SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, Ali Khan Mahmudabad/FB
భారత్, పాకిస్తాన్ ఘర్షణలు, కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ మీడియా సమావేశం గురించి సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన ప్రొఫెసర్ అలీ ఖాన్ మహమూదాబాద్‌ను అరెస్ట్ చేశారు.
స్థానికుడైన యోగేష్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా హరియాణాలోని సోనిపట్ పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. రెండు మతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టడం వంటి అభియోగాల్లో నమోదు చేసే సెక్షన్ కింద, ప్రొఫెసర్ అలీ ఖాన్‌పై కేసు నమోదు చేశారు హరియాణా పోలీసులు.
అలీ ఖాన్ హరియాణాలోని అశోకా యూనివర్సిటీలో అసోసియేట్ ప్రొఫెసర్. పోలీసులు ఆదివారం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో తమ ఇంటికి వచ్చి ప్రొఫెసర్ అలీ ఖాన్‌ను తమతో తీసుకువెళ్లారని ఆయన భార్య బీబీసీకి చెప్పారు.
అంతకుముందు, ఈ కేసులో హరియాణా మహిళా కమిషన్ కూడా ప్రొఫెసర్ అలీ ఖాన్‌కు సమన్లు జారీ చేసింది. వివరణ ఇవ్వాలని కూడా అడిగింది.
అలీ ఖాన్ అరెస్టుపై చాలా మంది సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను షేర్ చేస్తున్నారు.


ఫొటో సోర్స్, Vinay Kumar
అసలేమైంది?
బీబీసీ ప్రతినిధి చందన్ కుమార్ జజ్వారే.. ప్రొఫెసర్ అలీ ఖాన్‌పై ఫిర్యాదు చేసిన యోగేష్‌తో మాట్లాడారు.
తాను జాఠేడీ గ్రామ సర్పంచ్‌నని, తానే ఫిర్యాదు చేశానని యోగేష్ చెప్పారు. తాను బీజేపీ సభ్యుడినే కానీ, ఈ విషయంలో పార్టీకి ఏమాత్రం సంబంధం లేదన్నారు.
మే 6,7 తేదీల మధ్య రాత్రి పాకిస్తాన్‌పై భారత్ సైనిక చర్యల గురించి కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ మీడియా సమావేశంలో చెప్పారు.
ఆ మరుసటి రోజు మే 8న, ప్రొఫెసర్ అలీ ఖాన్ సోషల్ మీడియాలో ఓ పోస్టు చేశారు. మీడియాకు వివరాలు చెప్పేందుకు కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్‌ను పంపడం గురించి ఆయన అందులో రాశారు.
దీంతోపాటుగా భారత్, పాకిస్తాన్ ఘర్షణ, యుద్ధాన్ని డిమాండ్ చేస్తున్న వారి భావోద్వేగాలు, యుద్ధం వల్ల వచ్చే నష్టాలను కూడా రాశారు.
ఈ పోస్టును హరియాణా మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుని మే 12న అలీ ఖాన్‌కు సమన్లు జారీ చేసింది. ఆయన పోస్టు ”సైన్యంలోని మహిళలను కించపరిచేలా, మత వైషమ్యాలను రెచ్చగొట్టేలా ఉంది” అని అందులో పేర్కొంది.
హరియాణా మహిళా కమిషన్ తన నోటీసులలో ఆరు పాయింట్లు పేర్కొంది. అలాగే, ”కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ సహా యూనిఫాం సర్వీసుల్లో ఉన్న మహిళలను అవమానించడం, భారత సైన్యంలో వారి వృత్తి నిబద్ధతను తక్కువ చేయడం” వంటి అంశాలను కూడా ప్రస్తావించింది.
తమ ముందు హాజరయ్యేందుకు ప్రొఫెసర్ అలీ ఖాన్‌కు 48 గంటల సమయమిచ్చిన మహిళా కమిషన్, లిఖితపూర్వక సమాధానం కూడా కోరింది.
దీనిపై అలీ ఖాన్ తరపున ఆయన న్యాయవాది సమాధానం ఇచ్చారు. ఇందులో ఆర్టికల్ 19(1) కింద లభించిన భావప్రకటనా స్వేచ్ఛ గురించి మాట్లాడారు. అలీ ఖాన్ హిస్టరీ, పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ అని, తనకున్న విద్యాపరమైన అవగాహన, వృత్తిగత నైపుణ్యంతో ఆయన మాట్లాడిన మాటలను ”తప్పుగా అర్థం చేసుకున్నారు” అని పేర్కొన్నారు.
