SOURCE :- BBC NEWS

భూకంపాలు, ప్రకాశం జిల్లా, ఒంగోలు, ఆంధ్రప్రదేశ్

ఫొటో సోర్స్, Getty Images

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా పొదిలి పరిసర ప్రాంతాల్లో డిసెంబర్‌ 5వ తేదీ తెల్లవారుజామున భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.

భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 3.4 గా నమోదైనట్టు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మాలజీ (ఎన్‌సిఎస్‌) ప్రకటించింది.

ఎన్‌సిఎస్‌ వివరాల ప్రకారం… ఏపీలోని ప్రకాశం జిల్లాలో డిసెంబర్‌ 5న, తెల్లవారుజామున 3.12 గంటలకు భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం 10 కిలోమీటర్ల లోతులో ఉంది.

భూ ప్రకంపనలు చోటుచేసుకున్న ప్రాంతం గుంటూరుకు నైరుతి దిశలో 121 కి.మీ దూరంలో ఉందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మాలజీ పేర్కొంది.

2 నుంచి 5 సెకన్లు భూ ప్రకంపనలు వచ్చాయని, తాము భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశామని భూ ప్రకంపనలు వచ్చిన రోజు పొదిలి, ఇస్లాంపేట, శ్రావణి ఎస్టేట్, బెస్తపాలెం స్థానికులు చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌

ఈ ఏడాది మే, జూన్‌లో కూడా…

ఇదే ఏడాది జూన్‌లో ప్రకాశం జిల్లా ముండ్లమూరు పరిసర ప్రాంతాల్లో స్వల్పంగా భూమి కంపించింది.

జూన్‌ 8న అర్ధరాత్రి 12.47 గంటల సమయంలో నాలుగు సెకండ్ల పాటు భూమి కంపించడంతో భయాందోళనలకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి వీధుల్లోకి పరుగులు తీశారు.

అంతకుముందు మే 6న ఉదయం 9.54 గంటలకు పొదిలిలో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి.

సుమారు 5 సెకన్లపాటు భూమి కంపించినట్లు అప్పట్లో స్థానికులు తెలిపారు.

ఇక 2024 డిసెంబర్‌ 21, 22 తేదీల్లో కూడా వరుసగా ప్రకాశం జిల్లాలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి.

ఈ వరుస భూ ప్రకంపనలు రాష్ట్రంలో తీవ్ర చర్చనీయంగా మారాయి.

స్థానికుల ఆందోళన నేపథ్యంలో గతేడాది ఆ జిల్లా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు సమావేశమై చర్చించారు.

ప్రకాశం జిల్లాలోని పొదిలి, దర్శి ప్రాంతాల్లోనే ఎక్కువ భూ ప్రకంపనలు చోటుచేసుకోవడం, స్థానికుల ఆందోళన నేపథ్యంలో అందుకు గల కారణాలపై అధ్యయనం చేయాల్సిందిగా జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియాను (జీఎస్‌ఐని) కోరామని, జీఎస్‌ఐ నుంచి నివేదిక రావాల్సి ఉందని ఏపీ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ దీపక్‌ బీబీసీతో చెప్పారు.

ప్రకాశం జిల్లాలో భూ ప్రకంపనలు

ఫొటో సోర్స్, UGC

‘అధ్యయనం చేస్తున్నాం..’

ఏపీ రాజధాని అమరావతితో పాటు, వరుసగా భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయంటూ ప్రకాశం జిల్లాలోని భూ పరిస్థితులపై అధ్యయనం చేయాల్సిందిగా ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు వచ్చాయని జీఎస్‌ఐ హైదరాబాద్‌లోని సీనియర్‌ జియాలజిస్ట్‌ ఎస్‌.టి మల్లికార్జున రావు బీబీసీకి తెలిపారు.

” అధ్యయనం చేస్తున్నాం. మా అధికారిక బృందాలు క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తున్నాయి. ఒంగోలు కేంద్రంగా 300 చదరపు కిలోమీటర్ల పరిధి వరకు పరిశోధనలు చేస్తున్నాం. భూమి పైభాగం నుంచి లోపలి వరకు 30 మీటర్ల వరకు డ్రిల్లింగ్‌ చేస్తాం. భూమి పొరల్లో ఏముందని క్షుణ్ణంగా పరిశీలిస్తాం. పూర్తిస్థాయి నివేదిక 2026 సెప్టెంబర్‌ తర్వాతే వస్తుంది” అని ఆయన చెప్పారు.

‘ ఆందోళన చెందాల్సిన పనిలేదు ‘

వాస్తవానికి, దక్షిణ భారతదేశంలోని డెక్కన్‌ పీఠభూమిలో భూకంపాలు వచ్చే అవకాశాలు తక్కువ.

