SOURCE :- BBC NEWS

అబీ వు తొలిసారి కాస్మెటిక్ సర్జరీ చేయించుకున్నప్పుడు ఆమెకు కేవలం 14 ఏళ్లే. హార్మోన్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత, అబీ 42 కేజీల నుంచి 62 కేజీలకు బరువు పెరిగారు. అది కూడా కేవలం రెండు నెలల్లోనే.
డ్రామా టీచర్ ఒకరు అబీ శరీరంలో వచ్చిన మార్పులను గమనించారు. అప్పుడు అబీ పరీక్షల కోసం ప్రిపేరవుతోంది.
”నువ్వు మా స్టార్‌వి. కానీ, చాలా లావైపోయావు. నటననైనా వదులుకోవాలి లేదా బరువైనా తగ్గించుకోవాలి అని మా డ్రామా టీచర్ అన్నారు” అని అబీ గుర్తు చేసుకున్నారు.
డ్రామా టీచర్ మాటలతో అబీ తల్లి ఆమెకు కడుపు, కాళ్లల్లో ఉన్న కొవ్వును తీయించేందుకు లైపోసక్షన్ చికిత్స కోసం తీసుకెళ్లారు.
ఆస్పత్రికి తీసుకెళ్తూ తన తల్లి అన్న మాటలు అబీకి ఇప్పటికీ గుర్తు ఉన్నాయి.
‘‘ధైర్యంగా ఉండు, లోపలికి వెళ్లు. బయటికి వచ్చేటప్పుడు నువ్వు అందంగా మారతావు అని అమ్మ చెప్పింది’’ అని అబీ అన్నారు.
తన సర్జరీ చాలా బాధాకరంగా జరిగిందని చెప్పారు అబీ. ఆమెకు అనెస్థీషియాను పూర్తిగా ఇవ్వలేదు. ఆపరేషన్ జరిగేటప్పుడు ఆమెకు పూర్తి స్పృహ ఉంది.
”నా శరీరం నుంచి కొవ్వును తొలగిస్తున్నప్పుడు, ఎంత రక్తం బయటికి వచ్చిందో చూశాను” అని అబీ తెలిపారు.
అబీ వయసు 35 ఏళ్లు. ఇప్పటికే ఇలాంటి వందలాది ఆపరేషన్లను ఆమె చేయించుకున్నారు. దీనికోసం 5 లక్షల డాలర్లను (రూ.4 కోట్లకు పైగా) ఖర్చు పెట్టినట్లు అబీ తెలిపారు.

చైనాలో ప్లాస్టిక్ సర్జరీలకు పెరుగుతున్న పాపులారిటీ
బీజింగ్‌లో అబీకి ఒక బ్యూటీ క్లినిక్ ఉంది. చైనాలో పెరుగుతోన్న ప్లాస్టిక్ సర్జరీ కేసులకు ఆమె ఒక ఉదాహరణ.
బీజింగ్‌లో ఆమెకు ఒక విలాసవంతమైన డూప్లెక్స్ ఉంది. తన డూప్లెక్స్‌లో అద్దం ముందు కూర్చున్న అబీ, ఇటీవల ముఖం చిన్నగా, అందంగా కనిపించేందుకు తీసుకున్న ఇంజెక్షన్లతో చర్మంపై కనిపిస్తున్న మచ్చలకు కన్సీలర్ రాసుకుంటున్నారు.
ఈ చికిత్సతో ఆమె ముఖంపైన చర్మం ‘బిగుతుగా, సన్నగా’ అయింది. ప్రతి నెలా అబీ ఇలాంటి చికిత్సను తీసుకుంటున్నారు. ఎందుకంటే, ఆమె దవడకు మూడు శస్త్రచికిత్సలు జరిగాయి. ఆ సమయంలో పలు ఎముకలను తొలగించారు.
అయితే, సర్జరీలు చేయించుకున్నందుకు ఆమెకెలాంటి పశ్చాత్తాపం లేదు. తన విషయంలో తల్లి తీసుకున్న నిర్ణయం సరైనదేనని అబీ అంటున్నారు.
‘‘సర్జరీ బాగా పని చేసింది. నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. చాలా ఆనందంగా ఉన్నాను. అమ్మ చాలా మంచి నిర్ణయం తీసుకుంది” అని అన్నారు.
