SOURCE :- BBC NEWS
- రచయిత, డాక్టర్ దేశం పీఆర్
- హోదా, బీబీసీ కోసం
-
5 జనవరి 2025
రంగారావుకు పదేళ్లుగా షుగర్ ఉంది. మంచి ఆహార నియమాలు పాటిస్తూ, రోజూ వ్యాయామం చేస్తూ, ఆయన ప్రతి ఆరు నెలలకు ఒకసారి డాక్టర్‌ని కలిసి, మందులు వాడుతూ ఉంటారు.
కానీ గత నెలలో సీతాఫలాలు చూడగానే రంగారావుకు నోరూరింది. వెంటనే బుట్ట నిండా సీతాఫలాలు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుని రోజుకొకటి తిన్నారు.
షుగర్ పరీక్ష చేయించుకుని 8 నెలలు దాటడంతో ఈనెల డాక్టర్ దగ్గరకు వెళ్లాలనుకున్నారు. కానీ డాక్టర్ తిడతారేమోనని ఓపక్క భయంగా ఉంది. దీంతో రెండు మూడు రోజులుగా ఏమీ తినకుండా ఉపవాసం చేస్తున్నారు. డాక్టర్ దగ్గరికి వెళ్లే ముందు రోజు మధ్యాహ్నం, రాత్రి కేవలం ఒక జొన్న రొట్టె, గుడ్డు కూర తిన్నారు.
ఆస్పత్రికి వెళ్లి చూస్తే ఈసారి కొత్త డాక్టర్ ఉన్నారు. పాత డాక్టర్ పది రోజులు సెలవు పెట్టారని, కొత్త డాక్టర్ వచ్చారని చెప్పారు. దీంతో హమ్మయ్య అనుకున్నారు రంగారావు.
కానీ మామూలుగా ఏమీ తినకుండా చేయించుకునే ఫాస్టింగ్ షుగర్ పరీక్ష, తిన్నాక చేయించుకునే షుగర్ పరీక్ష కాకుండా ఇంకో కొత్త పరీక్ష రాశారు. రంగారావుకు ఆ పరీక్ష చేయించుకోవడం ఇష్టం లేదు. అయినా డాక్టర్ రాశారని చేయించుకున్నారు.
రంగారావుకు ఫాస్టింగ్ షుగర్ టెస్టులో గ్లూకోజ్ విలువ 150 mg/dl ఉంటే, తిన్నాక 270 mg/dl ఉంది. డాక్టర్ చేయించిన కొత్త టెస్టులో మాత్రం 9 శాతం అని వచ్చింది.
పాత డాక్టర్ మామూలుగా మాట్లాడి, మందులు మార్చి రాసేవారు. కానీ కొత్త డాక్టర్ కాస్త స్ట్రిక్టుగా ఉన్నారు.
“రక్తంలో చక్కెర శాతం ఎందుకు పెరిగింది?” అని అడిగారు!
రంగారావుకు ఏం చెప్పాలో అర్థం కాలేదు.
“ఎక్కువ పెరగలేదు కదా డాక్టర్” అన్నారు.
“డాక్టర్ మీరా? నేనా?” అని డాక్టర్ అనేసరికి ఇక రంగారావు ఏం మాట్లాడకుండా కూర్చున్నారు.
కొత్త డాక్టర్ పేపరు, పెన్ను తీసి దానిపైన అంకెలు రాయడం మొదలుపెట్టారు.
మామూలు షుగర్ పరీక్షలు ముందురోజు మనం తినే ఆహారం బట్టి మారే అవకాశం ఉంటుందని, ఈ పరీక్ష అలా కాదని ఆయన చెప్పారు. మూడు నెలల షుగర్ పరీక్షను హెచ్ బీఏ1సీ (HbA1C) అంటారని, అందులో షుగర్ ఉండాల్సిన పరిమితికి మించి ఉందని చెప్పారు. అలా ఉంటే షుగర్ అసలు నియంత్రణలో లేనట్టు అని, తీపి పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇలా జరుగుతుందని ఆయన రంగారావుకు వివరించారు.
HbA1C పరీక్ష అంటే?
HbA1C పరీక్షను A1C పరీక్ష లేదా గ్లైకేటేడ్ హిమోగ్లోబిన్ లేదా హిమోగ్లోబిన్ A1C పరీక్ష అని కూడా పిలుస్తారు. రక్తంలో గ్లూకోజ్ అంటుకొని ఉన్న హిమోగ్లోబిన్ ప్రోటీన్ మొత్తాన్ని ఈ పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు.
