SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, Getty Images
ఒక గంట క్రితం
ఆసియా దేశాల్లో కరోనా -19 కేసులు పెరుగుతున్నాయి. అయితే భారత్‌లో పరిస్థితులు అదుపులో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.
సింగపూర్‌లో 2025 ఏప్రిల్ 27 నుంచి మే 3 మధ్య 14,200 కొత్త కేసులు నమోదైనట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ తెలిపింది. అంతకు ముందు వారంలో 11,100 కేసులు నమోదయ్యాయి.
చైనాలోనూ కొన్ని నెలలుగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇవి వేగంగా పెరగడానికి ఒమిక్రాన్ వేరియంట్‌కు సబ్ వేరియంట్ అయిన జేఎన్.1 కారణమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
భారత ప్రభుత్వపు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ లెక్కల ప్రకారం భారత్‌లో ప్రస్తుతం 257 కరోనా కేసులు ఉన్నాయి. ఇందులో 53 మంది బాధితులు ఒక్క ముంబయిలోనే ఉన్నారు.

ఏమిటీ జేఎన్ 1
సింగపూర్‌లో నమోదైన కేసుల నుంచి సేకరించిన శాంపిల్స్‌లోని జీనోమ్‌ను పరీక్షించిన తర్వాత, ఇందులో ఎక్కువ శాతం జేఎన్.1 వేరియంట్ ఉన్నట్లు ఎకనామిక్స్ టైమ్స్ కథనం వెల్లడించింది.
అయితే జేఎన్.1 వేరియంట్ పూర్తిగా కొత్తది కాదు. ఇది కోవిడ్ సెకండ్ వేవ్‌లో ప్రపంచమంతా విస్తరించిన ఒమిక్రాన్‌కు సబ్ వేరియంట్.
కోవిడ్ వైరస్‌లో కొత్త వేరియంట్ గురించి దిల్లీలోని ఎయిమ్స్‌లో డిపార్ట్మెంట్ ఆఫ్ కమ్యూనిటీ మెడిసిన్‌లో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న డాక్టర్ సంజయ్ రాయ్ డాక్టర్ సంజయ్ రాయ్‌తో బీబీసీ ప్రతినిధి చందన్ జాజ్వాడే మాట్లాడారు.
కరోనా వ్యాక్సీన్ ట్రయల్స్ మూడు దశలకూ సంజయ్ రాయ్ చీఫ్ రీసర్చర్‌గా పని చేశారు.
ఆయన చెప్పినదాని ప్రకారం…
“జేఎన్.1 అనేది కరోనా ఒమిక్రాన్ వైరస్ నుంచి వచ్చిన వేరియంట్. దీన్ని ఏడాది కిందటే గుర్తించారు. కొత్తదేమీ కాదు. ఇది ఎంత ప్రమాదం అనే దాని గురించి మాకు అవగాహన ఉంది. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మనకు తెలిసినంత వరకు ఇది సాధారణ జలుబు లేదా అంతకంటే కాస్త బలహీనమైనది కూడా కావచ్చు”

ఫొటో సోర్స్, Getty Images
నిపుణుల సలహా ఏమిటి?
“సాధారణ జలుబు కూడా కరోనా వైరస్ లాంటిదే. అది కోవిడ్ కుటుంబానికి చెందినది. కరోనా వైరస్లు వేలల్లో ఉన్నాయి. అయితే అందులో ఏడు మాత్రమే మనుషులకు ఇబ్బంది కలిగిస్తున్నాయి. అందులో నాలుగు ఇప్పటికే ఉన్నాయి. అవి జలుబుకు సంబంధించినవి” అని సంజయ్ రాయ్ చెప్పారు.
“2003-04లో చైనాలో సార్స్-1 గుర్తించిన తర్వాత, 2012-13లో మిడిల్ ఈస్ట్ నుంచి మెర్స్ వచ్చింది. దీని తర్వాత 2019లో మనం కోవిడ్-19 అని పిలుస్తున్న కరోనా వైరస్-2 వచ్చింది” అని ఆయన అన్నారు.
‘‘ఎవరికైనా సాధారణంగా జలుబు చేస్తే, ఇంట్లో ఉన్న అందరికీ సోకుతుంది. అది ప్రాణాలు పోయేంత ప్రమాదకరమైనదేమీ కాదు. కరోనా కూడా అంతే ’’ అని సంజయ్ రాయ్ చెప్పారు.
