SOURCE :- BBC NEWS

గ్రూప్ పరీక్షలు

ఫొటో సోర్స్, Getty Images

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన గ్రూప్‌–1 పరీక్షల జవాబు పత్రాల వాల్యుయేషన్‌ కేసుకు సంబంధించి పోలీసులు కోర్టుకు వెల్లడించిన అంశాలు చర్చనీయాంశంగా మారాయి.

యూనివర్సిటీ ప్రొఫెసర్లతో దిద్దించాల్సిన గ్రూప్‌–1 పేపర్లను.. నిబంధనలు పక్కనపెట్టి, ప్రైవేటు టీచర్లతో మొక్కుబడిగా దిద్దించినట్టు తమ విచారణలో తేలిందని పోలీసులు చెబుతున్నారు. ఏపీపీఎస్‌సీ సమక్షంలో వర్సిటీల్లోని కళాశాలల్లో మూల్యాంకనం చేయాల్సిన పేపర్లను అసలు సంబంధం లేని ఓ థర్డ్‌ పార్టీతో దిద్దించారని కోర్టుకు నివేదించారు.

అయితే, నిబంధనల మేరకే మూల్యాంకనం చేయించామని ఈ కేసులో ఏ1గా ఉన్న ఐపీఎస్ అధికారి, అప్పట్లో ఏపీపీఎస్‌సీ కార్యదర్శిగా ఉన్న సీతారామాంజనేయులు న్యాయాధికారి వద్ద హాజరు పరిచిన సమయంలో చెప్పారు. ఈ కేసులో ఏ2గా ఉన్న మధుసూదన్.. సీతారామాంజనేయులు ఒత్తిడి చేయడం వల్లే ఈ మూల్యాంకనం కాంట్రాక్టు తీసుకున్నానని చెప్పినట్లు పోలీసులు న్యాయాధికారికి ఇచ్చిన రిపోర్టులో పేర్కొన్నారు.

పోలీసులు కోర్టుకు నివేదించిన అంశాలతో పాటు, కేసు విచారణ చేస్తున్న ప్రత్యేక అధికారి ఏసీపీ తిలక్‌ బీబీసీకి చెప్పిన వివరాలిలా ఉన్నాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఏపీపీఎస్‌సీ

ఫొటో సోర్స్, APPSC

అసలేం జరిగింది?

ఆంధ్రప్రదేశ్‌లో 2018 డిసెంబర్‌ 31న 169 గ్రూప్‌–1 పోస్టుల భర్తీకి అప్పటి టీడీపీ ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. అయితే, 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చింది. అదే ఏడాది మే 26న గ్రూప్-1 ప్రిలిమ్స్‌ నిర్వహించారు, నవంబర్‌ 1న ఫలితాలు విడుదలయ్యాయి. 9,679 మంది అర్హత సాధించగా 6,807 మంది 2020 డిసెంబరు 14 నుంచి 20 వరకు జరిగిన మెయిన్స్‌ పరీక్షలు రాశారు.

అప్పట్లో కోవిడ్‌ ఉధృతంగా ఉండటంతో సంప్రదాయ విధానంలో కాకుండా డిజిటల్‌ విధానంలో మూల్యాంకనం చేసి ఫలితాలు విడుదల చేస్తామని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు 2021 ఏప్రిల్‌ 28న ఏపీపీఎస్‌సీ ఫలితాలను విడుదల చేసింది.

అయితే డిజిటల్‌ మూల్యాంకనం గురించి నోటిఫికేషన్‌లో పేర్కొనలేదని కొందరు అభ్యర్థులు వేసిన పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు, ఫలితాల వెల్లడిపై స్టే విధించి, సంప్రదాయ విధానంలోనే మూల్యాంకనం చేయాలని ఆదేశాలిచ్చింది.

సీతారామాంజనేయులు

ఫొటో సోర్స్, UGC

ఇక్కడే వివాదం మొదలైంది..

ఆ సమయంలో ఏపీపీఎస్‌సీ కార్యదర్శిగా పి. సీతారామాంజనేయులు (పీఎస్‌ఆర్‌) ఉన్నారు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో నిబంధనల మేరకు మాన్యువల్‌‌గా మూల్యాంకనం చేసే సంస్థను టెండర్‌ ద్వారా ఎంపిక చేయాలి.

