SOURCE :- BBC NEWS
కోల్‌కతాలోని ఆర్జీకర్ హాస్పిటల్లో ట్రైనీ మహిళా డాక్టర్‌పై అత్యాచారం, హత్య కేసులో సంజయ్ రాయ్‌కు కోర్టు జీవిత ఖైదు విధించింది.
ఈ కేసులో దోషికి శిక్ష విధిస్తూ సీల్దా కోర్టు అదనపు సెషన్స్ న్యాయమూర్తి జస్టిస్ అనిర్బన్ దాస్ ఇది అరుదైన కేసుల్లో అరుదైనది కాదని, ఈ కేసులో మరణశిక్ష విధించాల్సిన అవసరం లేదని చెప్పారు.
“అరుదైన కేసుల్లో అరుదైనది” అంటే అలాంటి కేసుల్లో దోషులకు మరణశిక్ష విధించవచ్చు.
యావజ్జీవ శిక్షతో పాటు కోర్టు సంజయ్ రాయ్‌కు లక్ష రూపాయల జరిమానా విధించింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా బాధితురాలి కుటుంబానికి 17 లక్షల రూపాయలు చెల్లించాలని ఆదేశించింది.
న్యాయ ప్రక్రియ ఇంకా మిగిలే ఉందా?
2024 ఆగస్టులో ఈ సంఘటన జరిగినప్పుడు, దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఆందోళనలు జరిగాయి. న్యాయపరంగానూ గందరగోళం ఏర్పడింది. అప్పట్లో ఈ కేసు గురించి కలకత్తా హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు పిటిషన్లు దాఖలయ్యాయి.
తాజాగా సీల్దా కోర్టు తీర్పు వచ్చిన తర్వాత కూడా, ఈ కేసులో న్యాయప్రక్రియ ముగియలేదు.
సీల్దా కోర్టు నిర్ణయంపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం హైకోర్టులో అప్పీలు చేసింది. సంజయ్ రాయ్‌కు విధించిన యావజ్జీవ శిక్షను ఉరిశిక్షగా మార్చాలని కోర్టును కోరింది.
ఈ కేసు దర్యాప్తు మరోసారి చేయాలని కోరుతూ బాధితురాలి తల్లిదండ్రులు కూడా 2024 డిసెంబర్లోనే కోల్‌కతా హైకోర్టుని ఆశ్రయించారు.
కోర్టు విచారణ సమయంలో సంజయ్ రాయ్ తాను అమాయకుడినని, కేసుతో తనకు సంబంధం లేదని వాదించాడు. ఈ కేసులో తీర్పు ఇచ్చిన న్యాయమూర్తి అనిర్బన్ దాస్ కూడా సంజయ్ రాయ్‌కు హైకోర్టును ఆశ్రయించే హక్కు ఉందని చెప్పారు.
సంజయ్ రాయ్‌ను కోర్టు దోషిగా ఎలా తేల్చింది?
భారతీయ శిక్షాస్మృతిలోని వేర్వేరు సెక్షన్ల కింద సంజయ్ రాయ్‌ను దోషిగా ప్రకటించింది న్యాయస్థానం.
ఇందులో అత్యాచారం చేసినందుకు సెక్షన్ 64, హత్య చేసినందుకు సెక్షన్ 103(1), అత్యాచారం చేసి హత్య చేసినందుకు సెక్షన్ 66 కింద కోర్టు సంజయ్‌రాయ్‌ను దోషిగా తేల్చింది. ఈ అభియోగాల కింద కోర్టు శిక్ష ప్రకటించింది.
ఈ కేసును సీబీఐ విచారించింది. సీబీఐ తనచార్జ్షీట్లో సంజయ్ రాయ్‌కు వ్యతిరేకంగా అనేక ఆధారాలను ప్రస్తావించింది. రాయ్ జుట్టు, బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ నేరం జరిగిన ప్రాంతంలో లభించాయని సీబీఐ తెలిపింది. రాయ్ బట్టలు, బూట్లలోనూ బాధితురాలి రక్త నమూనాలు గుర్తించినట్లు కోర్టు దృష్టికి తీసుకువచ్చింది.
