SOURCE :- BBC NEWS

అమరావతిలో బుద్ధుడి విగ్రహం

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని విషయంలో పదేళ్లుగా చర్చ నడుస్తూనే ఉంది. 2014లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం నవ్యాంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతిని ప్రకటించి, 2015లో నోటిఫై చేసి, ఆ మేరకు తాత్కాలిక అసెంబ్లీ, సచివాలయం నిర్మాణాలను పూర్తి చేసింది.

అనంతరం, 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్‌సీపీ, పాలనా వికేంద్రీకరణ పేరిట మూడు రాజధానులను తెరపైకి తెచ్చింది.

ఇక, 2024లో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి తిరిగి అమరావతినే ఏకైక రాజధానిగా ప్రకటించింది. ఈ మేరకు మే 2వ తేదీన ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా రాజధాని నిర్మాణ పనులకు మరోసారి శంకుస్థాపన చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.

ఈ నేపథ్యంలోనే ఇటీవల వైసీపీ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ రాజధాని అంశంపై పార్టీ స్టాండ్‌ పై మరోసారి ఆలోచన చేస్తామని వ్యాఖ్యానించారు.

దీంతో అసలు అమరావతి రాజధానిపై వైసీపీ విధానం ఎలా ఉండనుందనేది చర్చగా మారింది. ఆ పార్టీ ఇప్పటికీ మూడు రాజధానులకే కట్టుబడి ఉందా, లేక ఎన్నికల్లో ఎదురైన ఫలితాల నేపథ్యంలో అమరావతి ఏకైక రాజధానే అన్న నిర్ణయం వైపు మొగ్గుచూపుతుందా అన్నదానిపై స్పష్టత రావడం లేదు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
అమరావతి

ఫొటో సోర్స్, Getty Images

భూ సమీకరణపై అభ్యంతరం

2014లో అమరావతి రాజధాని ప్రకటనకు అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మద్దతు తెలిపిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ.. భూ సమీకరణపై మాత్రం విమర్శలు గుప్పించింది.

రాజధాని నిర్మాణానికి ఏడాదికి మూడు పంటలు పండే 33 వేల ఎకరాల పచ్చటి పొలాలు అవసరం లేదని అభ్యంతరం వ్యక్తం చేసింది.

భూ సమీకరణపై అప్పటి ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రధాని నరేంద్రమోదీ హాజరైన అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి సైతం గైర్హాజరైంది వైసీపీ. ఆ తర్వాత రాజధాని ప్రాంతంలో రూ.వేల కోట్ల భూ కుంభకోణం జరిగిందని ఆరోపించింది.

ఈ క్రమంలోనే సరిగ్గా 2019 ఎన్నికలకు ముందు అమరావతి రాజధాని విషయంలో వైసీపీ విధానంపై టీడీపీ నేతలు అనుమానం వ్యక్తం చేశారు. అయితే, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌, తాము రాజధాని అమరావతికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. అంతేకాదు, ఎన్నికలకు ముందుగానే తాడేపల్లిలో ఇల్లు కట్టుకుని గృహప్రవేశం చేశారు.

చంద్రబాబుకే ఇంకా సొంతిల్లు లేదని, హైదరాబాద్‌ నుంచి ‘షటిల్‌ సర్వీస్‌’ చేస్తూ ఇక్కడ ఓ అద్దె ఇంట్లో ఉంటున్నారని వైఎస్‌ జగన్‌ సహా వైసీపీ నేతలు అప్పట్లో విమర్శించారు.

బొత్స సత్యనారాయణ

ఫొటో సోర్స్, UGC

బొత్స ప్రకటనతోనే మొదలు..

2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తొలినాళ్లలోనే అమరావతి రాజధానిపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.

ముందుగా ఆ ఏడాది నవంబర్‌ నెలాఖరులో అప్పటి పురపాలకశాఖ మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ.. ‘రాజధాని అమరావతిలో ఏముంది.. స్మశానం’ అని వ్యాఖ్యానించారు.

అప్పట్లో అమరావతి పర్యటనకు చంద్రబాబు వెళ్తున్న సందర్భాన్ని బొత్స ప్రస్తావిస్తూ ”చంద్రబాబు అమరావతిలో ఏం చూస్తారు.. స్మశానం..చూసి ఏడవడానికా?” అని అన్నారు.

దీనిపై నాడు టీడీపీ సహా విపక్షాలు ధ్వజమెత్తగా, బొత్స తన వ్యాఖ్యలను సమర్ధించుకున్నారు. ఎండిపోయిన పొలాలు, సగంలో ఆగిన నిర్మాణాలే తప్పించి అక్కడేమీ లేదన్నారు.

బొత్స వ్యాఖ్యల తర్వాత డిసెంబర్‌ 17న ముఖ్యమంత్రి హోదాలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్వయంగా అసెంబ్లీలో నాటి శాసనసభ సమావేశాల చివరి రోజున ఏపీకి మూడు రాజధానులు అవసరమని వ్యాఖ్యానించారు.

