SOURCE :- BBC NEWS

ఇజ్రాయెల్, మొసార్, ఇంటెలిజెన్స్, గూఢచారి, సిరియా

ఫొటో సోర్స్, BBC/Puneet Kumar

ఇజ్రాయెల్ లెజెండరీ స్పై(గూఢచారి) ఎలీ కోహెన్ మరోసారి వార్తల్లో నిలిచారు.

తమ నిఘా సంస్థ మొసాద్, విదేశీ నిఘా సంస్థతో కలిసి ఒక రహస్య, సంక్లిష్టమైన ఆపరేషన్ నిర్వహించినట్లు ఇజ్రాయెల్ ప్రభుత్వం చెబుతోంది.

ఈ ఆపరేషన్‌లో ఏజెన్సీలు విజయం సాధించాయని, ఎంతోకాలంగా సిరియాలోనే ఉండిపోయిన గూఢచారి ఎలీ కోహెన్‌కు సంబంధించిన వస్తువులు, ఇతరత్రా వాటిని ఇజ్రాయెల్‌కు తీసుకొచ్చినట్లు తెలిపింది.

ఇజ్రాయెల్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ సీక్రెట్ ఆపరేషన్‌లో ఎలీ కోహెన్‌కు చెందిన ఫోటోలు సహా దాదాపు 2500 డాక్యుమెంట్లు, వస్తువులను సిరియా నుంచి ఇజ్రాయెల్‌కు తీసుకొచ్చారు.

ఇప్పటివరకూ ఈ డాక్యుమెంట్లన్నీ సిరియా భద్రతా దళాల వద్ద ఉన్నాయని, వాటిని వారు వేర్వేరు చోట్ల ఉంచినట్లు ఇజ్రాయెలీ గూఢచార సంస్థ మొసాద్ చెబుతోంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్

1965, మే 18న ఎలీ కోహెన్‌‌ను సిరియాలో బహిరంగంగా ఉరితీశారు.

ఆయన పూర్తి పేరు ఎలియాహు బెన్ షాల్ కోహెన్.

ఆయన్ను ఇజ్రాయెల్‌కు చెందిన ధైర్యవంతుడైన గూఢచారిగా చెప్తారు. సిరియాలో శత్రువుల మధ్య నాలుగేళ్లు గడపడమే కాకుండా, అక్కడి అధికార వర్గాలకు కూడా దగ్గరయ్యారు.

ఇజ్రాయెల్, మొసార్, ఇంటెలిజెన్స్, గూఢచారి, సిరియా

ఫొటో సోర్స్, X/Prime Minister of Israel

ఎలీ కోహెన్‌కు సంబంధించిన ఏయే వస్తువులను గుర్తించారు?

ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు ఎలీ కోహెన్ వస్తువులను ఆయన భార్య నాదియా కోహెన్‌కు చూపిస్తున్న ఫోటోలు, వీడియోలు నెతన్యాహు అధికారిక ఎక్స్‌ ఖాతాలో పోస్ట్ చేశారు.

తనను ఉరి తీయడానికి ముందు ఎలీ కోహెన్ రాసిన చివరి లేఖ కూడా ఆ పత్రాల్లో ఉంది.

ఈ ఆపరేషన్‌లో కోహెన్ విచారణకు సంబంధించిన ఆడియో రికార్డింగ్స్‌తో పాటు ఇతర సమాచారం కూడా స్వాధీనం చేసుకున్నామని, వాటితో పాటు కోహెన్‌తో సంబంధమున్న వ్యక్తులకు సంబంధించిన ఫైల్స్ కూడా ఉన్నట్లు ట్లు మొసాద్ చెబుతోంది.

అలాగే, సిరియాలో తన మిషన్‌లో భాగంగా కోహెన్ తీసిన ఫోటోలు( గతంలో ఎన్నడూ బయటపడనివి) కూడా ఈ డాక్యుమెంట్లలో ఉన్నాయి. కోహెన్ తన కుటుంబ సభ్యులకు రాసిన లేఖలు, ఆయన అరెస్ట్ తర్వాత.. అక్కడి తన ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న వస్తువులు కూడా రికవరీ చేసిన ఈ డాక్యుమెంట్లలో ఉన్నాయి.

