SOURCE :- BBC NEWS
ఫొటో సోర్స్, BBC/Jessica Hromas
ఆస్ట్రేలియాలో 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా అకౌంట్లను నేటి (డిసెంబర్ 10) నుంచి అనుమతించరు. ‘ప్రపంచంలోనే కఠినమైనది’గా చెబుతున్న ఈ సోషల్ మీడియా నిషేధాన్ని తప్పించుకునేందుకు 13 ఏళ్ల ఇసోబెల్‌కు ఐదు నిమిషాలు కూడా పట్టలేదు.
స్నాప్‌చాట్ సహా 10 ప్లాట్‌ఫాంలలో ఈ నిబంధనలను అమల్లోకి తెచ్చింది ఆస్ట్రేలియా ప్రభుత్వం.
స్నాప్‌చాట్ వాడుతున్న ఇసోబెల్‌కు ఆ యాప్‌లో ఓ నోటిఫికేషన్ వచ్చింది. ఆమె తనకు 16 ఏళ్లు దాటినట్లు నిరూపించలేకపోతే అకౌంట్ క్లోజ్ అవుతుందన్నది ఆ నోటిఫికేషన్ సారాంశం.
‘‘నేను మా అమ్మ ఫోటో తీసి, కెమెరా ముందు పెట్టాను. అంతే, మీ వయసు ధ్రువీకరించినందుకు ధన్యవాదాలు అని వచ్చింది” అని ఇసోబెల్ అన్నారు.
“ఎవరో బియాన్స్ (ప్రముఖ అమెరికన్ సింగర్) ముఖం చూపించి కూడా ఇలా చేశారని విన్నా” అని ఆమె చెప్పారు.

అయితే, సోషల్ మీడియాలో హింస, పోర్నోగ్రఫీ వంటి హానికరమైన కంటెంట్, సైబర్ బెదిరింపులు, ఆన్‌లైన్ దోపిడీల నుంచి పిల్లల రక్షణ కోసం ఉద్దేశించిన ఈ నిషేధంపై చాలామంది తల్లిదండ్రులు అనుకూలంగా ఉన్నట్లు ఆస్ట్రేలియా ప్రభుత్వం చెబుతోంది.
దీనివల్ల చిన్నారుల నిద్ర, వారి శారీరక, మానసిక ఆరోగ్యం కూడా మెరుగవుతుందని ప్రభుత్వం విశ్వసిస్తోంది.
తన కూతురు టిక్‌టాక్, స్నాప్‌చాట్ వాడేందుకు ఇసోబెల్ తల్లి మెల్ అనుమతించారు, కానీ ఆమెను నిశితంగా గమనిస్తూ ఉంటారు.
సోషల్ మీడియా వాడకంలో తమ పిల్లలకు హద్దులు నిర్ణయించడంలో ఈ చట్టం ఉపకరిస్తుందని ఆమె ఆశిస్తున్నారు.
కానీ, ఎంతోమంది నిపుణులు, చిన్నారులు ఈ నిషేధం అమలు, భద్రతపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.
ఈ విధానం ఎలా ఉండబోతోందని ప్రపంచం కూడా చూస్తోంది. అలాగే, టెక్ దిగ్గజాలు కూడా దీనిని నిశితంగా పరిశీలిస్తున్నాయి.
ఫొటో సోర్స్, BBC/Jessica Hromas
మరి చట్టం అమలు ఎలా?
ఈ పాలసీని 2024 నవంబర్‌లో తొలిసారి ప్రకటించారు. అయితే, సోషల్ మీడియా వినియోగించే పిల్లలకు, వారి తల్లిదండ్రులకు ఇందులో ఎలాంటి శిక్షలూ లేవు.
ఈ పాలసీ ప్రకారం, యూజర్స్ కనీస వయసు 16 సవంత్సరాలు దాటినట్లు నిర్ధరించేందుకు ఆయా కంపెనీలు సహేతుకమైన చర్యలు చేపట్టాలి.