దీంతో పాటు సీబీఐ సేకరించిన సీసీ ఫుటేజ్ దృశ్యాలను కోర్టుకు సమర్పించింది. ఇందులో అతను సెమినార్ రూమ్ వైపు వెళ్లడం కనిపించింది.
బాధితురాలి మృతదేహం ఈ సెమినార్ హాల్లోనే లభించింది. సంజయ్ రాయ్ తనపై వచ్చిన ఆరోపణలను తిరస్కరిస్తూ తాను అమాయకుడినని వాదించాడు. తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. అయితే తాను అమాయకుడినని చెప్పేందుకు అతను ఎలాంటి ఆధారాలు చూపలేకపోయాడు. సీబీఐ ప్రవేశ పెట్టిన ఆధారాలపై ఆయన లేవనెత్తిన ప్రశ్నలు కూడా నిలబడలేకపోయాయి.
ఆధారాలను పరిశీలించిన కోర్టు, సంజయ్ రాయ్ బాధితురాలి గొంతు నులిమి చంపాడని తెలిపింది, ఆమెపై అత్యాచారం జరిగింది. సీబీఐ ప్రవేశ పెట్టిన ఆధారాలను బట్టి రాయ్ ఈ హత్య చేసినట్లు స్పష్టమవుతోందని కోర్టు ప్రకటించింది.
రాయ్‌కు వ్యతిరేకంగా లభించిన ఆధారాలను కొట్టి పారేయలేమని న్యాయమూర్తి అన్నారు.
“ఇది సామూహిక అత్యాచారం కాదని చెప్పేందుకు అవసరమైనన్ని ఆధారాలు ఉన్నాయి. బాధితురాలిపై ఒక వ్యక్తి మాత్రమే అత్యాచారానికి పాల్పడ్డాడు” అని న్యాయమూర్తి అన్నారు.
కోర్టు ఇంకా ఏం చెప్పింది?
కోర్టు తన తీర్పులో ఆస్పత్రి సిబ్బంది, పోలీసుల వైఖరిని విమర్శించింది.
ఆస్పత్రిలో అత్యాచారం, హత్య జరిగిన విషయం ఆర్జీకర్ ఆస్పత్రి ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్‌కు తెలిసినప్పటికీ పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదో అర్థం కావడం లేదని కోర్టు వ్యాఖ్యానించింది.
అదే సమయంలో పోలీసులు కూడా కేసు నమోదులో అలసత్వం వహించారని కోర్టు ఆక్షేపించింది.
“ఈ కేసులో బాధితురాలి మరణాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు అధికారులు ప్రయత్నించారని, అలా చేస్తే ఆసుపత్రికి చెడ్డ పేరు రాకుండా ఉంటుందని భావించారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు” అని కోర్టు ప్రకటించింది.
సీబీఐ ప్రవేశ పెట్టిన ఆధారాలన్నింటినీ చూపిస్తూ ఈ అంశాలేవీ కేసు దర్యాప్తు మీద ప్రభావం చూపలేకపోయాయని న్యాయమూర్తి అన్నారు.
సంజయ్ రాయ్‌కు ఉరిశిక్ష విధించాలని సీబీఐ కోర్టులో వాదించింది. అయితే సంజయ్ రాయ్ న్యాయవాది మాత్రం అతనికి ఉరిశిక్ష బదులు యావజ్జీవ శిక్ష విధించాలని కోరారు.
హత్య కేసులో గరిష్ఠంగా యావజ్జీవ శిక్ష విధించవచ్చు.