చైనాలో అంతకుముందు ప్లాస్టిక్ సర్జరీని నిషేధంగా చూసేవారు. కానీ, రెండు దశాబ్దాల తర్వాత ఇక్కడ ప్లాస్టిక్ సర్జరీలు చాలా పాపులర్ అయ్యాయి. ఆ దేశంలో ప్రతియేటా 2 కోట్ల మంది కాస్మెటిక్ సర్జరీ చేయించుకుంటున్నారు.

ఫొటో సోర్స్, Family handout
చైనా సంస్కృతిలో ముఖ్యంగా మహిళలు, ప్రస్తుతం మీరెలా కనిపిస్తారన్న దానిపై ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే, ఆ దేశంలో బ్యూటీ స్టాండర్డ్స్ మారుతున్నాయి.
కొన్నేళ్ల కిందటి వరకు పాశ్చాత్య దేశాలతో అనుసంధానమైన బ్యూటీ ప్రమాణాల గురించి ఎక్కువగా చర్చించుకునేవారు. రెండు కనురెప్పలు, గడ్డం బాగా కనిపించడం, పెద్ద ముక్కు వంటి కొరియన్ పాప్, యానిమెలు ప్రాచుర్యం పొందాయి.
కానీ, ఇప్పుడు సర్జరీ ప్రొసీజర్ల గురించి మాట్లాడుకుంటున్నారు. తమను మరింత అందంగా, పిల్లల్లా కనిపించేలా మార్చాలంటూ డాక్టర్లను కోరుతున్నారు.
చెవి వెనుకాల బోటాక్స్ను వేయించుకుంటున్నారు. ఇది యవ్వనంగా, అందమైన ముఖం వచ్చేలా మారుస్తుందనే భావన ఉంది.
యానిమె క్యారెక్టర్లలో కనిపించేట్లుగా అతిపెద్ద కళ్ల కోసం కింద కంటిరెప్పల సర్జరీ చేయించుకోవడం, ముక్కుకు, పెదాలకు మధ్య దూరాన్ని తగ్గించేందుకు పైపెదవి సర్జరీ చేయించుకోవడం, అందంగా కనిపించేందుకు ముక్కుకు సర్జరీ వంటివి దీనిలో ఉంటున్నాయి.
అయితే, ఈ అందం కేవలం స్క్రీన్లపై కనిపించేందుకే. నిజ జీవితంలో మనిషి ముఖంలాగా ఇది కనిపించదు.

ఫొటో సోర్స్, Abby Wu
చైనాలో బ్యూటీ యాప్‌లకు పెరుగుతోన్న ఆదరణ
కాస్మెటిక్ సర్జరీ యాప్‌లు సోయంగ్ (న్యూ ఆక్సీజన్), జెంగ్మే (మోర్ బ్యూటిఫుల్) వంటి వాటికి చైనాలో బాగా ప్రాచుర్యం లభిస్తోంది. ఆల్గారిథమ్‌ల ద్వారా ముఖాన్ని పరిశీలించి, ముఖంపై ఉన్న లోపాలను సవరిస్తామని ఈ యాప్‌లు యువతకు చెబుతున్నాయి.
ముఖాన్ని స్కాన్ చేసిన తర్వాత, ఏం సర్జరీ చేయించుకోవాలో వారికి పలు సూచనలు చేస్తాయి. అలాగే, దగ్గర్లో ఉన్న క్లినిక్స్ వివరాలు చెబుతాయి. ప్రతి ఆపరేషన్‌కు ఈ యాప్‌లు కొంత కమిషన్ తీసుకుంటాయి.
ఈ ట్రెండ్స్‌ను సోషల్ మీడియాలో సెలబ్రిటీలు ప్రమోట్ చేస్తున్నారు. ఈ చికిత్సలు చాలా కామన్ అన్నట్లుగా వాళ్లు మాట్లాడుతుంటారు.
చైనీస్ సర్జరీ ఇన్ఫ్లుయెన్సర్గా బాగా పాపులర్ అయిన అబీ, ఈ మొత్తం సర్జరీ ప్రక్రియను సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో డాక్యుమెంటరీ రూపంలో పొందుపరిచారు. ఆమె సోయంగ్ అనే యాప్‌లో కూడా చేరారు.
వందకు పైగా కాస్మెటిక్ ప్రొసీజర్లు చేయించుకున్నప్పటికీ, యాప్‌లో చేరిన తర్వాత, ‘మ్యాజిక్ మిర్రర్’ అనే ఫీచర్ ఆమెకు మరిన్ని కాస్మెటిక్ సూచనలు చేసింది. యాప్ ఇచ్చిన ఆ సూచనలు చూసి అబీ ఆశ్చర్యపోయారు.
