతంలో పాకిస్తాన్ యుద్ధ ట్యాంకులు కాల్పులు మొదలుపెట్టాయి. ముళ్ల తీగలు మొహరించిన ప్రాంతం వద్ద అవి ఆగిపోయాయి. అక్కడ ల్యాండ్మైన్లు ఉన్నాయని అవి భావించాయి.
”ద 1971 వార్ యాన్ ఇలస్ట్రేటెడ్ హిస్టరీ” అనే పుస్తకంలో డాక్టర్ యూపీ థపలియాల్ దీని గురించి ప్రస్తావించారు.
”దీన్నే అదునుగా చేసుకొని భారత సైన్యం మరిన్ని బలగాలను సమీకరించుకొని పటిష్టంగా మారింది. సూర్యోదయం కాగానే పాకిస్తాన్ సైనికులు, భారత పోస్ట్‌పై దాడికి పాల్పడ్డారు” అని పుస్తకంలో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Bharat-Rakshak.com
ఎయిర్‌ఫోర్స్ సహాయం తీసుకోవాలని నిర్ణయం
ఈ ఆకస్మిక దాడి విషయం తెలియగానే జనరల్ ఆర్ఎఫ్ ఖంభాతా ఆశ్చర్యపోయారు. పరిస్థితి చాలా తీవ్రంగా ఉందని వెంటనే గ్రహించిన ఆయన, దీన్నుంచి బయటపడటానికి సరిపడినంత వనరులు లేవని గుర్తించారు.
ఆయన వాయుసేనపైనే నమ్మకం ఉంచారు. రాత్రి దాదాపు 2 గంటల సమయంలో జైసల్మేర్ వైమానిక స్థావరం వింగ్ కమాండర్ ఎంఎస్ బావాతో వైర్లెస్ రేడియో ద్వారా సంప్రదించారు.
”జైసల్మేర్ వైమానిక స్థావరంలోని హంటర్ విమానాలు రాత్రిపూట ఎగరలేవు. అందుకే వారు తెల్లవారేవరకు వేచి చూడాల్సి వచ్చింది” అని తన పుస్తకం ‘ద ఎపిక్ బ్యాటిల్ ఆఫ్ లోంగేవాలా’లో ఎయిర్ మార్షల్ భరత్ కుమార్ పేర్కొన్నారు.
”బేస్ కమాండర్, మేజర్ జనరల్ ఖంభాతాతో మాట్లాడారు. పొద్దున తొలి కిరణాలు ప్రసరించగానే హంటర్ విమానాలు పని మొదలుపెట్టి పాకిస్తాన్ యుద్ధ ట్యాంకులను గుర్తించి, వాటిని ధ్వంసం చేస్తాయని కమాండర్ భరోసా ఇచ్చారు. ఉదయం 4 గంటలకు కమాండర్ బావా, స్క్వాడ్రన్ లీడర్ ఆర్ఎన్ బాలీకి బ్రీఫింగ్ ఇచ్చారు” అని ఆ పుస్తకంలో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, IMR media publication
రికాయిలెస్ గన్లతో ట్యాంకులపై కాల్పులు
అంతలో ఉదయం 5:15 గంటలకు మేజర్ చాంద్‌పురి, బ్రిగేడియర్ రామ్‌దాస్‌ను సంప్రదించారు.
”పాకిస్తాన్ లీడ్ ట్యాంక్, లోంగేవాలా పోస్టుకు నైరుతి దిశన గోటారూ రోడ్డుపై కిలో మీటర్ దూరంలో ఉన్నప్పుడు చాంద్‌పురి తన రికాయిలెస్ తుపాకీతో దానిపై కాల్పులు జరిపారు. కానీ, గురి కుదరలేదు. పాకిస్తాన్ ట్యాంకులు ప్రతిదాడులు చేసి పోస్టును పూర్తిగా ధ్వంసం చేశాయి. అక్కడ పక్కన ఉన్న ఒక ఆలయం మాత్రమే మిగిలిపోయింది. ఒంటెల కోసం ఉంచిన గ్రాసం మంటల్లో తగలబడింది” అని ఆనాటి పరిస్థితి గురించి రామ్‌దాస్ వివరించారు.
పాకిస్తాన్ యుద్ధ ట్యాంకర్లకు సరిహద్దు నుంచి 16 కిలోమీటర్ల దూరం రావడానికి 6 గంటల సమయం పట్టింది.