‘‘ప్రస్తుతం సింగపూర్‌లో విస్తరిస్తున్న కోవిడ్ వేరియంట్లలో ఎల్ఎఫ్.7, ఎన్బి 1.8 (ఇది జేఎన్.1 సబ్ వేరియంట్) ప్రధానమైనవి. ఇటీవల పరీక్షలు నిర్వహించిన కేసుల్లో మూడింట రెండొంతులు జీనోమ్‌లు వీటికి సంబంధించినవే. కోవిడ్ -19కు ఉపయోగిస్తున్న వ్యాక్సీన్‌నే జేఎన్.1కు కూడా ఉపయోగిస్తున్నాం” అని సింగపూర్ ఆరోగ్యశాఖ తెలిపింది.
గతంలో సోకిన కరోనా వేరియంట్లతో పోలిస్తే జేఎన్.1 వల్ల ఎవరూ తీవ్రంగా అనారోగ్యం పాలవరని, అయితే అది వ్యాపిస్తున్న తీరు ఆందోళన కలిగిస్తోందని నిపుణులు చెబుతున్నారు.
“ఇది అనేకసార్లు రావచ్చు. జలుబు, ఇతర ఫ్లూల మాదిరిగా ఇది ఒక్కసారి వచ్చిపోదు. కరోనాలో 10వేల వేరియంట్లు ఉన్నాయి. అది పూర్తిగా మారిపోయింది” అని సంజయ్ రాయ్ చెప్పారు.
‘‘కోవిడ్ సమయంలో మేము ఒక సర్వే నిర్వహిచినప్పుడు, అందరిలోనూ యాంటీ బాడీస్ అభివృద్ధి చెందాయి. దీనర్థం ఏంటంటే అందరికీ కరోనా సోకిందని’’ అని ఆయన అన్నారు.
కరోనా కేసుల విషయానికొస్తే, వైరస్ సోకిన కొంతమంది ఆసుపత్రుల్లో చేరినట్లు వార్తలు వస్తున్నాయి.
ముంబయిలోని ఓ ఆసుపత్రిలో ఇద్దరు కరోనా సోకిన వ్యక్తులు చేరారని, అయితే దీని గురించి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి ప్రకాశ్ అబిత్కర్ చెప్పారు.
ఎవరికైనా సాధారణ జలుబు చేసినా, వారిని ఆసుపత్రిలో చేర్చాల్సిన అవసరం ఏర్పడవచ్చని డాక్టర్ సంజయ్ రాయ్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
జేఎన్.1 లక్షణాలు, భారత్ సంసిద్ధత
కరోనా వైరస్‌కు చెందిన జేఎన్.1 వేరియంట్ లక్షణాలు ఒమిక్రాన్ మాదిరిగానే ఉన్నాయి.
ఈ వైరస్ సోకిన వారిలో గొంతు నొప్పి, అలసట, దగ్గు, తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి.
ఈ లక్షణాలు కూడా వ్యాధి సోకిన వారి ఆరోగ్యం, వ్యాధి నిరోధక శక్తిపై ఆధారపడి బయట పడుతున్నాయి.
జేఎన్.1 సోకిన వారిలో కనిపిస్తున్న రెండు ప్రధాన లక్షణాలు డయేరియా, తలనొప్పి.
సింగపూర్, హాంకాంగ్‌లో కేసులు పెరుగుతూ ఉండటంతో భారత్‌లో సోమవారం డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ నాయకత్వంలో ఉన్నత స్థాయి సమావేశం జరిగినట్లు పీటీఐ వార్తా సంస్థ తెలిపింది.
నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, ఎమర్జెన్సీ మెడికల్ రిలీఫ్ డివిజన్, డిజాస్టర్ మేనేజ్మెంట్ సెల్, ఇండియన్ మెడికల్ రీసర్చ్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ హాస్పిటల్స్‌కు చెందిన నిపుణులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
“కరోనా-19కు సంబంధించి ప్రస్తుతం భారత్‌లో పరిస్థితులు అదుపులో ఉన్నాయి. 2025 మే 19 నాటికి దేశంలో 257 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశ విస్తృత జనాభానుబట్టి చూస్తే ఈ సంఖ్య చాలా చిన్నది. కేసుల్లో ఏవీ తీవ్రమైనవి లేవు. ఎవరినీ ఆసుపత్రిలో చేర్చాల్సిన అవసరం కూడా లేదు” అని ఒక అధికారి చెప్పినట్లు పీటీఐ వెల్లడించింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)