“పీఎస్‌ఆర్‌ అందుకు విరుద్ధంగా కొటేషన్‌ ఆధారంగా హైదరాబాద్‌కు చెందిన క్యామ్‌సైన్‌ సంస్థకు వర్క్‌ ఆర్డర్‌ జారీ చేశారు. గతంలో జర్నలిస్టుగా పనిచేసిన పమిడికాల్వ మధుసూదన్‌కు చెందిన క్యామ్‌సైన్‌ సంస్థకు కనీసం చిన్నపాటి పరీక్షలైనా వాల్యుయేషన్‌ చేసిన అనుభవం లేదు. కేవలం ఈవెంట్లు,ఫంక్షన్లు ఆర్గనైజ్‌ చేసే సంస్థకు ఏకంగా గ్రూప్‌–1 జవాబు పత్రాల వాల్యుయేషన్‌ అప్పగించారు. ఆ సంస్థ కూడా నిబంధనలు పాటించలేదని మా విచారణలో తేలింది” అని పోలీసులు చెబుతున్నారు.

హాయ్ ల్యాండ్

ఫొటో సోర్స్, haailand.com

నిబంధనలు పాటించలేదా?

వర్క్‌ ఆర్డర్‌ ప్రకారం జవాబు పత్రాల వాల్యుయేషన్‌ చేసే వారిని ఏపీపీఎస్‌సీ ఎంపిక చేసి, ఆ జాబితాను క్యామ్‌సైన్‌ సంస్థకి అందించాలి. రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల్లో అనుభవం ఉన్న ప్రొఫెసర్లను ఎంపిక చేసి వారితోనే వాల్యుయేషన్‌ చేయించాలి.

”ఇక్కడ మాత్రం మూల్యాంకనం కోసం మధుసూదన్‌ వివిధ స్కూళ్లలో పనిచేసే ప్రైవేటు టీచర్లను, కనీస విద్యార్హత లేని చిన్నపాటి ఉద్యోగాలు చేసే మొత్తం 66 మందిని నియమించుకున్నారు. నిబంధనల మేరకు వాల్యుయేషన్‌ను ఏపీపీఎస్‌సీ నిర్దేశించిన విద్యాసంస్థల్లోనే నిర్వహించాలి. కానీ, క్యామ్‌సైన్‌ సంస్థ మంగళగిరి సమీపంలోని హాయ్‌ల్యాండ్‌లో ఈ వాల్యుయేషన్‌ చేపట్టింది. అసలు మాన్యువల్‌గా మూల్యాంకనం చేయకుండా తామిచ్చిన మార్కులను ఓఎంఆర్‌ షీట్లపై నమోదు చేసి, సంతకం చేస్తే చాలని క్యామ్‌సైన్‌ ప్రతినిధులు వారికి చెప్పారు” అని పోలీసులు కోర్టుకి అందించిన నివేదికలో పేర్కొన్నారు.

అదేవిధంగా హాయ్‌ల్యాండ్‌లో మూల్యాంకనం జరిపిన క్యాంపులో సీసీ కెమెరాలు కూడా లేవని తేలినట్టు పోలీసులు కోర్టుకు తెలిపారు. మొత్తంగా మాన్యువల్‌ మూల్యాంకనానికి సంబంధించిన ఏ ప్రక్రియనూ పాటించలేదని పేర్కొన్నారు.

కోర్టులు

ఫొటో సోర్స్, Getty Images

కేసు ఎప్పుడు పెట్టారంటే..

ఏపీపీఎస్‌సీ పరీక్షల నిర్వహణలో అవకతవకలు జరిగాయంటూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆరోపణలు చేసిన తెలుగుదేశం.. అధికారంలోకి వచ్చిన తర్వాత విచారణ చేపట్టింది.

ఏపీ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నుంచి అందిన నివేదిక మేరకు సీతారామాంజనేయులు, మధుసూదన్‌పై కేసు నమోదు చేసి విచారణ జరపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ డీజీపీకి ఆదేశాలిచ్చారు.

