SOURCE :- BBC NEWS

ఓయో రూమ్స్

ఫొటో సోర్స్, OYO

  • రచయిత, కొటేరు శ్రావణి
  • హోదా, బీబీసీ ప్రతినిధి
  • 7 జనవరి 2025

హోటల్ బుకింగ్ సంస్థ ఓయో తన భాగస్వామ్య హోటళ్ల కోసం సరికొత్త చెక్-ఇన్ పాలసీని తీసుకొచ్చింది.

ఈ పాలసీ ప్రకారం ఆన్‌లైన్‌లో ఓయో రూమ్ బుక్ చేసుకోవాలనుకునే జంటలు బుకింగ్ సమయంలోనూ, చెక్-ఇన్ వేళ తమ మధ్య రిలేషన్‌కు సంబంధించిన గుర్తింపు పత్రాలను చూపించాలని పేర్కొంది.

తమ హోటళ్లలోకి పెళ్లి కానీ జంటలను అనుమతించాలా, లేదా అనే నిర్ణయాన్ని తీసుకునే స్వేచ్ఛను ఓయో తన పార్ట్‌నర్ హోటళ్లకే వదిలేసింది. అంటే, పెళ్లి కానీ జంటల బుకింగ్స్‌పై ఆ హోటళ్లే ఇక నుంచి నిర్ణయం తీసుకోనున్నాయి.

గతంలోని ఓయో పాలసీ ప్రకారం, పెళ్లి కానీ జంటలకు హోటల్ గదులను తిరస్కరించే అనుమతి పార్ట్‌నర్ ‌హోటళ్లకు లేదు. ఇప్పుడు ఈ కొత్త పాలసీ ప్రకారం, పెళ్లి కాని జంటలకు గదులు ఇవ్వడాన్ని ఓయో హోటళ్లు తిరస్కరించవచ్చు.

ఈ కొత్త మార్గదర్శకాలు తొలుత ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఓయో పార్ట్‌నర్ హోటళ్లకు వర్తిస్తాయి. ఇక్కడ వచ్చే స్పందనను బట్టి ఇతర నగరాలకు కూడా ఈ నిబంధనలను విస్తరిస్తామని ఓయో ప్రకటించింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

తాజా పాలసీ ప్రకారం, ఓయో వెబ్‌సైట్‌లోని మీరట్ నగరానికి చెందిన పలు హోటల్ గదుల బుకింగ్‌ను చెక్ చేయగా.. పెళ్లి కాని జంటలకు అనుమతి లేదనే విషయం వాటి నిబంధనల జాబితాలో కనిపించింది.

ఈ నేపథ్యంలో అసలు ఓయో హోటల్ రూమ్‌ బుక్ చేసుకునేటప్పుడు ఎలాంటి షరతులు ఉంటాయి? ఓయో నిర్ణయంపై ఎవరేమంటున్నారు?

ఫోటో గుర్తింపు తప్పనిసరి

ప్రైమరీ గెస్ట్ వయసు హోటల్‌లోకి చెక్-ఇన్ అయ్యే సమయంలో కనీసం 18 ఏళ్లు ఉండాలి. చెక్-ఇన్ సమయంలో హోటల్ గదిని బుక్ చేసుకున్న వారు ప్రస్తుతం చెల్లుబాటయ్యే ఫొటో గుర్తింపును తప్పనిసరిగా చూపించాలి.

ప్రభుత్వ నిబంధనల మేరకు హోటల్‌లో ఉండాలనుకునే 18 ఏళ్లు పైబడిన ప్రతి వ్యక్తి చెల్లుబాటయ్యే ఫోటో ఐడీ చూపించాలి. ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ కార్డు, పాస్‌పోర్టులను మాత్రమే గుర్తింపు ధ్రువీకరణ పత్రాలుగా స్వీకరిస్తారు.

పాన్ కార్డుపైన అడ్రస్ ఉండదు కాబట్టి ఈ కార్డును అంగీకరించరు. చెక్-ఇన్ సమయంలో ఒరిజినల్ ఐడీ మాత్రమే ఉండాలి.

