SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, Getty Images
వరంగల్‌కు చెందిన శశిభూషణ్ ఆరేళ్లుగా సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో అకౌంటెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ఆయన వయస్సు 38. మంచి జీతంతో పాటు కంపెనీ కల్పించిన హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఉంది.
ఓరోజు ఆయన తీవ్రమైన కడుపు నొప్పితో హాస్పిటల్లో చేరారు. అపెండిసైటిస్ అని తేలడంతో వెంటనే సర్జరీ చేయాల్సి వచ్చింది. ఇంకొన్ని సమస్యలు ఎదురుకావడంతో 4 రోజులు హాస్పిటల్లోనే ఉండాల్సి వచ్చింది.
కంపెనీ నుంచి గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ రూ.3లక్షలు మాత్రమే ఉండడంతో చేతి నుంచి సుమారు రూ.లక్షన్నర వరకూ పడింది. రూమ్ ఖర్చు విషయంలో కూడా లిమిట్ ఉండడంతో బాగా ఇబ్బందిపడాల్సి వచ్చింది శశిభూషణ్.
ఇది శశిభూషణ్ ఒక్కరి పరిస్థితే కాదు.
గ్రూప్ ఇన్సూరెన్స్ ఉంది, కంపెనీ ఇచ్చే మెడిక్లెయిమ్ ఉందని భావిస్తూ, ధీమాగా ఉండే చాలామంది ఉద్యోగులకు ఎదురయ్యే స్థితి ఇది. ఈ రోజుల్లో కంపెనీ ఇచ్చే మూడు, నాలుగు లక్షల రూపాయల కవరేజీతో ఎంతవరకూ ఉపయోగం ఉంటుంది? శశిభూషణ్‌కు ఎదురైన పరిస్థితి మీకూ వస్తే.. ఇబ్బంది పడకుండా ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాలి?


ఫొటో సోర్స్, Getty Images
సొంత హెల్త్ ఇన్సూరెన్స్ తప్పనిసరి
ఐఆర్డీఏఐ వార్షిక నివేదిక 2022-23 ప్రకారం భారత్‌లో 27 శాతం మందికి మాత్రమే వ్యక్తిగత రీటైల్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది.
పాలసీ బజార్ ఎంప్లాయీ బెనిఫిట్ సర్వే 2023 ప్రకారం నగరాల్లో పనిచేసే వాళ్లలో 74 శాతం మంది కేవలం తమ సంస్థ ఇచ్చే హెల్త్ కేర్ కవరేజీపైనే ఆధారపడుతున్నారు.
ప్లమ్ హెల్త్‌కేర్ 2023 నివేదిక ప్రకారం భారత్‌లో సరాసరి గ్రూప్ ఇన్సూరెన్స్ కవరేజీ రూ. 3 లక్షలలోపే ఉంది.
నగరాల్లో పనిచేసే ఉద్యోగుల్లో 74శాతం మంది పూర్తిగా కంపెనీ ఇచ్చే గ్రూప్ ఇన్సూరెన్స్ మీద మాత్రమే ఆధారపడుతున్నారు.
టెక్నాలజీ బేస్డ్ ఇన్సూరెన్స్ సంస్థ ప్లమ్ రీసెర్చ్ ప్రకారం భారత్‌లో ఉద్యోగులకు ఇచ్చే ఆరోగ్య బీమా సరాసరి కేవలం రూ.3 లక్షలుగా ఉంది. ఉద్యోగులు దీర్ఘకాలిక అనారోగ్యం బారిన పడ్డప్పుడు 85శాతం కంపెనీలు పెద్దగా అదనపు సాయం అందించిన దాఖలాలు కూడా లేవని రెండేళ్ల క్రితం రూపొందించిన ఈ రిపోర్ట్ చెబుతోంది.
ఈ డేటా బట్టి మనల్ని మనం ఎంత సెక్యూర్డ్‌గా ఉంచుకోవాలో అర్థమవుతుంది. మరింత స్పష్టత కోసం ఓ ఉదాహరణ చూద్దాం.
భావన ఓ ఐటీ కంపెనీలో సీనియర్ ఉద్యోగి. సుమారు పదిహేనేళ్ల అనుభవం తర్వాత ఆమె ఈ జాబ్ వదిలేసి చేసి స్టార్టప్ కంపెనీలో సీనియర్ రోల్లో చేరారు. ఈ రెండు జాబ్స్ మధ్య వ్యత్యాసం కేవలం 15 రోజులు. ఈ గ్యాప్‌లోనే తనకు డెంగీ వచ్చింది. కానీ ఎలాంటి ఇన్సూరెన్స్ లేకపోవడంతో సుమారు రూ.6 లక్షలు హాస్పిటల్ బిల్ కట్టాల్సి వచ్చింది. పాత కంపెనీలో మంచి ఇన్సూరెన్స్ ఉండేది కానీ అక్కడ మానేసి, కొత్త కంపెనీలో చేరడానికి మధ్యలో తనకు ఎలాంటి బీమా లేకుండా పోయింది.
సొంతంగా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుని ఉంటే ఇప్పుడు భావనకు ఆర్థికంగా ఇంత నష్టం వచ్చి ఉండేది కాదు.

