SOURCE :- BBC NEWS

ఏనుగు మృతి

తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరు సమీపంలోని మరుధమలై కొండలలో గర్భంతో ఉన్న ఓ ఏనుగు అనారోగ్యంతో చనిపోయింది.

ప్లాస్టిక్ వ్యర్థాలను తినడమే ఆ ఏనుగు చనిపోవడానికి ప్రధాన కారణమనే విషయం వెలుగులోకి వచ్చింది.

మరుధమలై వంటి పర్యటక ప్రదేశాల్లో ప్లాస్టిక్ వినియోగం ఎక్కువ కావడం ఏనుగులు సహా ఇతర వన్య ప్రాణులకు ప్రాణసంకటంగా మారింది.

ఈ ఘటన జరగడంతో ఊటీ, కొడైకెనాల్ తదితర పర్వతశ్రేణి పర్యటక కేంద్రాల్లో మాదిరిగానే అటవీ ప్రాంతాల్లోని పుణ్య క్షేత్రాల్లోనూ ప్లాస్టిక్, పాలిథిన్ బ్యాగ్‌లపై నిషేధం విధించాలనే డిమాండ్ ఊపందుకుంది.

ఈ విషయమై తమిళనాడు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినట్లు అటవీశాఖ అధికారులు చెప్పారు.

పశ్చిమ కనుమల్లో భాగమైన కోయంబత్తూరు డివిజన్ పరిధిలోని మరుధమలై అటవీ ప్రాంతంలో, కొండల మధ్య సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
క్రేన్

గర్భంతో ఉన్న ఏనుగు మృతికి కారణమేమిటి?

ఏనుగులు, చిరుతపులులు, అడవి పందుల సహా వివిధ రకాల వన్యప్రాణులకు మరుధమలై అటవీ ప్రాంతం ఆవాసంగా ఉంది.

కొన్ని వందల ఎకరాల విస్తీర్ణంలో ఆసియా ఏనుగుల ఆవాసంగా, కారిడార్‌గా పేరొందిన భారతీయార్ విశ్వవిద్యాలయం ఈ హిల్ స్టేషన్‌కు సమీపంలోనే ఉంది.

మే 17వ తేదీన ఈ అటవీ ప్రాంతంలో అపస్మారక స్థితిలో ఓ ఆడ ఏనుగు, దాని పక్కనే ఒక గున్న ఏనుగు పడి ఉండటాన్ని గమనించారు.

అటవీ శాఖ అధికారులు క్రేన్ సహాయంతో ఆ ఆడ ఏనుగును రక్షించారు.

అటవీ శాఖకు చెందిన ఐదుగురు వెటర్నరీ డాక్టర్లు శస్త్ర చికిత్స చేశారు. అయినప్పటికీ ఆ ఏనుగు చనిపోయింది. కళేబరానికి అటాప్సీ నిర్వహించగా… దాని గర్భంలోని 15 నెలల పిల్ల చనిపోయి ఉంది. అంతేకాదు ఆ కడుపు నిండా ప్లాస్టిక్, పాలిథిన్, పేపర్ వేస్ట్ భారీస్థాయిలో బయటపడింది.

కనీసం గర్భంతో ఉందనే విషయం తెలియకుండానే ఆ ఏనుగుకు వెటర్నరీ డాక్టర్లు వైద్యం చేశారని మీడియాలో చాలా కథనాలు వచ్చాయి. ఆ ఆరోపణలను ఆయా డాక్టర్లతో పాటు అటవీ శాఖ అధికారులు తోసిపుచ్చారు.

అటాప్సీ నిర్వహించిన వారిలో ఒకరైన డాక్టర్ సుకుమార్ బీబీసీతో మాట్లాడారు.

”అప్పటికే ఆ ఏనుగు.. శరీరంపై గాయాలు, పలు అవయవాల వైఫల్యంతో ఇబ్బందిపడుతోంది. దాని కడుపులో చాలా ప్లాస్టిక్ వేస్ట్ బయటపడింది. అక్కడ డంప్ చేసిన ఆహార వ్యర్థాలతో పాటు ప్లాస్టిక్, పాలిథిన్ కూడా తినేసింది. దీంతో అనారోగ్య సమస్యలు తలెత్తాయి. ఏనుగు చనిపోవడానికి విషతుల్యమైన ఆహారం, ప్లాస్టిక్ వేస్ట్ ప్రధాన కారణం” అని ఆయన వెల్లడించారు.

ప్లాస్టిక్ వేస్ట్

ఫొటో సోర్స్, Getty Images

ఏనుగు పేడలో 70 శాతం ప్లాస్టిక్ వ్యర్థాలు

చనిపోయిన ఏనుగు చిన్న పేగులు, పెద్ద పేగులు.. ప్లాస్టిక్ వేస్ట్‌, అల్యూమినియం ఫోయిల్ పేపర్ల‌తో నిండిపోయాయని డాక్టర్లు చెప్పారు.