గత 3 నెలలు (8 నుండి 12 వారాలు)గా రక్తంలోని గ్లూకోజ్ స్థాయిని HbA1C సూచిస్తుంది. అంటే నిన్న, మొన్న తిన్న ఆహారం వల్ల కాకుండా, గత మూడు నెలలుగా మనం తీసుకునే ఆహారాన్ని బట్టి రక్తంలో షుగర్ శాతం ఎంత ఉందో తెలుపుతుంది.
ఈ పరీక్ష డయాబెటిస్ ఉన్న వారికి రక్తంలో చక్కెర స్థాయులను పరీక్షించడానికి, అలాగే షుగర్ ముందు స్టేజీ (ప్రీ-డయాబెటిస్), షుగర్ (మధుమేహం/డయాబెటిస్)ని గుర్తించడం కోసం ఉపయోగపడుతుంది.
ఈ పరీక్షకు ఉపవాసం ఉండాల్సిన పనిలేదు. తినే ఆహారంతో నిమిత్తం లేకుండా రోజులో ఎప్పుడైనా ఈ పరీక్ష చేయవచ్చు.
HbA1C ఫలితాలను ఎలా చూడాలి?
షుగర్ వ్యాధి లేని వారందరికీ హిమోగ్లోబిన్ A1C స్థాయి సాధారణంగా 4% నుంచి 5.6% మధ్య ఉంటుంది. హిమోగ్లోబిన్ A1C స్థాయి 5.7% నుంచి 6.4% మధ్య ఉంటే ప్రీ-డయాబెటిస్ స్థాయి అని, ముందు ముందు వీరికి మధుమేహం వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని అర్థం. ఈ విలువ 6.5% లేదా అంతకన్నా ఎక్కువ ఉంటే షుగర్ వ్యాధి ఉందని అర్థం.
అప్పుడు రక్తంలో షుగర్ స్థాయి నియంత్రణకు మందులు వాడాల్సి ఉంటుంది. ఈ స్థాయి 9% మించి ఉంది అంటే వారికి షుగర్ ఏమాత్రం నియంత్రణలో లేదని, దీని వల్ల శరీరంలోని కొన్ని అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఎక్కువగా ఉందని అర్థం.
ఈ పరీక్ష ఎప్పుడు చేయించుకోవాలి?
45 ఏళ్లు పైబడిన వారు ఏడాదికోసారి ఈ పరీక్ష చేయించుకోవడం మంచిది.
తల్లిదండ్రులకు, అక్కాచెల్లెళ్లకు, అన్నదమ్ములకు డయాబెటిస్ ఉంటే వయసుతో సంబంధం లేకుండా ఏడాదికోసారి HbA1C పరీక్ష చేయించుకోవడం మంచిది.
అధిక బరువు, రక్తపోటు, గుండె జబ్బులు ఉన్నవారు, 30 నుండి 45 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు ప్రతి రెండేళ్లకోసారి ఈ పరీక్ష చేయించుకోవాలి.
షుగర్ వ్యాధి లక్షణాలు ఏమైనా ఉన్నాయని అనుమానం ఉంటే ఈ పరీక్ష చేయించుకోవాలి.
ప్రీ-డయాబెటిస్ అంటే ఏమిటి?
ప్రీ-డయాబెటిస్ అంటే రక్తంలోని చక్కెర శాతాన్ని శరీరం అదుపులో పెట్టుకోలేకపోతోంది అని అర్థం. ఇంకొన్ని సంవత్సరాల్లో అవయవాలు సరిగా పనిచేయక, చక్కెర స్థాయులు నియంత్రణలో ఉండవు అని అర్థం.
రోజువారీ ఆహారంలో, జీవనశైలిలో మార్పులు చేసుకుంటే షుగర్ వ్యాధి రాకుండా మరికొన్నేళ్ల పాటు నియంత్రించవచ్చు. ఆరోగ్యకరమైన ఆహార నియమాలతో శరీరం మళ్లీ చక్కెర స్థాయులను నియంత్రించుకోగలిగే సామర్థ్యాన్ని పుంజుకుంటుంది.
ప్రీ-డయాబెటిస్ (డయాబెటిస్ ముందు స్టేజీ)లో ఉన్నట్టు HbA1C పరీక్షలో చూపిస్తే, వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి.
ఈ పరీక్ష ఎలా చేస్తారు?
HbA1C పరీక్ష మామూలు రక్త పరీక్షే. ఏ అక్రెడిటెడ్ ల్యాబ్ లోనైనా ఈ పరీక్ష చేయించుకోవచ్చు.
ఐదు నిమిషాల్లో రక్తం సేకరిస్తారు, పరీక్ష చేసి అదే రోజు ఫలితాలు ఇచ్చేస్తారు.
