SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, Getty Images
కాబోయే పోప్ ఎవరు? ఈ నిర్ణయం కాథలిక్ చర్చ్ మీద, ప్రపంచంలోని 140 కోట్ల రోమన్ క్యాథలిక్కుల మీద ప్రభావం చూపుతుంది.
పోప్ ఫ్రాన్సిస్ వారసుడు ఎవరనేది ఊహించడం దాదాపు అసాధ్యం. అంతే కాదు ఇది అనేక కారణాల వల్ల బహిరంగంగా జరిగే వ్యవహారం కూడా.
కార్డినల్స్ కాలేజీలో సభ్యులంతా సిస్టైన్ చాపెల్‌లో సమావేశమై చర్చలు జరిపి తాము మద్దతిస్తున్న అభ్యర్థికి ఓటు వేస్తారు. అలా ఒకే పేరు వచ్చేవరకూ ఈ ప్రక్రియ కొనసాగుతుంది.
కార్డినల్స్ కాలేజీలో ఉన్న కార్డినల్స్లో 80 శాతం మంది, పోప్ ఫ్రాన్సిస్ నియమించినవారే. వాళ్లు తొలిసారిగా పోప్ ఎన్నికలో పాల్గొనడమే కాదు, విస్తృత ప్రపంచ దృక్పథాన్ని అందించబోతున్నారు.
పోప్ ఎన్నికలో పాల్గొంటున్న కార్డినల్స్లో సగం కంటే తక్కువ మంది యురోపియన్లు ఉండటం చరిత్రలో ఇదే తొలిసారి.
కార్డినల్స్ కాలేజ్‌లో ఎక్కువమంది పోప్ ఫ్రాన్సిస్ నియమించిన వారే అయినప్పటికీ, వారంతా “ఆధునిక” లేదా “సంప్రదాయవాదులు” కాదు.
ఈ కారణాల వల్ల, తర్వాతి పోప్ ఎవరనేది అంచనా వేయడం కష్టం.
కార్డినల్స్ ఆసియన్ను లేదా ఆఫ్రికన్‌ను పోప్‌గా ఎన్నుకోగలరా? లేక వాటికన్ పూర్వ పాలకుల్లో ఒకరికి అనుకూలంగా వ్యవహరిస్తారా?
పోప్ ఫ్రాన్సిస్ వారసుడు అయ్యే అవకాశం ఉందని భావిస్తున్న వారిలో కొంతమంది పేర్లు ఇవి.


ఫొటో సోర్స్, Getty Images
పియత్రో పారోలిన్
జాతీయత: ఇటాలియన్
వయసు: 70 ఏళ్లు
మృదువుగా మాట్లాడే ఇటాలియన్ కార్డినల్ పారోలిన్, పోప్ ఫ్రాన్సిస్ హయాంలో వాటికన్ విదేశాంగ మంత్రిగా ఉన్నారు. అది ఆయనను పోప్‌కు ముఖ్య సలహాదారుగా మార్చింది. చర్చ్ కేంద్ర పాలనా విభాగమైన రోమన్ క్యురియాకు కూడా విదేశాంగమంత్రి నాయకత్వం వహిస్తారు.
పోప్‌కు డిప్యూటీగా సమర్థవంతంగా పని చేయడంతో, పోప్ ఎవరనే పోటీలో ఆయన ముందున్నారు.
ఆయన క్యాథలిక్ సిద్ధాంతం కంటే దౌత్యం, ప్రపంచ దృక్పథానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారని భావిస్తున్నారు. అది బలమని మద్దతుదారులు నమ్మితే, అదే సమస్యనేది విమర్శకుల అభిప్రాయం.
సమ లైంగిక వివాహాలకు చట్టబద్దత కల్పించడాన్ని విమర్శించిన పారోలిన్, 2015లో సమ లైంగిక వివాహలకు అనుకూలంగా ఐర్లండ్ ప్రభుత్వం ఓటు వేయడాన్ని “మానవజాతికి ఓటమి” అని పిలిచారు.
ఇప్పటి వరకు పోప్‌లుగా వ్యవహరించిన 266 మందిలో 213 మంది ఇటాలియన్లు. అయినప్పటికీ 40 ఏళ్లుగా ఇటాలియన్లు ఎవరూ పోప్‌గా లేరు.

