SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, UGC
విజయనగరం జిల్లాలో కారులో ఇరుక్కుపోయి ఊపిరాడక నలుగురు చిన్నారులు మరణించారు. ఈ ఘటన ఆదివారం జరిగింది.
ఆదివారం ఉదయం విజయనగరం రూరల్ మండలంలోని ద్వారపూడి గ్రామానికి చెందిన నలుగురు చిన్నారులు ఆడుకునేందుకు బయటకు వెళ్లారు.
మధ్యాహ్నం వరకు రాకపోయేసరికి తల్లిదండ్రుల్లో ఆందోళనతో వెదకడం ప్రారంభించారు. అయితే సాయంత్రానికి…వారు కారులో చనిపోయి ఉన్నట్లు గుర్తించారు.
చనిపోయిన నలుగురు చిన్నారుల వయసు ఎనిమిదేళ్ల లోపే.


ఫొటో సోర్స్, UGC
కారులోకి పిల్లలు ఎలా వెళ్లారు?
ద్వారపూడికి చెందిన చిన్నారులు కంది మనేశ్వరి (6), బూర్ల చారులత (7), బూర్ల జాస్రిత (8), పంగి ఉదయ్ (7) ఉదయం వేళ ఆడుకుంటూ గ్రామంలోని మహిళా మండలి కార్యాలయం వద్ద పార్క్ చేసి ఉన్న ఒక కారు వద్దకు వెళ్లారు.
దాని డోర్ లాక్ చేసి లేకపోవడంతో…అందులోకి ఎక్కారు. ఆ తర్వాత ఆటోమేటిక్ డోర్‌లాక్ పడిపోయింది. ఆ తర్వాత ఆ పిల్లలు కారు డోర్ తీసేందుకు ప్రయత్నించినా డోర్ ఓపెన్ కాకపోవడంతో అందులోనే చిక్కుకుపోయి, ఊపిరాడక ఆ చిన్నారులు మరణించి ఉంటారని పోలీసులు చెప్పారు.
ద్వారపూడి ఘటనలో కారులోని చిన్నారులను ఎవరు గుర్తించకపోవడంతో వారు ప్రాణాలు కోల్పోయారని స్పష్టమైంది. కారు డోర్లు లాక్‌పడి…వాటిని తీయడం తెలియకపోవడంతో చిన్నారులు మరణిస్తున్న ఘటనలు ఇటీవల కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో నమోదయ్యాయి.
పిల్లలు ఆడుకుంటూ డోర్ వేయని కార్ల లోపలికి వెళ్లిన తర్వాత లాక్ పడిపోవడంతో ఊపిరాడక మరణిస్తున్న సంఘటనలు దేశవ్యాప్తంగా కూడా జరుగుతూనే ఉన్నాయి.

ఫొటో సోర్స్, UGC
లాక్ చేసిన కారు లోపల ఉంటే ఏమవుతుందంటే…
నిలిపి ఉంచిన కార్లలోకి ఎక్కే చిన్నారులు…డోర్ లాక్ అయిపోతే ఎలా బయటపడాలనే విషయాలపై ఎలాంటి అవగాహన కల్పించాలి, అసలు కార్లలో చిన్నారుల కోసం ఉండే లాకింగ్ సిస్టమ్ (చైల్డ్ లాక్) వంటి ఫెసిలిటీలను ఎలా ఉపయోగించుకోవాలి? తల్లిదండ్రులు ఎలాంటి అవగాహన పొందాలి, ఈ విషయాలను పిల్లలకు ఎలా చెప్పాలనే విషయాలపై ఆటోమొబైల్ ఇంజనీరుగా 17 ఏళ్ల అనుభవమున్న సత్యగోపాల్‌తో బీబీసీ మాట్లాడింది.
సత్యగోపాల్ వెహికిల్ ఇన్సూరెన్స్ ఇన్వెస్టిగేటర్‌గా కూడా పని చేస్తున్నారు. ఆయన చెప్పిన ముఖ్యమైన విషయాలు ఇవి.