ఈ నేపథ్యంలోనే పి.సీతారామాంజనేయులుపై విజయవాడలోని సూర్యారావుపేట పోలీస్ స్టేషన్‌లో గత నెలాఖరులో కేసు నమోదైంది. మోసం, ప్రభుత్వ నిధుల దుర్వినియోగం, సాక్ష్యాల తారుమారు, నేరపూరిత కుట్ర సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, విచారణాధికారిగా నందిగామ ఏసీపీ ఏడీజీ తిలక్‌కి బాధ్యతలు అప్పగించారు.

ప్రత్యేక బృందాలతో విచారణ చేపట్టిన తిలక్‌… హైదరాబాద్‌లో ఉన్న ఏ–2 పమిడి కాల్వ మధుసూదన్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కి తరలించారు. ఇప్పటికే ముంబయి నటి జత్వానీ కేసులో రిమాండ్‌లో ఉన్న సీతారామాంజనేయులును ఈ కేసులో పీటీ వారెంట్‌ కింద విజయవాడలోని ఒకటో అదనపు సీనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో గత గురువారం హాజరుపరచగా, ఏపీపీ వాదనల తర్వాత న్యాయాధికారి మే 22 వరకు రిమాండ్‌ విధించారు.

దిద్దింది ప్రైవేటు వ్యక్తులే

”ప్రతి జవాబు పత్రం వెనుక నిబంధనల మేరకు పేపర్ దిద్దిన ప్రొఫెసర్‌ పేరు, హోదా రాయాల్సి ఉంటుంది. అయితే ఆ స్థానంలో ప్రైవేటు వ్యక్తుల సంతకాలు ఉన్నట్లు గుర్తించాం. కేసు విచారణ దశలో ఉంది. విషయం కోర్టులో ఉంది. ఇంతకుమించి వివరాలు చెప్పలేం” అని తిలక్‌ బీబీసీతో అన్నారు.

కాగా, న్యాయాధికారి వద్ద హాజరు పరిచిన సమయంలో సీతారామాంజనేయులు తాను నిబంధనల మేరకే మూల్యాంకనం చేయించానని చెప్పారు.

గ్రూప్ పరీక్షలు

ఫొటో సోర్స్, Getty Images

‘‘నాకు తెలియకుండానే అన్నీ చేశారు’’

”2021 నవంబర్‌ 26 వరకు నేను ఏపీపీఎస్‌సీస్సీ చైర్మన్‌గానే ఉన్నాను. నేను ఉన్నప్పుడే మెయిన్స్‌ పరీక్షలు జరిగాయి. నేను చైర్మన్‌గా ఉండగానే నాకు సంబంధం లేకుండా అన్నీ చేసేవాళ్లు. ఆ తర్వాత కార్యదర్శిగా పీఎస్‌ఆర్‌ను నియమించారు. దీంతో అంతా ఆయన ఇష్టారాజ్యమైంది” అని గతంలో ఏపీపీఎస్‌సీ చైర్మన్‌గా పనిచేసిన ఉదయభాస్కర్‌ బీబీసీతో అన్నారు.

గ్రూప్ పరీక్షలు రాసిన అభ్యర్థుల పరిస్థితి ఏమిటన్న ప్రశ్నపై మాట్లాడుతూ.. ”ప్రస్తుతం ఆ విషయం కోర్టులో ఉంది. ఇప్పటికే అపాయింట్‌మెంట్‌లు అయిపోయాయి. మొదట ప్రభుత్వం, సర్వీస్‌ కమిషన్‌ అండర్‌ టేకింగ్‌ తీసుకుని, అపాయింట్‌మెంట్‌లకు అనుమతిచ్చింది కోర్టు. ఆ తర్వాత విచారణలో నియామకాల్ని రద్దు చేసింది సింగిల్ జడ్జి బెంచీ. దీంతో, తీర్పును డివిజన్ బెంచీలో అప్పీల్ చేసింది ఏపీపీఎస్సీ. విచారణ చేపట్టిన డివిజన్ బెంచ్ తీర్పుపై స్టే విధించింది ” అని వివరించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)