ఫొటో సోర్స్, Getty Images
గ్రూప్ ఇన్సూరెన్స్
సాధారణంగా గ్రూప్ ఇన్సూరెన్స్, కార్పొరేట్ మెడిక్లెయిమ్ అనేవి పెద్ద కంపెనీలు తమ ఉద్యోగులకు కల్పించే బీమా ప్రయోజనాలు. తక్కువ మొత్తం ప్రీమియంతో ఎక్కువ మంది ఉద్యోగులను ఈ పాలసీలో చేర్చుకుంటారు. దీనివల్ల ఇన్సూరెన్స్ కంపెనీకి బల్క్‌గా ప్రీమియం లభించడంతో రేట్లు తక్కువగా ఉంటాయి.
ఎంప్లాయర్‌కు కూడా పన్ను ప్రయోజనాలు లభిస్తాయి. ప్రీమియంను యజమాని చెల్లిస్తారు కాబట్టి ఉద్యోగులు కూడా ఆసక్తి చూపిస్తారు. ఉద్యోగితో పాటు ఉద్యోగి కుటుంబ సభ్యులు (భార్యా పిల్లలు) ఈ పాలసీలో కవర్ అవుతారు. కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులకు కూడా కవరేజ్ ఉంటుంది.
కొన్ని కంపెనీలు ఉద్యోగి జీతం నుంచి ప్రీమియం మొత్తాన్ని కట్ చేస్తూ, ఈ ప్రయోజనాన్ని అందిస్తుంటాయి. అయితే గతంలోని ఆరోగ్య పరిస్థితులు, ప్రస్తుతమున్న వ్యాధులకు మినహాయింపు, వయసును బట్టి ప్రీమియం వంటివి ఇందులో ఉండవు కాబట్టి ఎక్కువ మంది గ్రూప్ ఇన్సూరెన్స్‌కు ప్రాధాన్యమిస్తారు.
అయితే కంపెనీలు సాధారణంగా గరిష్ఠంగా రూ.3 నుంచి 5 లక్షల లోపు మాత్రమే కవరేజ్ ఇచ్చేందుకు ఆసక్తిని చూపిస్తాయి. అసలు ఎలాంటి బీమా లేనప్పుడు ఇది కొద్దో గొప్పో అక్కరకు వస్తుంది గానీ, ఫ్యామిలీ పెరుగుతున్నప్పుడు, వయస్సు మీదపడుతున్నప్పుడు, కొద్దోగొప్పో అనారోగ్య సమస్యలు మొదలైనప్పుడు కేవలం కంపెనీ ఇచ్చే బీమాపైనే ఆధారపడడం పూర్తిగా రిస్క్‌తో కూడుకున్న వ్యవహారమే.