“కారుడోర్లు, విండోస్ క్లోజ్ చేసి లాక్ చేసినప్పుడు, గాలి బయటకు లోపలికి మారే అవకాశం ఉండదు. మనం ఆక్సిజన్ పీల్చుకొని కార్బన్ డయాక్సైడ్ వదులుతాం. కారు డోర్లు, విండోస్ లాకై ఉన్నప్పుడు అందులో ఎవరైనా ఉంటే.. క్రమంగా కార్బన్ డయాక్సైడ్ పెరుగుతూ ఉంటుంది. ఆక్సిజన్ తగ్గిపోతుంది. దీనివల్ల కారు లోపల ఉన్నవారికి తల తిరగడం మొదలవుతుంది. ఇది క్రమంగా పెరుగుతూ…ఊపిరి ఆడక…లోపలున్న వారు మరణిస్తారు” అని సత్య గోపాల్ వివరించారు.
కార్ ఉన్నవారు పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన సూత్రాలను ఆయన వివరించారు.
- వాహనం ఎక్కడ పార్క్ చేసినా తప్పకుండా లాక్ చేయాలి.
- కారు లేదా ఇతర వాహనాల్లో పిల్లలను ఒంటరిగా వదిలి వెళ్లకూడదు.
- వాహనాన్ని లాక్ చేసే ముందు వాహనంలో ఎవరైనా ఉండిపోయారా అనేది చెక్ చేసుకోవాలి.
- పిల్లలకు వెహికల్ అన్‌లాక్ చేయడం నేర్పించాలి. కానీ వాహనం తాళాలను పిల్లలకు అందుబాటులో ఉంచకూడదు.
- పిల్లలు కనబడకపోతే సమీప వాహనాల్లో కచ్చితంగా చెక్ చేయాలి.
- కార్లు, ఇతర వాహనాలు ఆడుకునే స్థలాలు కాదని, ఎవరూలేనప్పుడు వాటిలోకి వెళ్లరాదని తెలియచేయాలి.
‘కార్లకు చైల్డ్ లాక్ ఏర్పాటు చేసుకోవాలి’
చైల్డ్ లాక్ చెక్ సిస్టం, ఇది కారులో పిల్లల భద్రత కోసం రూపొందించిన ఒక ముఖ్యమైన సేఫ్టీ ఫీచర్. ఇది ఇప్పుడు అన్ని కార్లకు ఉంటోంది. దీని వలన లోపలెవరైనా ఉండిపోతే…బయట నుంచి కారు డోర్ ఓపెన్ చేయవచ్చు.
ముఖ్యంగా చైల్డ్ లాక్ ఎక్కడ ఉంటుందో తెలుసుకోవాలి. సాధారణంగా వెనుక డోర్ ప్రక్క భాగంలో, అంటే డోర్ తెరిచినప్పుడు డోర్ అడుగు భాగం వద్ద ఉంటుంది. అక్కడ ఒక చిన్న లివర్ లేదా స్విచ్ ఉంటుంది. దీనిపై చిన్న చైల్డ్ సింబల్ లేదా Child Lock అని రాసి ఉంటుంది.
చైల్డ్ లాక్ ఎలా వాడాలి?
ఆన్/ఆఫ్ అని ఉంటాయి. దీనిలో ఒక దానిని మనం ఎంచుకోవాలి. ఆన్ లేదా లాక్ అనే ఆప్షన్ ఎంచుకుంటే…లోపలి నుంచి డోర్ తెరవలేరు. (ఐదేళ్లు లోపు పిల్లల కోసం). ఆఫ్ లేదా అన్‌లాక్ ఆప్షన్ ఎంచుకుంటే…లోపలి నుంచి డోర్ ఓపెన్ చేయచ్చు. (ఐదేళ్లుదాటి అవగాహన ఉన్న పిల్లల కోసం)
మన ఇంట్లోని పిల్లల వయసుని బట్టి…వారే కారు లోపల నుంచి ఓపెన్ చేసుకోగలిగితే…. లాక్ లేదా ఆఫ్, అలా చేసేంత వయసు లేకపోతే లాక్ లేదా ఆన్ బటన్ ఎంచుకోవాలి. దానిని పిల్లలకు అర్థమయ్యేటట్లు చెప్పాలి.
పిల్లలకే కాదు…కార్లు, డోర్ లాకింగ్ సిస్టంపై అవగాహన లేని వారికి ఎవరికైనా ఈ విషయాలు చెప్పాలి.
పిల్లలతో ప్రయాణాలు..ఏ జాగ్రత్తలు తీసుకోవాలంటే…
పిల్లలు లోపల ఉన్నప్పుడు కారుని లాక్ చేయవద్దు.
కీ ఎప్పుడూ మీ దగ్గర ఉండేలా చూసుకోండి.