”దక్షిణాఫ్రికాను చూస్తే అక్కడ మూడు రాజధానులు ఉన్నాయి. బహుశా అమరావతిలో లెజిస్లేటివ్‌ కేపిటల్‌ పెట్టొచ్చు. విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్‌ కేపిటల్, కర్నూలులో హైకోర్టు పెట్టవచ్చు” అని జగన్‌ ఆ రోజు వ్యాఖ్యానించారు.

వైఎస్ జగన్

ఫొటో సోర్స్, IandPR

అసెంబ్లీలో జగన్‌ ఇంకా ఏమన్నారంటే..

ఆ రోజు ఏపీ అసెంబ్లీలో జగన్‌ మాట్లాడుతూ ”అమరావతిపై మాకు వ్యతిరేకత లేదు. కానీ అభివృద్ధి అంతా ఒక్క చోటే కేంద్రీకృతం కాకూడదు. హైదరాబాద్‌ అనుభవాలను దృష్టిలో పెట్టుకోవాలి. అందుకే రాజధాని వికేంద్రీకరణ జరగాలి’’ అని అన్నారు.

ప్రస్తుతం అమరావతి రాజధాని ప్రాంతంలో ప్రాథమిక మౌలిక సదుపాయాలకు చంద్రబాబు అంచనా ప్రకారమే కనీసం రూ.లక్షా 9 వేల కోట్లు కావాలనీ, వడ్డీలు కలుపుకుంటే అది ఇంకా పెరుగుతుందనీ, ఐదేళ్ల చంద్రబాబు హయాంలో ఇప్పటివరకు ఖర్చు చేసింది కేవలం రూ.5,300 కోట్లేనని జగన్ విమర్శించారు.

‘‘విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా చేసి అక్కడి నుంచి పరిపాలన సాగిస్తే మేలు. శాసన రాజధానిగా అమరావతిలోనే అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తాం. హైకోర్టు ఏర్పాటు చేయడం ద్వారా కర్నూలును న్యాయ రాజధానిగా అభివృద్ధి చేస్తాం” అని జగన్ ప్రకటించారు.

ఏపీ హైకోర్టు

ఫొటో సోర్స్, HC.AP.NIC.IN

కోర్టు చిక్కులతో చట్టాల ఉపసంహరణ

నాడు సీఎం వైఎస్‌ జగన్‌ ప్రకటనకు అనుగుణంగా 2020 జనవరిలో శాసనసభ ప్రత్యేక సమావేశాల సందర్భంగా అసెంబ్లీలో రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీయే) రద్దు, ఏపీ పాలనా వికేంద్రీకరణ బిల్లులు ఆమోదించారు.

అయితే శాసనమండలిలో అప్పటికి వైసీపీకి సరైన బలం లేకపోవడంతో ఆ బిల్లు పెండింగులో పడింది. ఆ తర్వాత సెప్టెంబర్‌లో మళ్లీ అసెంబ్లీ ఆమోదించింది. దీంతో బిల్లుపై మండలి అభిప్రాయంతో సంబంధం లేకుండానే చట్టంగా రూపొందించే పని మొదలైంది.

గవర్నర్‌ ఆమోదంతో 2020 సెప్టెంబర్‌లో మూడు రాజధానుల చట్టం రూపొందించారు.

మరోవైపు అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని భూములిచ్చిన రైతులు డిమాండ్ చేశారు. దీనికి టీడీపీతో పాటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సహా రాష్ట్రంలో మిగిలిన అన్ని రాజకీయ పార్టీలూ మద్దతుగా నిలిచాయి.

రైతులు ఏపీ హైకోర్టును ఆశ్రయించగా, న్యాయపరమైన చిక్కులు నాటి వైసీపీ ప్రభుత్వానికి సవాల్‌గా మారాయి. హైకోర్టు తుది తీర్పునకు ముందుగానే 2022 మార్చిలో ఆ రెండు చట్టాలను ఉపసంహరించుకుంది ఏపీ ప్రభుత్వం.

ఏపీ సీఆర్డీయే రద్దు, పాలనా వికేంద్రీకరణ పేరుతో చేసిన మూడు రాజధానుల చట్టాన్ని వెనక్కి తీసుకుంది.

అయితే ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ, మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నామని చెబుతూ, భవిష్యత్‌లో మరింత బలంగా చట్టాన్ని తీసుకొస్తామన్నారు. ఇక, ఏపీ హైకోర్టు 2022 మార్చి5న వెలువరించిన తీర్పులో రాజధానులను మార్చే విషయంలో శాసనసభకు అధికారం లేదని చెప్పింది. అమరావతి రాజధాని నిర్మాణం పూర్తి చేయాలంటూ కాలపరిమితి కూడా విధించింది. ఈ తీర్పుపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. కాగా, ఈ కేసు ఇంకా సుప్రీంకోర్టులో పెండింగ్‌లోనే ఉంది.