” భూమిపై ఒత్తిడి పెరిగినప్పుడు కొద్దికొద్దిగా రిలీజ్‌ అయితే పెద్దగా సమస్య రాదు. ఒకేసారి రిలీజ్‌ అయితేనే ప్రమాదం. ఇప్పుడు ప్రకాశం జిల్లాలో రిక్టర్‌ స్కేల్‌పై నమోదవుతోన్న 3.4 పాయింట్లు, 3.5 పాయింట్లు పెద్ద సమస్య కాదు. ఇలా రావడం వల్ల భవిష్యత్‌లో వచ్చే భూకంపాల తీవ్రత తగ్గుతుంది. ఎలాంటి నష్టం జరగదు. అందువల్ల ఆందోళన చెందాల్సిన పనిలేదు ” అని మల్లికార్జున రావు స్పష్టం చేశారు.

భూకంపాలు, ప్రకాశం జిల్లా, ఒంగోలు, ఆంధ్రప్రదేశ్

ఫొటో సోర్స్, UGC

1967లో ఒంగోలులో 5.4 తీవ్రతతో భూ ప్రకంపనలు

” ఒంగోలులో 1967 మార్చి 27న భూకంపం సంభవించింది. అప్పుడు రిక్టర్‌ స్కేల్‌పై 5.4 పాయింట్లు నమోదైంది. కానీ, ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఇటీవల తెలంగాణలోని ములుగులో 5.3 పాయింట్ల మేర వచ్చినా ప్రాణ నష్టం జరగలేదు. పెద్దగా ఆస్తి నష్టం కూడా సంభవించలేదు. అందువల్ల ప్రకాశం ప్రజలు పెద్దగా ఆందోళన చెందొద్దు. నష్టం జరగదు ” అని మల్లికార్జున రావు చెప్పారు.

తమ అధ్యయనం పూర్తయిన తర్వాత పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడిస్తామన్నారు.

భూకంపాలు, ప్రకాశం జిల్లా, ఒంగోలు, ఆంధ్రప్రదేశ్

అక్కడే ఎందుకు వస్తున్నాయి?

ఈ విషయంపై మల్లికార్జున రావు బీబీసీతో మాట్లాడుతూ, ” ప్రకాశం జిల్లా మీదుగా ప్రవహించే గుండ్లకమ్మ నదీ పరీవాహక ప్రాంతంలో నియో టెక్టానిక్‌ ఫాల్ట్స్‌ ఉన్నాయని గుర్తించారు. అంటే, అక్కడ భూ భ్రంశాలు కదులుతాయి.

భూమి పొరల్లో మార్పులు లేదా భూ అమరికల్లో మార్పులు జరుగుతుంటాయని గుర్తించారు. అయితే, ఆ మార్పులు, కదలికలు ఏమాత్రం ప్రమాదకరం కాదు” అని అన్నారు.

‘గ్రానైట్ తవ్వకాలు కారణమే కాదు’

” ప్రకాశం జిల్లాలో గ్రానైట్ తవ్వకాల వల్ల భూ ప్రకంపనలు చోటు చేసుకుంటున్నాయనే వాదనలు పూర్తిగా అర్ధరహితం. అసలు అలాంటి అవకాశమే లేదు ” అని జీఎస్‌ఐ సీనియర్‌ జియాలజిస్ట్‌ మల్లికార్జున రావు తెలిపారు.

” గ్రానైట్‌ అనేది హార్డ్‌ రాక్‌.. ఇలా రాళ్లు, గుట్టలు ఉంటే వేవ్స్‌ ఇంకా వేగంగా పాస్‌ అయి వెళ్లిపోతుంటాయి. దానివల్ల భూ ప్రకంపనల ప్రభావం తగ్గుతుంది. మట్టి, ఇసుక ఉన్నచోటే ప్రభావం ఎక్కువ ఉంటుంది. అందువల్ల గ్రానైట్స్‌ వల్ల కానీ, అక్కడి తవ్వకాల వల్ల కానీ భూ ప్రకంపనలు వస్తున్నాయనే వాదనల్లో ఏమాత్రం నిజం లేదు. ఆ వాదనే సరికాదు ” అని ఆయన స్పష్టం చేశారు.

ప్రకాశం జిల్లా భూగర్భ గనుల శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ రాజశేఖర్‌ ఈ విషయమై బీబీసీతో మాట్లాడుతూ.. మైనింగ్‌ వల్ల భూ ప్రకంపనలు అనేది నిరాధారమని వ్యాఖ్యానించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

SOURCE : BBC NEWS