SOURCE :- BBC NEWS

అమృత బొచ్చె, ఏహెచ్ఆర్ జయంతి రాగండి చేపలు, హేచరీలు

ఫొటో సోర్స్, cifa.nic.in

చేపల మార్కెట్‌లో ఎక్కువగా దొరికే రకాలు బొచ్చె, రాగండి, కొర్రమీను.

అయితే వీటిలో రైతులు ఎక్కువగా సాగు చేేసేది మాత్రం బొచ్చె, రాగండి చేపలనే.

ఇప్పుడు ఆ రెండు రకాలకు ప్రత్యామ్నాయంగా అమృత బొచ్చె, ఏహెచ్‌ఆర్‌ జయంతి రాగండి రకాలను అభివృద్ధి చేసినట్లు సెంట్రల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్రెష్‌ వాటర్‌ ఆక్వా కల్చర్‌ (సిఫా) చెబుతోంది.

బాపట్ల జిల్లా అమృతలూరులో ఉన్న ఓ హేచరీస్‌తో ఈ సీడ్‌ పునరుత్పత్తి కోసం అవగాహన కుదుర్చుకున్నామని, తక్కువ కాలంలో వేగంగా పెరిగే.. ఈ ‘హై గ్రోత్‌’ రకాల చేపలను జులై నాటికి అందుబాటులోకి తేవాలని ప్రయత్నిస్తున్నామని సిఫా ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ రమేష్‌ రాథోడ్‌ బీబీసీతో చెప్పారు.

ఒడిశా, పశ్చిమబెంగాల్‌లోనూ ఇవి అందుబాటులోకి రానున్నాయని, ఇప్పటికే అక్కడి కొన్ని హేచరీస్‌లకు ఈ సీడ్‌ను అందించామని రమేష్‌ చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
సిఫా అభివృద్ధి చేసిన ‘అమృత బొచ్చె’ రకం చేప

కొత్త రకం చేపలు ఎందుకంటే..

సముద్రంలో దొరికే చేపలు కాకుండా, భారత్‌లో మంచినీటిలో సాగయ్యే చేపల్లో బొచ్చె(కట్ల), రాగండి/శీలావతి (రోహు), మోసులు (మ్రిగాల్‌) రకాలు ప్రముఖమైనవి.

ఇండియన్‌ మేజర్‌ క్రాప్‌(ఐఎంసీ) వెరైటీలుగా పిలిచే ఈ వెరైటీల్లో ఆంధ్రప్రదేశ్‌లోని మత్య్యకారులు, రైతులు ప్రధానంగా సాగు చేసే చేపలు రాగండి, బొచ్చెలే.

సగటున ఒక ఎకరంలో 2 వేల చేపల విత్తనాలు అంటే చేప పిల్లలు, గుడ్లు వేస్తే అందులో 80 శాతం రాగండి, 15శాతం బొచ్చె, 5 శాతం మోసులే ఉంటాయి.

చేప పిల్లలను చెరువుల్లో వేసిన తర్వాత, అవి పెరిగి చేపలు పట్టే దశకు రావడానికి దాదాపు 9 నెలల నుంచి ఏడాది సమయం పడుతుంది.

1980ల్లో డెవలప్ చేసిన ఈ రకం చేపల్లో కొన్నాళ్లుగా రోగ నిరోధక శక్తి తగ్గుతోందని.. ఏటా పెరుగుతున్న వ్యాధులతో ఎక్కువ చేపలు వృద్ధి దశలోనే చనిపోతుండటంతో రైతులకు దిగుబడి తగ్గుతోందని సైంటిస్టులు చెప్తున్నారు.

ఈ రకం చేపలకు ఎక్కువగా సోకే రెడ్‌ డిసీజ్, పేను వ్యాధుల నియంత్రణకు రైతులు ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తోంది.

దీంతో అధిక రోగ నిరోధకశక్తిని కలిగి 6 నుంచి 9 నెలలకే చేపలు చేతికొచ్చేలా కొత్త రకం తయారుచేశామని రాథోడ్‌ వెల్లడించారు.