ఫొటో సోర్స్, Getty Images
లూయీస్ ఆంటోనియో గోకిమ్ టగ్లే
జాతీయత: ఫిలిప్పినో
వయసు: 67 ఏళ్లు
తర్వాతి పోప్ ఆసియా నుంచి వస్తారా?
కార్డినల్ టగ్లేకు దశాబ్ధాలుగా మతంతో సంబంధం ఉంది. ఆయన వాటికన్ దౌత్యవేత్త గానో, లేదంటే చర్చి చట్టంలో నిపుణుడిగా కాకుండా ప్రజల్లో క్రియాశీల చర్చి నాయకుడుగా ఉన్నారు.
ఫిలిప్పీన్స్‌లో చర్చి ప్రభావం ఎక్కువ. దేశ జనాభాలో 80శాతం మంది క్యాథలిక్కులు. ఫిలిప్పీన్స్ నుంచి ప్రస్తుతం రికార్డు స్థాయిలో ఐదుగురు కార్డినల్స్ ఉన్నారు. వాళ్లంతా కార్డినల్ టగ్లేకు మద్దతిస్తే అది బలమైన వర్గాన్ని కూడగట్టేందుకు బాటలు వేస్తుంది.
కార్డినల్ టగ్లేను ఆధునిక క్యాథలిక్కుగా భావిస్తారు. అలాగే ఆయనను “ఏషియన్ ఫ్రాన్సిస్” అని పిలుస్తారు.
2013లో పోప్ ఫ్రాన్సిస్ ఎన్నిక జరిగినప్పుడు, కార్డినల్ టగ్లేను పోప్ అభ్యర్థిగా భావించారు.
పదేళ్ల కిందట, తర్వాత పోప్‌గా మీరుండాలనే ప్రతిపాదనను ఎలా చూస్తారని అడిగినప్పుడు “అదొక జోక్‌గా భావిస్తాను. చాలా తమాషాగా ఉంటుంది” అని ఆయన సమాధానమిచ్చారు.

ఫొటో సోర్స్, AFP
ఫ్రిడోలిన్ అంబోంగో బెసుంగు
జాతీయత: కాంగోలీస్
వయసు: 65 ఏళ్లు
తర్వాతి పోప్ ఆఫ్రికా నుంచి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆఫ్రికాలో క్యాథలిక్ చర్చ్ లక్షల మందిని సభ్యులుగా చేర్చుకుంటోంది. కార్డినల్ అంబోంగో డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోకు చెందిన వ్యక్తి.
ఆయన కిన్షాసాలో ఏడేళ్లు ఆర్చ్ బిషప్‌గా ఉన్నారు. పోప్ ఫ్రాన్సిస్ ఆయనను కార్డినల్‌గా నియమించారు.
బెసుంగు సాంస్కృతిక సంప్రదాయవాది. సమ లైంగికుల వివాహాలను వ్యతిరేకించారు.
డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో మెజారిటీ ప్రజలు క్రైస్తవులైనప్పటికీ, అక్కడి జిహాదీ గ్రూపులు, ఇస్లామిక్ స్టేట్, వారితో అనుబంధంగా ఉన్న రెబెల్స్ నుంచి ప్రాణ భయం, హింసను ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితుల దృష్ట్యా కార్డినల్ బెసుంగును క్రైస్తవులకు బలమైన మద్దతుదారుగా భావిస్తున్నారు.
అయితే 2020లో ఓ ఇంటర్వ్యూలో ఆయన మతపరమైన బహుళత్వానికి అనుకూలంగా మాట్లాడారు. “ప్రొటెస్టెంట్లను ప్రొటెస్టెంట్లుగా ముస్లింలను ముస్లింలుగా ఉండనివ్వండి. మేము వారితో కలిసి పని చేస్తాం. అందరికీ వారి సొంత గుర్తింపు ఉండాలి” అని ఆ ఇంటర్వ్యూలో చెప్పారు.
ఇటువంటి వ్యాఖ్యల వల్ల క్యాథలిక్ చర్చ్ లక్ష్యాన్ని ఆయన పూర్తిగా స్వీకరిస్తారా అని కొంతమంది కార్డినల్స్ సందేహించవచ్చు.

