SOURCE :- BBC NEWS

ఏపీలో ఇంటింటి సర్వే

ఫొటో సోర్స్, Getty Images

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ‘‘వర్క్‌ ఫ్రం హోమ్’’ (డబ్ల్యుఎఫ్‌హెచ్‌) సర్వే చేయిస్తోంది.

ఇంటి నుంచే వివిధ కంపెనీలకోసం పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలతో పాటు విద్యార్హత ఉండి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారు, ఉద్యోగం పొందేందుకు తగిన శిక్షణ కోసం ఎదురు చూస్తున్న వారి వివరాలను సేకరిస్తోంది.

రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది తమ తమ ప్రాంతాల్లో ఇంటింటికీ తిరిగి, లేదంటే ఫోన్‌ ద్వారా సర్వే చేస్తున్నారు.

ఉద్యోగులు, ఉద్యోగార్థులతో పాటు ప్రతి కుటుంబంలోని సభ్యులందరితోనూ మాట్లాడుతున్నారు.

ఇంట్లోనే ఉంటూ వివిధ వృత్తి పనులపై ఆసక్తి కనపరుస్తున్న మహిళల డేటాను తీసుకుంటున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
వర్క్ ఫ్రమ్ హోమ్, ఏపీ ప్రభుత్వం, విద్యార్హత, ఉపాధి

ఫొటో సోర్స్, UGC

నెల రోజులుగా సర్వే

ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ఫిబ్రవరి చివరి వారం నుంచి మొదలైంది. ఇందుకోసం ప్రభుత్వం ఫిబ్రవరి 24న మెమో విడుదల చేసింది.

అన్ని జిల్లాల కలెక్టర్లు ఈ సర్వేకి ప్రాధాన్యమిచ్చి గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల ద్వారా సమగ్రంగా సర్వే చేయించాలని ఆ మెమోలో స్పష్టం చేసింది.

ప్రస్తుతం సర్వే జరుగుతోందని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌ ప్రశాంతి బీబీసీకి తెలిపారు.

మ్యాపింగ్‌ జరిగిన ప్రతి ఇంటికీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులువెళ్లి కుటుంబ వివరాలను సేకరిస్తున్నారు. కుదరని పక్షంలో ఫోన్‌ ద్వారా తీసుకున్న వివరాలను ప్రభుత్వం ఇచ్చిన సాఫ్ట్‌వేర్‌లో నమోదు చేస్తున్నారు.

వర్క్ ఫ్రమ్ హోమ్, ఏపీ ప్రభుత్వం, విద్యార్హత, ఉపాధి

ఫొటో సోర్స్, UGC

సర్వే ఎందుకంటే…

ఏపీలో 18 ఏళ్ల నుంచి 50 ఏళ్లలోపు వయసు ఉండి, ఆధునిక సాంకేతికాంశాలపై అవగాహన, విద్యార్హత కలిగిన వారికి ‘వర్క్‌ ఫ్రం హోం’ ద్వారా మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించేందుకే సర్వే మొదలుపెట్టినట్టు ఈ మెమో విడుదల చేసిన ప్రభుత్వ కార్యదర్శి కాటంనేని భాస్కర్‌ బీబీసీకి తెలిపారు.

ఈ సర్వే ద్వారా యువతకు స్వగ్రామంలోనే ఉద్యోగావకాశాలు కల్పించడానికి అవకాశం లభిస్తుందని చెప్పారు. ఇంటి నుంచి ఉద్యోగం చేయాలనుకునే ఐటీ, ఇతర రంగాల ఉద్యోగులకు కూడా ఈ సర్వే ఉపయోగపడుతుందని ఆయన వివరించారు.

ప్రస్తుతం 70శాతం సర్వే పూర్తయిందనీ, ఈ నెలాఖరు నాటికి సర్వే పూర్తి చేసిన తర్వాత ప్రభుత్వం ఓ ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తుందని కాటంనేని భాస్కర్‌ చెప్పారు.

”ఇంటి నుంచి కాకుండా ఆఫీసుకు వెళ్లి పని చేస్తే బాగుంటుందని ఎవరైనా అనుకుంటే.. ఒకే ఊళ్లో ఉన్న అలాంటి వారందరి కోసం ఆ ఊళ్లోనో లేదా అక్కడికి దగ్గరలోనే ఓ సెంటర్‌ను ఏర్పాటు చేస్తాం. అక్కడ 20 నుంచి 25 మంది వరకు పని చేసేలా సదుపాయాలు కల్పిస్తాం. నెట్‌ స్పీడు ఇతర సౌకర్యాలు అందిస్తాం..ఒకే ఊళ్లో ఎక్కువమంది యువత తగిన అర్హతలు ఉండి ఉపాధి కోసం ఎదురు చూస్తుంటే వారి కోసం సమీప పట్టణంలోనో లేదా అవకాశముంటే వారి ఊళ్లోనే ఆఫీసులు పెట్టేలా ప్రైవేటు కంపెనీలతో మాట్లాడతాం’’ అని భాస్కర్ చెప్పారు.