బయట నుంచి ఓపెన్ అవుతుందా, లేదా…ముందే టెస్ట్ చేసుకోవాలి. ముఖ్యంగా చైల్డ్ లాక్ ఆన్ చేసి ఉన్నప్పుడు.
అత్యవసర సమయాల్లో కారు లాకింగ్, అన్ లాకింగ్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలు కారు మాన్యువల్ లో ఉంటాయి. పూర్తిగా చదవాలి.

ఫొటో సోర్స్, UGC
‘డోర్ లాక్ చేయకపోవడం నైతిక నేరమే’
పార్కింగ్, కారు డోర్లు లాకింగ్ విషయాలపై విశాఖ ట్రాఫిక్ అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ప్రవీణ్ కుమార్‌తో బీబీసీ మాట్లాడింది.
“కారు పార్క్ చేస్తున్నామంటే కచ్చితంగా లాక్ చేయాలి. అదే సమయంలో కారులో పిల్లలు, లేదా ఇతర విలువైన వస్తువులు లేనట్లు నిర్ధరించుకోవాలి. కార్ లాక్ చేయకపోవడం చట్టప్రకారం నేరం కాకపోయినా…ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు నైతికంగా చూస్తే నేరమే” అని ఏడీసీపీ ప్రవీణ్ కుమార్ బీబీసీతో చెప్పారు.
‘‘కేవలం లాకింగ్ సిస్టమే కాదు…పార్కింగ్ సమయంలో కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. చాలా సార్లు ఎక్కడ స్థలముంటే అక్కడ పార్కు చేస్తారు. కానీ పల్లంలో పార్కు చేసిన వాహనాలు అనుకోని విధంగా కదులుతాయి. అవి ప్రమాదాలకు ఆస్కారం కల్పిస్తాయి. అలాగే సందుల్లో,చిన్న చిన్న రోడ్లపై అడ్డదిడ్డంగా పార్కు చేస్తారు. ఇవన్నీ ఒక్కోసారి ఊహించని ప్రమాదాలకు దారి తీస్తాయి.’’
ఇంకా వాహనాలు, పిల్లల విషయంలో ఏం చేయాలో ఆయన కొన్ని జాగ్రత్తలు చెప్పారు ఏడీసీపీ.
పిల్లల కోసం ఏం చేయాలంటే….
1. డూప్లికేట్ కీ తీసుకోండి: కారుకి రెండు కీలు ఇస్తారు. కానీ ఒక కీ పోయినప్పుడు, రెండోదానిని వాడుతూ దానితోనే మెయింటైన్ చేయకండి. డూప్లికేట్ కీని తయారు చేసి ఇంట్లో పెట్టుకోండి.
2. పిల్లలకి బేసిక్స్ చెప్పండి: కారు లాకింగ్, అన్ లాకింగ్, హారన్ ప్రెస్సింగ్ వంటి విషయాలపై పిల్లలకు ప్రాథమిక విషయాలను చెప్పండి.
3. ఇప్పుడు కొత్తగా వస్తున్న కార్లను ఫోన్లోని యాప్ ద్వారా అన్ లాక్ చేయవచ్చు. దీనిని యాక్టివేట్ చేసి ఉంచుకోవాలి.
వేసవిలో ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి: సత్యగోపాల్
- వేసవిలో కారు లోపల ఉష్ణోగ్రతలు చాలా వేగంగా పెరిగిపోతాయి. వేసవిలో నిలిపి ఉన్న కార్లలో ఎవరైనా ఉంటే వారికి ముఖ్యంగా పిల్లలు, వృద్ధులకు శ్వాసపరమైన ఇబ్బందులు రావచ్చు.
- ప్రయాణంలో ఎక్కడైనా ఆగినప్పుడు ఎండగా ఉందని…పిల్లలను కార్లలోనే కొందరు తల్లిదండ్రులు వదిలేస్తారు. ఇది మంచి పద్దతి కాదు. మీతో పాటు పిల్లలను తీసుకెళ్లండి, లేదంటే ఎవరైనా పెద్దవాళ్లను కూడా కారులో ఉండేలా చూడండి.
- శుభకార్యాలు, ఇతర పనుల నిమిత్తం వచ్చే తల్లిదండ్రులు బంధువులతో బిజీగా ఉండటం వల్ల కార్లు, ఇతర వాహనాల్లో వదిలేసిన వాళ్ల గురించి ధ్యాస ఉండదు. ఫలితంగా విషాదాలను చూడాల్సి రావొచ్చు. జాగ్రత్తగా ఉండాలి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)