SOURCE :- BBC NEWS
ఫొటో సోర్స్, Getty Images
మాల్దీవులు ఒకప్పుడు అత్యంత ధనవంతులు మాత్రమే వెళ్లగలిగే పర్యటక ప్రదేశంగా ఉండేది. కానీ ఇప్పుడు స్థానికంగా, సరసమైన ధరల్లో కొత్త పర్యటక నమూనాను అవలంబిస్తోంది.
మా ఫెర్రీ(బోటు వంటిది) థొడ్డూ అనే ద్వీపంలో ఆగగానే ఉప్పు, పుచ్చకాయ వాసనతో గాలి పలకరించింది.
నేను 12 ఏళ్ల క్రితం బీబీసీ ‘ది ట్రావెల్ షో’ ఎపిసోడ్ షూట్ చేయడానికి ఇక్కడికి వచ్చినప్పుడు, మాల్దీవులు ఒక ఫాంటసీ గమ్యస్థానంగా ఉండేది. అక్కడి ప్రైవేట్ ద్వీపాలు, ఆకాశాన్నంటే ధరలు చాలా మంది పర్యటకులను ఈ ప్రదేశానికి దూరంగా ఉంచాయి.
కానీ, ఇప్పుడు ఇక్కడికి వచ్చేవారు ధనవంతులు కాదు. బ్యాక్‌ప్యాక్‌లు వేసుకుని వస్తున్న సాధారణ కుటుంబాలు ఇక్కడ బోట్ల నుంచి దిగుతున్నాయి. ఇది గతంలో నేను చూసిన మాల్దీవులు కాదు. చాలా మారిపోయింది.
గడచిన దశాబ్దంలో ఇక్కడ ఒక నిశ్శబ్ద విప్లవం జరిగింది. ప్రభుత్వ మార్పుల వల్ల, ఇప్పటికే నివాసం ఉన్న దీవులలో స్థానికులు గెస్ట్‌హౌస్‌లు మొదలుపెట్టడం సులువైంది. గతంలో టూరిజం తక్కువ జనాభా ఉన్న దీవుల్లో, ఖరీదైన రిసార్ట్స్‌కే పరిమితమై ఉండేది.

ఈ మార్పుల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. దేశ పర్యటక మంత్రిత్వ శాఖ ప్రకారం, 90 దీవులలో ఇప్పుడు దాదాపు 1,200 అతిథి గృహాలు ఉన్నాయి. దీనర్థం పర్యటకులు దేశ సంస్కృతిని నిజంగా ఆస్వాదించగలుగుతున్నారు. మొదటిసారిగా, స్థానిక కుటుంబాలు తమ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్న రంగం నుంచి నేరుగా ప్రయోజనం పొందుతున్నాయి.
మా ముగ్గురు పిల్లలతో కలిసి ఈ మార్పు ఎలా ఉందో నేను చూడాలనుకున్నాను. మేం థొడ్డూ దీవిలోని ఒక ఇంట్లో భోజనం చేశాం. ఓ మోస్తరు స్థాయి రిసార్ట్‌లో బస చేశాం. ఇది నిశ్శబ్దంగా ఒక కొత్త స్వర్గాన్ని సృష్టిస్తోంది.
ఫొటో సోర్స్, Getty Images
ఐలాండ్‌లో ఎలా ఉందంటే..
థొడ్డూ దీవిలో అడుగుపెట్టగానే, మనం ఊహించే విలాసవంతమైన రిసార్ట్‌లకు పూర్తి భిన్నమైన ప్రపంచంలోకి వచ్చినట్లు అనిపిస్తుంది. రాజధాని మాలె నుంచి స్పీడ్ బోట్లో 90 నిమిషాల్లో ఇక్కడకు చేరుకోవచ్చు. ఇది రిసార్ట్ ‘సీప్లేన్’ కంటే చాలా చవకైంది.
అక్కడికి చేరుకున్న తర్వాత, మేం పూర్తిగా భిన్నమైన జీవన విధానాన్ని గమనించాం.
