SOURCE :- BBC NEWS
ఫొటో సోర్స్, Getty Images
పురుషులు మూత్రవిసర్జన చేసేటప్పుడు కూర్చోవాలా, నిలబడాలా?
మగవారు టాయిలెట్‌కు వెళ్లినప్పుడు మూత్రవిసర్జన ఎలా చేయాలనే దానిపై జరుగుతున్న చర్చలో ఇదే ప్రధాన ప్రశ్న.
అయితే, కూర్చోవడం వల్ల పెద్ద ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయనడానికి బలమైన వైద్య రుజువులైతే లేవు. కానీ, కూర్చోవడం ఎక్కువ పరిశుభ్రమైనదని మాత్రం చెబుతారు.
“మూత్రవిసర్జన చేయడానికి సరైనది, లేదా తప్పు మార్గమంటూ లేదు. అది వ్యక్తిపై ఆధారపడి ఉంటుంది” అని యూకేకి చెందిన యూరాలజీ ఫౌండేషన్ చైర్‌పర్సన్ డాక్టర్ మేరీ గార్త్‌వైట్ బీబీసీతో చెప్పారు.
”టాయిలెట్లు శుభ్రంగా ఉంటే, కూర్చోవడం నిజానికి మరింత పరిశుభ్రం” అన్నారామె.
బ్యాలెన్స్ సమస్యలు ఉన్నవారికి కూర్చోవడం సురక్షితంగా ఉంటుందని, ముఖ్యంగా రాత్రిపూట టాయిలెట్ ఉపయోగించాల్సిన అవసరం వచ్చినప్పుడు ఇది సహాయపడుతుందని ఆమె వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
కొన్ని సంప్రదాయాలలో..
2014లో నెదర్లాండ్స్‌లోని లైడెన్ విశ్వవిద్యాలయం నుంచి నిర్వహించిన ఒక అధ్యయనం, పురుషులు ఎంత త్వరగా మూత్రవిసర్జన చేస్తారు, మూత్రాశయం ఎంత త్వరగా ఖాళీ అవుతుంది వంటి అంశాలను శరీర భంగిమ (కూర్చుని లేదా నిలబడటం) ఎలా ప్రభావితం చేస్తుందో పరిశీలించింది.
ప్రోస్టేట్‌తో బాధపడుతున్న పురుషులు కూర్చున్నప్పుడు వారి మూత్రాశయాన్ని వేగంగా, పూర్తిగా ఖాళీ చేస్తున్నారని వైద్య బృందం కనుగొంది. కానీ, ఆరోగ్యకరమైన పురుషుల్లో కూర్చోవడం, నిలబడటం మధ్య ఎటువంటి తేడా కనిపించలేదు.
నిలబడి మూత్రవిసర్జన చేయడం చాలామంది పురుషులకు సౌకర్యంగా ఉంటుంది. అందుకే పురుషుల టాయిలెట్ లైన్లు మహిళల కంటే వేగంగా కదులుతాయి. అయితే, నిలబడటం వల్ల చిమ్మే అవకాశం కూడా పెరుగుతుంది. ఇది ఇతరులకు అసహ్యం కలిగిస్తుంది.
మూత్రం సూక్ష్మ బిందువులు విస్తృత కోణాల్లో చాలాదూరం చిమ్ముతాయని 2013లో అమెరికన్ మెకానికల్ ఇంజనీర్లు కనుగొన్నారు. దీనర్థం సమీపంలోని వస్తువులు, టూత్ బ్రష్‌లపై కూడా మూత్ర బిందువులు పడవచ్చు.
కొన్ని మతాలు, సంస్కృతులు పురుషులు మూత్రవిసర్జన చేసేటప్పుడు కూర్చోవాలని ప్రోత్సహిస్తాయి.
ప్రపంచవ్యాప్తంగా చాలామంది పురుషులకు అలవాట్లు అంత తేలికగా మారవు. నిలబడి మూత్రవిసర్జన చేయడానికే ప్రాధాన్యమిస్తారు.
ఫొటో సోర్స్, Getty Images

13 దేశాలలో సర్వే
పురుషులు ఎలా మూత్రవిసర్జన చేయడానికి ఇష్టపడతారనే దానిపై 2023లో యూగోవ్ కంపెనీ 13 దేశాలలో సర్వే చేసింది.
సమీప దేశాల మధ్య కూడా తేడాలు కనిపించాయి: జర్మనీలో 40 శాతం మంది పురుషులు మూత్రం పోసేటపుడు కూర్చుంటామని చెప్పారు. 10 శాతం మంది మాత్రమే నిలబడతామని చెప్పారు. యూకేలో కేవలం 9 శాతం మంది కూర్చుంటామని చెప్పారు. 33 శాతం మంది నిలబడతామని తెలిపారు.
ఆసక్తికరంగా, జర్మనీలో కూర్చొని మూత్రవిసర్జన చేయడం సాధారణం అయినప్పటికీ, ‘సిట్జ్‌పింక్లర్’ (మూత్రవిసర్జన చేయడానికి కూర్చునే వ్యక్తి) అనే పదాన్ని కొన్నిసార్లు పురుషులను ‘పురుషత్వం లేని వ్యక్తి’ అని అవమానించడానికి ఉపయోగిస్తారు.
మూత్రవిసర్జనకు కూర్చోవడమనేది కేవలం “స్త్రీలు, కప్పలకు” మాత్రమే అని బ్రెజిల్‌లో పాతకాలం వారు చెప్పే మాట.

పరిణామాత్మక అలవాటు?
నిలబడి మూత్రం పోయడమనే విషయంలో పురుషులు పరిణామాత్మక(ఎవల్యూషనరీ) అలవాటుతో పోరాడుతున్నారా?.
”పురుషులు నిలబడి మూత్రవిసర్జన చేయడానికి గల కారణాలను వివరించే పరిణామాత్మక ఆధారాలు లేవు” ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఎవల్యూషనరీ సైకాలజిస్ట్, డాక్టర్ రాబర్ట్ డన్‌బార్ చెప్పారు.
కాబట్టి, కూర్చోవడం అనే ఆలోచనను ఇష్టపడని పురుషులకు ఆ సాకు నిలబడదు.
“కొంతమంది పురుషులకు నిలబడటం సౌకర్యంగా ఉంటే, మరికొందరికి కూర్చోవడం సౌకర్యంగా ఉంటుంది” అని డాక్టర్ మేరీ గార్త్‌వైట్ అన్నారు.
వైద్యపరంగా ఎలాంటి నియమం లేనందున, మూత్రవిసర్జనలో ఎలా ఉండాలనే ఆప్షన్ పురుషుడి వ్యక్తిగతమే – సామాజిక ఒత్తిడి లేదా బాత్రూంలలో నోటీసులు కూర్చోవడానికి ప్రోత్సహిస్తే తప్ప (జర్మనీలో చాలా సాధారణం).
కానీ, నిలబడడాన్ని ఎంచుకుంటే మాత్రం ఆ పని సరిగ్గా పూర్తయ్యేలా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)