చైనాలో కాస్మెటిక్ సర్జరీలకు బాగా డిమాండ్ పెరుగుతుండటంతో, ఈ క్లినిక్స్ కూడా ఎక్కువగా వెలుస్తున్నాయి. కానీ, అర్హులైన ప్రాక్టీషనర్ల కొరత ఉంది. లైసెన్స్ లేకుండానే చాలా క్లినిక్స్ నడుస్తున్నాయి.
చైనాలో 80 వేల ప్రాంతాల్లో కాస్మెటిక్ సర్జరీలు లైసెన్స్ లేకుండానే జరుగుతున్నాయని మార్కెటింగ్ రీసెర్చ్ కంపెనీ ఐ రీసెర్చ్ తన 2019 రిపోర్టులో వెల్లడించింది. వాటిల్లో సర్జరీలు చేస్తోన్న లక్షలమందికి అసలు అర్హతే లేదని పేర్కొంది.
దీనివల్ల, కాస్మెటిక్ సర్జరీ క్లినిక్స్‌లో ప్రతిరోజూ వందలాది ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపింది.
షాంఘైలో కాస్మెటిక్ సర్జరీ క్లినిక్ నడుపుతోన్న ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ యంగ్ లూ దీనిపై మాట్లాడుతూ.. సర్జరీ సమయంలో ప్రమాదాలు ఇటీవల బాగా పెరిగినట్లు తెలిపారు.
‘‘ చాలామంది పేషెంట్ల తొలి సర్జరీ ఫెయిల్ అయినట్లు నేను చూశాను. ఎందుకంటే, వారు లైసెన్స్ లేని క్లినిక్స్‌లో ఈ చికిత్స చేయించుకున్నారు. కొందరైతే తమ ఇంట్లోనే సర్జరీ చేయించుకున్నారు’’ అని చెప్పారు.

ఫొటో సోర్స్, Gao Liu
భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తోంది
సర్జరీ బెడిసి కొట్టిన వారిలో 28ఏళ్ల యు యు ఒకరు. 2020లో ఆమె తన స్నేహితురాలి క్లినిక్‌లో కొలేజన్ ఇంజెక్షన్‌ను బేబీ ఫేస్ కోసం తీసుకున్నారు.
ఇది ఆమె ముఖం బొద్దుగా కనిపించేందుకు తీసుకున్నది. ఈ క్లినిక్‌కు లైసెన్స్ లేదు.
అయితే, ఆ ఫిల్లర్ల వల్ల ఆమె ఇబ్బంది పడ్డారు. ”నా చర్మం కింద ఏదో సిమెంట్ ఉన్నట్లు నాకనిపించింది’’ అని యు యు చెప్పారు.
దీనికోసం ఆమె సోషల్ మీడియాలో కనిపించిన మరో క్లినిక్‌కు వెళ్లారు. అక్కడికి వెళ్లిన తర్వాత ఆమె పరిస్థితి మరింత ఘోరంగా మారింది.
క్లినిక్‌లో సిరంజీ వాడుతూ ఆ ఫిల్లర్లను తొలగించేందుకు ప్రయత్నించారు. కానీ, గట్టిగా ఉన్న ఆ భాగాన్ని తొలగించడానికి బదులు, కణజాలాన్ని తీసేశారు. అది ఆమె చర్మంపై ప్రభావం చూపింది.
చెవులకు కిందనున్న చర్మాన్ని పైకి లేపడం ద్వారా ఫిల్లర్‌ను తొలగించేందుకు మరో క్లినిక్ ప్రయత్నించింది. దీంతో, ఆమె శరీరంపై రెండు పెద్ద గాయాలు ఏర్పడి, ముఖం అసహజంగా బిగుతుగా మారింది.
ఆ తర్వాత సోయంగ్ యాప్ ద్వారా డాక్టర్ యాంగ్‌ను సంప్రదించారు. అక్కడే ఆమె చికిత్స తీసుకోవడం ప్రారంభించారు. ఆ చికిత్స ఆమెకు సాయపడింది. కానీ, అంతకుముందు చికిత్స వల్ల జరిగిన నష్టాన్ని భర్తీ చేయడం అసాధ్యమని యు యు అన్నారు.
