SOURCE :- BBC NEWS

ప్రీతమ్ సివాచ్ 2021లో ద్రోణాచార్య అవార్డును అందుకున్నారు.

ఫొటో సోర్స్, ANI

ఒక గంట క్రితం

బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ ఐదో ఎడిషన్ నామినేషన్లను గురువారం దిల్లీలో ప్రకటించారు.

గోల్ఫ్ క్రీడాకారిణి అదితి అశోక్, షూటర్లు మను భాకర్, అవనీ లేఖర, క్రికెటర్ స్మృతి మంధాన, రెజ్లర్ వినేష్ ఫొగాట్‌లకు ఈ నామినేషన్‌లో చోటు దక్కింది.

2024లో భారత క్రీడాకారిణుల ప్రతిభ, కృషి, వారు సాధించిన విజయాలకు గుర్తుగా ఈ అవార్డును బీబీసీ అందిస్తోంది.

ఈ అయిదుగురిలో ప్రజల నుంచి ఎక్కువ ఓట్లు పొందిన క్రీడాకారిణి బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకుంటారు. ఇందుకోసం భారత కాలమానం ప్రకారం జనవరి 31వ తేదీ శుక్రవారం రాత్రి 11:30 గంటల వరకు ప్రజలు ఓటు వేయవచ్చు. ఫిబ్రవరి 17న న్యూదిల్లీలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో విజేతను ప్రకటిస్తారు.

బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్

బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ ఐదవ ఎడిషన్‌కు సంబంధించి గురువారం విలేకరుల సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా హాజరైన ద్రోణాచార్య అవార్డు గ్రహీత, కోచ్ ప్రీతమ్ సివాచ్, పారిస్ పారాలింపిక్స్‌లో కాంస్యం సాధించిన పారా అథ్లెట్ సిమ్రాన్ శర్మలను స్పోర్ట్స్ జర్నలిస్టులు ప్రశ్నలు అడిగారు, వారి సమాధానాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ఆ ప్రశ్నలు, సమాధానాలను దిగువనిస్తున్నాం.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
భర్తతో సిమ్రాన్

భర్తతో సిమ్రాన్

విలేకరులు ఎలాంటి ప్రశ్నలు అడిగారు?

కృతిశర్మ, వెబ్‌దునియా

భర్త విజయం వెనుక భార్య ఉన్నట్టే.. భార్య విజయం వెనుక భర్త కూడా ఉంటాడు. ఆర్మీలో ఉన్న మీ భర్త కూడా మీకు శిక్షణ ఇచ్చారు. ఈ సంయుక్త శిక్షణ విధానం ఏమిటి, ఇదెప్పుడు ప్రారంభమైంది?

సిమ్రన్: మాకు 2017లో వివాహం అయింది. జీవితంలో ఏం చేయాలనుకుంటున్నావు అని నా భర్త అడిగారు. నా టీ షర్టుపై ఇండియా పేరును చూడాలనుకుంటున్నాను అని చెప్పాను. నేనది కేవలం నవ్వుతూ చెప్పాను. కానీ ఆయన దీనికోసం చాలా కష్టపడాలని చెప్పారు. అబ్బాయిలు చాలా సీరియస్‌గా ఉంటారని నాకు తెలియదు. నా చుట్టుపక్కల ఉండేవారు ఎవరూ కూడా సీరియస్‌గా ఉండేవారు కాదు. పెళ్లయిన మరుసటి రోజే ఆయన నన్ను జిమ్‌కు వెళ్లేందుకు సిద్ధం కమ్మని చెప్పారు.

గోరింట పండిన చేతులతోనే నేను ట్రాక్‌సూట్‌లోకి తిరిగి వచ్చాను పెళ్లికూతురును చూసేందుకు వచ్చినవారంతా కొత్తకోడలు ఎక్కడా అని అడుగుతున్నారు. వారందరికీ కొత్తకోడలను నేనే అని చెప్పాను. అప్పటి నుంచే నా పోరాటం మొదలైంది.

అందరూ ఆ అమ్మాయి ఏమిటి అలాంటి బట్టలు వేసుకుందని మా అత్తపై మాటలదాడికి దిగారు. కూతురు ఎవరో, కోడలు ఎవరో తెలియదు. మీ కోడలు ముసుగు వేసుకోకపోవడం ప్రత్యేకమా అంటూ ప్రశ్నించారు.

అయితే నా భర్త వారితో మాట్లాడుతూ తను ఒలిపింక్స్‌లో షార్ట్స్ ధరించి పరిగెత్తుతుంటే మీరు ఆమెను చూడరా అని ప్రశ్నించారు.

నేను దానికి నవ్వుతుంటే నువ్వెందుకు నవ్వుతున్నావు అని నా భర్త అడిగారు. నువ్వు ఒలిపింక్స్ గురించి మాట్లాడుతుంటే నేను దానిని టీవీలో చూడటం మొదలుపెట్టాను అన్నాను. దీంతో ఆయన నువ్వు ఆ పని చేయలేవు. కానీ నేను చేయిస్తా అన్నారు.

ఆ సమయంలో నేను అంత బలంగా లేను. కానీ నా భర్త నన్ను సిద్ధం చేశారు.

పెళ్లయిన రెండుమూడేళ్ళు చాలా కష్టంగా ఉండేది క్రీడలను వృత్తిగా ఎంచుకోవడం చాలా ఖరీదుతో కూడుకోవడంతో నా భర్త తనకున్న స్థలాన్ని అమ్మేశారు.

బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ ఐదవ ఎడిషన్‌

ప్రీతమ్ సివాచ్ 2021లో ద్రోణాచార్య అవార్డును అందుకున్నారు.