ప్రొఫెసర్ అలీఖాన్ వ్యాఖ్యలపై మే 17న సోనిపట్ నివాసి యోగేష్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా ఆదివారం ప్రొఫెసర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
అలీ ఖాన్‌పై 196 (1)బీ, 197(1)సీ, 152, 299 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

ఫొటో సోర్స్, Ali Khan Mahmudabad/FB
అలీ ఖాన్ ఏమన్నారు?
మే 8న చేసిన పోస్టులో ప్రొఫెసర్ అలీ ఖాన్ ఇలా రాశారు.
”కల్నల్ సోఫియా ఖురేషీని రైట్ వింగ్ కామెంటేటర్లు ప్రశంసిస్తుండడం చూసి నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే వీరంతా మూకదాడులు, బుల్డోజర్ న్యాయం, బీజేపీ ద్వేషపూరిత ప్రచార బాధితుల పక్షాన కూడా తమ గళమెత్తితే.. అలాంటి వారికీ భారతీయ పౌరుల్లా రక్షణ లభిస్తుంది” అని రాశారు.
”ఇద్దరు మహిళా సైనికుల ద్వారా సమాచారం ఇవ్వడం మంచి విధానమే. అయితే, ఇదే విధానం వాస్తవికంగానూ ఉండాలి. లేదంటే అది కేవలం కపటత్వమే అవుతుంది” అని ప్రొఫెసర్ అలీ ఖాన్ తన పోస్టులో రాశారు.
అదే పోస్టులో అలీఖాన్ భారత్‌లోని భిన్నత్వాన్ని కీర్తించారు.
”ప్రభుత్వం దేన్ని చూపాలని ప్రయత్నిస్తోందో, క్షేత్రస్థాయిలో సాధారణ ముస్లింలు దానికి భిన్నమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. కానీ, ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ (కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ప్రెస్ బ్రీఫింగ్) భారత్‌లోని భిన్నత్వంలో ఏకత్వం అనే ఆలోచన పూర్తిగా చచ్చిపోలేదని చూపుతోంది” అని రాశారు.
తన పోస్టు చివరన ప్రొఫెసర్ త్రివర్ణ పతాకంతోపాటు జై హింద్ అని రాశారు.

ఫొటో సోర్స్, Vinay Kumar
అలీ ఖాన్ భార్య, న్యాయవాది ఏం చెప్పారు?
ప్రొఫెసర్ అలీ ఖాన్ అరెస్ట్ గురించి తెలుసుకోవడానికి బీబీసీ ఆయన భార్యతో మాట్లాడింది.
”ఉదయం సుమారు 6.30 గంటల సమయంలో కొంతమంది పోలీసులు హఠాత్తుగా మా ఇంటికి వచ్చి, ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఫ్రొఫెసర్ అలీ ఖాన్‌ను తమతోపాటు తీసుకెళ్లారు” అని ప్రొఫెసర్ అలీ ఖాన్ భార్య ఒనైజా చెప్పారు.
”నేను 9 నెలల గర్భిణిని. త్వరలో ప్రసవం. ఎలాంటి నిర్దిష్ట కారణం లేకుండా మా ఆయన్ను బలవంతంగా తీసుకెళ్లారు” అని ఒనైజా అన్నారు.
”ఆయనను అరెస్ట్ చేశారని భావిస్తున్నాం. ట్రాన్సిట్ వారెంట్‌పై సోనిపట్‌కు తరలించి ఉంటారని అనుకుంటున్నాం. అక్కడి స్థానిక న్యాయస్థానంలో ఆయనను హాజరుపరుస్తారు. ప్రస్తుతానికి మేం మరింత సమాచారం కోసం ప్రయత్నిస్తున్నాం” అని అలీ ఖాన్ న్యాయవాద బృందంలోని ఓ న్యాయవాది బీబీసీకి చెప్పారు.
ప్రొఫెసర్ అలీ ఖాన్ అరెస్టును హరియాణా పోలీసులు ధ్రువీకరించారు.
‘ఆపరేషన్ సిందూర్’ గురించి కామెంట్ చేసినందుకు ఆయన్ను అరెస్ట్ చేసినట్లు వార్తా సంస్థ పీటీఐ పేర్కొంది.

ఫొటో సోర్స్, ANI
అలీ ఖాన్ అరెస్ట్‌పై ఎవరెవరు ఏమన్నారు?
ప్రొఫెసర్ అలీఖాన్ అరెస్ట్‌పై సోషల్ మీడియాలో పలువురు ప్రముఖులు స్పందించారు.
”ఈ పోస్టు చదివి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఇందులో మహిళలకు వ్యతిరేకంగా ఏముంది? మతవిద్వేషాన్ని ఈ పోస్టు ఏ విధంగా రెచ్చగొడుతోంది? ఇది ఐక్యతకు, సమగ్రతకు, భారతదేశ సార్వభౌమత్వానికి ఎలా భంగకరమవుతుంది? అలాంటి ఫిర్యాదుపై పోలీసులు ఎలా చర్యలు తీసుకుంటారు?” అని ప్రశ్నించారు.