మొసాద్ చెప్తున్న వివరాల ప్రకారం.. సిరియాలో కోహెన్ అపార్ట్‌మెంట్ నుంచి స్వాధీనం చేసుకున్న నోట్‌బుక్స్, డైరీల్లో ఇజ్రాయెల్ మిషన్‌కు సంబంధించి.. ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ నుంచి వచ్చిన సూచనలు కూడా ఉన్నాయి.

వీటితో పాటు కోహెన్ అపార్ట్‌మెంట్ తాళాలు, ఆయన పాస్‌పోర్ట్, మిషన్ సమయంలో ఆయన ఉపయోగించిన నకిలీ ధ్రువీకరణ పత్రాలను కూడా గుర్తించారు. వీటిలో కోహెన్ చేతిరాతతో ఉన్న ఒక లేఖ కూడా ఉంది. ఉరి తీయడానికి ముందు ఆయన ఈ లేఖ రాశారు.

ఇజ్రాయెల్, మొసార్, ఇంటెలిజెన్స్, గూఢచారి, సిరియా

ఫొటో సోర్స్, ISRAELI GOVERNMENT PRESS OFFICE

ఈజిప్ట్‌లో పుట్టి, సిరియాలో చనిపోయారు

కోహెన్ ఉరిశిక్ష ఉత్తర్వులు మొసాద్‌కు కూడా అందాయి, వాటిలో ఆయన డమాస్కస్‌లోని యూదు కమ్యూనిటీ హెడ్‌ రబ్బీ నిస్సిమ్ ఇండిబోను కలిసేందుకు అనుమతించారు.

కోహెన్ ఈ సీక్రెట్ మిషన్ సమయంలో అర్జెంటీనా పౌరుడిలా, కామిల్ అనే పేరుతో చెలామణీ అయ్యారు. ఆయన సిరియా అధ్యక్షుడికి దగ్గరయ్యారు, ఒకానొక సమయంలో సిరియా డిప్యూటీ డిఫెన్స్ మినిస్టర్ (రక్షణ శాఖ ఉప మంత్రి) అయ్యే అవకాశం కూడా వచ్చింది.

1967 అరబ్ – ఇజ్రాయెల్ యుద్ధంలో, ఇజ్రాయెల్ విజయం సాధించడంలో కోహెన్ సంపాదించిన నిఘా సమాచారం కీలకపాత్ర పోషించినట్లు చెబుతారు.

కోహెన్ ఇజ్రాయెల్, సిరియా, అర్జెంటీనాలో జన్మించలేదు. 1924లో, ఈజిప్టులోని అలెగ్జాండ్రియాలో ఒక సిరియన్ యూదు కుటుంబంలో పుట్టారు.

కోహెన్ తండ్రి 1914లో సిరియాలోని అలెప్పో నుంచి ఇక్కడికి వచ్చారు. ఇజ్రాయెల్ ఏర్పాటైన తర్వాత, ఈజిప్ట్ నుంచి అనేక యూదు కుటుంబాలు అక్కడికి వెళ్లిపోవడం మొదలైంది.

1949లో కోహెన్ తల్లిదండ్రులు, ముగ్గురు సోదరులు కూడా అదే నిర్ణయానికి వచ్చారు, ఇజ్రాయెల్‌ వెళ్లి స్థిరపడ్డారు. అయితే, ఆ సమయంలో ఎలక్ట్రానిక్స్ చదువుతున్న కోహెన్ ఈజిప్టులోనే ఉండి, తన కోర్సు పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు.

ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా ప్రకారం, అరబిక్, ఇంగ్లిష్, ఫ్రెంచ్ భాషల్లో ఆయనకు మంచి ప్రావీణ్యం ఉంది. దీంతో ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ విభాగం ఆయనపై ఆసక్తి చూపించింది.