గత 2-3 నెలల్లో రక్తంలోని సగటు చక్కెర స్థాయిని ఇది సూచిస్తుంది. కాబట్టి పరీక్షకు ముందు ఏమీ తినకపోయినా, నీళ్లు తాగినా, భోజనం చేసినా అది HbA1C పరీక్ష ఫలితాన్ని మార్చదు.
అయితే, కేవలం HbA1C పరీక్షను బట్టి డాక్టర్లు మందులు సూచించలేరు.
ఉపవాసం, భోజనం తర్వాత వచ్చే విలువలను బట్టి మాత్రమే చక్కెరను నియంత్రించే సరైన మందులను డాక్టర్లు రాయగలరు.
HbA1C ని ఎలా తగ్గించుకోవచ్చు?
HbA1C మూడు నెలల సగటు రక్త పరీక్ష కాబట్టి దాన్ని రెండు మూడు రోజుల్లో ఆహారపు అలవాట్లలో మార్పులు చేసో, మందులు వేసుకునో తగ్గించలేం. కచ్చితంగా కనీసం మూడు నెలల పాటు జీవనశైలిని మార్చుకొని, రోజూ వ్యాయామం చేసి, ఆహారపు అలవాట్లు మార్చుకుంటేనే HbA1C విలువ తగ్గుతుంది.
షుగర్ మందులు వాడేవారు, ప్రతిరోజూ క్రమం తప్పకుండా మందులు వాడితేనే HbA1C నియంత్రణలో ఉంటుంది.
షుగర్ వ్యాధి ఉన్నవాళ్లు ఆరు నెలలకోసారి ఈ పరీక్ష చేయించుకుంటే చాలు.
అసలు ఏమిటీ HbA1C?
మనం తినే ఆహారాన్ని బట్టి జీర్ణాశయం నుంచి రక్తంలోకి గ్లూకోజ్ విడుదలవుతుంది. అది రక్తంలో స్వేచ్ఛగా అటూ ఇటూ తిరుగుతుంది.
అయితే రక్తంలో రకరకాల ప్రోటీన్లు కూడా ఉంటాయి. శరీరంలోని అన్ని భాగాలకూ ఆక్సిజన్ సరఫరా చేసే ఎర్ర రక్త కణాల్లో ఉండే హిమోగ్లోబిన్ కూడా వాటిలో ఒకటి. ఈ హిమోగ్లోబిన్ కి స్వేచ్ఛగా తిరిగే గ్లూకోజ్ మాలిక్యూల్ అంటుకుంటుంది. దీన్నే గ్లైకేషన్ అంటారు.
ఇలా గ్లూకోజ్ అంటుకున్న హిమోగ్లోబిన్ ను గ్లైకేటెడ్ హిమోగ్లోబిన్ అంటారు.
ఎర్ర రక్త కణాల జీవిత కాలం రెండు, మూడు నెలలే కాబట్టి, గత మూడు నెలలుగా గ్లూకోజ్ (చక్కెర) వీటికి ఎంత మేరకు అతుక్కుందో సూచిస్తుంది. ఎక్కువ శాతం చక్కెర రక్తంలో తిరుగుతూ ఉంటే, ఎక్కువ శాతం హిమోగ్లోబిన్ కు అతుక్కుంటుంది. అదే ఈ పరీక్ష లో తెలుస్తుంది.
అందరికీ అవసరమా?
హిమోగ్లోబిన్ తో పాటు అల్బుమిన్, ఫరిటిన్, ఫైబ్రినోజెన్ వంటి ప్రోటీన్లకు కూడా గ్లూకోజ్ అతుక్కుంటుంది. కానీ అందరికీ ఈ పరీక్షలు అవసరం ఉండవు.
సివియర్ ఎనీమియా (రక్తంలో హిమోగ్లోబిన్ శాతం చాలా తక్కువగా) ఉన్న వారికి, కిడ్నీల సమస్య వలన రక్తం సరిగా ఉత్పత్తి కాని వారికి, హీమోఫీలియా లాంటి రక్త సంబంధ వ్యాధులు ఉన్న వారికి, లివర్ సంబంధిత రోగాలు ఉన్నవారికి HbA1C పరీక్ష ఫలితాలు నమ్మదగినవిగా ఉండవు. అలాంటివారికి మాత్రమే వేరే ప్రోటీన్‌లకు అతుక్కుని ఉన్న గ్లూకోజ్ శాతం పరీక్షలు అవసరం అవుతాయి.
(గమనిక: రచయిత వైద్యురాలు. ఇక్కడ చెప్పిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్యపరమైన ఏ అవసరం వచ్చినా వైద్యులను సంప్రదించి మాత్రమే నిర్ణయం తీసుకోగలరు)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
SOURCE : BBC NEWS