అలా చేయడంలో కంపెనీలు విఫలమైతే దాదాపు 49.5 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్ల (సుమారు రూ. 295 కోట్లు) వరకు జరిమానా ఎదుర్కోవాల్సి ఉంటుంది.
వయసు నిర్ధరణకు సంబంధించి ప్రభుత్వం ఒక ట్రయల్ కూడా నిర్వహించింది. ఇందులో భాగంగా వివిధ పద్ధతులను పరీక్షించింది.
అవన్నీ టెక్నికల్‌గా సాధ్యమే కానీ, ఏదీ కూడా 100 శాతం కచ్చితమైనది, సురక్షితమైనది కాదని ఆ నివేదిక పేర్కొంది.
ఐడెంటిటీ వెరిఫికేషన్ అత్యంత కచ్చితమైన పద్ధతి. కానీ, అందుకోసం యూజర్లు తమ కీలకమైన, సున్నిత సమాచారానికి సంబంధించిన డాక్యుమెంట్లను కూడా సమర్పించాల్సి ఉంటుంది.
ఆన్‌లైన్ యాక్టివిటీస్, ఫేషియల్ అసెస్‌మెంట్ టెక్నాలజీ ద్వారా.. వయసు అంచనా వేయడం కూడా అంత నమ్మకమైన పద్దతి కాదు.
అంతేకాకుండా, ఫేస్ స్కాన్లు కూడా టీనేజర్ వయసును కచ్చితంగా నిర్ధరించలేదు. అయితే, ఈ పద్ధతులన్నీ కలిపి ఉపయోగిస్తే.. కొంత వరకు సేఫ్‌గా, సెక్యూర్‌గా ఉండొచ్చని ఆ రిపోర్టు పేర్కొంది.
అయితే, ఈ ట్రయల్ నిర్వహించిన, యూకేలోని ఏజ్ చెక్ సర్టిఫికేషన్ స్కీమ్ చీఫ్ టోనీ అల్లెన్ మాట్లాడుతూ, ‘‘మీరు ఏదైనా మద్యం దుకాణానికి వెళ్లినప్పుడు, ఆ దుకాణదారు మిమ్నల్ని పరిశీలిస్తారు. ఒకవేళ వయసు తక్కువని భావిస్తే, మీ ఐడీ అడుగుతారు. ఇక్కడ కూడా అదే రూల్ వర్తిస్తుంది” అన్నారు.
కానీ, ఈ ట్రయల్ ఫలితాలు కూడా వివాదాస్పదమయ్యాయి. సలహా బోర్డులోని ఇద్దరు మాజీ సభ్యులు వీటిని పక్షపాతం (బయాస్)తో కూడినవనీ, గోప్యతా రహిత(ప్రైవసీ వాషింగ్)మైనవి అంటూ ఆరోపణలు చేశారు.
అలాగే, టీనేజర్లు వీటి నుంచి తప్పించుకునేందుకు ఉన్న మార్గాలపైనా ఈ ట్రయల్‌లో పరిశీలన జరిపినప్పటికీ, ఆ పద్ధతులను చెక్ చేయడం ఈ ట్రయల్ విధి కాదు.
ఫొటో సోర్స్, Getty Images
అయితే, ఈ రూల్స్ నుంచి ఎలా తప్పించుకోవాలనే దాని గురించి ఎన్నో చిట్కాలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
వీటిని అడ్డుకునే టెక్నాలజీ ఉందని కొందరు చెబుతున్నారు. మరోవైపు ఇసోబెల్ చెప్పినట్లుగా ఫోటోలను ఉపయోగించి, కొందరు సులభంగా అడ్డంకులను తప్పించుకుంటున్నారు.