తన క్రీడా ప్రయాణం గురించి కోచ్ ప్రీతమ్ సివాచ్ ఏమన్నారు?

నోరేష్ ప్రీతమ్, స్పోర్ట్స్ జర్నలిస్ట్

ప్రీతమ్, మీరు కామన్‌వెల్త్ గేమ్స్‌లో పాల్గొన్నప్పుడు మీ కొడుకు వయసు 7 నెలలే. ఇప్పుడు తను కూడా ఆడుతున్నాడా? లేదా నేనే ఆడుతాను నువ్వు కూర్చో అని చెబుతున్నారా?

ప్రీతమ్: నా ఇద్దరు పిల్లలు హాకి ఇండియా లీగ్‌లో ఆడుతున్నారు. నేను కోచింగ్ ఇచ్చే సోనిపత్‌లో కూడా 11 మంది ఆడుతున్నారు.

సిమ్రన్ చెపినట్టు మా ఇద్దరి ప్రయాణాలు దాదాపు ఒకేలా సాగాయి. సిమ్రన్ నేటి తరం అమ్మాయి అయితే , నా ప్రయాణం 20-25 సంవత్సరాల ముందు మొదలైంది. ఈ దారిలో చాలా కష్టాలుంటాయి, అవన్నీ తప్పవు కానీ, వాటిని ఎదుర్కోగలగాలి, అంతే.

అమ్మాయిల క్రీడలపై సమాజంలో అవగాహన కల్పించాలి. ఇదే ఆలోచనను ఆచరణలో పెడుతూ నేను ఒక టీమ్‌ను తయారు చేశాను. నేను చూసిన ఇబ్బందులు రాబోయే తరం అమ్మాయిలు ఎదుర్కోవద్దని నా ఆశ. నాకు అర్జున, ద్రోణాచార్య పురస్కారాలు రావడం మంచి ప్రోత్సాహం.

ఇన్ని సంవత్సరాలు క్రీడాకారిణిగా నిలిచాక, నా వంతుగా సమాజానికి తిరిగివ్వాలనుకున్నాను. అందుకే గత 20 సంవత్సరాలుగా కోచింగ్ ఇస్తున్నాను. హాకీలో ఇప్పటివరకు ద్రోణాచార్య పురస్కారాన్ని అందుకున్న ఏకైక మహిళను నేనే.

మనకు మహిళా కోచ్‌లు ఎంత అవసరం, కొరత ఎందుకు ఉంది?

శారదా ఉగ్రా, స్పోర్ట్స్ జర్నలిస్ట్

ప్రీతమ్, మీరు ద్రోణాచార్య అవార్డు గెలుచుకున్న ఏకైక మహిళను అని చెప్పారు. ఆటల్లో మహిళా కోచ్‌ల అవసరం ఎంత ఉంది, మహిళా కోచ్‌ల కొరత ఎందుకుంది? మహిళా కోచ్‌ల విషయంలో పరిస్థితి మారిందా?

ప్రీతమ్ సివాచ్: ఇది చాలా మంచి ప్రశ్న.మగవాళ్లు తప్పుగా అనుకోవద్దు. దేశంలో నేను చూసినది పురుషాధిక్య సమాజాన్ని. మహిళలు చాలా దూరం వెళ్లారని చెబుతారు కానీ, నా ప్రాంతంలో చాలామంది పాత్రికేయులు నా ఆటను చూశారు, నా కెరీర్ మొత్తాన్ని చూశారు. ఆటలకు నా జీవితాన్ని అంకితం చేశాను. ఆడటంలో 20 ఏళ్ళు, తరువాత 20 ఏళ్లను శిక్షణ కోసం వెచ్చించాను. అయినా ఇప్పటికీ, ద్రోణాచార్య అవార్డును తీసుకున్న తరువాత కూడా ఓ మహిళ భారతజట్టుకు కోచ్ కాగలదని నేను అనుకోవడం లేదు.

ఇదో పెద్ద నిజం. ప్రత్యేకించి కోచింగ్ విషయంలో ఇలా ఆలోచిస్తారు. మేం ఆటగాళ్ళకు కింది స్థాయి నుంచి కోచింగ్ ఇచ్చి దేశం కోసం తయారు చేయగలిగినప్పుడు, పైస్థాయిలో ఎందుకు రాణించలేం?

అందుకని మేం నమ్మకాన్ని కుదర్చాలి. ఈ పురస్కారాలు ఇచ్చేటప్పుడు నేను నా పేరుని రెండు సార్లు పంపాను, అప్పుడు అసలు మహిళలకి ఈ పురస్కారం దక్కుతుందా అని ప్రశ్నించడం మొదలుపెట్టారు?

మహిళైతే మాత్రం ఎందుకు రాదు అని నన్ను నేను ప్రశ్నించుకున్నా. . నాకు కచ్చితంగా వస్తుందని నేను దానిని సవాల్‌గా తీసుకున్నాను.

ప్రతీ మహిళా పని చెయ్యాలని నేను కోరుకుంటా. చాల మంది మహిళలు తమని ముందుకు వెళ్లనివ్వరని వెనకడుగు వేస్తారు. కానీ మేం ముందుకొచ్చి మా కోసం మేం పోరాడితే తప్ప మాకు ఏమీ దక్కదు.

అందుకే నేను చాలా పోరాడాను. అందరు పోరాడాలి. మహిళలు ముందుకు రావాలి. కోచింగ్ లో పాల్గొనాలి. ప్రతి రంగంలో మహిళలు పాల్గొనాలి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)