‘‘ఎవరైనా తమకు ఉపాధి శిక్షణ అవసరమని కోరుకుంటే వారికి ఆ శిక్షణ ఏర్పాటు చేయించి ఆ తర్వాత ఉపాధి కల్పించే దిశగా యత్నిస్తాం. సర్వే పూర్తయ్యాక పూర్తిస్థాయిలో అధ్యయనం చేసిన తరువాతే దీనిపై మార్గదర్శకాలు రూపొందిస్తాం” అని కాటంనేని బీబీసీకి తెలిపారు.

వర్క్ ఫ్రమ్ హోమ్, ఏపీ ప్రభుత్వం, విద్యార్హత, ఉపాధి

ఫొటో సోర్స్, UGC

సర్వేలో ప్రశ్నలేంటంటే…

‘మీరు వర్క్‌ ఫ్రం హోం చేస్తున్నారా?.. మీకున్న సమస్యలేంటి?.. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం కోరుకుంటున్నారు?’

మీకున్న విద్యార్హత ఏమిటి ? ప్రస్తుతం పని చేస్తున్నారా, లేదా ?

ప్రస్తుతం పని చేస్తున్నట్లయితే వర్క్‌ ఫ్రం హోం సదుపాయం ఉన్న ఏ రంగంలో పనిచేస్తున్నారు. ?

మీ ఇంటిలో వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌‌కు అవకాశం ఉందా ?

మీ ఇంటిలో బ్రాడ్‌ బాండ్‌ కనెక్టివిటీకి అవకాశం ఉందా ?

ఆ కనెక్టివిటీ ఉంటే మీకు ఎంత స్పీడ్‌తో ఇంటర్నెట్‌ సదుపాయం ఉంది ?

మీ ఇంట్లో వర్క్‌ ఫ్రం హోం కింద మీ స్నేహితులకు లేదా మీ కొలీగ్‌ / మీ తోటి ఉద్యోగులు కూడా మీతో పనిచేసేందుకు ఇంట్లో ప్లేస్‌ లేదా సపరేట్‌గా రూమ్‌ ఉందా ? ఉంటే ఆ రూమ్‌ కొలత ఎంత ? ఎంతమంది వరకు వర్క్‌ ఫ్రం హోం కింద ఆ రూమ్‌లో పనిచేయడానికి అవకాశం ఉంటుంది ?

ప్రస్తుతం పని చేయకపోతే ఏదైనా ఫీల్డ్‌ లో పనిచేసేందుకు ఆసక్తి ఉందా ? ఉంటే శిక్షణ కార్యక్రమాలకు హాజరు అవుతారా?’ వంటి ప్రశ్నలను సర్వేలో అడుగుతున్నారు.

వర్క్ ఫ్రమ్ హోమ్, ఏపీ ప్రభుత్వం, విద్యార్హత, ఉపాధి

ఫొటో సోర్స్, UGC

సర్వే ఎలా చేస్తున్నారు?

హౌస్‌ హోల్డ్‌ మ్యాపింగ్‌లో పేరు నమోదైన వారికి మాత్రమే ఈ సర్వే జరుగుతుంది.

ఎన్టీఆర్‌ జిల్లాలో మొత్తం 5లక్షల 39వేల89 కుటుంబాలు ఉన్నాయి. 11లక్షల 90వేల 339మంది జనాభా ఉన్నారు.

ఇందులో ఇప్పటి వరకు 8లక్షల 43వేల 801మందితో ఫోన్‌లో మాట్లాడి సర్వే నిర్వహించామని జిల్లా గ్రామ వార్డు సచివాలయ అభివృద్ధి అధికారి జ్యోతి బీబీసీకి తెలిపారు.

వర్క్ ఫ్రమ్ హోమ్, ఏపీ ప్రభుత్వం, విద్యార్హత, ఉపాధి

ఫొటో సోర్స్, UGC

‘సర్వే మంచిదే, ఉపాధి కల్పిస్తే ఇంకా మంచిది’

”నిజంగా ఇది ఆహ్వానించదగ్గ పరిణామమే, కుటుంబాల్లో ఎంతమంది చదువుకున్న వారున్నారు.. వారిలో ఎంతమంది ఉద్యోగాలు, వ్యాపారాలు లేదా ఉపాధి నిమిత్తం ఇతరత్రా పనులు చేస్తున్నారు. ఇంకా ఎంతమంది ఉద్యోగాలు, ఉపాధి కోరుకుంటున్నారు..వారి విద్యార్హత లేంటి” అనే వివరాలతో ప్రభుత్వమే సర్వే చేయించడం మంచిదే.

అయితే సర్వేతోనే వదిలేయకుండా ప్రభుత్వం వీలైనంత తొందరగా కార్యాచరణ మొదలు పెడితే ఇంకా మంచిది అని సీనియర్‌ జర్నలిస్టు, రాజకీయ పరిశీలకులు ధారా గోపీ బీబీసీతో అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

SOURCE : BBC NEWS