రెండు వైపులా వాదనలు విన్న న్యాయస్థానం ఈ కేసు చాలా క్రూరమైనది, తీవ్రమైనది అని పేర్కొంది. రాయ్ నేరానికి పాల్పడినట్లు స్పష్టమైనప్పటికీ, ఇది అరుదైన కేసుల్లో అరుదైనది కాదని న్యాయస్థానం అభిప్రాయపడింది.
కొన్ని సుప్రీంకోర్టు తీర్పులను ప్రస్తావిస్తూ, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే మరణశిక్ష విధిస్తామని చెప్పారు. అలాంటి తీవ్రమైన కేసుల్లో కూడా దోషులను సంస్కరించేలా న్యాయం జరగాలని అభిప్రాయపడ్డారు.
కేసులో తీర్పు ఇచ్చే సమయంలో మానవ జీవితానికున్న విలువను దృష్టిలో పెట్టుకోవడం ముఖ్యమని న్యాయమూర్తి చెప్పారు.
“క్రూరత్వం పట్ల క్రూరంగా వ్యవహరించడం మా డ్యూటీ కాదు. న్యాయపరంగా ఆలోచించి మానవీయతను కాపాడేందుకు తెలివిగా వ్యవహరించాలి” అని కోర్టు తన తీర్పులో వెల్లడించింది.
ఈ విషయాన్ని చెబుతూనే దోషికి శిక్షతో పాటు లక్ష రూపాయల జరిమానా విధించింది.
తర్వాత ఏం జరగనుంది?
ఈ తీర్పు మీద పై కోర్టుకు వెళ్లేందుకు సంజయ్‌రాయ్‌కు చట్టబద్దమైన హక్కు ఉందని న్యాయమూర్తి అనిర్బన్ దాస్ తెలిపారు.
అదే సమయంలో, రాయ్‌కు ఉరిశిక్ష విధించేలా సీబీఐ పై కోర్టులో అప్పీలు చేయాలని అనేకమంది డిమాండ్ చేశారు. పశ్చిమబెంగాల్ ప్రభుత్వం ఇదే అంశం మీద ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
“బాధితురాలి కుటుంబం లేదా సీబీఐ సంజయ్‌రాయ్‌కు మరణశిక్ష విధించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేయవచ్చు. అలాగే శిక్ష పడిన వ్యక్తి కూడా తనకు విధించిన శిక్షపై హైకోర్టుకు వెళ్లవచ్చు. ఇప్పుడీ కేసులో హైకోర్టు ఏం చెబుతుందనేది చూడాల్సి ఉంటుంది” అని సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా ఏఎన్ఐ వార్తా సంస్థతో చెప్పారు.
బాధితురాలి కుటుంబం డిసెంబర్లోనే హైకోర్టులో పిటిషన్ ఫైల్ చేసింది. సీబీఐ దర్యాప్తు తీరుపై బాధితురాలి కుటుంబం అనేక ప్రశ్నలు లేవనెత్తింది. ఈ కేసులో ఇంకా అనేకమంది ప్రమేయం ఉందని బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపించారు.
“దర్యాప్తు మొత్తం సంజయ్రాయ్ ఒక్కడిని కేసులో ఇరికించి మిగతా వారిని తప్పించుకునేందుకు అవకాశం ఇచ్చేలా సాగిందనేది సుస్పష్టం” అని బాధితురాలి తల్లిదండ్రులు తమ పిటిషన్లో పేర్కొన్నారు.
ఈ కేసు దర్యాప్తుకు సంబంధించిన కొన్ని అంశాలు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయని కోల్‌కతా హైకోర్టు డిసెంబర్ 24న తెలిపింది. అసలు ఈ పిటిషన్ విచారించవచ్చా లేదా అనే దాని గురించి పిటిషనర్లు సుప్రీంకోర్టు నుంచి అనుమతి తీసుకోవాలని హైకోర్టు పిటిషనర్లను కోరింది.
హైకోర్టు నిర్ణయంతో బాధితుల కుటుంబం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సుప్రీంకోర్టు ఈ పిటిషన్‌ను జనవరి 22న విచారించనుంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)