”కల్నల్ సోఫియాను నిజంగా అవమానించిన మధ్యప్రదేశ్ మంత్రిని ఏం చేశారు” అని కూడా యోగేంద్ర యాదవ్ ప్రశ్నించారు.
దిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ అపూర్వానంద్ ‘ఎక్స్’లో ”హరియాణా పోలీసులు ప్రొఫెసర్ అలీ ఖాన్‌ను అక్రమంగా అరెస్ట్ చేశారని రాశారు. ఎటువంటి ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఆయనను దిల్లీ నుంచి హరియాణాకు తరలించారు. రాత్రి 8 గంటలకు ఎఫ్ఐఆర్ నమోదైతే, తరువాత రోజు ఉదయం 7 గంటలకల్లా పోలీసులు ఆయన ఇంటి వద్ద ఉన్నారు.”
దిల్లీ హైకోర్టు, సుప్రీం కోర్టు ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ ప్రబీర్ పురకాయస్త కేసులో సుప్రీం తీర్పును ఆయన ఉటంకించారు.
మరోపక్క రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ)ఎంపీ మనోజ్‌కుమార్ అలీ ఖాన్ అరెస్ట్ గురించి పోస్టు చేశారు. ”నిజమైన ప్రజాస్వామ్యమంటే మీ అభిప్రాయాన్ని తెలపడానికి నిరోధించని చోటు.” అని రాశారు.
”ప్రొఫెసర్ అలీ ఖాన్ పోస్టు వివక్ష గురించి” అని ది హిందూ పత్రిక జర్నలిస్ట్ సుహాసిని హైదర్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ”ఆయనను అరెస్ట్ చేశారు. కానీ మతపరమైన కామెంట్లు చేసిన మంత్రి హాయిగా తిరుగుతున్నారు” అని ఆమె అందులో రాశారు.
అంతకుముందు, హరియాణా మహిళా కమిషన్ జారీ చేసిన నోటీసులను వ్యతిరేకిస్తూ 1203 మంది ప్రొఫెసర్ అలీ ఖాన్‌కు మద్దతుగా లేఖ విడుదల చేశారు.
”సమన్లు ఉపసంహరించుకుని, ప్రొఫెసర్ అలీఖాన్‌కు బహిరంగ క్షమాపణలు చెప్పాలి” అని ఆ లేఖలో డిమాండ్ చేశారు.
దీంతోపాటు ప్రొఫెసర్‌కు అండగా నిలవాలని అశోకా యూనివర్సిటీకి విజ్ఞప్తి చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.
పోస్ట్ of X ముగిసింది
ఎవరీ ప్రొఫెసర్ అలీఖాన్?
హరియాణాలోని అశోకా యూనివర్సిటీలో అలీఖాన్ ఓ అసోసియేట్ ప్రొఫెసర్. ఇదో ప్రైవేట్ యూనివర్సిటీ.
అలీ ఖాన్ పొలిటికల్ సైన్స్ విభాగాధిపతి కూడా.
అలీఖాన్ మొహమూదాబాద్ ఫేస్బుక్ ప్రొఫైల్ ప్రకారం ఆయన ఉత్తరప్రదేశ్‌లోని మొహమూదాబాద్ వాసి.
అశోకా యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌లోని వివరాల మేరకు, ఆయన అమెరికాలోని అమెస్ట్ కళాశాలలో హిస్టరీ, పొలిటికల్ సైన్స్‌లో డిగ్రీ చేశారు.
ఆ తర్వాత, సిరియాలోని డమాస్కస్ యూనివర్సిటీలో ఎంఫిల్ చేశారు. ఆ సమయంలో సిరియా, లెబనాన్, ఈజిప్ట్, యెమెన్లలో పర్యటించడంతోపాటు ఇరాన్, ఇరాక్లలో కొంతకాలం గడిపారు. తరువాత ఇంగ్లండ్‌లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో పీహెచ్డీ చేశారు.
తన ఇన్‌స్టా, ఎక్స్ ప్రొఫైల్‌లో అలీ ఖాన్ మొహమూదాబాద్ తాను సమాజ్‌వాదీ పార్టీ లీడర్నని చెప్పుకున్నారు. పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్‌తో దిగిన కొన్ని ఫోటోలు ఆయన ఇన్‌స్టా, ఫేస్బుక్లో కనిపిస్తున్నాయి.
అయితే, ఈ విషయంపై సమాజ్‌వాదీ పార్టీ, అఖిలేష్ యాదవ్ నుంచి ఎలాంటి స్పందన లేదు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)