‘‘నాకు ఇప్పుడు అందంగా కనిపించాలనే కోరిక లేదు. ఒకవేళ నాకు అవకాశం ఉంటే, సర్జరీకి ముందు ఎలా ఉన్నానో అలాగే కావాలని కోరుకుంటున్నా. అదే నాకు నచ్చింది’’ అని యు యు చెప్పారు.

ఫొటో సోర్స్, SoYoung
కాస్మెటిక్ సర్జరీకి పెరుగుతోన్న మార్కెట్
లైసెన్స్ లేని క్లినిక్స్‌లో చికిత్స చేయించుకోవడం వల్ల యు యు లాగా ప్రతియేటా చైనాలో వేలమంది సమస్యల్లో పడుతున్నారు.
లైసెన్స్ ఉన్న చాలా క్లినిక్స్ కూడా నిబంధనలను సరిగ్గా పాటించడం లేదు.
2020లో నటి గావో లియు తన ముక్కుకు సర్జరీ చేయించుకున్నారు. ఆమెకు కూడా చికిత్స బెడిసి కొట్టింది. ముక్కు పైభాగం నల్లగా మారింది.
‘‘నా ముఖం అందహీనంగా మారింది. యాక్టింగ్ కెరీర్ దెబ్బతింది’’ అని ఆమె తెలిపారు.
లైసెన్స్ ఉన్న క్లినిక్‌లోనే డాక్టర్ హీ మింగ్ వద్ద తాను ముక్కుకు సర్జరీ చేయించుకున్నట్లు గావో లియు చెప్పారు.
ఆయన అక్కడ చీఫ్ సర్జన్‌గా చెప్పుకున్నారని, ముక్కు సర్జరీల్లో నిపుణుడిగా పేర్కొన్నట్లు తెలిపారు.
కానీ, వాస్తవంగా ఆయన ఈ సర్జరీల్లో అంత పెద్ద నిపుణుడు కాదు. స్టేట్ హెల్త్ కమిషన్ నుంచి లైసెన్స్ పొందిన ప్లాస్టిక్ సర్జన్ కూడా కాదు.
నటికి అలా అయిన తర్వాత క్లినిక్‌పై అధికారులు జరిమానా విధించారు. ఆ క్లినిక్‌ను మూసివేశారు. డాక్టర్ హీ మింగ్ సర్జరీలు చేయకుండా 6 నెలల పాటు నిషేధం విధించారు.
కానీ, కొంతకాలం తర్వాత అదే అడ్రస్‌పై చింగ్యా పేరుతో మరో కొత్త క్లినిక్‌ను తెరిచేందుకు డాక్టర్ హీ మింగ్ అప్లికేషన్ పెట్టుకున్నట్లు తెలిసింది.
పాత క్లినిక్-కొత్త క్లినిక్‌కు మధ్యలో సంబంధం ఉందనే బలమైన ఆధారాలను బీబీసీ-ఐ గుర్తించింది. కొత్త క్లినిక్‌లో చేర్చుకున్న చాలామంది ఉద్యోగులు పాత వారేనని తెలిపింది.
2024 ఏప్రిల్‌లో ప్లాస్టిక్ సర్జన్‌గా డాక్టర్ హీ లైసెన్స్ పొందినట్లు బీబీసీ గుర్తించింది. కానీ, ఆయన ప్లాస్టిక్ సర్జన్ లైసెన్స్‌కు దరఖాస్తు చేసుకోకుండా 2021లోనే ఐదేళ్ల పాటు నిషేధం విధించారు.
దీనిపై బీబీసీ అడిగిన ప్రశ్నలకు డాక్టర్ హీ కానీ, చింగ్యా క్లినిక్ కానీ, హెల్త్ కమిషన్ కానీ స్పందించలేదు.

తక్కువ అర్హత కలిగిన హెల్త్ ప్రాక్టీషనర్లపై చర్యలు తీసుకునేందుకు చైనా సెంట్రల్ హెల్త్ కమిషన్ ఇటీవల చర్యలు తీసుకునేందుకు ప్రయత్నిస్తోంది. కానీ, ఈ సమస్య మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది.
జాబ్ సెర్చ్ ప్లాట్‌ఫామ్‌పై ఉద్యోగంతో సంబంధం లేకుండా వారు చూడటానికి ఎలా ఉన్నారన్న విషయంపైనే ఎక్కువగా చర్చించిన సందర్భాలు ఉన్నాయి.
