SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, Getty Images
పోప్ ఫ్రాన్సిస్ మరణంతో తదుపరి పోప్‌ను ఎన్నిక నిర్వహించాల్సి ఉంది. అంత్యక్రియలు ముగిసిన కొన్నివారాల తర్వాత ఆయన వారసుడి ఎన్నిక కోసం వాటికన్ సిటీలో కాంక్లేవ్ జరగనుంది.
ఇందులో భారత్ నుంచి నలుగురు కార్డినల్స్ పాల్గొంటారు. ఇంతకీ ఎవరా నలుగురు? వారి నేపథ్యం ఏంటి? వారిని కార్డినల్స్‌గా ఎంపిక చేసింది ఎవరు?


ఫొటో సోర్స్, collegeofcardinalsreport/archdioceseofhyderabad
పోప్ ఫ్రాన్సిస్ చూపిన కరుణ, ప్రేమ భావనలను ఈ నలుగురు కార్డినల్స్ ఎంతో ప్రశంసించేవారు. దీంతో పాటు చర్చిలో ఫ్రాన్సిస్ తీసుకువచ్చిన మార్పులనూ వారు స్వాగతించారు.
పోప్ ఫ్రాన్సిస్ “కరుణ చూపే దూత, అణగారిన వర్గాలకు మద్దతుదారు” అని ఆంథోనీ పూల అభివర్ణించారు.
ఆంథోనీ మాటలు దేశంలోని చాలా చర్చ్‌ల అభిప్రాయాన్ని ప్రతిబింబించాయి.

ఫొటో సోర్స్, Getty Images
పోప్ పర్యటనలో జార్జ్
రెండో వ్యక్తి సిరో-మలంకర క్యాథలిక్ చర్చికి చెందిన మేజర్ ఆర్చ్ బిషప్ కార్డినల్ బసేలియోస్ క్లీమిస్ కాగా, మూడో వ్యక్తి గోవా డామన్ ఆర్చ్ బిషప్ కార్డినల్ ఫిలిప్ నెరి ఫెర్రావ్. వీరిద్దరు కూడా పోప్ ఫ్రాన్సిస్ విధానాలను ప్రశంసించారు.
నాలుగో కార్డినల్ జార్జ్ జాకబ్ కూవాకడ్. ఆయన 2006 నుంచి వాటికన్ డిప్లొమాటిక్ సర్వీసులో ఉన్నారు. పోప్ ఫ్రాన్సిస్ ఆయనను కార్డినల్‌గా ఎంపికచేశారు. సిరో మలబార్ చర్చి నుంచి వచ్చిన జార్జ్, వాటికన్ డిప్లొమాటిక్ సర్వీసులో ప్రతినిధిగా మంచి గుర్తింపు దక్కించుకున్నారు.
కార్డినల్ జార్జ్ 2021 నుంచి పోప్ ‘పాపల్ టూర్’లో భాగమయ్యారు. ఈ సమయంలోనే పోప్ ఫ్రాన్సిస్ ప్రవచించిన ఉదారవాద, మతాంతర దృక్పథాన్ని ప్రపంచం చూసింది.

