SOURCE :- BBC NEWS

కల్వకుంట్ల కవిత

ఫొటో సోర్స్, Kavitha Office

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, తన తండ్రి, బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు (కేసీఆర్‌)కి రాసిన లేఖ తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది.

ఆ లేఖ ఆవిడ రాశారా లేదా అన్న సస్పెన్స్‌కి తెర దించుతూ అది తాను రాసిన లేఖేనని ప్రకటించారు కవిత.

24 గంటల పాటు తెలంగాణ రాజకీయాల్లో సంచలనం అన్న ఊహాగానాలకు తాత్కాలికంగా తెరదించుతూ, ”కేసీఆర్ దేవుడు, కానీ ఆయన చుట్టూ దెయ్యాలున్నాయి. పార్టీలో కోవర్టులు లేఖ బయటకు లీక్ చేశారు. నేను గతంలో చాలాసార్లు అలా లేఖ రాశాను. కేసీఆర్ నాయకత్వంలోనే పార్టీ ముందుకు వెళుతుంది” అంటూ మీడియాతో అన్నారు కవిత.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
కవిత

ఫొటో సోర్స్, Kavitha Office

విమానాశ్రయంలో కొత్త దృశ్యాలు

కవిత విమానాశ్రయంలోకి వచ్చే ముందు కూడా అనేక ఊహాగానాలకు ఊతమిచ్చేలా కనిపించాయి అక్కడి దృశ్యాలు. అమెరికా నుంచి వచ్చిన కవితకు స్వాగతం పలకడానికి వచ్చిన వారు టీమ్ కవితక్క అనే పోస్టర్లు ప్రదర్శించారు.

సామాజిక తెలంగాణ కోసం పనిచేస్తోన్న కవితక్కకు స్వాగతం అని బ్యానర్లు ప్రదర్శించారు. కవిత సీఎం అంటూ నినాదాలు చేశారు ఆమె అభిమానులు. కానీ ఎక్కడా బీఆర్ఎస్ జెండా కానీ, బీఆర్ఎస్ ఇతర నాయకుల ఫోటోలు కానీ లేవు. కానీ, ఆవిడ స్పీచ్ అక్కడి వాతావరణానికి భిన్నంగా సాగింది.

సాధారణంగా ఇలాంటి లేఖలు వచ్చినప్పుడు దానిపై ఖండనలు ఇస్తారు. కానీ అటు కవిత, ఆవిడ కార్యాలయం, ఇటు బీఆర్ఎస్ పార్టీ దాదాపు 24 గంటలు మౌనంగా ఉండిపోయాయి. కేవలం బీజేపీ, కాంగ్రెస్‌లే మాట్లడాయి. మొత్తంగా కవిత ప్రకటనతో తాత్కాలికంగా లేఖ వ్యవహారం సద్దుమణిగినా, కేసీఆర్ దేవుడే.. కానీ ఆయన చుట్టూరా దెయ్యాలున్నారంటూ మరో మాట పేల్చారు కవిత. ఇంతకీ కవిత ఏమన్నారంటే..

కల్వకుంట్ల  కవిత

ఫొటో సోర్స్, Kavitha Office

‘‘కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లుంది’’

”అమెరికా నుంచి వచ్చేలోపు లేఖ లీక్ అయిందని హంగామా నడుస్తున్నట్టు తెలుస్తోంది. నేను చెప్పేది ఒకటే. రెండు వారాల క్రితం నేను పెద్దలు, గౌరవనీయులు కేసీఆర్ గారికి లేఖ రాశాను.

గతంలో కూడా లేఖ ద్వారానే చెప్పేదాన్ని నా అభిప్రాయాలు. మొన్ననే చెప్పాను పార్టీలో కుట్రలు జరుగుతున్నాయని.

కొద్ది రోజుల్లోనే అంతర్గతంగా రాసిన ఉత్తరం బహిర్గతం కావడం అంటే పార్టీలో ఏం జరుగుతుందో మనందరం, తెలంగాణ ప్రజలందరూ ఆలోచించాల్సిన విషయం.

