SOURCE :- BBC NEWS
ఫొటో సోర్స్, Shahnawaz/BBC
బిహార్‌లోని బక్సర్ జిల్లాకు చెందిన జనార్దన్ సింగ్ కుమారుడు నవంబర్ 18న మరణించారు.
తన పాతికేళ్ల కుమారుడు చనిపోయిన విషాదంలోనూ, జనార్దన్ సింగ్ ప్రస్తుతం శ్మశానవాటిక నిర్వహణ కోసం ఒక కమిటీ ఏర్పాటు పనుల్లో తలమునకలై ఉన్నారు.
తన పెద్ద కుమారుడి మరణం తర్వాత, తన ఆస్తిలో నుంచి ఒక బిఘా (0.62 ఎకరం) భూమిని ముస్లిం శ్మశానవాటిక కోసం ఇచ్చారు.
ఈ విషయమై జనార్దన్ సింగ్ బీబీసీతో మాట్లాడుతూ, ”నా కొడుకు అంత్యక్రియలు గౌరవంగా జరిగినట్లే.. ఏ మతం, ఏ కులానికి చెందిన వ్యక్తి అంత్యక్రియలైనా గౌరవంగా నిర్వహించాలి. మా పక్క ఊళ్లో ముస్లిం కుటుంబాలకు శ్మశానవాటిక లేదు. కాబట్టి నా కొడుకు జ్ఞాపకార్థం ఇవ్వడానికి ఇంతకన్నా ముఖ్యమైనది ఏముంటుంది?” అని అన్నారు.

ఫొటో సోర్స్, Shahnawaz/BBC
అసలు విషయం ఏంటంటే..
బిహార్‌లోని బక్సర్ జిల్లా, చౌసా బ్లాక్, రాంపూర్ పంచాయతీ పరిధిలోని దేబీ డీహ్రా గ్రామంలో జనార్దన్ సింగ్ కుటుంబం నివసిస్తోంది. ఆయన డెహ్రాడూన్‌లో ఆయుర్వేద మందుల తయారీలో వినియోగించే ముడి పదార్థాల వ్యాపారం చేస్తుంటారు.
జనార్దన్ సింగ్, గీతాదేవి దంపతులకు ముగ్గురు పిల్లలు. వారి పెద్ద కుమారుడు శివమ్ సింగ్ డెహ్రాడైన్లో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఏంబీఏ పూర్తి చేసిన శివమ్ సింగ్ తన తండ్రి వ్యాపార వ్యవహారాలు చూసుకునేవారు.
జనార్దన్ సింగ్ బీబీసీతో మాట్లాడుతూ, “మా అబ్బాయి అందరితో స్నేహపూర్వకంగా ఉండేవాడు. ఇతర మతాలపై గౌరవించేవాడు, జంతువులను ప్రేమించేవాడు. వారణాసిలోని మణికర్ణిక ఘాట్‌లో మా అబ్బాయికి అంత్యక్రియలు నిర్వహించిన సమయంలో, ప్రతి ఒక్కరికీ ఈ ప్రపంచం నుంచి మంచి వీడ్కోలు ఉండాలని భావించా” అని అన్నారు.
“మా పక్క ఊళ్లో ముస్లిం కుటుంబాలకు శ్మశానవాటిక లేదని ఆలోచించా. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా.”
జనార్దన్ సింగ్ కుటుంబం ఆర్థికపరంగా బలమైనది. ఆయన తల్లి శారదా దేవి రాంపూర్ పంచాయతీ సర్పంచ్. ఆయన కుమార్తె వైద్య విద్య అభ్యసిస్తున్నారు. చిన్న కుమారుడు 8వ తరగతి చదువుతున్నారు.
శివమ్‌కు ఇంకా పెళ్లి కాలేదని జనార్దన్ సింగ్ చెప్పారు.
ఫొటో సోర్స్, Shahnawaz/BBC
శ్మశానవాటిక నిర్వహణకు హిందూ – ముస్లిం కమిటీ…
జనార్దన్ సింగ్ కుటుంబానికి సైన్యంతోనూ అనుబంధం ఉంది.
జనార్దన్ సింగ్ తాత మోతీ సింగ్ సైన్యంలో పనిచేశారు. 1961 గోవా విమోచన యుద్ధంలో పాల్గొన్నప్పటి వాటితో సహా అనేక పతకాలు వీరి ఇంట్లో ఉన్నాయి. అలాగే, మోదీ సింగ్ తన సైనిక శిక్షణ సమయంలో రాసుకున్న డైరీ కూడా ఉంది.