ఫొటో సోర్స్, Reuters
పీటర్ కోడ్వో అపియా టర్క్సన్
జాతీయత: ఘనేయన్
వయసు: 76 ఏళ్లు
సహచరులు ఎన్నుకుంటే, కార్డినల్ టర్క్సన్ 1500 ఏళ్లలో తొలి ఆఫ్రికన్ పోప్‌గా గుర్తింపు పొందుతారు.
కార్డినల్ బెసుంగు మాదిరిగానే ఆయన కూడా తాను పోప్ కావాలని భావించడం లేదని చెప్పారు. “ఎవరైనా పోప్ కావాలని కోరుకుంటారో లేదో నాకు తెలియదు” అని ఆయన 2013లో బీబీసీతో చెప్పారు.
ఆఫ్రికాలో క్రైస్తవ జనాభా పెరుగుతోంది కాబట్టి, తర్వాతి పోప్‌ను ఆఫ్రికా నుంచి ఎన్నుకోవచ్చు కదా అని అడిగినప్పుడు “గణాంకాల ఆధారంగా పోప్‌ను ఎన్నుకోకూడదు, ఎందుకంటే అలాంటి పరిగణనలు నీటిని బురదగా మారుస్తాయి” అని చెప్పారు.
కార్డినల్‌గా నియమితుడైన తొలి ఘనా దేశస్తుడాయన. పోప్ జాన్‌పాల్2 ఆయనను 2003లో కార్డినల్‌గా నియమించారు.
కార్డినల్ టగ్లే మాదిరిగానే పోప్ ఫ్రాన్సిస్ ఎన్నిక జరిగిప్పుడు కార్డినల్ టర్క్సన్ కూడా బలమైన అభ్యర్థిగా ఉన్నారు. అప్పట్లో ఓటింగ్‌కు ముందే ఆయనను ‘ఫేవరెట్’ అని బుక్ మేకర్లు భావించారు.
గతంలో గిటారిస్ట్‌గా ఫంక్ బ్యాండ్‌లో పని చేసిన కార్డినల్ టర్క్సన్ చలాకీగా ఉండేవారు.
2012లో వాటికన్లో జరిగిన బిషప్‌ల సమావేశంలో, యూరప్‌లో ఇస్లాం వ్యాప్తి గురించి ఆయన అంచనాలు భయానకంగా ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ అంశంపై తర్వాత ఆయన క్షమాపణలు చెప్పారు.

ఫొటో సోర్స్, Reuters
పీటర్ ఎర్డో
జాతీయత: హంగేరియన్
వయసు: 72 ఏళ్లు
51 ఏళ్లకే కార్డినల్ అయిన పీటర్ ఎర్డో పట్ల యూరప్ చర్చ్ నుంచి ఎంతో గౌరం ఉంది. 2006 నుంచి 2016 వరకు రెండుసార్లు యూరోపియన్ బిషప్స్ సమావేశానికి నాయకత్వం వహించారు.
ఆఫ్రికన్ కార్డినల్స్లో ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ఆర్థోడాక్స్ చర్చ్తో క్యాథలిక్కుల సంబంధాలపై పని చేశారు.
2021, 2023లో పోప్ ఫ్రాన్సిస్ హంగేరీలో పర్యటించడంలో ఎర్డో కీలక పాత్ర పోషించారు. పోప్ బెనడిక్ట్, ఆయన తర్వాత పోప్ ఫ్రాన్సిస్ ఎన్నికల్లో పాల్గొన్నారు,