పార్టీలో అన్ని స్థాయిల్లో నాయకులు అనుకుంటున్న విషయాలు, సగం తెలంగాణలో నేను పర్యటించిన సమయంలో ప్రజలు అనుకుంటున్న విషయాలను లేఖలో చెప్పాను.

నాకు వ్యక్తిగత ఎజెండా లేదు. ఎవరిపైనా ప్రేమా, ద్వేషం లేదు. అంతర్గతంగా రాసిన లేఖ, పార్టీలో ఎలా బహిర్గతం అయిందో ఎవరు చేశారో ఆలోచించుకోవాలి.

పార్టీలో కోవర్టుల పని ఇది అనుకుంటున్నాను. వారిపై పార్టీ చర్యలు తీసుకోవాలి. కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఏమీ చేయలేదు. పార్టీని బలోపేతం చేయడానికి ఫీడ్ బ్యాక్ వ్యవస్థ ఉండాలి.

అదే చేశాను. కేసీఆర్ గారు దేవుడు. కానీ కేసీఆర్ చుట్టూ కొన్ని దెయ్యాలు ఉన్నాయి. వారి వల్ల చాలా నష్టం జరుగుతోంది. కూతుర్ని అయిన నా లేఖ బయటకు వచ్చిందంటే, ఇతర సామాన్యుల సంగతేంటి అనేది పార్టీలో చర్చ జరగాలి.

తరచుగా నేను ఇచ్చే ఫీడ్ బ్యాకే తప్ప ఆ లేఖ ప్రత్యేకమేం కాదు. కానీ ఆ లేఖ బయటకు రావడం బాధాకరం.

కాకపోతే ఈ లేఖ చూసి కాంగ్రెస్ బీజేపీ సంబరపడుతున్నాయి. కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు ఉంది వారికి. కానీ అంత సీన్ లేదు. మా నాయకుడు కేసీఆర్ మాత్రమే.

ఆయన నాయకత్వంలోనే బీఆర్ఎస్ ముందుకు వెళ్తుంది. పార్టీలో చిన్న చిన్న లోపాలు ఉంటే సరిచేసుకుని, చర్చించుకుని ముందుచూపుతో వెళ్తే పార్టీ పది కాలాలు చల్లగా ఉంటుంది. బీజేపీ, కాంగ్రెస్‌లు తెలంగాణకు ఒరగబెట్టేది ఏమీ లేదు.

రెండూ తెలంగాణను ఫెయిల్ చేశాయి. రెండు పార్టీలకూ ప్రత్యామ్నాయం కేసీఆర్ నాయకత్వం మాత్రమే. కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ ముందుకు వెళ్తుంది” అని విమానాశ్రయంలో మీడియాతో అన్నారు కవిత.

కవిత రాసిన లేఖ

ఫొటో సోర్స్, kavitha Office

ఏముందా లేఖలో..

తన లేఖలో సానుకూల, ప్రతికూల రెండు అంశాలూ ప్రస్తావించారు కవిత. ముఖ్యంగా బీజేపీని కేసీఆర్ ఘాటుగా విమర్శించకపోవడాన్ని ఆవిడ ఆక్షేపించారు.

”రజతోత్సవ సభలో బీజేపీ గురించి తక్కువగా మట్లాడటం అనేది భవిష్యత్తులో ఆ పార్టీతో పొత్తు ఉంటుందనే ఊహాగానాలకు” దారి తీస్తుందని కవిత వ్యాఖ్యానించారు.

డాడీ అంటూ ఇంగ్లీషులో లేఖ ప్రారంభించారు. సుదీర్ఘ లేఖ రాసినందుకు సారీ అంటూ ముగించారు. మొత్తం చేతిరాతతోనే ఆ లేఖ ఉంది.