అమృత బొచ్చె, ఏహెచ్ఆర్ జయంతి రాగండి చేపలు, హేచరీలు

ఏమిటీ చేపల ప్రత్యేకత

సిఫా సైంటిస్టులు చెప్పిన వివరాల ప్రకారం..

చేపలు పెరిగే దశలో వచ్చే వ్యాధులను సమర్థంగా ఎదుర్కొనే ప్రత్యామ్నాయ రకాలను అభివృద్ధి చేసేందుకు శాస్త్రవేత్తలు పదేళ్లుగా కృషి చేస్తున్నారు.

ఇందుకోసం దేశంలోని వివిధ ప్రాంతాల్లో సాగయ్యే చేపలను పరీక్షించారు. అనంతరం ఇటీవలే 14వ జనరేషన్‌కి చెందిన(ఒక జనరేషన్‌ అంటే రెండున్నర ఏళ్లు) అమృత బొచ్చె, ఐదో జనరేషన్‌కి చెందిన ఏహెచ్‌ఆర్‌ జయంతి రాగండి రకాలను వృద్ధి చేశారు.

క్షేత్రస్థాయి పరీక్షల అనంతరం సీడ్‌ పునరుత్పత్తి కోసం ఏపీతో పాటు దేశంలోని వివిధ హేచరీలతో ఒప్పందం కుదుర్చుకున్నామని రాథోడ్‌ తెలిపారు.

ప్రస్తుతం సాగవుతున్న బొచ్చె, రాగండి రకాల్లో చేప కిలో బరువు పెరగడానికి ఏడాది పడుతుంది.

అయితే ఈ కొత్తరకం చేపలు కేవలం ఆరు నెలలకే కిలోకి పైగా పెరుగుతాయి.

ఏడాది వరకు సాగయితే రెండు నుంచి మూడు కేజీల వరకు పెరుగుతుంది.

తక్కువ కాలంలో ఎక్కువ సాగయ్యే ఈ రకాలతో రైతులు ఏడాదికి రెండు సార్లు చేపలు పట్టుకోవచ్చని రాథోడ్‌ తెలిపారు.

అలాగే వ్యాధులు సోకే అవకాశం తక్కువగా ఉండటంతో రైతులకు ఆ మేరకు ఖర్చుల భారం తగ్గుతుందన్నారు.

అమృత బొచ్చె, ఏహెచ్ఆర్ జయంతి రాగండి చేపలు, హేచరీలు

ఫొటో సోర్స్, cifa.nic.in

వచ్చే సీజన్‌కల్లా అందుబాటులోకి జయంతి రాగండి

”బొచ్చె, రాగండి రకాలకు ప్రత్యామ్నాయంగా సిఫా అభివృద్ధి చేసిన అమృత బొచ్చె, ఏహెచ్‌ఆర్‌ జయంతి రాగండిల్లో ఏహెచ్‌ఆర్‌ జయంతి రాగండి ఈ ఏడాది జులైకల్లా అందుబాటులోకి రావొచ్చు. అమతృ బొచ్చె వచ్చే ఏడాది వస్తుంది. ఇప్పుడొస్తున్న రకాల కంటే ఇవి 30 నుంచి 40 శాతం పెద్దగా ఉంటాయి.” అని బాపట్ల జిల్లా అమృతలూరు మండలం కూచిపూడి గ్రామంలోని గాయత్రీ హేచరీస్‌ యజమాని యలవర్తి కుమార స్వామి బీబీసీతో తెలిపారు.

“మార్కెట్‌లో మృగాల్‌(మోసు) చేపలకు రేటు లేకపోవడంతో కొన్నేళ్లుగా కేవలం బొచ్చె, రాగండి చేపల సీడ్‌నే వృద్ధి చేస్తున్నామని చెప్పారు. ఇప్పుడు వీటిలో కూడా రోగనిరోధకశక్తి పెరిగి తక్కువ కాలంలో దిగుబడి వచ్చే సీడ్‌ను వృద్ధి చేయడం నిజంగా రైతులకు లాభమే” అని ఆయన అన్నారు.