ఫొటో సోర్స్, Getty Images
ఏంజలో స్కోలా
జాతీయత: ఇటాలియన్
వయసు: 83ఏళ్లు
పోప్ ఎన్నికలో 80 ఏళ్ల లోపు కార్డినల్స్కు మాత్రమే కాంక్లేవ్‌లో ఓటు వేయగలరు. అయితే ఏంజెలో స్కోలాకు ఇప్పటికీ పోప్‌గా ఎన్నికయ్యే అవకాశాలు ఉన్నాయి.
2013లో ఫ్రాన్సిస్ పోప్‌గా ఎన్నికైనప్పుడు ఈ మాజీ అర్చి బిషప్ ఆఫ్ మిలన్ పోటీ దారుడిగా ఉన్నారు. అయితే ఆయన పోప్‌గా కాంక్లేవ్‌లో పాల్గొని కార్డినల్‌గా నిష్క్రమించారనే సామెతకు బలైపోయానని భావిస్తున్నారు.
పోప్ ఎన్నికకు ముందు ఆయన పేరు మరోసారి తెరపైకి వచ్చింది, దీనికి కారణం వృద్దాప్యం గురించి ఆయన రాసిన పుస్తకం ఈ వారంలో ప్రచురితమైంది. పోప్ ఫ్రాన్సిస్ ఆసుపత్రిలో చేరడానికి కొద్ది సేపటికి ముందు ఆయన రాసిన ముందుమాట ఉంది. అందులో ఆయన “మరణం ప్రతి దానికి ముగింపు కాదు, ఏదో ఒక దానికి ప్రారంభం” అని రాశారు.
ఫ్రాన్సిస్ రాసిన ఆ మాటలు స్కోలా పట్ల ఆయనకున్న అభిమానానినికి నిదర్శనం. అయితే కార్డినల్స్ కాలేజ్ వృద్ధాప్యంపై ఆయన దృష్టిని కొత్త పోప్ ఎన్నికలో ఆదర్శంగా తీసుకోకపోవచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
రైన్హార్ మార్క్స్
జాతీయత: జర్మన్
వయసు: 71ఏళ్లు
జర్మనీలో క్యాథలిక్ అగ్ర మతాధికారి. వాటికన్‌కు అత్యంత సన్నిహితుడైన వ్యక్తి.
2013లో ఫ్రాన్సిస్ పోప్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆర్చ్ బిషప్ ఆఫ్ మ్యూనిక్ అండ్ ఫ్రెయిసింగ్ను సలహాదారుగా ఎంచుకున్నారు.
పదేళ్ల పాటు ఆయన పోప్‌కు చర్చ్ సంస్కరణలపై సలహాలు ఇచ్చారు. ప్రస్తుతం వాటికన్ ఆర్థిక సంస్కరణలను పర్యవేక్షిస్తున్నారు.
స్వలింగ సంపర్కులు, ట్రాన్స్జెండర్ల పట్ల కాథలిక్ బోధనలలో సానుకూల దృక్పథాన్ని చూపుతున్నారు.
రెండేళ్ల క్రితం పోప్‌కు అతి ముఖ్యమైన సలహా సంస్థ అయిన కౌన్సిల్ ఆఫ్ కార్డినల్స్ నుంచి ఆయన నిష్క్రమించారు. జర్మనీలో ఈ నిర్ణయాన్ని ఆయన కెరీర్లో ఎదురు దెబ్బగా చూశారు.

ఫొటో సోర్స్, Reuters
మార్క్ ఔల్లెట్
జాతీయత: కెనేడియన్
వయసు: 80 ఏళ్లు
2005, 2013లో పోప్ ఎన్నిక జరిగినప్పుడు కార్డినల్ ఔల్లెంట్ సమర్థుడైన అభ్యర్థిగా కనిపించారు.
ఆధునిక దృక్పథం కలిగిన సంప్రదాయ వాదిగా ఆయనకు గుర్తింపు ఉంది. మత ప్రచారకులు బ్రహ్మచారులుగా ఉండాలనే వాదనకు ఆయన బలమైన మద్దతుదారుడు.
మహిళా మత ప్రచార నియామకాలకు వ్యతిరేకం. అయితే క్యాథలిక్ చర్చ్‌ను నడపడంలో మహిళలు కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. “క్రీస్తు పురుషుడు. చర్చి స్త్రీలాంటిది” అని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
రాబర్ట్ ప్రివోస్ట్
జాతీయత: అమెరికన్
వయసు: 69 ఏళ్లు
రోమన్ క్యాథలిక్ చర్చ్ ఆధిపత్యం తొలిసారి అమెరికాకు దక్కుతుందా?
షికాగోలో జన్మించిన కార్డినల్ ప్రివోస్ట్కు పోప్ అయ్యేందుకు చాలా అర్హతలు ఉన్నాయి.
రెండు సంవత్సరాల క్రితం పోప్ ఫ్రాన్సిస్, వాటికన్ బిషప్‌ల డికాస్టరీకి ప్రిఫెక్ట్‌గా మార్క్ ఓయెల్లెట్ స్థానంలో ప్రీవోస్ట్‌ను ఎంచుకున్నారు. తర్వాతి తరం బిషప్‌లను ఎంపిక చేసే బాధ్యత ప్రివోస్ట్కు అప్పగించారు.
ప్రీవోస్ట్‌ను కేవలం అమెరికన్‌గా మాత్రమే కాకుండా, లాటిన్ అమెరికా కోసం పోంటిఫికల్ కమిషన్‌కు నాయకత్వం వహించిన వ్యక్తిగా కూడా పరిగణిస్తారు.
ఆయనకు సంస్కర్తగా గుర్తింపు ఉంది. అయితే పోప్ పదవి చేపట్టేందుకు 69 ఏళ్లు చాలా చిన్న వయసుగా భావిస్తారు. పెరూలో ఆర్చ్ బిషప్‌గా ఆయన లైంగిక వేధింపుల ఆరోపణలను కప్పిపుచ్చారని విమర్శలు వచ్చాయి. అయితే ఆయన పరిధిలోని చర్చ్‌లు ఈ ఆరోపణలను ఖండించాయి.