ఈ విషయం గురించి బీబీసీ స్నాప్‌చాట్‌ను సంప్రదించింది. ఆ కంపెనీ ప్రతినిధి మాట్లాడుతూ, “ఈ నిబంధనల అమలులో సాంకేతిక సవాళ్ల గురించి ఆందోళనలు ఉన్నాయి. వాటిలో ఇది కూడా ఒకటి” అన్నారు.
స్నాప్‌చాట్ కోసం వయసు ధ్రువీకరణ వ్యవహారాలను కే-ఐడీ పర్యవేక్షిస్తోంది. “ఇదో నిరంతర యుద్ధం. ప్రతిరోజూ మన సిస్టమ్‌ను మనం మెరుగుపరుచుకోవాలి” అని కే-ఐడీ ఎగ్జిక్యూటివ్‌గా ఉన్న ల్యూక్ డెలానీ అన్నారు.
ఈ నిషేధం వల్ల ఉపయోగం లేదని ఇసోబెల్ అన్నారు.
“ఒకవేళ నా అకౌంట్‌పై నిషేధం విధించినా, నేను మరో యాప్ వాడతాను” అని ఆమె అంటున్నారు.
ఇది చర్చించాల్సిన విషయమని ఇసోబెల్ తల్లి మెల్ అంటున్నారు. అయితే, ఆమెతో పాటు మరికొందరు భయపడుతున్నది ఏంటంటే, ఇది సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు, ప్రభుత్వం మధ్య నిత్యపోరాటంగా మారుతుందని. అంటే, ఒక లోపం బయటపడితే మరో కొత్త రూల్.. తర్వాత మరో రూల్…ఇలా కొనసాగుతూనే ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
ఫొటో సోర్స్, Getty Images
జరిమానాల ప్రభావమెంత?
సోషల్ ప్లాట్‌ఫామ్‌లు క్రమంగా ఈ నిషేధ ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రయత్నించే అవకాశం ఉందని 2013 నుంచి 2017 మధ్య ఆస్ట్రేలియా, న్యూజీలాండ్‌లో ఫేస్‌బుక్‌కు నేతృత్వం వహించిన స్టీఫెన్ షిల్లర్ అభిప్రాయపడుతున్నారు.
జరిమానాల భయంతో కంపెనీలు నిబంధనలను పాటిస్తాయని అనుకోలేమని షిల్లర్ అంటున్నారు. ఉదాహరణకు, ఫేస్‌బుక్ కేవలం రెండు గంటల్లో ప్రపంచవ్యాప్తంగా జరిమానకు కావాల్సినంత డబ్బు సంపాదిస్తుంది. ‘‘ఇది పార్కింగ్ జరిమానా లాంటిది” అని ఆయన అన్నారు.
దానికితోడు చట్టపరమైన సవాళ్లు కూడా ఉన్నాయి. ఇద్దరు టీనేజర్లు ఇప్పటికే దేశ అత్యున్నత న్యాయస్థానంలో కేసు వేశారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని, చాలా కఠినమైనదని వారు అంటున్నారు.
యూట్యూబ్, గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ కూడా చట్టపరంగా సవాల్ చేయడానికి అవకాశాలను పరిశీలిస్తోంది.
మానవ హక్కుల సంస్థలు, కొందరు న్యాయ నిపుణులు కూడా ఈ చట్టాన్ని వ్యతిరేకించారు.
“ఒక పాలసీ విజయవంతం కావాలంటే, 100 శాతం మంది చిన్నారులను సోషల్ మీడియా నుంచి దూరంగా ఉంచాల్సిన అవసరం లేదు. 80 శాతం మంది పిల్లలు దూరంగా ఉంటే, మిగిలిన వారు నెమ్మదిగా అంగీకరిస్తారు” అని అలెన్ అంటున్నారు.
దీని అమలు సాధ్యమేనా? లేదా అనేది వేరే ప్రశ్న. కానీ, ఇప్పుడు ప్రజలు అడుగుతోంది అసలు ఇది అవసరమా? అని.