“మా తాత సైన్యంలో ఉండేవారు. మేం దేశభక్తుల కుటుంబానికి చెందినవాళ్లం, సమాజం కోసం పనిచేయడం మా బాధ్యతగా భావిస్తాం” అన్నారు జనార్దన్ సింగ్.
అయితే, శ్మశానవాటికకు భూమిని బదిలీ ఎలా చేయాలి?
ఈ విషయమై జనార్దన్ సింగ్ సోదరుడు, న్యాయవాది బ్రిజ్రాజ్ సింగ్ బీబీసీతో మాట్లాడుతూ, ”కొంతమంది హిందువులు, కొంతమంది ముస్లింలు ఉండేలా ఒక కమిటీ ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నాం. ఈ కమిటీ రెండు పనులు చేస్తుంది. మొదటిది, ఆ భూమి శ్మశానవాటికకు తప్ప మరే ఇతర అవసరాలకూ ఉపయోగించకుండా చూడటం, రెండోది నిర్వహణ” అని చెప్పారు.
ఈ భూమిని వక్ఫ్ చేస్తారా?
ఈ ప్రశ్నకు బ్రిజ్రాజ్ సింగ్ బదులిస్తూ, “చట్టపరమైన అంశాలను పరిశీలనకు ఒక కమిటీ ఏర్పాటు చేస్తాం. కానీ, ఒక్కటి మాత్రం ఖాయం. ఇకపై ఈ భూమిపై మా హిందూ కుటుంబానికి ఎలాంటి హక్కూ ఉండదు. మా బిడ్డ పేరుమీద మా ముస్లిం సోదరులకు శాశ్వతంగా ఇచ్చేశాం” అన్నారు.
రాంపూర్ పంచాయతీ పరిధిలో 50 నుంచి 60 వరకూ ముస్లిం కుటుంబాలు, సాగర, రసూల్పూర్ గ్రామాల్లో 20 ముస్లిం కుటుంబాలు ఉన్నాయి.
కానీ, వారి కుటుంబాల్లో ఎవరైనా చనిపోతే అంత్యక్రియలు నిర్వహించడానికి శ్మశానవాటిక లేదు.
వాస్తవానికి సాగ్రా గ్రామంలో ఒకప్పుడు వారికి శ్మశానవాటిక ఉండేది. కానీ, కొన్నేళ్ల క్రితం అక్కడ ప్రభుత్వ పాఠశాల నిర్మించారు. ఆ భూమి విద్యాశాఖకు చెందినదని స్థానికులు చెబుతున్నారు.
ప్రభుత్వ పాఠశాల నిర్మాణంతో స్థానికులకు రెండు రకాలుగా ఇబ్బందులు తలెత్తాయి. మొదటిది, గ్రామంలోని ముస్లింల పూర్వీకుల సమాధులు కనిపించకుండా పోయాయి. రెండోది, ఎవరైనా మరణిస్తే మృతదేశాలను ఖననం చేయడానికి ఐదు కిలోమీటర్ల దూరం తీసుకెళ్లాల్సి వస్తోంది.
ఫొటో సోర్స్, Shahnawaz/BBC
‘నిజమైన ఇల్లు శ్మశానమే’
”మా పూర్వీకుల సమాధులన్నీ ఈ పాఠశాల నిర్మించిన స్థలంలో ఉన్నాయి. జిల్లా కలెక్టరు వద్దకు చాలాసార్లు తిరిగాం. ప్రత్యేకంగా శ్మశానవాటికను కేటాయిస్తామని హామీ ఇచ్చారు. కానీ, అమలుకాలేదు. ఇప్పుడు జనార్దన్ సింగ్ మాకోసం వచ్చారు. ప్రస్తుతం మనం నకిలీ ఇంట్లో నివసిస్తున్నాం. శాశ్వత నివాసం శ్మశానవాటికే” అని అల్లావుదీన్ అనే కూలీ బీబీసీతో అన్నారు.
ఇక్కడ ముస్లిం కుటుంబాలన్నీ సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.
”మాకు ఒక శ్మశానవాటిక ఉంది. దాన్ని జాగ్రత్తగా నిర్వహించుకుంటాం. చెట్లను నాటుతాం. పరిశుభ్రంగా ఉంచుకుంటాం” అని ముస్తాకిమ్ అనే స్థానిక ముస్లిం చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)