కోహెన్ అర్జెంటీనా ఎలా వెళ్లారు?

1955లో, స్పై కోర్సు చేయడానికి ఇజ్రాయెల్ వెళ్లిన కోహెన్, మరుసటి సంవత్సరం ఈజిప్టు తిరిగొచ్చారు. అయితే, సూయిజ్ సంక్షోభం తర్వాత, చాలామందిని ఈజిప్ట్‌ నుంచి బహిష్కరించారు, వారిలో కోహెన్ కూడా ఉన్నారు. 1957లో ఆయన తిరిగి ఇజ్రాయెల్ వచ్చారు.

జూయిస్(యూదు) వర్చువల్ లైబ్రరీలో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, ఇక్కడికి వచ్చిన రెండేళ్ల తర్వాత ఇరాకీ యూదు కుటుంబానికి చెందిన వ్యక్తి, రచయిత శామీ మైకేల్‌ సోదరి అయిన నాదియా మజ్దల్‌ను వివాహం చేసుకున్నారు.

1960లో ఇజ్రాయెల్‌ ఇంటెలిజెన్స్‌లో చేరడానికి ముందు ఆయన ట్రాన్స్‌లేటర్‌గా పనిచేశారు.

శిక్షణ పూర్తయిన తర్వాత, కోహెన్ 1961లో అర్జెంటీనా రాజధాని బ్యేనొస్ ఐరెస్‌ చేరుకున్నారు. అక్కడ సిరియన్ మూలాలున్న వ్యాపారవేత్తగా తన పని ప్రారంభించారు.

కామిల్ అమీన్ థాబెట్‌ పేరుతో చెలామణీ అవుతూ, అర్జెంటీనాలోని సిరియన్ కమ్యూనిటీతో విస్తృతంగా పరిచయాలు పెంచుకున్నారు. కొద్దికాలంలోనే సిరియన్ రాయబార కార్యాలయంలోని సీనియర్ అధికారులతో స్నేహం కుదుర్చుకుని, వారి నమ్మకాన్ని పొందగలిగారు.

వారిలో సిరియన్ మిలిటరీకి చెందిన అమీన్ అల్ హఫీజ్ కూడా ఒకరు. ఆ తర్వాత ఆయన సిరియా అధ్యక్షుడయ్యారు. తాను కూడా వీలైనంత త్వరగా, సిరియా ‘తిరిగి’ వచ్చేయాలని అనుకుంటున్నట్లు కోహెన్ తన ‘కొత్త స్నేహితులతో’ అనేవారు.

1962లో ఆయనకు సిరియా వెళ్లి, డమాస్కస్‌లో స్థిరపడే అవకాశం వచ్చింది. అర్జెంటీనాలో పరిచయాలు ఆయన్ను సిరియాలోని అత్యున్నత అధికారవర్గాలకు మరింత చేరువ చేశాయి.

తాను అక్కడ కుదురుకున్న తర్వాత.. సిరియన్ సైన్యం, ఇంటెలిజెన్స్, ప్రణాళికల గురించి ఇజ్రాయెల్‌కు సమాచారం పంపడం ప్రారంభించారు.

ఇజ్రాయెల్, మొసార్, ఇంటెలిజెన్స్, గూఢచారి, సిరియా

ఫొటో సోర్స్, ISRAELI GOVERNMENT PRESS OFFICE

సిరియాలో అధికార మార్పిడి, పట్టు సాధించిన అలీ

1963లో అధికార మార్పిడి జరిగిన తర్వాత, కోహెన్ సేవలు మరింత కీలకంగా మారాయి. బాత్ పార్టీ సిరియాలో అధికారంలోకి వచ్చింది. అర్జెంటీనాలో ఉన్నప్పుడు తనకు స్నేహితులుగా ఉన్న చాలామంది ఆ ప్రభుత్వంలో ఉన్నారు.