ఇందులో మొదటి ఆందోళన ఏంటంటే, ఇది పిల్లలను ఇంటర్నెట్‌లోని చీకటి ప్రపంచంలోకి నెట్టేసే అవకాశం.
తీవ్రవాద వ్యాప్తికి సహకరిస్తున్నాయని విమర్శలు ఎదుర్కొన్న గేమింగ్ సైట్లలోని చాట్‌రూమ్‌లలో కూడా పిల్లలు చిక్కుకోవచ్చు. వీటికి వయసు పరిమితి ఉండదు.
ఎలాంటి అకౌంట్ లేకుండా వీడియోలు చూడగలిగే టిక్‌టాక్, యూట్యూబ్ వంటి యాప్‌లు అనేకం ఉన్నాయి. వాటిలో అందుబాటులో ఉండే కంటెంట్, లేదా ప్రకటనల్లో ఫిల్లర్లు లేకపోవడం కూడా మరింత హానికరం కావొచ్చు. అయితే, కొత్త అకౌంట్లకు కొన్ని పరిమితులు ఉన్నాయి.
కంటెంట్ నియంత్రణకు సంబంధించి టెక్ దిగ్గజాలు విమర్శలను ఎదుర్కొంటూనే ఉంటాయి, కానీ చాలా చిన్న కంపెనీలతో పోలిస్తే పెద్ద కంపెనీలు ఈ విషయంలో మెరుగ్గా ఉన్నాయనే భావన కూడా ఉంది.
ఉదాహరణకు, ఎవరైనా పెద్ద వయసు వ్యక్తి పిల్లలకు అదేపనిగా సందేశాలు పంపుతున్నట్లయితే.. ఫేస్‌బుక్‌లో వార్నింగ్ వ్యవస్థలు ఉన్నాయి.
ఫొటో సోర్స్, BBC/Jessica Hromas
ప్రయోజనం ఉంటుందా?
సోషల్ మీడియా, దానివల్ల ఆరోగ్యం మీదా పడే ప్రభావం గురించి పరిశోధనలు అస్పష్టంగా ఉన్నాయి. అవి నిరంతరం మారుతూనే ఉన్నాయి.
సోషల్ మీడియా వల్ల మానసిక ఆరోగ్యం దెబ్బతింటుందని కొన్ని అధ్యయనాలు చెబుతుంటే.. మరికొన్ని ఇది సహాయకారిగా ఉందనేందుకు ఆధారాలను కూడా అందిస్తున్నాయి. మరీముఖ్యంగా ఎల్జీబీటీక్యూ+తోపాటు ఆటిజం వంటి నరాల సంబంధిత సమస్యలున్న పిల్లలు, గ్రామీణ చిన్నారుల విషయంలో దీని ప్రభావం కనిపిస్తుంది.
చాలా మంది నిపుణులు చెబుతున్నదేంటంటే.. సోషల్ మీడియాలో వస్తున్న హానికరమైన కంటెంట్‌ను నియంత్రించేలా కంపెనీలపై మరింత ఒత్తిడి తీసుకురావడంపై దృష్టి పెట్టాలి.
ఆస్ట్రేలియా కమ్యూనికేషన్స్ మంత్రి అనికా వెల్స్ బీబీసీతో మాట్లాడుతూ, “మా ప్రభుత్వం అవన్నీ చేయాలనుకుంటోంది. ఈ నిషేధం సంపూర్ణమైనది కాకపోయినా, ప్రయోజనకరంగా ఉంటుంది” అని అన్నారు.
“ఇది నివారణ కాదు, కేవలం చికిత్సా ప్రణాళిక మాత్రమే. ఇలాంటి ప్రణాళికలు కాలానుగుణంగా మారుతూ, మెరుగవుతూ ఉంటాయి” అని ఆమె అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
SOURCE : BBC NEWS