అమృత బొచ్చె, ఏహెచ్ఆర్ జయంతి రాగండి చేపలు, హేచరీలు

మన నేలకి పనికొస్తాయో లేదో చూడాలి

అయితే, సిఫా తాజాగా అభివృద్ధి చేసిన చేపల రకాలను పెద్ద మొత్తంలో ఇప్పటి వరకు సాగు చేయలేదు. ప్రయోగాత్మకంగా మాత్రమే పెంచి చూశారు.

“కొత్తగా సిఫా అభివృద్ధి చేశామని చెబుతున్న అమృత బొచ్చె, జయంతి రాగండి వెరైటీలు మన భూముల్లో ఎంతవరకు నిలబడతాయో లేదో చూడాలి. పైగా అవి ఎక్కువ బరువు ఉండటంతో ధర కూడా పెరుగుతుంది. వినియోగదారులు అంత ధర భరించగలరా లేదా అనేది కూడా చూడాలని” భీమవరం ప్రాంతానికి చెందిన చేపల రైతు గాదిరాజు సుబ్బరాజు బీబీసీతో అన్నారు.

40 ఏళ్లుగా బొచ్చె, రాగండి రకాలను 300 ఎకరాల్లో సాగు చేస్తున్నామని, మొదట్లో వచ్చిన లాభాలు ఇప్పుడు రావడం లేదని సుబ్బరాజు తెలిపారు.

”పిల్లల ఉత్పత్తిలో ఇన్‌బ్రీడింగ్‌ వల్ల వ్యాధి నిరోధకశక్తి తగ్గిపోయి ఇప్పుడొస్తున్న బొచ్చె, రాగండి రకాలకు సోకే వ్యాధుల నియంత్రణ మందుల కోసం చాలా ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లో జన్యుపరంగా మెరుగుపడిన రకాలని సిఫా చెబుతున్న అమృత బొచ్చె, ఏహెచ్‌ఆర్‌ జయంతి రాగండిలు మంచి ఫలితాలను అందిస్తే రైతులకు మేలు జరుగుతుందని” ఏలూరు కి చెందిన ఏపీ ఫిష్‌ ఫార్మర్స్‌ అసోసియేషన్‌ కార్యదర్శి బోసురాజు బీబీసీతో అన్నారు.

అమృత బొచ్చె, ఏహెచ్ఆర్ జయంతి రాగండి చేపలు, హేచరీలు

ఫొటో సోర్స్, cifa.nic.in

సిఫా అంటే..

భువనేశ్వర్‌ ప్రధాన కేంద్రంగా ఉన్న సెంట్రల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్రెష్‌ వాటర్‌ ఆక్వా కల్చర్‌(సిఫా) మంచినీటి చేపల పెంపకంపై పరిశోధనలు నిర్వహిస్తోంది. చేపల పెంపకంలో శిక్షణ ఇస్తుంది. ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌ (ఐసీఏఆర్‌)కి చెందిన ఈ సంస్థ చేపల పెంపకానికి సంబంధించి వివిధ రకాల సీడ్‌లను వృధ్ధి చేస్తుంటుంది.

ఇక్కడి నుంచి సీడ్‌లను తీసుకుని హేచరీలు పునరుత్పత్తి చేసి వాటిని రైతులకు అందిస్తుంటాయి.

“ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు ఆరు లక్షల ఎకరాల్లో ఆక్వా సాగవుతోంది. అందులో సుమారు రెండున్నర లక్షల ఎకరాల్లో చేపలు సాగవుతున్నాయి. ప్రధానంగా బొచ్చె, రాగండి చేపలే ఎక్కువగా సాగవుతుంటాయని” రాష్ట్ర మత్స్యశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ నాగలింగాచారి బీబీసీతో చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)