ఈ తిరుగుబాటుకు నాయకత్వం వహించిన అమీన్ అల్ హఫీజ్ అధ్యక్షుడయ్యారు. కోహెన్‌ను హఫీజ్ చాలా నమ్మేవారు. ఒకానొక సమయంలో, కోహెన్‌ను డిప్యూటీ డిఫెన్స్ మినిస్టర్‌గా నియమించాలని అనకున్నారని చెబుతారు.

కోహెన్‌కు రహస్య సైనిక సమావేశాలకు హాజరయ్యే అవకాశం మాత్రమే కాకుండా, గోలన్ హైట్స్‌లోని సిరియన్ సైనిక స్థావరాలను సందర్శించే అవకాశం కూడా వచ్చింది. గోలన్ హైట్స్‌కు వెళ్లినప్పుడు, సిరియన్ సైన్యానికి సాయం పేరుతో కోహెన్ అక్కడ చెట్లు నాటారు.

ఆ సమయంలో, గోలన్ హైట్స్ ప్రాంతం గురించి సిరియా – ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు ఉండేవి.

గోలన్ హైట్స్‌‌ గురించి, అక్కడి చెట్లు, ఇతర విషయాల గురించి కోహెన్ పంపిన సమాచారమే 1967 నాటి మిడిల్ ఈస్ట్ యుద్ధంలో ఇజ్రాయెల్ చేతిలో సిరియా ఓటమికి కారణమైనట్లు చెబుతారు.

ఈ చెట్లు సిరియా సైనిక స్థావరాలను గుర్తించడంలో ఇజ్రాయెల్‌కు ఉపయోగపడ్డాయి.

ఇజ్రాయెల్, మొసార్, ఇంటెలిజెన్స్, గూఢచారి, సిరియా

ఫొటో సోర్స్, Getty Images

రేడియో కమ్యూనికేషన్‌లో నిర్లక్ష్యమే పట్టించిందా?

జూయిస్ వర్చువల్ లైబ్రరీ ప్రకారం, గూఢచర్యంలో కోహెన్‌కు ప్రావీణ్యం ఉన్నప్పటికీ, ఆయన నిర్లక్ష్యంగా కూడా ఉండేవారు. రేడియో కమ్యూనికేషన్ సమయంలో జాగ్రత్తగా ఉండాలని ఇజ్రాయెల్‌‌లోని అధికారులు ఆయన్ను పదేపదే హెచ్చరించారు.

రోజుకి రెండుసార్లకు మించి రేడియో ద్వారా మాట్లాడొద్దని కూడా ఆయనకు సూచించారు. కానీ, కోహెన్ ఈ హెచ్చరికలను పట్టించుకోలేదు. ఈ నిర్లక్ష్యమే ఆయన అంతానికి దారితీసింది.

1965 జనవరిలో, కోహెన్ రేడియో సిగ్నల్స్‌ను గుర్తించిన సిరియన్ కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు ఆయన్ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కోహెన్‌ను విచారించారు. మిలిటరీ విచారణ కూడా జరిపారు. చివరికి ఆయనకు మరణశిక్ష విధించారు.

1965 మే 18న కోహెన్‌ను డమాస్కస్‌లోని ఓ కూడలిలో ఉరితీశారు. ”సిరియాలోని అరబ్ ప్రజల కోసం” అని రాసివున్న ఒక బ్యానర్‌‌ను ఆయన మెడకు కట్టారు.

ఆయనకు క్షమాభిక్ష ప్రసాదించాలంటూ ఇజ్రాయెల్ ప్రపంచ దేశాల ద్వారా అభ్యర్థించింది. కానీ, అందుకు సిరియా అంగీకరించలేదు.

కోహెన్ మరణించిన తర్వాత, ఆయన మృతదేహాన్ని, ఆయనకు సంబంధించిన వస్తువులను ఇవ్వాలని ఇజ్రాయెల్ ఎన్నోసార్లు అభ్యర్థించింది. అందుకు, సిరియా నిరాకరిస్తూనే వచ్చింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)