ఫొటో సోర్స్, GUY PETERSON/AFP
రాబర్ట్ సారా
జాతీయత: గినేయన్
వయసు: 79 ఏళ్లు
చర్చ్‌లో సంప్రదాయ వాదులకు బాగా ఇష్టమైన వ్యక్తి.
సిద్ధాంతం, సంప్రదాయ ప్రార్థనలకు కట్టుబడి ఉంటారని గుర్తింపు ఉంది.
పోప్ ఫ్రాన్సిస్ సంస్కరణలను వ్యతిరేకించేవారు.
వ్యవసాయ కూలీ కుమారుడైన సారా 34ఏళ్లకే ఆర్చ్ బిషప్ అయ్యారు.
పోప్‌గా బాధ్యతలు చేపట్టేందుకు సుముఖంగా లేకున్నప్పటికీ, సంప్రదాయ వాద కార్డినల్స్ నుంచి ఆయనకు బలమైన మద్దతు ఉంది.

ఫొటో సోర్స్, EPA
పీర్ బాటిస్టా పిజబల్లా
జాతీయత: ఇటాలియన్
వయసు: 60
పాతికేళ్లకే ఇటలీలో మత బోధకుడిగా నియమితుడైన పిజబల్లా జెరూసలేంకు వెళ్లి అక్కడే నివసిస్తున్నారు.
పోప్ ఫ్రాన్సిస్ ఐదేళ్ల కిందట ఆయన్ను జెరూసలేం లాటిన్ పాట్రియార్క్గా, తరువాత కార్డినల్‌గా నియమించారు.
ఇజ్రాయెల్, పాలస్తీనియన్ల గురించి, గాజాలో జరుగుతున్న యుద్ధం గురించి ఆయనకున్న లోతైన అవగాహనతో తోటి కార్డినల్స్ ఆకట్టుకోగలరు.

ఫొటో సోర్స్, NGELO CARCONI/EPA-EFE/REX/Shutterstock
మైఖేల్ చెర్నీ
జాతీయత: కెనేడియన్
వయసు: 78 ఏళ్లు
కార్డినల్ చెర్నీని పోప్ ఫ్రాన్సిస్ కార్డినల్‌గా నియమించారు.
పోప్ ఫ్రాన్సిస్ మాదిరిగానే ఆయన కూడా దైవ సేవకుడు.
చెర్నీ పూర్వపు చెకోస్లోవేకియాలో జన్మించినప్పటికీ, ఆయనకు రెండేళ్ల వయసు ఉన్నప్పుడే కుటుంబం కెనడాకు వెళ్లిపోయింది.
లాటిన్ అమెరికా, ఆఫ్రికాలో ఆయన విస్తృతంగా పనిచేశారు.
బలమైన అభ్యర్థి అయినప్పటికీ, కార్డినల్స్ వరుసగా రెండవ జెస్యూట్ పోప్‌ను ఎన్నుకునే అవకాశం లేదు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)