ఇదొక్కటే కాదు ఈ ప్రాంతంలోని మిగతా ఏనుగుల పేడలోనూ 70 శాతం ప్లాస్టిక్ వేస్ట్ కనిపిస్తుంది.

”దుప్పిలు, అడవి పందులవంటి వన్యమృగాల ఉదరంలో నాలుగు గదులు ఉంటాయి. అవి ప్లాస్టిక్ వేస్ట్‌ను తింటే ఏదొక చోట పేరుకుపోయి కడుపు ఉబ్బి చనిపోతాయి. కానీ ఏనుగు ఉదరంలో ఒకే గది ఉండటం వల్ల అది ప్లాస్టిక్‌ను తిన్నా పేడతో బయటకు వచ్చేస్తుంది. కానీ ఇక్కడ ఏనుగు మరణానికి అది బాగా ఎక్కువగా ప్లాస్టిక్ తినడమే కారణమైంది” అని డాక్టర్ సుకుమార్ చెప్పారు.

ఏనుగుల పేడ

ఇదే ప్రాంతంలో రెండేళ్ల క్రితం చనిపోయిన ఏడుగు కడుపులోనూ కిలోల కొద్దీ ప్లాస్టిక్ వేస్ట్ బయటపడింది.

సోమాయంపాళ్యం పంచాయతీలో సేకరించిన చెత్త తీసుకొచ్చి అటవీ ప్రాంత సమీపంలోని ఖాళీస్థలంలో పడేయడమే ఈ పరిస్థితికి కారణమంటూ మీడియాలో కథనాలు వచ్చాయి.

ఏనుగు మృత్యువాత ఘటన తర్వాత కోయంబత్తూరు జిల్లా కలెక్టర్ పవన్ కుమార్ ఆదేశాలతో ఆ గార్బేజ్ డంప్‌ను తొలగించారు.

కానీ మరుధమలై దేవాలయం, పరిసర అటవీ ప్రాంతాలలో వాడిపడేస్తున్న ప్లాస్టిక్ వస్తువులను మాత్రం నియంత్రించలేకపోతున్నారు.

”బయో మైనింగ్ ద్వారా చెత్త తొలగిస్తాం. ఏనుగులు సహా వన్య మృగాలు ఆ ప్రాంతానికి రాకుండా మోడ్రన్ ఫెన్సింగ్ ఏర్పాటుచేయడానికి చర్యలు తీసుకుంటాం. గార్బేజ్ వాటికి కనిపించకుండా ఆ ప్రాంతం చుట్టూ చెట్లను పెంచుతాం” అని కలెక్టర్ పవన్ కుమార్ చెప్పారు.

కలెక్టర్ మాటలను బట్టి చూస్తే… గార్బేజ్ డంప్‌ను అక్కడి నుంచి వేరేచోటకు తరలించరని అర్థమవుతోందని పర్యావరణవేత్తలు అంటున్నారు.

అయితే పలువురు పర్యావరణవేత్తలు, వన్యమృగాల పరిశీలకులు మాత్రం దాన్ని అక్కడి నుంచి పూర్తిగా తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.

 గార్బేజ్ డంపింగ్

తమిళనాడు ప్రభుత్వం ఏం చెబుతోంది?

”తమిళనాడు ప్రభుత్వం ఇప్పటికే 14 రకాల సింగిల్-యూజ్ ప్లాస్టిక్ వస్తువులను నిషేధించింది. వాటన్నింటినీ వేరేచోటకు తరలించాల్సిన బాధ్యత స్థానిక సంస్థలది. ఈ విషయమై ఆ శాఖ కార్యదర్శికి లేఖ రాశాం” అని తమిళనాడు అటవీశాఖ కార్యదర్శి సుప్రియా సాహు బీబీసీతో చెప్పారు.

తమిళనాడులోని అటవీ ప్రాంతాలకు ఆనుకుని ఉన్న గార్బేజ్ డంప్‌లన్నీ పరిశీలించాలని అన్ని జిల్లాల్లోని డిస్ట్రిక్ ఫారెస్ట్ ఆఫీసర్స్‌కు ఆదేశాలిచ్చాం ” అని సుప్రియ తెలిపారు.

ఆరోగ్య ప్రమాదాలు

ఫొటో సోర్స్, Getty Images

ప్లాస్టిక్ వాడకాన్ని, క్యారీ బ్యాగుల వాడకాన్ని తగ్గించాలని అటవీశాఖ ఏటా అవగాహన కల్పిస్తున్నా ప్రయోజనం లేకుండా పోయింది. ఇతర వన్యప్రాణుల కంటే ఎక్కువగా ఏనుగులకే ప్లాస్టిక్ వల్ల హాని కలుగుతోంది.

ప్లాస్టిక్ వ్యర్థాలు జంతువులలో హార్మోన్ల అసమతుల్యతకు కారణమవుతాయని, దీంతో వాటి పునరుత్పత్తిపై ప్రభావితం పడుతుందని.. నేచర్ కన్జర్వేషన్ జర్నల్లో ప్రచురితమైన ఒక అధ్యయనం తెలిపింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)