ఫొటో సోర్స్, IMR media publication
హంటర్ విమానాల దాడులు
లోంగేవాలా పోస్టు మీద మరోసారి దాడికి పాకిస్తాన్ యుద్ధ ట్యాంకులు సన్నద్ధమవుతున్నప్పుడు జైసల్మేర్ నుంచి వచ్చిన భారత వైమానిక దళానికి చెందిన హంటర్ విమానం అక్కడికి చేరుకుంది.
ఆ సమయానికి పాకిస్తాన్ లీడ్ ట్యాంక్, పోస్టుకు కేవలం కిలోమీటరు దూరంలో ఉంది. హంటర్ విమానాలను చూసిన పాకిస్తాన్ యుద్ధ ట్యాంకులు గుండ్రంగా తిరుగుతూ పొగను వెదజల్లడం మొదలుపెట్టాయి.
స్క్వాడ్రన్ లీడర్ డీకే దాస్, ఫ్లైట్ లెఫ్టినెంట్ రమేశ్ గొసాయి హంటర్ విమానాన్ని నడుపుతున్నారు.
డీకే దాస్ తర్వాత ఒక ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి మాట్లాడారు
”లోంగేవాలాకు మేం చేరుకున్నప్పుడు అక్కడ కనిపించిన దృశ్యాన్ని నేను ఎప్పటికీ మర్చిపోను. నేల మీద ఉన్న శత్రు ట్యాంకులు చిన్న అగ్గిపెట్టెల్లా కనిపించాయి. అందులో కొన్ని ఒకచోట ఉండగా, మరికొన్ని కదులుతున్నాయి. వాటి నుంచి మాపైకి ట్రేసర్ ఫైర్ రావడం నేను చూశాను.
అప్పుడు యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ రేంజ్ నుంచి తప్పించుకోవడానికి విమానం ఎత్తును పెంచాను. తర్వాత ఒక్కసారిగా డైవ్ చేసి , దిశను మార్చుకొని దాడి చేయాలని అనుకున్నా.
నేను ప్రయోగించిన రాకెట్, యుద్ధ ట్యాంకును పేల్చిన వెంటనే మిగతా ట్యాంకులు అన్ని ముందుకు కదల్లేదు. నా తర్వాత, రమేశ్ కూడా ఇలాగే చేసి ఒక యుద్ధ ట్యాంకును ధ్వంసం చేశారు” అని డీకే దాస్ వివరించారు.

ఫొటో సోర్స్, Natraj Publications
హంటర్ విమానాల దాడులు
ఆ తర్వాత దాస్, రమేశ్ మరో రెండుసార్లు ట్యాంకులపై దాడి చేశారు. ఈ దాడులను తప్పించుకోవడానికి పాకిస్తాన్ యుద్ధ ట్యాంకులు వలయాకారంలో తిరగడం మొదలుపెట్టాయి. దీనివల్ల దట్టంగా ధూళి చెలరేగింది. ఫలితంగా యుద్ధ ట్యాంకులకు గురి పెట్టడం భారత వైమానిక దళానికి కష్టమైంది.
రాకెట్లు అయిపోయిన తర్వాత, స్క్వాడ్రన్ లీడర్ దాస్ 30ఎంఎం ఆడమ్ గన్‌తో ఒక ట్యాంకుపై ఫైరింగ్ చేశారు. దానికి మంటలు అంటుకున్నాయి. ఆ తర్వాత, భారత వైమానిక దళం సూర్యాస్తమయం వరకు శత్రు ట్యాంకులపై దాడి చేస్తూనే ఉన్నాయి.
మధ్యాహ్నం వరకు భారత వైమానిక దళం 17 ట్యాంకులను, 23 ఇతర వాహనాలను ధ్వంసం చేసింది.
”ఉదయం 7 గంటల నుంచి భారత వైమానిక దళానికి చెందిన నాలుగు హంటర్ విమానాలు రోజంతా మాపై దాడులు చేస్తూనే ఉన్నాయి. రాత్రి కాగానే వైమానిక దాడులు ఆగిపోయాయి. అప్పుడు పాకిస్తాన్ ముందు రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి సరిహద్దుకు తిరిగి వెళ్లిపోవడం, రెండు బలాన్ని కూడగట్టుకొని మళ్లీ మా లక్ష్యమైన జైసల్మేర్, రామ్‌గఢ్‌ను స్వాధీనం చేసుకోవడం” అని తన పుస్తకం ‘ద వే ఇట్ ఈజ్, ఇన్సైడ్ ద పాకిస్తానీ ఆర్మీ”లో పాకిస్తాన్ 18 కేవల్రీ రెజిమెంట్ కమాండర్ బ్రిగేడియర్ జెడ్ఏ ఖాన్ రాశారు.

ఫొటో సోర్స్, IMR media publication
ఓవర్ హీటింగ్, ఎయిర్ కవర్ లేకపోవడం వల్ల…
వాళ్లు రామ్‌గఢ్, జైసల్మేర్లను స్వాధీనం చేసుకోవాలని ఆలోచనను వదులుకున్నట్లుగా అనిపించింది. అదే రాత్రి 22 కేవల్రీకి చెందిన పాకిస్తాన్ సైనికులు మసిత్వారీ బీత్, గబ్బర్ ప్రాంతాలకు తిరిగి వెళ్లారు. కానీ, లోంగేవాలాను స్వాధీనం చేసుకోవడమే తమ లక్ష్యంగా పెట్టుకున్నారు.
బ్రిగేడియర్ జహాంజేబ్ అరబ్ నేతృత్వంలోని ఒక పాకిస్తాన్ బ్రిగేడ్ మరుసటి రోజు ఉదయమే లోంగేవాలాపై మళ్లీ దాడి చేయాలని అనుకుంది. లోంగేవాలా-జైసల్మేర్ రోడ్డు వెంట ముందుకు సాగి గొటారును స్వాధీనం చేసుకుంటామని 28 బలూచ్‌కు కూడా సమాచారం ఇచ్చారు.
సాయంత్రానికి లోంగేవాలా యుద్ధం ముగిసింది. ఈ యుద్ధంలో పాకిస్తాన్ సైనికుల ఓటమికి కారణం ఎడారిలో వారి షెర్మన్, టి-59 చైనా ట్యాంకులు చాలా నెమ్మదిగా ముందుకు కదలడం.