అక్కడ కార్లు లేవు. సైకిళ్లు, కొన్ని ఎలక్ట్రిక్ బగ్గీలు మాత్రమే ఉన్నాయి.
మాల్దీవుల నీలి సముద్రం చుట్టూ బొప్పాయి చెట్లు, పుచ్చకాయ తోటలు కనువిందు చేస్తున్నాయి.
ఈ ద్వీపంలోని మొదటి గెస్ట్‌హౌస్ అయిన సెరెనా స్కైలో మేం బస చేశాం. దీని యజమాని అహ్మద్ కరం. ఈయన మాల్దీవుల గెస్ట్ హౌస్ అసోసియేషన్ అధ్యక్షుడు. దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న పర్యటక ఉద్యమ నాయకుడు.
ఆ ప్రదేశం చాలా ప్రశాంతంగా, పరిశుభ్రంగా ఉంది. దిండ్లు ఖరీదైనవేమీ కావు, బాత్రూమ్ కూడా మంచిగా ఉంది. మమ్మల్ని సాదరంగా ఆహ్వానించారు. ఇంటి భోజనం చాలా రుచిగా ఉంది. కొద్దిగంటల ముందే పట్టి వేయించిన చేపలు, పొట్లకాయ కూర, పుచ్చకాయ జ్యూస్ ఇచ్చారు.
“కమ్యూనిటీ టూరిజం ఇక్కడ అన్నింటినీ మార్చేసింది” అని అహ్మద్ అన్నారు.
“స్థానికులు ఇప్పుడు పర్యటకులిచ్చే డాలర్లతో నేరుగా ప్రయోజనం పొందుతున్నారు. అయితే, ఈ దీవులను, వన్యప్రాణులను మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉందని మేం కూడా గ్రహించాం. ప్రజలు వాటిని చూడడానికే వస్తారు” అని ఆయన అన్నారు.
ఫొటో సోర్స్, Carmen Roberts
మా పిల్లలకు ఈ దీవి బాగా నచ్చింది. మేం స్థానికులతో కలిసి స్నార్కెలింగ్ (సముద్ర గర్భంలో మాస్క్‌తో ఈతకొట్టడం)కు వెళ్లి సముద్ర తాబేళ్లను చూడడం వర్ణించలేని అనుభూతిని అందించింది.
తరువాత విదేశీయుల కోసం చాలాచోట్ల ప్రత్యేకంగా నెలకొల్పిన ‘బికినీ బీచ్‌ల’లో విశ్రాంతి తీసుకున్నాం. ఈ సౌకర్యం వల్ల విదేశీయులు సన్‌బాత్(ఎండ నేరుగా ఒంటికి తగిలేలా పడుకోవడం) చేస్తూ ప్రకృతిని ఆస్వాదిస్తారు.
మాల్దీవులలో ఎక్కువ మంది జనాభా ముస్లింలు. ఇక్కడ దుస్తుల విషయంలో జాగ్రత్తలు అవసరం.
తర్వాత ఆండీ అనిస్ అనే స్థానిక రైతును కలిశాం. ఆయన మమ్మల్ని ఆహ్వానించి, తన తోటలో పండిన పుచ్చకాయ రుచిచూపించారు.
ఎండ వేడిలో, పుచ్చకాయ రసం మా మణికట్టు మీదుగా కారుతోంది. అనిస్‌కు చెందిన చిన్న జ్యూస్ బార్లో కొబ్బరి ఐస్ క్రీం తిని సూర్యాస్తమయాన్ని వీక్షించాం.
ఫొటో సోర్స్, Carmen Roberts
సరసమైన లగ్జరీ
మా పర్యటనలోని రెండో భాగం మమ్మల్ని పూర్తిగా భిన్నమైన ప్రపంచానికి తీసుకెళ్లింది. సన్ సియామ్ రిసార్ట్‌లో హృదయపూర్వక స్వాగతం పలికారు. కానీ, అది కొంచెం నాటకీయంగా అనిపించింది. చేతుల్లో డ్రమ్స్, చల్లని తువ్వాళ్లతో సిబ్బంది నవ్వుతూ, నిలబడి ఉన్నారు. మాకు ఆతిథ్యం ఇచ్చింది రైల్. ఆయన స్నార్కెల్ గేర్ నుంచి పిల్లల మందుల వరకు అన్నీ వాట్స్‌యాప్ ద్వారా చూసుకుంటున్నారు.