రిసెప్షనిస్ట్ పోస్ట్ కోసం అడ్వర్టయిజ్మెంట్ ఇచ్చినప్పుడు, ‘‘ అభ్యర్థి కచ్చితంగా 160 సెంటీమీటర్ల ఎత్తు ఉండాలి, చూడటానికి అందంగా ఉండాలి’’ అని పేర్కొన్నారు.
సమాజం నుంచి వస్తోన్న ఈ ఒత్తిడిని చైనాలో కొన్ని క్లినిక్‌లు తమకు అనుకూలంగా తీసుకుంటున్నాయి.
2024లో ఒక ప్రముఖ జాబ్ సెర్చ్ వెబ్సైట్ ద్వారా ”బ్యూటీ కన్సల్టెంట్” ఉద్యోగానికి డా లేన్ (పేరు మార్చాం) దరఖాస్తు చేసుకున్నారు. ఇంటర్వ్యూ అయిన తర్వాత ఆ రోజు సాయంత్రమే ఆమెకు ఉద్యోగం వచ్చినట్లు తెలిసింది.
ఆ తర్వాత రోజు ఆమె పనిని ప్రారంభించినప్పుడు, తనను ఒక చిన్న గదికి తీసుకెళ్లిన మేనేజర్, పైనుంచి కిందకు చూసి, కాస్మెటిక్ సర్జరీ చేయించుకోవాలని లేదంటే ఉద్యోగం పోతుందని చెప్పారు.
దీనిపై ఆలోచించుకునేందుకు ఆమెకు గంటకంటే తక్కువ సమయమే ఇచ్చారు. ఈ ఒత్తిడిలో ఆమె కనురెప్పల సర్జరీ చేయించుకునేందుకు అంగీకరించారు.
ఆ సర్జరీ ఖర్చు 13 వేల యువాన్లు. ఆమె నెలవారీ జీతం కంటే మూడింతలు ఎక్కువ. ఆ చికిత్సకు అయ్యే ఖర్చుపై వార్షికంగా 30 శాతం వడ్డీని కూడా విధించారు.
అక్కడి స్టాఫ్ తన చేతుల్లోంచి మొబైల్‌ను తీసేసుకుని, ‘బ్యూటీ లోన్’కు దరఖాస్తు చేశారని లేన్ చెప్పారు. దానిలో ఆదాయం గురించి తప్పుడు సమాచారం ఇవ్వడంతో, నిమిషాల్లో రుణం వచ్చినట్లు తెలిపారు.
సర్జరీ చేయించుకున్నప్పటికీ, ఆమెపై తన మేనేజర్ అరిచేవారని, అవమానించేవారని లేన్ చెప్పారు. కొన్ని వారాల్లోనే ఉద్యోగం మానేసినట్లు తెలిపారు. ఆ ఉద్యోగం నిజమైనది కాదని ఆమెకు అర్థమైంది.

‘చాలామంది అప్పుల్లో కూరుకుపోతున్నారు’
డా లేన్ వంటి చాలామంది బాధితులతో బీబీసీ మాట్లాడింది. ఈ అప్పులను కట్టుకునేందుకు చాలా ఏళ్లు పట్టిందని చాలామంది చెప్పారు.
తనను మోసం చేసిన క్లినిక్ గురించి ఇంతకు ముందు రిపోర్టులు వచ్చాయని డాక్టర్ లేన్ చెప్పారు. ఈ విషయంపై స్థానిక మీడియాలో కూడా వార్తలు వచ్చినట్లు తెలిపారు. కానీ, ఈ క్లినిక్ ఇప్పటికీ తెరిచే ఉంది.
ఈ స్కామ్ ఇతర ఉద్యోగాల్లో కూడా ఉందని తెలిసింది.
కొన్ని లైవ్ స్ట్రీమింగ్ కంపెనీలు యువతను సర్జరీ కోసం రుణాలు తీసుకోవాలని ఒత్తిడి చేస్తున్నాయి. అప్పుడే, ఇన్ఫ్లుయెన్సర్లుగా అవకాశాలు కల్పిస్తామని అంటున్నాయి.
అయితే, ఈ ఒత్తిళ్ల వెనక కంపెనీలకు, క్లినిక్‌లతో మధ్య జరిగిన ఒప్పందాలే కారణం. ప్రతి ఆపరేషన్‌పై కొంతమొత్తంలో కమీషన్ వారి చేతుల్లోకి వచ్చేలా ముందే అగ్రిమెంట్ ఉంటుంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)