ఫొటో సోర్స్, IMR media publication
అతిగా వేడెక్కడం వల్ల చాలా యుద్ధ ట్యాంకుల ఇంజిన్లు పని చేయడం మానేయడంతో పాకిస్తాన్ సైనికులు అక్కడి నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది. ఎడారిలో వారి యుద్ధ ట్యాంకులను కవర్ చేసే ప్రత్యామ్నాయాలు వారి వద్ద లేవు.
రెండోది, అంత పెద్ద ఆపరేషన్ జరుగుతున్నప్పుడు పాకిస్తాన్ వద్ద ఎలాంటి ఎయిర్ కవర్ కూడా లేదు. అందుకే భారత వైమానిక దళం దాడికి దిగినప్పుడు వారు కదల్లేని బాతుల్లా అయిపోయారు.
ఈ యుద్ధంలో పాకిస్తాన్‌కు చెందిన 45 యుద్ధ ట్యాంకుల్లో 36 ధ్వంసం అయ్యాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత, ఒక యుద్ధంలో ఏ దేశం కూడా ఈ స్థాయిలో ట్యాంకులను నష్టపోలేదు.
”మా ట్యాంక్ కమాండర్లు అయిదుగురు జామ్ అయిన మెషీన్ గన్లను తెరవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు చనిపోయారు. దీని తర్వాత మెషీన్ గన్లను డీజిల్‌తో కడిగి బాగు చేశారు. ఇదే కాకుండా, రెండో ప్రపంచ యుద్ధంలో వాడిన 12.7ఎంఎం యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ గన్లు, ఆధునిక యుద్ధ విమానాలను ఎదుర్కొనే సామర్థ్యాన్ని కోల్పోయాయి” అని బ్రిగేడియర్ జెడ్ఏ ఖాన్ రాశారు.

ఫొటో సోర్స్, IMR media publication
ఈ యుద్ధం ఫలితంగా భారత్ తన మొత్తం సైనిక బలాన్ని తూర్పు సెక్టార్లో మోహరించింది.
పాకిస్తాన్‌కు చెందిన చాలా యుద్ధ ట్యాంకులను ధ్వంసం చేసినట్లుగానే కాకుండా, ఈ యుద్ధం పాకిస్తాన్ ఆర్మీ నైతిక స్థైర్యాన్ని తీవ్రంగా దెబ్బతీసిన యుద్ధంగా గుర్తుంచుకుంటారు.
ఈ యుద్ధంలో చూపిన తెగువకు భారత కంపెనీ కమాండర్ కుల్దీప్ సింగ్ చాంద్పురీని మహావీర్ చక్రతో భారత ప్రభుత్వం గౌరవించింది.
మరోవైపు పాకిస్తాన్ డివిజనల్ కమాండర్ మేజర్ జనరల్ బీఎం ముస్తఫాను ఆ పదవి నుంచి తప్పించారు.

ఫొటో సోర్స్, JP Dutta Production
‘బోర్డర్ సినిమాలో వైమానిక దళం పాత్రను సరిగ్గా చిత్రీకరించ లేదు’
ఈ యుద్ధం గెలుపులో భారత వైమానిక దళం చాలా కీలక పాత్రను పోషించింది.
దీని నేపథ్యంలో తీసిన ‘బోర్డర్’ సినిమా 1997లో విడుదలైంది. ఆ సినిమాలో యుద్ధం గెలుపులో ఆర్మీ కీలక పాత్ర పోషించినట్లుగా, వైమానిక దళం సహాయక పాత్ర పోషించినట్లుగా చూపించారు.
”బోర్డర్ సినిమాలో లోంగేవాలా యుద్ధాన్ని ఎలా చూపించినా, నిజానికి లోంగేవాలా యుద్ధాన్ని భారత వైమానిక దళం చరిత్రలో ఒక మైలురాయిగా పరిగణిస్తారు. ఈ యుద్ధంలో భారత వైమానిక దళానికి చెందిన నాలుగు హంటర్ విమానాలు, దాదాపు 2000 మంది పాకిస్తాన్ సైనికులను, 45 యుద్ధ ట్యాంకులను లొంగిపోయేలా చేశాయి” అని ఎయిర్ మార్షల్ భరత్ కుమార్ రాశారు.
యుద్ధం జరిగిన ఆరేళ్ల తర్వాత అక్కడ ఒక విజయ స్తూపాన్ని నిర్మించారు. యుద్ధ కాలంలో రక్షణ మంత్రిగా వ్యవహరించిన జగ్జీవన్ రామ్ ఈ స్తూపాన్ని ఆవిష్కరించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)