హోటల్‌కు చేరుకున్న తర్వాత, ఏదైనా సమస్య వస్తే, ఓయోను కాంటాక్ట్ చేయొచ్చు.

ప్రకృతి విపత్తులు, ఉగ్రవాద దాడులు, ఏదైనా బలవంతపు చర్య వల్ల ఓయో హోటళ్లలో గదులు అందుబాటులో లేనప్పుడు, ముందుగా బుక్ చేసుకున్న వారికి బుకింగ్ మొత్తాన్ని రీఫండ్ చేయరు.

ఓ జంట

ఫొటో సోర్స్, Getty Images

హోటల్ గదులను ఎప్పుడు తిరస్కరిస్తుంటారు?

కొన్ని హోటళ్లు పెళ్లి కానీ జంటల బుకింగ్స్‌ను అంగీకరించవని ఓయో తన గెస్ట్ పాలసీలో పేర్కొంది. అలాగే, ఐడీ ప్రూఫ్స్ లేకపోయినా బుకింగ్స్‌ను తిరస్కరిస్తాయంది. బుకింగ్‌కు ముందే ఈ సమాచారం గెస్ట్‌కు తెలిసేలా ఉంటుందని పేర్కొంది.

చట్టబద్ధమైన ప్రభుత్వ ఐడీ చూపించలేనప్పుడు, తోడు లేకుండా మైనర్లు వచ్చినప్పుడు, చెకిన్‌ సమయంలో గెస్ట్‌ల ప్రవర్తన హోటల్ సిబ్బందికి అనుమానాస్పదంగా అనిపించినప్పుడు వారి చెక్-ఇన్‌ను తిరస్కరించే అధికారం హోటల్‌కు ఉంటుందని తెలిపింది.

ఓయో హోటళ్ల అధినేత

ఫొటో సోర్స్, Getty Images

‘ఓయో నిర్ణయం స్వాగతించదగినది’

”ఓయో ప్రస్తుతం తీసుకున్న నిర్ణయం స్వాగతించదగినది. ఈ నిర్ణయం ఓయో గౌరవాన్ని పెంచుతుంది.” అని విజయవాడ హోటల్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పీవీ రమణ అన్నారు.

” హోటళ్ల గెస్ట్ పాలసీల్లో చిన్న చిన్న మార్పులే ఉంటాయి. కానీ, అందరూ కూడా ఆధార్‌ను తప్పనిసరిగా తీసుకుంటారు. వయసును పరిగణనలోకి తీసుకుని బుకింగ్స్‌కు, చెక్-ఇన్‌లకు అనుమతిస్తుంటారు. అయితే, జంటలు కచ్చితంగా మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకురావాలి అంటే సమస్యలు వస్తాయి. ఎందుకంటే ఇండియాలో చాలా మంది మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకోరు. ఆధార్‌లో కూడా ఆడపిల్లలు వారి ఇంటిపేరును మార్చుకోవడం లేదు. ఆ సమయంలో సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఫోన్‌లో పెళ్లి ఫోటో కానీ, సర్టిఫికెట్ కానీ పట్టుకుని వెళితే మంచిది. ” అని రమణ సూచించారు.

” అంతకుముందు అందరికీ అనుమతి ఉండేది కాబట్టి, హోటల్ వాళ్లకి అడిగేందుకు ఎలాంటి హక్కు ఉండేది కాదు. కానీ, ఇంతకుముందులా ఫ్రీడం సొసైటీ లేదనే మెసేజ్‌ను ప్రస్తుతం ఓయో అందించింది. రిసెప్షన్‌లో హోటల్ వాళ్లకు అడిగే హక్కు ఉంటుంది. అదే సమయంలో, గెస్ట్‌కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలి. ఓయో రూమ్ అనగానే ఫ్యామిలీల్లో ఉన్న ప్రతికూల అభిప్రాయాన్ని పోగొట్టేందుకే ప్రస్తుతం ఈ నిర్ణయం తీసుకుందని భావిస్తున్నా” అని రమణ చెప్పారు.