పాజిటివ్ అంశాలు:

  • ఆపరేషన్ కగార్, పహల్గాం మృతులకు సంతాపం
  • కాంగ్రెస్ విఫలం అని కార్యకర్తలతో చెప్పించిన విధానం
  • సభతో మొత్తంగా ఉత్సాహం వచ్చింది. ప్రసంగం అందరూ శ్రద్ధతో విన్నారు.
  • రేవంత్ రెడ్డి పేరు తీయకుండా మాట్లాడటం, హుందాగా కనిపించింది.
  • తెలంగాణ తల్లి, గీతం అంశాలపై మాట్లాడతారని ఆశించారు. తెలంగాణ అంటే బీఆర్ఎస్ అని చెప్తారని ఆశించారు. మొత్తంగా ప్రసంగంలో ఇంకాస్త పంచ్‌ ఆశించారు. అయినా కార్యకర్తలు, నాయకులు సభతో సంతృప్తిగా ఉన్నారు.
  • పోలీసులకు చేసిన హెచ్చరిక కూడా బలంగా వెళ్లింది.
కవిత రాసిన లేఖ

ఫొటో సోర్స్, kavitha Office

నెగిటివ్ అంశాలు:

  • చాలామంది మీతో ఫొటో దిగాలని, చేయి కలపాలని అంటుంటే సంతోషం వేసింది. కానీ జడ్పీటీసీ సభ్యులుగా, జడ్పీ ఛైర్మన్‌లుగా, ఎమ్మెల్యేలుగా పనిచేసిన వారు మిమ్మల్ని కలిసే అవకాశం దొరకడం లేదని బాధపడుతున్నారు. కొందరికే ఆ అవకాశం వస్తుందంటున్నారు. అందర్నీ కలవండి.
  • కాంగ్రెస్‌పై నమ్మకం పోయింది. కానీ దానికి బీజేపీ ప్రత్యామ్నాయం అవుతుందేమో అని మన వారే అనుమానిస్తున్నారు.
  • బీజేపీ గురించి రెండు నిమిషాలు మాత్రమే మాట్లాడారు. దీంతో చాలామంది ఆ పార్టీతో భవిష్యత్తులో పొత్తు ఉంటుందనే ఊహాగానాలు మొదలుపెట్టారు. నేను కూడా మీరు బలంగా మాట్లాడలేదని భావిస్తున్నాను. నేను కూడా (బీజేపీ వల్ల) బాధపడ్డాను. మీరు బీజేపీని ఇంకాస్త టార్గెట్ చేయాల్సింది.
  • ఎమ్మెల్సీ ఎన్నికలో పోటీ చేయకుండా బీజేపీకి సాయం చేశామనే సందేశం కాంగ్రెస్‌ బలంగా తీసుకెళ్లింది.
  • కనీసం ఇప్పుడైనా పార్టీ తరపున రెండు రోజులు ప్లీనరీ పెట్టి, కార్యకర్తల అభిప్రాయాలు తీసుకుని, మార్గనిర్దేశం చేయండి. దీనిపై ఆలోచన చేయండి.
  • సభలో బీసీలకు 42 శాతం, ఎస్సీ వర్గీకరణ అంశాలు మాట్లాడకపోవడం
  • ఉర్దూలో మాట్లాడకపోవడం, వక్ఫ్ బిల్లుపై మాట్లాడకపోవడం
  • పాత ఇంచార్జులకు సభ నిర్వహణ ఇవ్వడం, వారు ఉద్యమకారులకు సదుపాయాలు ఇవ్వకపోవడం కొన్ని నియోజకవర్గాల నుంచి వచ్చిన ఫిర్యాదు.
  • స్థానిక సంస్థల ఎన్నికల బీ ఫారాలు పాత ఇంచార్జులకు ఇస్తున్నారు చెబుతున్నారు. పంచాయితీ సర్పంచ్ కాకుండా, ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులు నేరుగా రాష్ట్ర పార్టీ నుంచి బీ ఫారాలు ఆశిస్తున్నారు.
  • మీరు సభా వేదిక మీదకు వచ్చే ముందు పార్టీ ప్రారంభం అంటే 2001 నుంచి మీతో ఉన్న వారిని మాట్లాడనిస్తే బావుండేది.
  • సాంస్క్రతిక కార్యక్రమం ధూం ధాం ఆకట్టుకోలేదు.
కిషన్ రెడ్డి

ఫొటో సోర్స్, kishanreddy/fb

ప్రతిపక్షాలు ఏమంటున్నాయంటే..