సముద్ర తీరానికి దగ్గరలోని రెండు గదులు ఉన్న విల్లాను మేం బుక్ చేసుకున్నాం. మా ప్లాన్‌లో మూడు దీవులలోని పది రెస్టారెంట్లు, బార్లకు సర్వీస్ మాత్రమే కాక, ఇతర వినోద కార్యకలాపాలు కూడా ఉన్నాయి. మాకు కావలసినంత సమయం కూడా ఉండింది, ఫ్రీగా ఉండగలిగాం.
మా పిల్లలు బీచ్‌లో ఆడుకున్నారు. సొరచేపలు, తాబేళ్లను చూసి చాలా ఆనందంగా గడిపారు. నేను షార్క్ పాయింట్, బనానా రీఫ్ చూడటానికి బోట్ డైవింగ్‌కు వెళ్లాను. మాల్దీవులలో అతి పొడవైన 210 మీటర్ల స్విమ్మింగ్ పూల్స్‌తో సహా ఆరు స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి. వినోదం, విశ్రాంతి కోసం ఇక్కడ చాలా ప్లేస్‌లు ఉన్నాయి.
ఇలాంటి రిసార్ట్స్ మాల్దీవ్స్ కొత్త వ్యూహానికి ప్రతీకలు. “సన్ సియామ్ కేర్స్ ప్రోగ్రామ్” కింద, పర్యటకులు బీచ్ శుభ్రతలో కూడా పాల్గొనవచ్చు. రిసార్ట్ “రీసైకిల్-రీయూజ్” యత్నంలో భాగంగా పాత దుస్తులను తిరిగి వినియోగిస్తున్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా ఆపేశారు. నేను తడిగా ఉన్న ‘స్విమ్‌వేర్’ కోసం ప్లాస్టిక్ బ్యాగ్ అడిగినప్పుడు, “ఇప్పుడు మేం ప్లాస్టిక్ వినియోగించడంలేదు” అని నవ్వుతూ బదులిచ్చారు.
పర్యటకాన్ని సరసమైన, స్థిరమైనదిగా చేసే వ్యూహంలో ఇది భాగం. పర్యటకం, పర్యావరణ విధానాలు ఇప్పుడు కలిసి పనిచేస్తున్నాయి. ఈ నిబంధనలు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి సముద్ర జీవులను రక్షించేందుకు దోహదపడతాయి.
అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు ప్రభుత్వం 2028 నాటికి మొత్తం విద్యుత్‌లో 33 శాతం శక్తిని పునరుత్పాదక మూలాల నుంచి ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
మాల్దీవ్స్ మారుతోంది. గెస్ట్ హౌస్‌లు, స్థానిక కుటుంబాలు నిర్వహించే ‘హోమ్ స్టే’లు అక్కడి స్థానిక జీవనాన్ని ప్రత్యక్షంగా, అర్థవంతంగా అనుభూతి చెందే అవకాశం ఇస్తున్నాయి.
ఒకప్పుడు అధిక ధరల కారణంగా సామాన్యులకు అందుబాటులో లేని మాల్దీవులు ఇప్పుడు సంపన్నులకు విలాసంగా మాత్రమే కాకుండా.. పర్యటకులకు నిజమైన, స్వచ్ఛమైన అనుభవాన్ని కూడా అందిస్తున్నాయి.
ఒకప్పుడు హనీమూన్ జంటలకు గమ్యస్థానమైన మాల్దీవులు.. ఇకపై కుటుంబాలకు కూడా నెరవేరని కల కాబోదు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)