ఫొటో సోర్స్, Getty Images
మెటర్నిటీ, ఔట్ పేషెంట్ చికిత్స సమయంలో… ?
కార్పొరేట్ మెడిక్లెయిమ్స్లో మెటర్నిటీ (ప్రసూతి) విషయంలో… సాధారణంగా తక్కువ కవరేజ్ ఉంటుంది. చాలా పాలసీల్లో గరిష్ఠ క్లెయిమ్ పరిమితి రూ.25-50వేల వరకే ఉంటుంది. ఐవీఎఫ్, ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ వంటి అధునాతన చికిత్సలకు ఆస్కారం బాగా తక్కువ.
రిటైల్ ఇన్సూరెన్స్‌లో.. రెండు నుంచి నాలుగేళ్ల వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. గరిష్ఠంగా లక్షన్నర వరకూ కవరేజ్ లభిస్తుంది. సిజేరియన్, ఇతర సమస్యలు, అప్పుడే పుట్టిన పిల్లలకూ కవరేజ్, టీకాలు వంటి వాటికి కవరేజ్ ఉంటుంది. అధిక ప్రీమియంతో కొన్ని సంస్థలు ఐవీఎఫ్, ఇన్ఫెర్టిలిటీ చికిత్సలకు కూడా కవర్ ఇస్తున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
పిల్లల కవరేజ్
గ్రూప్ కవరేజ్‌లో ఇద్దరు పిల్లలు, భాగస్వామికి మాత్రమే కవరేజ్ ఉంటుంది. తల్లిదండ్రులకు కవరేజ్ అవకాశాలు తక్కువ. పుట్టుకతోనే లోపాలున్న పిల్లలకు కవరేజ్ తక్కువ.
రిటైల్ ఇన్సూరెన్స్‌లో… కొన్ని పాలసీల్లో భాగస్వామితో పాటు తల్లిదండ్రులు, అత్తమామలకు కూడా కవరేజ్ ఉంటుంది. క్రిటికల్ ఇల్నెస్, ఔట్‌పేషెంట్ డిపార్ట్మెంట్, మెంటల్ హెల్త్, డెంటల్ చెకప్స్ వంటి యాడ్ ఆన్స్ ఉంటాయి.
కార్పొరేట్ వర్సెస్ రీటైల్ ఇన్సూరెన్స్

ప్రొఫెషనల్స్ ఏం చేయొచ్చు??
కార్పొరేట్ కవర్‌ను మొదటి రక్షణ కవచంగా మాత్రమే పరిగణించండి.
కార్పొరేట్ కవర్‌తోపాటు రూ.10-15 లక్షల వరకూ ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ తీసుకోండి.
తక్కువ ఖర్చులో రూ.20 లక్షల వరకూ సూపర్ టాప్అప్ తీసుకోండి.
35 ఏళ్లలోపు లేదా సాధ్యమైనంత ముందుగానే ఇన్సూరెన్స్ తీసుకోండి.
పిల్లలను కనాలనే ఆలోచన ఉంటే మెటర్నిటీ, తీవ్ర అనారోగ్యం వంటి యాడ్ ఆన్స్ తీసుకోండి.

ఫొటో సోర్స్, Getty Images
ఏ పాలసీ ఎప్పుడు వాడాలి?
కార్పొరేట్ ప్లాన్‌ను సాధారణంగా చిన్న క్లెయిమ్స్ కోసం వినియోగించుకోండి.
మీ రిటైల్ ప్లాన్‌ను అత్యవసరమైనప్పుడు మాత్రమే వాడుకోండి. అందులో ప్రతి ఏడాదీ వచ్చే నో క్లెయిమ్ బోనస్‌ను రిజర్వ్ చేసిపెట్టుకోండి. మీకు ఏదైనా పెద్ద సమస్య వచ్చినప్పుడు ఇది ఉపయోగపడొచ్చు.
చివరగా… మీ ఆరోగ్యానికీ, ఉద్యోగానికి సంబంధం ఉండకూడదు. ఉద్యోగంలో ఏదైనా బ్రేక్ వచ్చింది కదా అని అనారోగ్య సమస్యలు ఆగవు కదా! అందుకే సొంతంగా ఆరోగ్య బీమా ఉండడం తప్పనిసరి.
(గమనిక: ఇవన్నీ కేవలం అవగాహన కోసం అందించిన వివరాలు మాత్రమే. ఆర్థిక అంశాలపై మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనుకున్నా నిపుణులను సంప్రదించగలరు)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)