ఫొటో సోర్స్, Getty Images
భారత కార్డినల్ ఓటర్లు పోప్ ఫ్రాన్సిస్ వంటి ఉదారవాద దృక్పథాన్ని కొనసాగించే వ్యక్తికి మద్దతు ఇస్తారా లేక పోప్ పదవికి పోటీలో ఉన్నవారిలో ఎక్కువమంది మద్దతు ఉన్నవారికి తమ ఓటు వేస్తారా అన్నది త్వరలోనే తెలుస్తుంది.
“సాధారణంగా భారత చర్చిలు, దాని ప్రతినిధులు సంప్రదాయవాద దృక్పథాన్ని అనుసరిస్తారు. పోప్ పదవిలోకి ఎవరు వచ్చినా వారికి మద్దతు ఇస్తారు. ప్రత్యేక వైఖరి ఏమీ తీసుకోరు. పోప్ ఫ్రాన్సిస్ అనుసరించిన ఉదారవాదం లేదా ఆధునిక దృక్పథం మన దగ్గర లేదు” అని కేరళలోని ఎర్నాకుళంలో పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక చర్చి మతాధికారి బీబీసీతో అన్నారు.
భారత కార్డినల్స్ ప్రస్తుత పోప్ అనుసరించిన విధానాలను కొనసాగించడానికే మొగ్గు చూపుతారని విశాఖపట్నంలోని ‘ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిలాసఫీ, రిలిజియస్ స్టడీస్ అండ్ సోషల్ సైన్సెస్’లో ఫిలాసఫీ, సోషల్ ప్రాక్టీస్ ప్రొఫెసర్ ఫాదర్ జోస్ మాలికల్ ఆశిస్తున్నారు.
“కార్డినల్ ఆంథోనీ పూల ఉదారవాద మనస్తత్వం ఉన్న వారిలో ఒకరు. సమాజంలోని వెనుకబడిన వర్గాలను ఉద్ధరించడం గురించి ఆయన ఆలోచిస్తుంటారు. కార్డినల్ జార్జ్ కూవాకడ్ ఆలోచనలు కూడా పోప్ ఫ్రాన్సిస్ మాదిరే ఉంటాయి. కార్డినల్ ఫిలిప్ నేరి ఫెర్రావు మధ్యస్థంగా ఆలోచిస్తారు. అదే సమయంలో, ఆయన రైట్ వింగ్ లేదా సంప్రదాయవాదంవైపు మొగ్గు చూపే వ్యక్తి కాదు” అని ఫాదర్ మాలికల్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
పోప్‌ను ఎవరు ఎన్నుకుంటారు?
చెన్నైలోని సూట్ కాలేజ్ ఆఫ్ థియాలజీలో పని చేస్తున్న ప్రొఫెసర్ ఫాదర్ రాజ్ ఇరుదయ మాట్లాడుతూ.. ఈ కాంక్లేవ్‌లో పాల్గొనే భారతీయ ప్రతినిధులు ప్రస్తుత పోప్ అనుసరించిన విధానాలకు వ్యతిరేకులైన వారికి ఓటు వేయబోరని అభిప్రాయపడ్డారు.
“పోప్ ఫ్రాన్సిస్ తీసుకువచ్చిన సంస్కరణలను చూశారు. మతాంతర సంభాషణల పట్ల ఆయన సానుకూల విధానాన్ని లేదా మహిళలు, ఇతర అణగారిన వర్గాలను కలుపుకోవడంపై చర్చి వైఖరిని చాలామంది బిషప్‌లు అవలంబించలేదు” అని రాజ్ ఇరుదయ గుర్తుచేశారు.
“కాంక్లేవ్ స్ఫూర్తిని చూసి భారత కార్డినల్స్ ఓటు వేస్తారని అందరికీ తెలుసు” అని ఆయన అన్నారు.
“క్యాథలిక్ చర్చి దృఢమైనదన్నది స్పష్టం. కొత్త పోప్ బాధ్యతలు స్వీకరించాక మునుపటి పోప్ చేసిన మంచి పని కొనసాగుతుంది” అని ఎర్నాకుళంలోని సిరో మలబార్ చర్చి ప్రతినిధి ఫాదర్ ఆంథోనీ వడకర బీబీసీతో అన్నారు.
ఈ కాంక్లేవ్‌లో పాల్గొనే 252 మంది కార్డినల్స్‌లో 135 మంది 80 ఏళ్లు పైబడిన వారు. వారికి ఓటు హక్కు లేదు. కాంక్లేవ్‌లో పాల్గొనే వారిలో 108 మంది కార్డినల్స్‌ను పోప్ ఫ్రాన్సిస్ నియమించారు.
కాగా, పోప్ వారసుడు ఆఫ్రికనా, ఇటాలియనా, ఫిలిప్పీన్స్ వాసా, లేక అమెరికనా అన్నదానిపై చర్చి వర్గాల్లో చర్చ జరుగుతోంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)