” ఆస్పత్రికి లేదా ఇంటర్వ్యూలకు ఊర్ల నుంచి వచ్చే వాళ్లు పెద్ద హోటల్‌కు వెళ్లే స్తోమత లేక, చిన్న హోటల్స్ బుక్ చేసుకుంటుంటారు. ఆ సమయంలో, ఒక్కోసారి వారు జంటలైనప్పటికీ, వాటిని రుజువు చేసే సర్టిఫికేట్లు తీసుకురాకపోవచ్చు. అప్పుడు, హోటల్ రూమ్ ఇవ్వకపోతే ఇబ్బందే కదా” అని ఒక కస్టమర్ ఆవేదన చెందారు.

రిలేషన్‌షిప్

ఫొటో సోర్స్, Getty Images

‘చెకిన్ గైడ్‌లైన్స్ మేరకే వసతి కల్పిస్తాం’

” ఓయో హోటళ్లు అంటే కపుల్స్‌కు మాత్రమే అని ముద్ర పడింది. కానీ, మా దగ్గర కూడా చెక్-ఇన్ గైడ్‌లైన్స్ ఉంటాయి. దాని ఆధారంగానే వసతి కల్పిస్తాం. ఓయో హోటళ్లు స్థానికంగా ఉన్న పోలీసు స్టేషన్ నిబంధనల ప్రకారమే నడుచుకుంటాయి. విదేశాల నుంచి వచ్చే వారి దగ్గర సీ-ఫామ్‌ను తీసుకుని, పోలీసు స్టేషన్‌కు అందిస్తాం.

ఓయో సామాన్య ప్రజలతో పాటు, కార్పొరేట్లకు కూడా వసతి సౌకర్యం కల్పించే ప్లాట్‌ఫామ్. ఇది వచ్చిన తర్వాత, తక్కువ ధరకే, మెరుగైన సౌకర్యాలు అన్ని వర్గాల వారికి అందుతున్నాయి. ఎవరేమనుకున్నా, ఎవరికీ ఇబ్బంది కలగకుండా అందరికీ వసతి సదుపాయం అందించడమే ఓయో ధ్యేయం. ” అని ఓయోలో పనిచేసే ఓ ఉద్యోగి చెప్పారు.

”హోటల్స్ బుకింగ్ సమయంలోనే చెకిన్-చెకవుట్ సమయాలను కస్టమర్లకు తెలియజేస్తాం. అలాగే, సాధారణంగా పెళ్లి అయిన వారికే రూమ్‌లను బుక్ చేస్తుంటాం. మ్యారేజ్ సర్టిఫికేట్ చూపించాలి. ఒకవేళ అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి ఏదైనా ట్రిప్‌కు వెళ్తున్నప్పుడు, అబ్బాయిలు, అమ్మాయిలు వేరువేరు గదులు బుక్ చేసుకోవాలని సూచిస్తుంటాం.” అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ ట్రావెల్ బుకింగ్ ఏజెంట్ చెప్పారు.

”ఒకప్పుడు హోటల్‌లో గదులు బుక్ చేసేటప్పుడు ఎవరిదైనా ఒకరి ఆధార్ కార్డు తీసుకునే వాళ్లు. కానీ, ఇప్పుడు అందరిదీ లేదా కనీసం ఇద్దరి ఆధార్ కార్డులు సమర్పించాలని అడుగుతున్నారు. సాధారణంగా తెలంగాణలో హోటళ్లు ఆలయాలకు దగ్గర్లో ఉంటాయి కనుక, పెళ్లయిన జంటలకు మాత్రమే అనుమతిస్తుంటారు. ఎక్కడా కూడా కస్టమర్లకు ఉండే హక్కుల గురించి నిర్వచించలేదు. అన్ని హోటళ్లకు దాదాపు ఒకే రకమైన పాలసీలు ఉంటాయి.” అని ట్రావెల్ బుకింగ్ ఏజెంట్ తెలిపారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

SOURCE : BBC NEWS