SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, facebook/7C’s Entertainment Pvt ltd.
మహారాజ తర్వాత విజయ్ సేతుపతికి తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది. ఏస్ సినిమాపై అంచనాలు లేవు కానీ, బాగుండొచ్చనే అభిప్రాయం మాత్రం ముందు నుంచి ఉంది. ఎందుకంటే మహారాజ సైలెంట్‌గా వచ్చి హిట్‌గా మారింది. మరి ఏస్ ఎలా ఉందో చూద్దాం.
కథ ఏమంటే బోల్ట్ కాశీ (విజయ్ సేతుపతి) ఉపాధి కోసం మలేసియా వస్తాడు. అతన్ని కమెడియన్ యోగిబాబు రిసీవ్ చేసుకుని తన లవర్ హోటల్లో వంటవాడిగా చేరుస్తాడు.
నిజానికి కాశీ, జైలు నుంచి విడుదలై బయటకు వస్తాడు. యోగిబాబు చెప్పిన పని చేస్తున్న హీరోకి హీరోయిన్ రుక్మిణి ఎదురవుతుంది. ఆమెని సవతి తండ్రి పృథ్వీ బాధలు పెడుతుంటాడు. పార్ట్ టైమ్ జాబ్ చేస్తున్న రుక్మిణికి హీరోకి మధ్య ప్రేమ మొదలవుతుంది.
హీరోయిన్ పని చేస్తున్న బట్టల షాప్ సేల్స్ టార్గెట్ పూర్తి చేయడానికి పదివేల మలేసియా కరెన్సీ కావాలి. దీనికోసం హీరో, యోగిబాబు కలిసి విలన్ ధర్మా (కేజీఎఫ్ అవినాశ్) దగ్గరికి వెళ్తారు.
అక్కడ హీరో పోకర్ ఆడి 5 లక్షలు అప్పు పడతాడు. వారంలోగా డబ్బు తిరిగి ఇవ్వాలి. ఇంకోవైపు సవతి తండ్రి నుంచి హీరోయిన్ కష్టాలు తీరాలంటే పది లక్షలు కావాలి. పరిష్కారంగా హీరో ఒక దోపిడీకి పథకం వేస్తాడు. తర్వాత ఏమైందన్నది మిగతా కథ.


ఫొటో సోర్స్, 7C’s Entertainment Pvt ltd./facebook
యోగిబాబు వన్ లైనర్లు
నిజానికి ఇది అరిగిపోయిన కథ. తెరమీద ఇలాంటివి ఎన్నో వచ్చాయి. అయితే విజయ్ సేతుపతి, యోగిబాబుల నటన, కామెడీ టైమింగ్ సినిమాని కాస్తోకూస్తో నిలబెట్టాయి.
దర్శకుడు ఆర్ముగకుమార్ కూడా ఇదే గట్టిగా నమ్మినట్టున్నాడు. సినిమాలో ఎక్కువ భాగం ఇద్దరే కనిపిస్తారు. మిగిలిన వాళ్లకి పెద్దగా ప్రాధాన్యం వుండదు.
హీరోయిన్ వున్నా నటనకి పెద్దగా అవకాశం లేని పాత్ర. విలన్లుగా పృథ్వీ, అవినాశ్ ఉన్నా వాళ్లకీ స్కోప్ తక్కువే. యోగిబాబు వన్ లైనర్లు కొన్నిచోట్ల పేలాయి. తమిళ ప్రేక్షకుల్ని ఉద్దేశించి రాసినవి కావడంతో కొన్ని అతకలేదు.
హీరో గ్యాంబ్లింగ్ ఆడిన తర్వాత కథ మలుపు తిరుగుతుందని, మలేసియాలో డాన్‌గా ఉన్న విలన్‌తో సంఘర్షణ తీవ్రంగా వుంటుందని ఆశిస్తాం. కానీ అదేమీ లేకుండా రొటీన్ ఛేజ్‌లు, ఫైట్లతో క్లైమాక్స్‌కి రావడంతో నత్తనడక నడిచినట్టు అనిపిస్తుంది.
కామెడీ థ్రిల్లర్‌లో అనేక సబ్ప్లాట్లు జతకూడితే కథ రంజుగా ఉండేది. కానీ మలేసియా వీధులు, హీరో రూమ్‌లో కథ ఇరుక్కపోయి అంతా ఊహించేలా ఉంటుంది.

ఫొటో సోర్స్, Insta/Vijay sethupati
స్టయిలిష్ టేకింగ్
సింగిల్ లేయర్ కథల కాలం చెల్లిపోయింది. సేతుపతి లాంటి నటుడు, యోగిబాబు లాంటి కమెడియన్‌తో కథని బలంగా రాసుకుని ఉంటే మంచి ఎంటర్టైనర్ అయ్యేది. కథకి కీలకమైన లవ్‌ట్రాక్ కూడా బలహీనంగా ఉంటుంది.
విజయ్‌సేతుపతి నటనకి ఎక్కడా పేరు పెట్టడానికి లేదు. దర్శకుడు కూడా టేకింగ్ స్టయిలిష్‌గా తీశాడు. కానీ, కథలో విషయం లేకుండా చేసుకున్నాడు. ప్రేక్షకుడి ఆలోచనలకి పదును పెట్టకుండా, దర్శకుడికి అనుగుణంగా కథ నడవడం పెద్ద మైనస్.
గ్యాంబ్లింగ్ సన్నివేశాలు ఉత్కంఠతో తీసిన డైరెక్టర్, దోపిడీ సీన్స్ రొటీన్‌గా లాగించేశాడు. బీజీఎం బావుంది. పాటలు కథకి అడ్డం పడతాయి. ఫొటోగ్రఫీ బావుంది. రిలీఫ్ ఏమంటే సినిమా మొత్తం మలేసియాలో జరగడం. బ్యాగ్రౌండ్ కొత్తగా అనిపిస్తుంది. పెద్దగా అంచనాలు లేకుండా ఒకసారి చూడొచ్చు.

ఫొటో సోర్స్, facebook/7C’s Entertainment Pvt ltd.
ప్లస్ పాయింట్స్
1. విజయ్‌సేతుపతి నటన
2. యోగిబాబు కామెడీ టైమింగ్
3. బీజీఎం
మైనస్ పాయింట్
1. నిడివి
2. పాతకథ
3. సేతుపతి, యోగిబాబులకి తప్ప, మిగతా ఎవరికీ స్క్రీన్ స్పేస్ లేకపోవడం
థియేటర్ నుంచి బయటికి వచ్చాకా, రెండున్నర గంటలు మనం ఏం చూసామో గుర్తు లేకపోవడం ఈ సినిమా ప్రత్యేకత.
(గమనిక: అభిప్రాయాలు సమీక్షకుడి వ్యక్తిగతం)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)