SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, Getty Images
ఎయిర్ ఫోర్స్ వన్ కోసం ఖతార్ బహుమతిగా ఇవ్వాలనుకున్న విమానాన్ని తీసుకునేందుకు అమెరికా అంగీకరించింది.
ఇలా ఒక దేశం నుంచి విమానాన్ని బహుమతిగా తీసుకోవడంపై అధ్యక్షుడు ట్రంప్ మీద ఆయన మద్దతుదారులు సహా పలువురు విమర్శలు చేశారు.
అయితే, “అన్ని నియమాలు, నిబంధనలకు అనుగుణంగానే ఖతార్ నుంచి బోయింగ్ 747ను తీసుకోవడానికి ప్రభుత్వం అంగీకరించింది” అని పెంటగాన్ అధికార ప్రతినిధి సీన్ పార్నెల్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
అధ్యక్షుడి అధికారిక విమాన రవాణా వ్యవస్థ ‘ఎయిర్ ఫోర్స్ వన్’లో ఈ విమానం భాగమవుతుంది. అంతకు ముందు దీనికి కొన్ని మార్పులు చేర్పులు చేయాల్సి ఉంటుంది.
వారం కిందట ఈ విమానాన్ని స్వీకరించడం గురించి చేసిన ప్రకటన వివాదానికి దారితీసింది. కానీ ఈ బహుమతి చట్టబద్ధమైనదేనని వైట్ హౌస్ స్పష్టం చేస్తోంది.
‘‘ఈ విమానం ఖతార్ రాజకుటుంబం నుంచి వచ్చిన బహుమతి. దీని విలువ 400 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 3429 కోట్లు )ఉంటుందని అంచనా. డోనాల్డ్ ట్రంప్ పదవీకాలం ముగింపునాటికి ఈ కొత్త విమానాన్ని ట్రంప్ ప్రెసిడెన్షియల్ లైబ్రరీకి అందిస్తాం’’ అని వైట్‌హౌస్ తెలిపింది.
అధ్యక్షుడు ప్రయాణించే ఈ విమానానికి అణుబాంబు పేలుళ్ల నుంచి వచ్చే ఎలక్ట్రో మ్యాగ్నటిక్ ఎఫెక్ట్‌లను తట్టుకునే సామర్థ్యంతోపాటు, ప్రయాణం మధ్యలోనే ఇంధనం నింపుకునే సౌకర్యం, ఇంకా అదనపు భద్రతా వ్యవస్థలను అప్‌గ్రేడ్ చేయడానికి కొన్ని సంవత్సరాల సమయం పట్టొచ్చు.
సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్లో సీనియర్ సలహాదారు మార్క్ కాన్సియన్ మాట్లాడుతూ, అటువంటి కొత్త ఫీచర్లను ఏర్పాటు చేసేందుకు ఖర్చు సుమారు 1 బిలియన్ డాలర్ల ( సుమారు రూ.8572 కోట్లు) ఖర్చు కావొచ్చని అన్నారు.
‘‘వాళ్లు మాకు గిఫ్ట్ ఇస్తున్నారు. ఆ గిఫ్ట్‌ను తిరస్కరించడం మూర్ఖత్వం’’ అని వారం కిందట ఈ ట్రాన్స్ఫర్ను సమర్థిస్తూ డోనల్డ్ ట్రంప్ అన్నారు.
అమెరికా రాజ్యాంగంలో ఎమాల్యుమెంట్ క్లాజ్ అనే ఒక నిబంధన ఉంది. దీని ప్రకారం కాంగ్రెస్ అనుమతి లేకుండా విదేశీ ప్రభుత్వాల నుంచి అమెరికా ప్రభుత్వ అధికారులకు బహుమతులు తీసుకోవడం నిషేధం.
ఈ విమానాన్ని తీసుకోవడానికి కాంగ్రెస్ నుంచి ఆమోదం లభించలేదు.