దీనిపై ప్రతిపక్షాలు స్పందించాయి. బీజేపీ ఈ అంశంపై తేలికగా స్పందించగా, కాంగ్రెస్ నాయకులు మాత్రం పెద్ద సంఖ్యలో మాట్లాడారు. బీఆర్ఎస్ మాత్రం లేఖ నకిలీ కావొచ్చంటూనే, నిజమైనా పెద్ద విషయం కాదంటూ మాట్లాడారు.

”కవిత రాసిన లేఖను ప్రాధాన్యతతో చూడక్కర్లేదు. అది డాడీ–డాటర్ మధ్య అంతర్గత లేఖ. మునిగిపోతున్న నౌక లాంటి బీఆర్ఎస్ లాంటి పార్టీలో ఇలాంటివి జరగడం సహజం. డాడీ–డాటర్ లేఖ ఓ డ్రామా మాత్రమే. బీఆర్‌ఎస్ పార్టీ డాడీ–డాటర్–సన్ పార్టీ. ఇది నాలుగు స్తంభాల ఆటలాంటిది. కవిత రాసిన లేఖలో తెలంగాణలో ప్రత్యామ్నాయంగా బీజేపీనే ఉందని ప్రజలు అనుకుంటున్నట్లు ఆమె చెప్పింది. అదే ప్రజలు నమ్ముతున్నారు. ఓడిపోయిన పార్టీ గురించి మేం పట్టించుకోం” అని వ్యాఖ్యానించారు బీజేపీ నాయకులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.

”కాంగ్రెస్ ఆరోపణలకు బలమిస్తూ కవిత లేఖ ఉంది. బీజేపీతో బీఆర్‌ఎస్ ఎందుకు స్నేహంగా ఉందని కవిత అడిగారు. అదే ప్రశ్న మేం అడిగితే రాజకీయం అన్నారు. పెద్ద ఎత్తున కేంద్రం, రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నా, దేశ వ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వం తప్పు చేస్తున్నా కేసీఆర్ ఎందుకు ప్రశ్నించడం లేదని కాంగ్రెస్ అడిగితే రాజకీయం అన్నారు. ప్రజాస్వామ్యానికి అవకాశం లేని పార్టీ బీఆర్ఎస్. సొంత పార్టీ అధ్యక్షుడు సామాన్య కార్యకర్తలను కలవడం లేదు. మేము ముందు నుంచీ చెప్తున్నాం బీజేపీ, బీఆర్ఎస్ వేరువేరు కాదని. దిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ లాగా వ్యవహరిస్తున్నారు. అన్ని ఎన్నికల్లో సహకరించుకుంటున్నాయి ఆ పార్టీలు” అని విమర్శించారు కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్.

”ఈ లేఖ వల్ల వచ్చే నష్టమేమీ లేదు. కొందరు మీడియా వాళ్ళు కావాలని దాన్ని హైలెట్ చేస్తున్నారు. ఆ లేఖలో కొత్త విషయాలేమీ లేవు. కార్యకర్తలు చర్చించుకునే విషయాలే ఉన్నాయి. ఇతర పార్టీలు తమ సమస్యలు చూసుకుంటే మంచిది. ఒకవేళ లేఖ కవితే రాసినా అది అంతర్గత అంశం. మోదీని కేసీఆర్ విమర్శించినట్టు ఎవరూ విమర్శించలేదు. ఫాసిస్ట్ ప్రధాని అన్నారు కేసీఆర్” అని అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)