జగన్, మూడు రాజధానులు, ఆంధ్ర‌ప్రదేశ్

వైసీపీ మేనిఫెస్టోలో రాజధానిపై ఏముంది?

పాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాలను ఉపసంహరించుకున్నా మూడు రాజధానులపై వైసీపీ వెనక్కు తగ్గలేదు. త్వరలోనే విశాఖకు వస్తామని అప్పటి మంత్రులు చెబుతూ వచ్చారు. 2024 ఎన్నికల మేనిఫెస్టోలో కూడా మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నామని వైసీపీ తేల్చిచెప్పింది.

”2024లో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం మళ్లీ ఏర్పడగానే పరిపాలనా రాజధానిగా, రాష్ట్రాభివృద్ధికి గ్రోత్‌ ఇంజిన్‌గా పనిచేసేలా విశాఖను అభివృద్ధి చేస్తాం. అమరావతిని శాసన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా అభివృద్ధి చేస్తాం” అని మేనిఫెస్టోలో పేర్కొంది.

ఇప్పుడు మళ్లీ బొత్స ప్రకటన..

2024 ఎన్నికల్లో పరాజయం తర్వాత మూడు రాజధానులపై వైసీపీ నేతలు పెద్దగా మాట్లాడలేదు. వికేంద్రీకరణ విధానాన్ని ప్రజలకు సరిగ్గా అర్ధమయ్యేట్లు చెప్పలేక పోయామని ఒకటి రెండు సందర్భాల్లో ఆ పార్టీ నేతలు వ్యాఖ్యానించారు.

అయితే రాజధాని పునర్నిర్మాణ పనులకు మే నెల 2వ తేదీన నరేంద్ర మోదీ వస్తున్న నేపథ్యంలో ఇటీవల వైసీపీ నేత బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయమయ్యాయి.

‘‘మూడు రాజధానులనేది ఆ రోజు మా విధానం.. ఇప్పుడు మా విధానం ఏమిటనేది చర్చించి చెబుతాం’’ అని ఆయన వ్యాఖ్యానించడంతో పార్టీ స్టాండ్‌ మారిందా అన్న అనుమానాలు మొదలయ్యాయి.

దీనిపై బొత్స బీబీసీతో మాట్లాడుతూ ”అమరావతి రాజధాని కాదని మేం ఎక్కడా అనలేదు. శాసన రాజధానిగా అమరావతే ఉంటుందని ఆనాడే చెప్పాం. వికేంద్రీకరణతో అన్ని ప్రాంతాల అభివృద్ధి సాధ్యమని నమ్మిన మేం మూడు రాజధానులను తెరపైకి తెచ్చాం. ఇప్పుడు మా స్టాండ్‌ ఏంటనేది పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం” అని అన్నారు.

అమరావతి

ఇంకా గందరగోళమేనా?

కాగా, గతేడాది ఎన్నికల ఫలితాల నేపథ్యం, ప్రధాని మోదీ రెండోసారి అమరావతి రాజధాని పనులకు శంకుస్థాపన చేయనున్న పరిస్థితులో మళ్లీ రాజధానిపై గందరగోళ పరిస్థితులకు తావివ్వకూడదని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి.

అయితే, అమరావతికే పరిమితమవ్వాలన్న నిర్ణయంవైపే పార్టీలో మెజారిటీ వర్గాలు మొగ్గుచూపుతున్నట్టు అంతర్గతంగా చెబుతున్నప్పటికీ, బయటకు మాత్రం ఏమీ చెప్పడం లేదు.

ఈ విషయంపై వీలైనంత త్వరగా స్పష్టతనివ్వడంలో పార్టీ పెద్దలు మల్లగుల్లాలు పడుతున్నారనే వాదనను స్వయంగా పార్టీ వర్గాలే వ్యక్తం చేస్తున్నాయి.

‘జగన్‌ మళ్లీ అలా చేయకపోవచ్చు’

”ప్రధాని నరేంద్రమోదీ రెండోసారి అమరావతి పనులకు శంకుస్థాపన చేసిన తర్వాత వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ తన విధానం మార్చుకుంటారనే భావిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు డానీ బీబీసీతో అన్నారు.

”మోదీని కాదని, లేదంటే మోదీని వ్యతిరేకించే పరిస్థితి జగన్‌కు లేదు. అందుకే ఇక మూడు రాజధానుల మాటను మర్చిపోతారు. మూడు రాజధానుల ప్రతిపాదనను అన్ని ప్రాంతాల జనం ఇష్టపడలేదని గతేడాది ఎన్నికల ఫలితాలతో అర్థమై ఉంటుంది. అందుకే మోదీ వచ్చే ముందుగా బొత్స సత్యనారాయణతో అలా మాట్లాడించి ఉంటారు” అని ఆయన అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

SOURCE : BBC NEWS