ఈ ప్లేన్‌ను తనకు కాకుండా అమెరికా రక్షణ శాఖకు బహుమతిగా ఇస్తున్నందున అది చట్టబద్ధమైనదేనని ట్రంప్ వాదించారు. పదవీ విరమణ తర్వాత దానిని ఉపయోగించనని కూడా ఆయన చెప్పారు.
ప్రస్తుత ఎయిర్ ఫోర్స్ వన్ విమానాల సముదాయంలో 1990 నుంచి వాడుకలో ఉన్న రెండు 747-200 జెట్లతోపాటు చిన్న757 జెట్లు అనేకం ఉన్నాయి.


ఫొటో సోర్స్, Getty Images
వైట్‌హౌస్‌కు రెండు 747-8 విమానాలను అందించడానికి ఒప్పందం కుదుర్చుకున్న విమానాల తయారీ సంస్థ బోయింగ్‌పై ట్రంప్ అసంతృప్తిని వ్యక్తం చేశారు.
ట్రంప్ మొదటి పదవీకాలంలో ఈ విమానాల కోసం ఆయన బృందం చర్చలు జరిపింది. కానీ, అప్పటికే పలుమార్లు ఆలస్యమైంది. అవి మరో రెండు మూడేళ్ల వరకు అందుబాటులోకి రావని బోయింగ్ స్పష్టం చేసింది.
ట్రంప్ తన రెండో పదవీకాలం ప్రారంభమైన కొన్ని వారాల తర్వాత, తన మార్-ఎ-లాగో రిసార్ట్ సమీపంలోని పామ్ బీచ్‌లో ఉన్న ఖతార్ విమానాన్ని రహస్యంగా సందర్శించారు.
“అమెరికా రక్షణ శాఖ 40 ఏళ్ల ఎయిర్ ఫోర్స్ వన్ స్థానంలో తాత్కాలికంగా, పారదర్శక లావాదేవీలో 747 విమానాన్ని బహుమతిగా అందుకుంటోంది” అని ట్రంప్ తన ట్రూత్ సోషల్ అకౌంట్లో పోస్ట్ చేశారు.
అయితే ఖతార్ ప్రధాన మంత్రి షేక్ మొహమ్మద్ మాట్లాడుతూ ఈ బదిలీ ‘‘ప్రభుత్వం నుంచి ప్రభుత్వానికి మధ్య జరిగిన లావాదేవీ’’ అని అన్నారు.
“ఈ లావాదేవీ ఇరుదేశాల వ్యక్తుల మధ్య జరిగింది కాదు. రెండు రక్షణ శాఖల మధ్య జరిగేది” అని ఆయన అన్నారు.
అయితే, ఇవన్నీ కూడా విమానం విషయంలో ట్రంప్ మీద వస్తున్న విమర్శలను ఆపలేకపోయాయి.
‘‘ఇందులో ఏదైనా తప్పు జరిగిందా లేదా అన్నది పక్కనబెట్టి, అసలు ఇలాంటి బహుమతులు స్వీకరించకుండా ఉండటం మంచిది’’ అని ఫాక్స్ న్యూస్‌తో మాట్లాడుతూ రిపబ్లికన్ సెనేటర్ రాండ్ పాల్ వ్యాఖ్యానించారు.
‘‘ఖతార్ మీద మనం చేసే మానవహక్కుల ఉల్లంఘన ఆరోపణలపై ఈ పెద్ద విమానం గిఫ్ట్ ప్రభావం పడకుండా ఉంటే అది నిజంగా అద్భుతమే’’ అని పాల్ అన్నారు.
మరో రిపబ్లికన్ సెనేటర్ ట్రెడ్ క్రూజ్ మాట్లాడుతూ, ‘‘ఈ విమానం కారణంగా గూఢచర్యం, నిఘా సమస్యలు తలెత్తుతాయి’’ అని ఆందోళన వ్యక్తం చేశారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)